ప్రేమ లేఖ - వెంకటరమణ శర్మ పోడూరి

Prema lekha

ప్రియమయిన మాధవి లతకి నీ వాట్సాప్ మెసేజ్ చూసి కొంచం ఆశ్చర్య పోయాను. "చిన్న చిన్న మెసేజ్ లతో విసిగి పోయాను కొంచం ఎక్కువ విషయాలతో ఉత్తరం రాయండి" అన్నావు ఈ రోజుల్లో ఇంకా ఉత్తరాలు రాసేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే. డెలివరీ అయేదాకా మనకి ఇంకా అయిదారు నెలలు విరహం తప్పదు కనుక ఉత్తరాలు ఒక ,మంచి ఆలోచనే కదా ! ఈ స్మార్ట్ ఫోన్ కల్చర్ వచ్చిన తరువాత, మనసులోని భావాలు వివరంగా చెప్పుకునే అవకాశం మిస్ అవుతున్నామేమో! ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది.నీతో పరిచయానికి ముందు, దూరంగా ఉండడం వల్ల, అమ్మ, నాన్న. చెల్లాయి అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి, వాళ్ళ మీదికి ఆలోచనలు పోయేవి. కానీ నీతో పరిచయం ప్రా రంభమయ్యాక, ప్రతి క్షణం నీ ఆలోచనలే. భగవంతుడి సృష్టిలో ఇష్టమయిన స్త్రీ పురుషు ల మధ్యన పెట్టిన ఈ అనుబంధం గురించి ఆలోచించినప్పుడు. అద్భుతం గా అనిపిస్తుంది. ఒక వ్యక్తి సహచర్యంలో ఇంత మాధుర్యం పెట్టిన ఆ దేముడికి ప్రేమికులు అందరూ రుణపడి ఉండాలేమో. ఏపని చేస్తున్నా, ఇప్పుడు నువ్వు ఏమి చేస్తూ ఉంటావన్న ఆలోచనే. . మనిషి ఎదురుగా ఉన్నా చెప్పలేని కొన్ని భావాలు ఉత్తరాలు ద్వారా నే సాధ్యం అవుతుందేమో కదా? నువ్వు ఎదురుగ ఉన్నప్పుడు చెప్పని విషయాలు ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. నువ్వు ఎదురుగా ఉంటే చేతలే కానీ మాటలు కష్టం కదా? 😃 పెద్ద ఉత్తరం రాయమన్నావు కాబట్టి , ఎప్పటినుంచో నీకు చెబుదామనుకున్నది ఇప్పుడు చెబుతాను. మన పెళ్లి అయిన తరువాత, మనం మొదటి సారి కలవడం గురించి మాట్లాడుకున్నాము. గుర్తు ఉందా ? అప్పుడు అంతా చెప్పలేదు. ఇప్పుడు చెబుతాను. నేను మీ కాలేజీ కి గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చినపుడే నువ్వు నన్ను మొదటిసారి చూశావు. కానీ నేను నిన్ను అంతకు ముందే చూశాను. యూనివర్సిటీ లో నా కొలీగ్ నారాయణ, నేను, ఒక మాటు మీ కాలేజ్ ఫేకల్టీ రూమ్ కి వచ్చాము. మీ కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ మధుసూదన్, మా నారాయణ, చిన్నప్పటి ఫ్రెండ్స్. మేము అతనితో మాట్లాడుతూ ఉండగా నువ్వూ, నీ క్లాస్మేట్ జలజ మధుసూదన్ ని కలవడానికి వచ్చారు. జలజది అసాధారణ సౌందర్యం నీకు తెలుసుగా ? ఆమె చాలా అందంగా ఉందన్న విషయం గుర్తించినా , నాకు వెంఠనే చిరాకు కలిగింది. ఆమె తన అందాన్ని అందరూ చూస్తున్నారా లేదా అనే భావన, బాడీ లాంగ్వేజ్ లోనూ, చూపులలోనూ స్పష్ట పరచడం నాకు నచ్చలేదు. వెంఠనే పక్కన ఉన్న నిన్ను నేను గమనించడం జరిగింది. ఎర్రటి గులాబీ పక్కన, బుట్ట సంపెంగ సువాసనలా అనిపించావు బెదురు చూపులతో ఉన్ననువ్వూ , నీ సహజ మయిన ముగ్ధత్వం నన్ను వెంఠనే ఆకట్టుకున్నాయి. ఆవేళ నువ్వు లేత ఆకుపచ్చ రంగు వోణీ వేసుకున్నావు, చిన్న గులాబీ, జడలో ఓ పక్కన పెట్టుకున్నావు. జలజ మధుసూదన్ తో ఎదో మాట్లాడిన తరువాత మీరు ఇద్దరూ వెళ్లిపోయారు. నాకు ఎదురుగ కూర్చున్న ప్రసాద్ కళ్ళు తిప్పుకోకుండా జలజ కేసి చూడడం నేను గమనించాను. అతను కె మిస్ట్రీ లెక్చరర్ ప్రసాద్ అని తరవాత తెలిసింది. నారాయణ, నాకు మధుసూదన్ ని పరిచయం చేశాడు. నేను యూనివర్సిటీ లో చాలా పాపులర్ లెక్చరర్ ననీ ఇంకా ఏవేవో చాలా చెప్పేశాడు. నారాయణ, మధుసూదన్ కాసేపు మాట్లాడుకున్న తరవాత మేము వచ్చేశాము. నిన్ను ఆవేళ చూసిన తరవాత నీ రూపం మనసులో ముద్ర పడిపోయింది. మళ్ళీ ఎలా చూడడమా అని ఆలోచిస్తూ ఉంటె, మీకాలేజ్ లో గెస్ట్ లెక్చర్ ఒకటి నా చేత ఇప్పించమని మధుసూదన్ అడిగాడని నారాయణ నాతో చెప్పడం తో, మనసు లో ఎగిరి గంతేసినా, పైకి మామూలుగా సరే అని ఒప్పుకున్నాను.నిన్ను మళ్ళీ చూసే అవకాశం కదా ! అప్పుడు నాకు తెలియనిదేమిటంటే? జలజ మధుసూదన్ కి వరస కి చెల్లెలు అవుతుందనీ, నారాయణ ని సంబంధాలు అడిగితే, నా గురించి చెబితే, తెలియకుండా చూపిద్దామని, నన్ను తీసుకు రమ్మన్నాడట . నారాయణ ఆవేళ నన్ను, సంగతి చెప్పకుండా, తీసుకువెళ్లాడు. మేము అక్కడికి వచ్చే సమయానికి మధుసూదన్ జలజని పిలిపిస్తే, నువ్వు కూడా ఆమెతో వచ్చావు. ఆ తరవాత చెప్పాడు నారాయణ, మధుసూదన్, జలజని నాకు ప్రపోజ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని. గెస్ట్ లెక్చర్ పూర్తి అవగానే మీరందరూ నా చుట్టూ చేరడం, కొంచం వెనగ్గా నుంచున్న నీకేసే తరుచు చూడడం, నువ్వు కొంచం ఆశ్చర్యం, ముఖం లో ప్రకటించడం, అన్నీ నీకు తెలుసు గా. అప్పుడే నిర్ణయించుకున్నాను, నిన్ను వదులు కోకూడద ని. ఆ తరవాత జరిగిందే గమ్మత్తు. గెస్ట్ లెక్చర్ అయిన తరువాత నారాయణ, మధుసూదన్ తో మాట్లాడుతూ ఉండగా, నేను రెస్ట్ రూమ్ కి వెళ్లి వస్తోంటే, ప్రసాద్ కలిశాడు. అతను నేను ఒంటరిగా దొరకడం కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. "ఏమిటి విషయం అన్నాను.? " మధుసూదన్ కి , జలజ ని మీకు అఫర్ చేసే ఉద్దేశ్యం ఉన్నట్టుంది. మీరు ఇష్ట పడుతున్నారా? " అన్నాడు " ఎం ?మీకు ఏమన్నా ఆసక్తి ఉందా ? అన్నాను ? అప్పుడు గుర్తుకు వచ్చింది. మొదటి సారి వచ్చినప్పుడు అతను స్టాఫ్ రూమ్ లో ఆమె కేసి చూసే పధ్ధతి. ప్రసాద్ చెప్పడం బట్టి, నారాయణ నా గురించి చెప్పేదాకా మధుసూదన్, ప్రసాద్ కి, జలజ ని సజస్ట్ చేద్దామనే ఉద్దేశ్యంలో ఉన్నాడట . " ప్రసాద్ పరిస్థితి అర్థం అయ్యింది. నాకు ఎలాగు ఇష్టం లేదు. ఆ సంగతి పైకి చెప్పకుండా కొంచం గొప్పగా ఉంటుందని, " మీరు చేసుకుంటానంటే, నేను ఇష్టం లేదని చెప్పేస్తాను" అన్నాను నేను త్యాగం చేస్తున్న స్వరం తో. ప్రసాద్ కృతజ్ఞత తో మెలికలు తిరిగిపోయాడు, థాంక్స్ చెబుతూ ఆ తరవాత, నాకు ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పడం ఎందుకని, నారాయణ ద్వారా జలజ జాతకం తెప్పించి, జాతకాలు సరిపోలేదని నారాయణ ద్వారా చెప్పేశాను ఆ తరవాత కొద్దీ రోజులకే వాళ్ళిద్దరి పెళ్లి అయిపొయింది. నా పేరు చెప్పకుండా, మంచి సంబంధం ఉంది పెళ్లి చేస్తారా అని కొన్ని నెలలు తరవాత మధుసూదన్ ద్వారానే మీ వాళ్ళకి ప్రతిపాదన పంపితే, నువ్వు పిజి అయితే కానీ పెళ్లి చేసు కోనన్నావని తెలిసి, నేను ఉద్యోగం చేస్తూనే పోస్ట్ డాక్టరల్ మొదలు పెట్టాను. ఆ తరవాత మనిద్దరం యూనివర్సిటీ లో గడిపిన రోజులు ఎలా మరిచి పోగలం ? నీకు క్లాసులు మూడు గంటలు మాత్రమే ఉన్నా, నా వర్క్ అయేదాకా, వెయిట్ చేయడం, మనిద్దరం కలిసి కాంటీన్ లో కాఫీ టిఫిన్లు కానిచ్చి, లైబ్రరీ వెనకాల అడవి లాగా ఉన్న చెట్ల మధ్య ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం? దగ్గరికి రానిచ్చేదానివి కాదు కాబట్టి కబుర్లే చెప్పుకునేవాళ్ళం 😄 పెద్ద ఉత్తరం రాయ మన్నావు కాబట్టి, మన పెళ్లి అయ్యేదాకా, ఆ రెండేళ్లలో జరిగిన ఒక విషయం రాస్తాను. నీకు తెలుసుగా జలజ, ప్రసాద్ ల పెళ్లి మీ డిగ్రీ పూర్తి అవగానే అయ్యింది కదా ? ప్రసాద్ పిలిస్తే నేనూ వచ్చాను పెళ్ళికి. పెళ్లి లో, పెళ్లి కంటే నిన్ను చూడటం తోటే సరిపోయింది నాకు. పెళ్లి అయిన తరవాత ప్రసాద్ ఉద్యోగం మారి, చెన్నై వెళ్లిపోయాడని తెలిసింది. మన పెళ్ళికి ఆరునెలలు ముందు, పోస్ట్ డాక్టోరల్ థీసిస్ చర్చించడానికి, అక్కడి ప్రొఫెసర్ దినకరన్ దగ్గరికి ఒక ఆరునెలల్లో నాలుగు అయిదు మాట్లు వెళ్లి వారం రోజుల చొప్పున అక్కడ ఉండవలిసి వచ్చేది. మొదటి సారి వెళ్ళినప్పుడు, నేను ఉండే గెస్ట్ హౌస్ దగ్గరలో ఉన్న స్పెన్సర్ మాల్ లో జలజ, ప్రసాద్ కనిపించారు. జలజ పలకరించింది, సరుకుల సంచీ పట్టుకుని ప్రసాద్ వెనుకాల వస్తున్నాడు. నన్ను చూసి కొంచం ముభావంగా పలకరించాడు. నాకేసి కొంచం కోపంగా చూసినట్టనిపించింది. జలజ తో నేను మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకున్నాను. మర్యాద కోసం ఆమె అడిగిన ప్రశ్న ల కి జవాబు ఇచ్చాను. ఆయనకి చాలా పని ఉంది. వస్తామండీ అని జలజ అనడంతో వాళ్ళు వెళ్లి పోయారు. అలాగే ఇంకో మాటు కనపడినప్పుడు కూడా, ఆమె పలకరించడం. ప్రసాద్ నాకేసి కోపంగా చూడడం, నాకు ఆశ్చర్యమేసింది. ఆయనకి చాలా పని ఉంది వస్తాం అని జలజ అనగానే ఇద్దరూ వెళ్లిపోయారు. ఆఫీస్ పని, ప్రసాద్ ఇంటిదగ్గర కూడా చేయవలిసి వస్తోందేమో అనుకున్నాను. తన అందమయిన భార్య తో, నేను మాట్లాడడం ఇష్టం లేక కాబోసు, నాకేసి కోపంగా చూశాడు అనుకున్నాను. రెండు వారాల తరవాత కలిసినప్పుడు కూడా అదే పరిస్థితి. ఆఖరి సారి కలిసినపుడు, ప్రసాద్ ఒక పిల్లా డిని భుజం మీద వేసుకుని కనపడ్డాడు. అంతకు ముందు కలిసినప్పుడు పిల్లా డు లేకపోవడం వల్ల, ఆ సంగతి నాకు తెలియ లేదు. ఆయా దగ్గర వదిలి వచ్చేవారేమో అనుకున్నా. ఇద్దరినీ కంగ్రాట్యులేట్ చేశాను. ప్రసాద్ లో మాత్రం తేడా లేదు. అదే కోపం ముఖం. వాళ్ళు బై చెప్పి ముందుకు వెళ్లారు. ముందు జలజ వెడుతోంటే, ప్రసాద్ వెనకాల మెల్లగా వెడుతోంటే, నేను ఉండ బట్టలేక ప్రసాద్ గారు! అని వెనక్కి పిలిచాను. జలజ వెడుతూనే ఉంది.. నా పిలుపు విని ప్రసాద్ వెనక్కి వచ్చాడు. " నేను ఒకటి అడుగుతాను ఏమీ అనుకోనంటే ? అడగనా ?" అన్నాను " అడగండి అన్నాడు ప్రసాద్ " " నన్ను చూసినప్పుడల్లా ఎందుకో మీరు నాకేసి కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. అది ఇజమేనా? నేనేం చేశాను?" అడిగాను కారణం తెలుసుకుందామని . " అతను కొంచం గొంతుక తగ్గించి , "నిన్ను ఎవడు త్యాగం చెయ్య మన్నాడ య్యా బాబూ. పెళ్లయినప్పటి నుంచీ చస్తున్నాను. ఇరవై నాలుగుగంటలూ సౌందర్యపోషణ తప్ప వేరే ఏమీ లేదు ఆమెకి . నాకు ఇంటిదగ్గర పని ఏమిటనుకుంటున్నావు? గిన్నెలు కడగటం, బట్టలు ఉతకడం, ఇస్త్రీచేయడం ఇలాంటివే, నీ మీద కోపం రమ్మంటే రాదు మరీ ?" అని గబా గబా చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. 😁😄😄 నేను అక్కడే విరగబడి నవ్వు కుంటూ ఉంటె పక్క వాళ్ళు వింతగా చూశారు. నీకు కూడా ఇది చదివినప్పుడు నవ్వు వచ్చి ఉండాలి నువ్వూ , ఆమె ఫ్రెండ్స్ కాబట్టి, ఎందుకో ఇన్నాళ్లూ చెప్ప లేదు. నువ్వు పెద్ద ఉత్తరం రాయమంటే గుర్తుకు వచ్చి ఇవన్నీ రాశాను. సరే వాళ్ళ సంగతి వదిలేయి "నార్మల్ గా అవదు, ఆపరేషన్ చేయాలి" అని డాక్టర్ అందని మెసేజ్ పెట్టావు. తేదీ నిర్ణయిస్తే మెసేజ్ పెట్టు. నేను వచ్చి పక్కనే ఉంటాను. అమెరికా లోనే కానక్కరలేదు మన ఇద్దరి ఆనంద ఫలితమయినా, ప్రకృతి నీకు పెట్టిన బాధ్యత ఎక్కువ. నీకు గుర్తు ఉందా ఒక మాటు మనం అతి దగ్గరగా ఉండగా, ఇంకా దగ్గర అయి ఒక్కటి గా అయిపోలేమా ? అన్నావు. అదే నిజమవుతోంది కదా? నువ్వు ఎత్తుకోబోయే చిన్నారి లో మనిద్దరం కలిసే ఉంటాము కదా ? ఆ ఆలోచన ఎంత మధురం గా ఉంది లతా ! మీ నాన్నగారికి, అమ్మగారికీ నా నమస్కారాలు చెప్పు. మావయ్య అవ్వబోతున్న మన వెంకటేశానికి అభినందనలు నీ రాజశేఖర్

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి