మనసు మలుపుల మజిలీ - బి.రాజ్యలక్ష్మి

Manasu malupula majilee
పదేళ్లతర్వాత తన ఫ్రెండ్ రాధను కలుస్తున్నది లలిత .మనసంతా వుద్వేగం ఈ పదేళ్లల్లో యిద్దరి జీవితాల్లోనూ యెన్నో మార్పులు . అనుకోకుండా అదేఊరికి వుద్యోగం బదిలీ అయ్యింది .ముందుగా రాధ ను చూడాలి .తర్వాత నెమ్మదిగా గది వెతుక్కోవాలి . రాధ చెప్పిన చిరునామా ముందు ఆటో ఆపించుకుంది లలిత.గేట్ తోసింది .గేట్ చప్పుడుకు రాధ బయటకొచ్చింది .ఇద్దరూ సంతోషం గా చేతులు కలుపుకున్నారు .పరికిణీల వయస్సులో దూరమైన స్నేహం యిప్పుడు పరువం లో కలుసుకున్నారు .ఆ నాటి బాల్యం ఆటలు చిలిపిపనులు యిద్దరికీ ఒకసారి గుర్తుకొచ్చి బిగ్గరగా నవ్వేసారు .చీరల్లోకి మారారు .జీవితం లో ఆలోచనలలో యెన్నో యెన్నో మార్పులు .
రాధ లలిత ను లోపలి గదిలోకి తీసుకెళ్లింది .ముందు హాలు లోపల రెండుగదులు వంటిల్లు .ముచ్చటగా వుంది .
“లలితా మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అమ్మమ్మగారింటికి వెళ్లిపోయారు గా !సుమారు ఐదేళ్లు మనకు కాంటాక్ట్ లేదు .మంగళక్కయ్య పెళ్లయ్యింది ,నాన్నా అమ్మా వారం రోజుల వ్యవధి లో చనిపోయారు .నేను అప్పుడే డిగ్రీ ముగించాను .నాన్న వుద్యోగం నాకిచ్చారు .”అంటూ ఆపింది రాధ .
లలిత మధ్యాహ్నం సమయం లో వచ్చిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది రాధకు .”నిన్ను చూసిన సంతోషం లో నీ సంగతే మర్చిపోయాను యిదిగో ద్రాక్షపళ్లు తింటూ వుండు ,యిప్పుడే వస్తాను “అంటూ వంటింట్లో కి వెళ్లింది .లలిత నవ్వేసింది . కుక్కర్ వేసి బెండకాయలు చాకు తీసుకుని లలిత దగ్గరకొచ్చి కూర్చుంది .రాధలో ఒక ఆరాటం యేదో చెప్పుకోవాలనే తపన కనిపించాయి లలితకు .ఇద్దరూ కాసేపు తమ వుద్యోగవిషయాలు ,చిన్ననాటి విషయాలు పంచుకున్నారు .లలిత డిగ్రీ ముగిసే సమయం లో అమ్మ చనిపోయింది .ఒక్క కూతురే అవడం వల్ల ఆ వూరు వదిలి వేరే వూళ్లో వుద్యోగం లో చేరింది .ఇద్దరికీ పెళ్లిళ్లు కాలేదు .
ఇంతలో ఆ గదిలోకి ఒక యువతి వచ్చింది .”బాగున్నావా లలితా “అంది .లలిత కాస్త అయోమయం లో పడింది .పరిశీలనగా చూసింది .”నువ్వు మంగళక్కయ్యావు కదూ “అంది ఆశ్చర్యం గా .
“అదేమిటక్కయ్యా యింత మారిపోయావు ? నీ గొంతొక్కటే మారలేదు .”అంటూ లలిత మంగళ చేతులు పట్టుకుంది .
“నాకేం నేను బాగానే వున్నాను “నవ్వుతూ అక్కడినించి వెళ్లిపోయింది .మంగళ నిర్లిప్తత నిరుత్సాహం లలితకు అర్ధం కాలేదు .వాతావరణం ఒక్కసారిగా గాలి ఆగినట్టుగా బరువయ్యింది .రాధ వైపు ప్రశ్నర్ధాకం గా చూసింది లలిత .
“దగ్గర్లో పార్కు వుంది చల్లబడింది పద పోదాం “అంటూ రాధ లలితా పార్కు లో ఒక గడ్డిమీద కూర్చున్నారు . అప్పుడే ఐస్క్రీమ్ వాడు వస్తే చెరో ఐస్క్రీమ్ తీసుకున్నారు .
“నీకు గుర్తుందా రాధా ,మాయింటి దగ్గర ఐస్క్రీమ్ తింటూ పరుగెత్తుతూ పాలబండి వాడి సైకిల్ పడేశాం .పాలన్నీ ఒలికిపోయాయి ,యిద్దరం భయపడి గుళ్లో దాక్కున్నాం ,”అంది లలిత తమాషా గా నవ్వుతూ ! రాధ కూ నవ్వొచ్చింది కానీ వెంటనే చూపుల్లో యేదో చెప్పాలనే తపన గ్రహించింది
“మా శేఖరం బావ అంటే అక్కయ్యకు యిష్టం .చిన్నప్పటినించీ వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని రెండువైపులా అనుకున్నారు కూడా .అక్కయ్య అతని చుట్టూ తన ప్రపంచాన్ని చుట్టుకుంది .మానసికం గా తనవాడనుకుంది .కానీ బావ. పై చదువులకు. అమెరికా వెళ్లి అక్కడే ఒకమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు .అది తెలిసిన రోజు అక్క కృంగిపోయింది .అమ్మా నాన్నా ధైర్యం చెప్పారు ఏదైనా వ్యాపకం పెట్టుకోమన్నారు ,కానీ మంగళక్కయ్య యించుమించు మానసికం గా దెబ్బ తిన్నట్టు యేడుస్తూ వుండేది .అప్పుడే విశ్వం గారికి దగ్గరయింది .”రాధ చెప్పడం ఆపి బరువుగా వూపిరి పీల్చి వదిలింది .
“విశ్వం యెవరు ?”అంది లలిత.
“మన లెక్కల మాస్టారు మనం ఆయన దగ్గర లెక్కలు చెప్పించుకునే వాళ్లం గుర్తుకొచ్చిందా !”అంది రాధ .
“అవునవును ,గుర్తుకొచ్చింది .”అంది లలిత .
“నేను లెక్కలు చెప్పించుకునేటప్పుడు అక్కయ్య కూడా అక్కడే చదువుతూ కూర్చునేది .విశ్వం గారు అప్పుడప్పుడూ పలకరిస్తూ వుండేవారు .అక్కయ్య మితం గా బదులు చెప్పేది .ఒక రోజు అక్కయ్య కన్నీళ్లు తుడుచుకోవడం విశ్వం చూసారు .ఆయనకు కొంత వరకూ తెలుసు .
“మంగళ గారూ,మీ బావ మిమ్మల్ని వద్దనుకున్నప్పుడు మీరు యింకా అదే ఆలోచించడం దండగ !మీరు మర్చిపోండి ,మీరు కవితలు వ్రాస్తారని తెలుసు మన చుట్టూ వుండే ప్రకృతి మీ కవితలలో చూపించండి “అంటూ ఆయన ధైర్యం చెప్పారు .నెమ్మదిగా వాళ్లిద్దరూ ఒకరినొకరు యిష్టపడడం మొదలయ్యింది .అక్కయ్య మనసంతా విశ్వం గారే .అమ్మా నాన్నలకు విశ్వం మంగళక్కయ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పారు .అతని కులం వేరని నాన్న ఒప్పుకోలేదు . విశ్వం గారు అక్కయ్యను తనతో వచ్చెయ్యమన్నారు .దూరం వెళ్లి పెళ్లి చేసుకుందామన్నారు కానీ అక్కయ్య ఒప్ప్పుకోలేదు .
అక్కయ్య కు మెడికల్ రిప్రసెంటేటివ్ తో పెళ్లయ్యింది .ఇప్పుడు మనం వున్న యీ వూళ్లో కాపురం మొదలయ్యింది .అతను ముభావి ,అక్కయ్య తో పెద్దగా సరదాలు లేవు .అమ్మా నాన్నా పోయిన తర్వాత నేను వుద్యోగం యిక్కడికే మార్చుకున్నాను . “ రాధ చెప్పడం ఆపి వూపిరి పీల్చుకుంది .లలిత రాధ మాటల్లోని లోతు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది .
“బావగారు పది రోజులు యింట్లో వుంటే యిరవై రోజులు టూర్లు తిరుగుతారు ,అందుకే అక్కయ్యను ఒంటరిగా వుండనివ్వకుండా నేను వుంటున్నాను .ఒకటి రెండుసార్లు బావ ను ఒకావిడ తో చూసాను ,కానీ బావ టూరు లో వెళ్లాడు కదా నేనే పొరబడ్డానేమో అనుకున్నాను .అక్కయ్య ను అడగలేదు .ఒకరోజు మా బంధువులింటికి వెళ్తే అక్కడ వాళ్లు అసలు విషయం చెప్పారు .బావ ఒకావిడ తో వుంటున్నారుట .ఆవిడ ఒంటరి గా వుద్యోగం చేసుకుంటూ వుంటున్నదిట వేరే వూళ్లో .నేను యింటికి వచ్చి అక్కయ్యను అడిగితే తనకు తెలుసని చెప్పింది .ఇది లలితా అక్కయ్య జీవితం .మానసికం గా కృంగిపోయింది .అనారోగ్యం పాలయింది .ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలిసిన విషయం అక్కయ్యకు బ్లడ్ క్యాన్సర్ ! “రాధ యేడ్చేసింది .చీకటి పడుతున్నది .ఇద్దరూ మౌనం గా యిల్లు చేరారు .
ముగ్గురూ భోజనం చేసారు .మంగళ పెళ్లి ఆల్బమ్ చూపించింది రాధ .ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది లలితకు .కన్నీటిపొరలు ఆల్బమ్ చూడనివ్వలేదు . సుమారు రాత్రి పదవుతున్నది .
“రాధా నేను ఒక అర్జెంటు డ్రాఫ్ట్ చెయ్యాలి వెళ్తాను యేమనుకోకు “అంటూ కళ్లు తుడుచుకుంటూ బయలు దేరింది .వెన్నెల్లో లలిత ముఖం సరిగా చూడలేకపోయింది .సరిగా చూసుంటే ఆ ముఖం లో మంగళ వేదనకు జవాబు కనిపించేదేమో !
రాధ మనసులో సందేహం ,లలిత హృదయం లో కలవరం !! జీవితపు మలుపులలో పూల బాటలొకరికైతే అదే బాటలో మరొకరికి రాళ్లు గుచ్చుకుంటాన్నాయి .పయనించే బాటసారి యే మలుపులో పిల్లతెమ్మెరలను ఆస్వాదిస్తాడో !

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల