అపరాధులు - జీడిగుంట నరసింహ మూర్తి

Aparadhulu

పక్క పోర్షన్ లోనుండి ఎవరో దెబ్బలాడుకుంటున్నట్టుగా అనిపించి లైట్ వేసి చూశాడు శ్రీకాంత్.. టైమ్ పన్నెండయ్యింది. అతనికి ఒకసారి నిద్రలోంచి మెలుకువ వచ్చిందంటే మళ్ళీ నిద్ర మీదకు రాదు . . పక్కనే భార్య శ్రావణి ప్రశాంతంగా నిద్రపోతోంది .. తన పక్క క్వార్టర్ రామారావుదే. అరుపులు అక్కడనుండే వస్తున్నాయి. అయిన నిద్ర ఎలాగూ చెడింది. శ్రావణిని లేపి అసలు విషయమేమిటో కనుక్కుంటే కానీ అతని మనసుకు ప్రశాంతత కలిగేటట్టుగా లేదు. . ఆమె జబ్బ మీద సుతిమెత్తగా చరిచి "ఇదిగో నిన్నే ఒకసారి లే. పక్కింట్లో ఏమిటి ఆ గొడవ ? వాళ్ళకు గొడవ పెట్టుకోవడానికి ముహూర్తం ఈ అర్ధరాత్రిళ్లే దొరికిందా? నుదుటకు పట్టిన చెమటను తుడుచుకుంటూ అడిగాడు.

"అబ్బా ఏమిటండీ బాబు .బంగారం లాంటి నిద్ర పాడు చేశారు . వాళ్ళ గొడవ ఎప్పుడూ వుండేదే. మీకు ఈ రోజు వినపడినట్టుంది. నేనూ రోజూ అనుభవిస్తున్నాను. అత్తగారు కోడల్ని ఏదో కారణం పెట్టుకుని నానా హింసలు పెడుతోందిట. ఆ అమ్మాయి మొగుడు కూడా తక్కువేమీ కాదు . అంతకు రెట్టింపు బాధలు పెడతాడుట. పాపం ఆ అమ్మాయిని చూస్తూంటే జాలేస్తోంది. పగవాళ్ళకు కూడా అటువంటి సమస్యలు రాకూడదు. ఇప్పుడు మనమిద్దరం ఆ ముచ్చట్లు గురించి చెప్పుకుంటూ వుంటే ఇక వాళ్ళు వాళ్ళ గొడవ మానేసి గోడదగ్గర చెవులు పెట్టుకుని మన మాటలు వింటారు. పొద్దునే లేస్తే మోహమొహాలు చూసుకోవాలి. వాళ్ళ విషయాలు రేపు మీకు అర్ధమయ్యేటట్టుగా చెపుతాను. ఏదైనా నిద్ర మాత్ర వేసుకుని పడుకోండి . నాకు మధ్యలో మెలుకువ వచ్చిందంటే తల నొప్పితో తల పగిలిపోతుంది .ముందా ఆ పెద్ద లైట్ ఆపండి. భరించలేకపోతున్నాను ." అంటూ అటువైపు తిరిగి పడుకుంది శ్రావణి .

భార్య కొద్దిగా చెప్పి అసలు విషయాన్ని దాటేయ్యడంతో ఎందుకో అతనికి సరిపెట్టుకో బుద్ది కాలేదు. నిద్ర రాకపోయినా ఏదో ఆఫీసు ఫైళ్ళు చూస్తూ గడిపేస్తాడే తప్ప నిద్ర మాత్రల జోలికి పోడు శ్రీకాంత్. ఇక లైట్ ఆపేశాక చేసేదేముంది? . ఆ రాత్రి పొడికళ్లతోనే గడిపాడు. .

శ్రీకాంత్, రామారావు ఒకే సంస్థలో వేరు వేరు కేడర్లో పనిచేస్తున్నారు.కొత్తగా క్వార్టర్లు నిర్మాణం జరుగుతూ వుండటం వల్ల కేడర్లుతో సంబంధం లేకుండా యాజమాన్యం వున్న వాటితోనే సరిపెట్టేస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఇంచుమించుగా ఒకేసారి అదికూడా పక్క పక్క క్వార్టర్లు దొరికాయి.

శ్రావణి ఆ రోజు పాలు పొంగించుకునే కార్యక్రమం పెట్టుకుంది. పక్క వాళ్ళను పిలవకపోతే బాగుండదని వెళ్ళి చెప్పి వచ్చింది. ఇంట్లో ఎవరో చాలామంది కనిపిస్తున్నారు. విషయం చెప్పి ప్రసాదం తీసుకెళ్లమని ఆడవారికి చెప్పి వచ్చింది.

ఆ రోజు కార్యక్రమానికి పెద్దావిడ ఒకత్తే వచ్చింది. పూజ మధ్యలోనే" మీది ఏ వూరు ? ఇంతకు ముందు ఎక్కడ వుండేవారు ? మీ కులం ఏమిటి" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.

." పోనీలెండి ఈ అడవిలో నాకు కాలక్షేపానికి ఎవరు దొరుకుతారని భయపడ్డాను . అదృష్టవశాత్తు మీరు వచ్చారు. మా కోడలు వుంది కానీ ముచ్చు మొహం. ఎవరితోనూ మాట్లాడదు ముంగిలా కూర్చుంటుంది" ... అంటూ ఏ మాత్రం సంస్కారం లేకుండా ఇంకా శ్రావణితో పూర్తిగా పరిచయం కాకముందే కోడలిమీద అస్త్రాలు సంధించింది . శ్రీకాంత్ అటువైపు రావడంతో మళ్ళీ వస్తాను అంటూ మెల్లగా జారుకుంది.

శ్రావణికి అర్ధమైనది ఏమిటంటే ఆవిడ కోడలు ఆ ఇంట్లో ఏ మాత్రం సుఖపడటం లేదని . . ఆ క్షణం నుండి ఆమెకు పక్కింటి ఆవిడ కోడల్ని కలుసుకోవాలన్న కోరిక బలీయంగా కలిగింది. . .

రెండు రోజులు తర్వాత అనుకుంటా. ఆమె శ్రీకాంత్ వాళ్ళ పోర్షన్ వైపు వచ్చి అటూ ఇటూ పరికించి చూస్తూ మెల్లగా లోపలికి తొంగిచూసింది. అంతకు ముందు పాలు పొంగించేటప్పుడు పిలవడానికి వెళ్లినప్పుడు శ్రావణి ఒకసారి ఆమెను చూసి వుండటంతో గుర్తుపట్టి " రండి రండి లోపలికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో నేనొకత్తినే వున్నాను " అంటూ స్వాగతం పలికింది. ఇంట్లో మగవారు లేరని తెలిసాక ఆమె గుండెలు తేలికపడి ఒక్కసారి హాయిగా వూపిరి తీసుకుంది.

షో కేసులో నీటుగా అమర్చిన తెలుగు నవలలు చూడగానే ఆమెకు ప్రాణం లేచొచ్చింది. "నాకు కూడా పుస్తకాలంటే పిచ్చి.మా వూళ్ళో ఉన్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివానో ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చి పడ్డాక నా అభిరుచులన్నీ అటకెక్కాయి. . అన్నట్టు నా పేరు చెప్పకుండానే మిమ్మల్ని పరిచయం చేసుకోకుండానే మాట్లాడేస్తున్నాను. మా పుట్టింట్లో ముద్దుపేర్లు ఎన్ని వున్నా అసలు పేరు స్వాతి . మా అత్తగారు పక్కనే వున్న వాళ్ళ చెల్లెలు గారింటికి వెళ్లారు. ఏ క్షణంలోనైనా వచ్చేయొచ్చు. మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి కలుస్తాను. ఏమీ అనుకోకండే " అంటూ పరుగులాంటి నడకతో అక్కడనుండి మాయమయ్యింది.

ఆ తర్వాత వారం రోజుల వరకు స్వాతి జాడ లేదు. ఆమె అత్తగారి కంట్రోల్లో , కనుసన్నల్లో భయం భయంగా మెలుగుతోందని శ్రావణి కి ప్రస్పుటం అయ్యింది. . . . తనకు కధలు రాసే అలవాటు ఉండటం , భర్త ఇంతకు ముందు కంపినీలో పనిచేసినప్పుడు తను క్లబ్ మహిళామండలి సెక్రెటరీ గా పని చేసినప్పుడు తోటి ఆడవారి సమస్యలను గురించి చర్చించి వాటికి పరిష్కార మార్గాలు చూపడంలో చొరవ వహించడం లాంటి అనుభవాలు ఆమెకు ఎన్నో ఎదురయ్యాయి. . ఎలాగైనా స్వాతి గురించి తెలుసుకుని ఆమెకు ఏదో విధంగా ఉపయోగపడి ఆమె జీవితంలో మార్పు తేవాలన్న పట్టుదల శ్రావణిలో పెరుగుతూ వచ్చింది. .

నాలుగు రోజులు శ్రీకాంత్ ఆఫీసు పని మీద క్యాంపుకు వెళ్లడంతో శ్రావణి స్వాతి అత్తగారు లేని సమయం చూసి ఇంటికి రప్పించుకుంది.

"ఏం పర్వాలేదు. మీ సమస్య నాతో చెప్పుకోండి. రోజూ రాత్రిపూట మీ మీద మీ అత్తగారు, మీ భర్త చేసే అఘాయిత్యాలు వినకూడదనుకుంటూనే మా చెవిన పడుతూనే వున్నాయి. నేను మీలో ఎంతో కొంత ధైర్యం నింపాలని నా కనిపిస్తోంది. నేను మీ అక్కగారిని అనుకుని మీ బాధలను నాతో పంచుకోండి. మీకు నేను ఎటువంటి పరిస్తితిలలోనూ సమస్యలు తెచ్చి పెట్టను అని హామీనిస్తున్నాను " అంటూ స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది . శ్రావణి పలికిన ధైర్య వచనాలకు ఆ కొద్ది క్షణాల్లోనే ఆమెపైన స్వాతికి గౌరవం రెట్టింపయ్యింది. .

"ఆ రోజు మీరు పాలు పొంగించినప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆతృత పడ్డాను. కానీ మా అత్తగారికి నేను ఎక్కడకీ వెళ్ళడం ఇష్టం లేదు. తన గురించి అన్ని విషయాలు ఇరుగూ పొరుగూతో చెప్పుకుంటానని కట్టడి చేసింది. . పెళ్ళయి ఆరేళ్లు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదంటూ అభాండాలు వేస్తోంది కానీ తన కొడుకులో లోపం వుందన్న విషయం మాత్రం తెలుసుకోదు . నాకు అంతా క్లియర్ గా వుందని డాక్టర్ల రిపోర్టులు వస్తే తల్లీ కొడుకులిద్దరూ వాటిని చింపి మంటల్లో పారేశారు. ఈ సమస్య ఇలా వుంటే బీద కుటుంబం నుండి పిల్లను తెచ్చుకున్నాం కొడుకు అచ్చటా, ముచ్చటా తీరడం లేదని నామీద లేనిపోని కధలన్నీ సృష్టించి వూరంతా చెప్పుకుంటూ వుంటారు. . నేనంటే వాళ్ళకు ప్రతి విషయంలోనూ తీవ్రమైన అసంతృప్తి . ప్రతి క్షణం సాధింపే . రాత్రి నిద్రపోయింది లేదు. కావాలని ఆ సమయంలోనే దెబ్బలాట వేసుకునే వాళ్ళు. . మా వాళ్ళకు ఫోన్ చెయ్యడానికి లేదు. వాళ్ళు ఈ గడప తొక్కడానికి లేదు. నా ప్రతి కదలిక గమనిస్తూనే వుంటారు. ఆయనకు కూడా నామీద ఇసుమంత ప్రేమ లేదు. తల్లి చెప్పిందే వింటాడు. పలాయన వాదం. అతని తమ్ముళ్లూ అంతే . ఆ ఇంట్లో ఎవరికీ నా మీద సానుభూతి లేదు. ప్రతి రోజు ప్రత్యక్ష నరకం చవి చూస్తున్నాను"

ఎంతో కాలం నుండి అంతర్లీనంగా ఆమె గుండెల్లో గూడుకట్టుకున్న వ్యధ శ్రావణి సమక్షంలో బయట పడింది. కొద్ది సేపు చెప్పడం ఆపి మౌనంగా తలదించుకుంది. ఆమె పెదవులు ఉద్వేగంతో కంపిస్తున్నాయి.కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి.

ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి చలించి పోయింది శ్రావణి .

" ఇదేమిటి స్వాతి గారు గారు మీరు బాగా చదువుకున్నారని విన్నాను. ఇప్పుడు చట్టాలు అన్నీ స్త్రీలవైపే వున్నాయి. వాళ్లలా టార్చర్ పెడుతూ వుంటే మీరు ప్రతిఘటించాల్సింది పోయి బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు. అది చాలు వాళ్ళు ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి . ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరో అడుగు ముందుకెయ్యండి . " అంది శ్రావణి . ఆమె ముఖంలో రియాక్షన్ కనిపిస్తోంది .

"ఒక్కనిమిషం స్వాతి గారు. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. ఈ లోపు ఏం చేసి ఈ సమస్యలనుండి బయట పడగలరో ఒక తరుణోపాయం ఆలోచిద్దాం " అంటూ టేబుల్ మీద ప్లాస్క్ లోంచి రెండు కప్పుల్లో కాఫీ పోసి తీసుకొచ్చింది.

"లేదు శ్రావణి గారు . అలాంటి పరిస్తితి లేదు. మా పుట్టింటివారి ఆర్ధిక పరిస్తితి అంతంత మాత్రమే . ఎదిరించి వాళ్ళ పంచన చేరే అవకాశం లేదు. మీరు చెప్పినట్టు నా విషయంలో చట్టాలు నాకు ఉపయోగపడతాయన్న నమ్మకం ఏ కోశానా లేదు. వాళ్ళ బలం ముందు నేను ఎప్పటికీ అబలనే అనిపిస్తోంది. " అంది స్వాతి . ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి వున్నాయి.

దూరం నుండి అత్తగారు వస్తున్న అలికిడి వినపడింది. క్షణాల్లో ఆవిడ రావడం, స్వాతిని శ్రావణి ఇంట్లో చూడగానే ఆమె అహంకారం భళ్ళున బద్దలయ్యింది. అత్తగారిని చూడగానే స్వాతి క్షణకాలం శిలా ప్రతిమలా అయిపోయింది. ఆ వెనువెంటనే గుండెల్లో ప్రకంపనాలు మొదలయ్యాయి. .

అర్ధరాత్రి పదకొండు దాటింది. . మళ్ళీ స్వాతి ఇంట్లో భూకంపం మొదలయ్యింది. ఆ రోజు ఉదయం అత్తగారు ఒకరకంగా స్వాతిని దాదాపు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళడం తను కళ్ళారా చూసింది. దాని పర్యవసానమే ఈ తీవ్రత.

చెప్పుకోవడానికి పక్కనే శ్రావణి వుందనే ధైర్యంతో స్వాతి రోజులు బలవంతంగా నెట్టుకొస్తోంది. .

** ** **

పదిహేనేళ్ళ తరవాత విషయం. ఆ రోజు శ్రీకాంత్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న కంపినీలో ఇంటర్వ్యూలు అవుతున్నాయి. ఆశ్చర్యంగా ఆ రోజు రామారావును అక్కడ చూశాడు. మొదట్లో గుర్తు పట్టడం కష్టమైనా అతని ఫైళ్ళు అవీ చూశాక అతనే అని నిర్ధారించుకుని అతనికి అక్కడ అవకాశం వచ్చేటట్టు చేశాడు. ఆ తర్వాత బోర్డు రూంలో అతన్ని కలిసి పాత స్మృతులు చెప్పుకున్నారు. వాళ్ళ సంభాషణల్లో కుటుంబ విషయాలు ఏమీ రాలేదు. మరో పది రోజుల్లో రామారావుకు అదే కాలనీలో క్వార్టర్ దొరికింది. . శ్రావణికి రామారావును గురించి గుర్తు చేసి ఇప్పుడతను తమ కంపినీలో ఉద్యోగం చేస్తున్నాడని, వాళ్ళ దంపతులు రేపు ఆదివారం మనింటికి భోజనానికి వస్తున్నారని చూచాయిగా భార్యకు చెప్పడంతో ఆమె ఆమె మొహంలో ఆనందం వెల్లివిరిసింది ఎన్నో రోజులకు స్వాతిని చూడబోతున్నందుకు . వెనువెంటనే ఆమెలో అవ్యక్తమైన ఆవేదన ముంచుకొచ్చింది. శ్రీకాంత్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చెయ్యడంతో తను ఆ తర్వాత కాలంలో సమస్యల వలయంలో పూర్తిగా కూరుకుపోయి విలవిలలాడుతున్న స్వాతిని అగాధంలోకి నెట్టేసి ఆమె ఏమయ్యిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. . ఇన్నాళ్లకు మళ్ళీ ఆమెను చూడటానికి సిగ్గుగా అనిపిస్తోంది. పాపం తనకు తోడుంటానని ఆనాడు ఎన్నో ధైర్య వచనాలు చెప్పింది. ఆమె జీవితంలో వెలుగులు కురిపిస్తానని మాటిచ్ఛింది. కానీ అనుకోకుండా అక్కడనుండి భర్తకు ఉద్యోగం మారడంతో ఆ క్వార్టర్, ఆ వూరు శాశ్వతంగా వదిలేయ్యాల్సి వచ్చింది. శ్రావణికి రామారావు వాళ్ళ విషయం చెప్పిన దగ్గరనుండి మనసు మనసులో లేదు. అయోమయంగా చూస్తూ వుండిపోయింది . .

"వీరు శ్రీకాంత్ గారి భార్య. ఇంతకు ముందు శ్రీకాంత్ గారు , నేను ఒకే కంపినీలో పనిచేస్తూ పక్క పక్క క్వార్టర్లలో వుండేవారం . ఈమె నా భార్య మాధవి " అంటూ పరిచయం చేస్తూంటే అప్పుడు పరిశీలనగా చూసింది శ్రావణి . . ఆమె ఆశ్చర్యానికి అంతు లేదు. ఆమె ఖచ్చితంగా స్వాతి కాదు. మరి స్వాతి ఏమయ్యింది ? ఈవిడను రెండో పెళ్లి చేసుకున్నాడా ? అంతుపట్టని విషయం. మాటల మధ్యలో రామారావు చెప్పాడు తన మొదటి భార్య పదిహేనేళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయిందని అలా చెప్తూ వుంటే అతని మొహంలో కించిత్తు బాధ కూడా కనిపించడం లేదు. క్యాజువల్ గా చెప్పినట్టుంది. శ్రావణి అన్యమస్కంగా వుండిపోయింది. లోపలనుండి ఆవేదన తన్నుకొస్తోంది. రామారావు చెప్పేది ఆమెకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఖచ్చితంగా స్వాతి ఆత్మహత్య చేసుకుని వుంటుంది. ఆమెను అలా చేసుకునేలా ఆ కుటుంబం ప్రేరేపించి వుంటుంది. ఎందుకో మాధవి తో మనసు విప్పి మాట్లాడానిపించలేదు. . స్వాతిని చూసి వుండకపోవడంతో శ్రీకాంత్ కు మాధవిని చూడగానే ఎటువంటి అనుమానం రాలేదు.

"నువ్వు వూహించింది నిజమేనోయ్. నువ్వు చెప్పాక నేను పాత కంపినీలోని కొలీగుకు ఫోన్ చేసి కనుక్కున్నాను. మనం అక్కడనుండి వెళ్ళిన నాలుగైదు రోజులకే రామారావు పెళ్ళాం ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందిట. వాళ్ళ మీదకు రానియ్యకుండా మ్యానేజ్ చేసుకున్నారుట " అన్నాడు శ్రీకాంత్ బాధగా మొహం పెడుతూ.

"చూసారా రామారావు ఎంత పని చేశాడో ? ఒక రకంగా ఆ కుటుంబం స్వాతిని హత్యచేసినట్టే లెక్క . ఇప్పుడు మాధవికి కూడా పిల్లలు పుట్టలేదు అంటే ఖచ్చితంగా అది రామారావులోని లోపమే అని అర్ధం అవుతోంది కదా. కానీ ఆ నెపం స్వాతి మీద వేసి ఆమెను మానసికంగా శారీరకంగా హింసించి ఆమెను చావుకు ఉసిగొలిపారు. సాధ్యమైనంతవరకు మనం ఆ రామా రావుకు దూరంగా వుండటం మంచిది. అతనంటే నాకు మొదటినుండి సదభిప్రాయం లేదు. . . స్వాతి చనిపోవడం ఒక పీడకల అని సరిపెట్టుకుంటాను " అంది నిర్లిప్తతగా. కానీ ఒక రచయిత్రిగా తనకంటూ ఎన్నో అభ్యుదయ భావాలు ఉన్నాయని , స్త్రీ ఉద్దరణకు కంకణం కట్టుకున్నానని చెప్పి పాపం ఆ పిచ్చిపిల్లకు తన జీవితం మీద ఎన్నో ఆశలు కలిపించి చివరకు ఆమెను గాఢాంధకారంలో వదిలేసి తన స్వార్ధం చూసుకుని మొగుడు వెంట వెళ్ళిపోయి ఇన్నాళ్ల వరకు ఆమె ఏమైపోయిందో కూడా కలలో కూడా వూహకు తెచ్చుకోని తన కుత్సిత బుద్ది వల్ల తను కూడా నైతికంగా రామారావు కుటుంబంతో పాటు స్వాతి ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమే అని శ్రావణికి తప్ప ఎవరికీ తెలియడానికి అవకాశం లేదు. *** .

సమాప్తం

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి