ఆవకాయ ప్రహసనం - జీడిగుంట నరసింహ మూర్తి

Aavakaya prahasanam

" ఏమీ లేదు వసూ నిన్న అనుకోకుండా శ్యామల అక్క ఇంటికి వెళ్లానే. పాపం ఎంతో ప్రేమగా చీర కూడా పెట్టిందే. అంతే కాదు నాకు ఇష్టం అని ఒక పెద్ద సీసాడు ఆవకాయ ఇంట్లో ఎవరూ వాడటం లేదని నాకు ఇచ్చేసింది " అంది ఫోనులో రామలక్ష్మి .

"అనుకున్నాను. ఆ ఆవకాయ నీకు అంటగట్టిందా. మమ్మల్ని తీసుకోమని బ్రతిమాలితే ఆ పాత ఆవకాయ ఎవరికి కావాలి ? మా దొడ్లో బోళ్లు మామిడికాయలు కాశాయి. కొత్త ఆవకాయ పెట్టుకుందాం అని ప్లాన్ లో వున్నాం అని తప్పించుకున్నాను. పోనీలే అది నీకు ప్రాప్తం ఉన్నట్టుంది. అన్నట్టు అక్క వాళ్లిల్లు చాలా దూరం కదే. అంత సాహసం ఎలా చేశావు ?" అనుమానం వచ్చి అడిగింది వసుధ.

వసుధకు ఎందుకో శ్యామల పొడ అంతగా గిట్టదు. ఒక రకంగా ఆమె అంటే అసూయతో రగిలిపోతుంది.ఆమె చేసే పనులన్నీ గొప్పల కోసం చేసేవే అని అందరి దగ్గరా బాకా వేస్తుంది. శ్యామల మాటలలో తన నగలు, .తన ఆస్తుల గురించే ఎక్కువగా ప్రస్తావన వస్తుందని అని వసుధ నమ్మకం. తన అక్కచెల్లెళ్లతో మాట్లాడుతున్నప్పుడల్లా ప్రధానంగా తన అక్కగారు శ్యామలను ఆడిపోసుకోవడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. . అందుకే అనుకుంటా రామలక్ష్మి శ్యామల ఇంటికి వెళ్ళిందంటే తన అక్కసు బయట పెట్టింది.

" అవునే . నువ్వు చెప్పినట్టు అక్క ఇల్లు దగ్గరా దాపూ లేదు. . . అక్కడికీ రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్ దొరుకుతుందేమో అని చూశాను. ఆదివారం ట్రైన్లు బాగా తక్కువగా తిరుగుతున్నాయిట. ఇక చూసి చూసి విసుగెత్తి ఆటొ మాట్లాడుకుని వెళ్ళాను " అంది రామలక్ష్మి .

"అబ్బో. ఆటో మీద వెళ్ళావా అయితే చాలానే పెట్టి ఉంటావు ? "

"అవును ఆటొ వాడు ముందు రానన్నాడు, నేనే మీటర్ మీద ఇంకో ఏభై రూపాయలు ఎక్కువ ఇస్తానని బ్రతిమాలడంతో మొత్తానికి నాలుగొందలు తీసుకున్నాడు. . ఒక్కదాన్నే వెళ్ళాను కదా. మెడలో గొలుసు , చేతి గాజులు లాక్కుంటే దిక్కెవరు చెప్పు ?. వాడితో ఏ గొడవ పెట్టుకో దల్చుకోలేదు. అందుకే కిక్కురుమనకుండా డబ్బు లిచ్చేశాను .పోన్లెద్దూ మాటికి మాటికి వెళతామా ఏమిటి ? నన్ను చూడాలని అనిపించిందిట పాపం " అలా అంటూంటే రామలక్ష్మి కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి.

"అవునే . నీకు అలాగే అనిపిస్తుంది. నేను మా ఇంటికి రమ్మని నిన్ను ఎన్ని సార్లు పిలిచాను ? ఏదో పనుందంటూ తప్పించుకునే దానివి. నీకు ఇష్టమైతే ఎంత దూరం అయినా దేక్కుంటూ పోతావు " అంది నిష్టూరంగా వసుధ

సాధ్యమైనంతవరకు రామలక్ష్మికి తన బంధువర్గంలో ఎవరితోనూ గొడవ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సూటీ పోటీ మాటలు అస్సలు ఆమెకు పడవు. . అవతల వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని తెలిసినా నవ్వుతూ వూరుకునేది. అందుకే తనంటే అందరూ ఇష్టపడతారు.

"అమ్మా ఎప్పుడూ ఫోనులేనా? అన్నం పెట్టు " కాలేజీకి టైమవుతోంది అంటూ వచ్చాడు రామలక్ష్మి చిన్న కొడుకు ఆశ్రిష్ . .

" మా వైపు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఓర్చుకోలేవురా. అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి తిను . వసు పెద్దమ్మ లైనులో ఉంది . తనతో మాట్లాడి చాలా రోజులయ్యింది " అంది రామలక్ష్మి కొద్దిగా సీరియస్గా.

" నిన్నే కదమ్మా. ఇంకో పెద్దమ్మ ఇంటికి వెళ్ళి గడిపి వచ్చావు. మళ్ళీ ఇంకెవరికి మాటిచ్చావు వస్తానని ? . అంతంత ఖర్చు పెట్టుకుని ఆటోల మీద వెళ్తావు. వాళ్లిచ్చే వస్తువులేవో హైరానా పడుతూ మోసుకుంటూ వస్తావు. ఇంతకీ నిన్న వాళ్ళింటినుండి ఏం తెచ్చావు ?" అన్నాడు కుతూహలంగా ఆశ్రిష్. .

"ఒక్క నిమిషమే ఆషూ ఏదో అడుగుతున్నాడు. " అంటూ రిసీవర్కు చెయ్యి అడ్డుపెట్టి

."అన్నట్టు మర్చిపోయాను. పెద్దమ్మ ఇచ్చిన ఆవకాయ ఉంది. పప్పులో నంచుకుందువు కానీ. ఘుమ ఘుమ లాడి పోతోందని ఇచ్చింది. కాస్త వేడి వేడి అన్నంలో కూడా కలుపుకో. పెద్దమ్మ ఆవకాయ గురించి ఫీడ్ బ్యాక్ అడిగింది చెప్పాలి. " అంటూ కొడుకును సమాధాన పరిచి చెయ్యి అడ్డుపెట్టి ఆపిన ఫోను మళ్ళీ కంటిన్యూ చెయ్యడం మొదలు పెట్టింది రామలక్ష్మి

ఇంతలో కెవ్వు మని కేక వినపడటంతో కంగారు పడి ఫోన్ డిస్ కనెక్ట్ చేసి పరిగెట్టుకుంటూ డైనింగ్ హాల్లోకి వచ్చి పడింది రామలక్ష్మి.

ఆశ్రిష్ వాష్ బేసిన్ దగ్గర వాంతి చేసుకుంటున్నాడు . అర్ధం కాక రామలక్ష్మి వాడి రెండు చెవులు వెనకనుండి మూసి పట్టుకుంది .

" ఏమిటమ్మా అది ఆవకాయా ? ఒకటే మట్టి వాసన. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కడుపంతా దేవేసి మొత్తం తిన్నదంతా బయటకు వచ్చింది. ఇటువంటి పచ్చళ్లు నాకు వెయ్యకు. మన ఖర్మ ఏం కాలిపోయిందని అలా పాడైపోయిన పచ్చళ్లు అంతంత దూరం వెళ్ళి తెచ్చుకుంటావు ? అయినా వాళ్ళకు మాత్రం సెన్స్ ఉండక్కర లేదూ ? వాళ్ళకు పనికి రానిది మనకు పనికి వస్తుందా ? ఏదో రకంగా పాత పచ్చళ్లు వదిలించుకోవాలని అనుకోవడం తప్ప? నాన్నతో చెప్పు మామిడికాయలు , త్రీ మాంగోస్ కారం సామర్ల కోట నూనె తెమ్మని . వెంటనే కొత్త ఆవకాయ పెట్టు . మళ్ళీ టేబుల్ మీద ఆ నల్లావకాయ చూశానంటే గోడెనకాల విసిరేస్తాను. ఏమనుకున్నావో ?" అంటూ రయ్యిమంటూ లేచాడు ఆశ్రిష్.

"ఏమిటిరా ఆ మాటలు పెద్దా చిన్నా లేకుండా ? పెద్దమ్మ ఇచ్చే ముందు నన్ను అడిగే ఇచ్చింది. అంతంత ఖరీదు పెట్టిన పచ్చళ్లు పనిమనిషికి వెయ్యాలంటే కష్టం అని ఈ పచ్చడి అయితే వేసినా పర్వాలేదు అని నేనే కావాలని తెచ్చాను. అంత దానికి అవతల వాళ్ళను ఆడిపోసుకోవడం ఎవరికైనా సరే మంచిది కాదు. ఇక నీ పని చూసుకో . ఈ ఆవకాయ గురించి ఎవరి దగ్గరైనా తేలావంటే బాగుండదు ముందే చెపుతున్నాను. ఈ విషయం పెద్దమ్మ వాళ్ళకు తెలిస్తే జన్మలో మన మొహం చూడదు" అంటూ కొడుకు మీద అరిచింది.

నిజానికి తన అక్కగారు" క్రితం సంవత్సరం చేసిన ఆవకాయ బోళ్ళంత నూనెతో ఘుమఘుమ లాడిపోతోంది తీసుకెళ్లు పిల్లలు తింటారు. మా ఇంట్లో నాకు బీపీ, ఆయనకు బీపీ . పిల్లలు వేరే వూళ్ళల్లో ఉంటున్నారు. ఏదో అందరూ పెట్టుకుంటున్నారు అంటే మేమూ పెట్టుకోవడం తప్ప అసలు ఇంట్లో పచ్చళ్లు తినే వాళ్ళే లేరు " అంటూ సీసా తీసుకొచ్చి తన ముందు పెట్టడం వల్లే మొహమాటంతో తీసుకోక తప్పలేదు. పైగా తనకు ఎవరి మనసును బాధ పెట్టడం అలవాటు లేదు కూడాను. కొడుకు ఈ ఆవకాయ గురించి అంత భయంకరంగా విమర్శించినా తను మాత్రం ఎటువంటి పరిస్తితులలోనూ తన పుట్టింటివారిని తక్కువ చేసి చిన్న బుచ్చడం ఇష్టం లేదు . అందుకే కొడుకు దగ్గర అక్కగారిని వెనకేసుకొచ్చింది.

** ** ** **

"ఏంటీ నువ్వేదో నాలుగొందల రూపాయలు ఖర్చుపెట్టి పాతావకాయ తీసుకొచ్చావుటగా నీ కొడుకు చెపుతున్నాడు. నువ్వు తింటే తిను నాకు మాత్రం వెయ్యకు " అన్నాడు ప్రకాశం రాత్రి భోజనం చేస్తూ రామలక్ష్మితో.

రామలక్ష్మి కొడుకు వైపు కొరకొరా చూసింది. వీడి నోరును అదుపులో పెట్టడం కష్టం. అప్పుడే తండ్రికి వూదేశాడు . ఈయన గారు ఈ విషయాన్ని ఇక తన అన్న దమ్ములందరికీ చేరేయ్యడానికి తహతహలాడి పోతాడు. తనకూ, తన తోడపుట్టిన వాళ్ళ మధ్య ఎన్నో ఉంటాయి. పాత చీరలు కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తూర్పార బెట్టేస్తే నలుగురిలో తమ పరువు ఏమి కాను ? రామలక్ష్మి మొహం నల్లబడి పోయింది. ఎలాగైనా ఈ ప్రమాదాన్ని ఆపాలి. అదే ఆమె ఆలోచన. రామలక్ష్మికి ఆ రాత్రంతా నిద్ర లేదు. అన్నీ పీడ కలలే.

వారం రోజులు గడిచిపోయింది. అనుకోకుండా రామలక్ష్మి అక్కగారు శ్యామల రామలక్ష్మి ఇంటికి వచ్చింది.

"ఏమిటి ఈ సర్ప్రైజ్ విజిట్? నేను ఊహించలేకపోతున్నాను. వచ్చేముందు ఒక్క ఫోన్ చేసి ఉండాల్సింది. పాపం మా అడ్రెస్ కనుక్కోవడానికి ఎన్ని తిప్పలు పడ్డావో ఏమిటో ?" అంటూ ఒకటే బాధపడి పోయింది రామలక్ష్మి.

కొద్దిసేపు ఆ కబుర్లూ, ఈ కబుర్లు అయ్యాక శ్యామల రామలక్ష్మి పక్కన కూర్చుని " ఇదిగో రామీ ! ముఖ్యంగా నేను ఎందుకొచ్చానంటే నీకు పాత ఆవకాయ ఇచ్చినందుకు మీ బావగారు రోజూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా నిద్ర పోనివ్వడం లేదనుకో. రాగా రాగా మనింటికి వచ్చిన నీ చెల్లెలికి పాత ఆవకాయ ఇచ్చి పంపిస్తావా నీకు అసలు బుద్ది ఉందా ? ఈ పాత ఆవకాయ , చింతకాయ పచ్చళ్లు ఎవరికి ఇస్తారు అనుకుంటున్నావు ? ఇంట్లో ఎవరైనా బాలింతలు, సూలింతలు ఉంటే కొత్త పచ్చళ్లు తినకూడదని వాళ్ళే అడిగి తీసుకెళతారు. ఇప్పుడు ఆ సందర్భం ఏమీ లేదు. నువ్వు పెట్టిన చీరకు , ఆ పాత ఆవకాయ ఎలా మ్యాచ్ అవుతుందనుకున్నావు ? " అంటూ అప్పటికప్పుడు మామిడికాయలు , సరుకులు తెచ్చి నాచేత కొత్త ఆవకాయ పెట్టించి నీకు పర్సనల్ గా ఇచ్చి ఆ పాత ఆవకాయను వెనక్కి తెచ్చేయ్యమని నన్ను పంపించారు . ఏమిటో ఈ మధ్య నా బుర్ర అసలు పని చెయ్యడం లేదనుకో. అది నీకెలా ఇచ్చానో ఆలోచిస్తూ ఉంటే నాకే సిగ్గుగా అనిపిస్తోంది. మరిది గారు ఏమనుకున్నారో ఏమో? ఆయన ముందు నేను తలెత్తుకోలేను . మరిది ఆఫీసునుండి ఇంటికొచ్చే లోపే నేను తిరిగి వెళ్లిపోతాను . దయచేసి నన్ను అపార్ధం చేసుకోకే. నీకు నేను పాత ఆవకాయ ఇచ్చినట్టు మన అక్క చెల్లెళ్లకు ఎవరికీ పొరపాటున కూడా చెప్పకే. చాలా రోజులనుండి ఎవరూ వేసుకోకుండా పక్కన పడేయడం వల్ల నిజానికి ఆ పచ్చడి పాడైపోయి ఉంటుంది. నేను చూసుకోలేదు. ఏదీ ఆ సీసా ఇటిచ్చెయ్యి తల్లీ . నా చేతులతోనే బయట పారేస్తాను. " అంటూ శ్యామల ఆ సీసా చెల్లెలు నుండి వెనక్కి తీసుకునే అంతవరకు వూరుకోలేదు.

సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వచ్చిన భర్తకు తన అక్కగారు వచ్చి కొత్తావకాయ ఇచ్చి పాతావకాయ తీసుకుపోయిందని , ఇక ఈ విషయం ఇంతటితో ఈ ఇంట్లో అందరూ చర్చించడం ఆపేయ్యాలని బ్రతిమాలుకుంది.

తన అక్కగారు పొరపాటున కూడా తను పాత ఆవకాయ ఇచ్చినట్టు తన అక్క చెల్లెళ్లకు ఎవరికీ తెలియనియ్యద్దు అని తన దగ్గర మాట తీసుకుంది. కానీ పొరపాటునో , గ్రహపాటునో ఆరోజు అనుకోకుండా తన ఇంకో అక్క వసుధకు చెప్పనే చెప్పేయ్యడం, దానికి ఆమె విపరీతంగా కామెంట్లు చెయ్యడం హాఠాత్తుగా గుర్తొచ్చింది రామలక్ష్మికి.

వెంటనే ఫోను తీసుకుని వసుధకు ఫోను చేసింది " వసూ ! మళ్ళీ నీతో మాట్లాడటం కుదరలేదు. ఆ రోజు అక్క ఆవకాయ ఇచ్చిందని చెప్పాను కదా. తీరా చూస్తే ఆ సీసా అక్కడే వదిలేశానని అక్క ఫోన్ చేసి చెప్పింది. సంచీలో పెట్టుకున్నాను అనుకున్నాను ఎలా మర్చిపోయానో అర్ధం కావడం లేదు. ఆ రోజే ఫోన్ చేసి అక్కకు చెప్పేశాను. "పర్వాలేదులే ఇంకా ఎక్కువ నిలవ ఉంటే బాగుండదు మీ పని మనిషికి ఇచ్చేయ్యి" అని. . ప్రస్తుతం ఏమీ చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. ఈ విషయమే నీతో చెపుదామని ఫోన్ చేశాను. ఉంటాను " అంటూ ఆపత్కాలంలో తప్పని సరి పరిస్తితులలో పెద్ద అబద్దం ఆడేసింది.

అక్కగారి ఇంటినుండి ఆ పాతావకాయ తెచ్చుకున్నప్పటినుండి, ఆ తరవాత పరిణామాలతో రామలక్ష్మికి మనసు మనసులో లేదు. ఒకటే ఆందోళనతో అతలాకుతలం అయిపోతోంది. అక్కగారు వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాక ఈ రోజు వసుధతో మాట్లాడిన అనంతరం ఇప్పుడు రామలక్ష్మి గుండెలు తేలిక పడ్డట్టయ్యి హాయిగా ఊపిరి పీల్చుకుంది *****

సమాప్తం

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి