భాగవత కథలు – 19 ( శ్రీకృష్ణుని అష్టమహిషులు) - కందుల నాగేశ్వరరావు

Srikrishnuni ashta mahishulu

భాగవత కథలు – 19
శ్రీకృష్ణుని అష్టమహిషులు

రుక్మిణీదేవి


విదర్భదేశంలో కుండని నగరముంది. దానికి భీష్మకుడు ప్రభువు. అతనికి రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అని ఐదుగురు కుమారులు, రుక్మిణి అనే ఒక కుమార్తె ఉన్నారు. పెద్దవాడైన రుక్మి నీతిమాలినవాడు. రుక్మిణి లక్ష్మీదేవి అంశతో జన్మించింది. గొప్ప గుణవంతురాలు. ఆమె పుట్టి పెరుగుతుండగా భీష్మకమహారాజు మందిరం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. యవ్వనంలో అడుగుపెట్టిన ఆమె తన తండ్రిగారి ఇంటికి వచ్చే అతిథులవల్ల శ్రీకృష్ణుడి రూపం, బలం, సద్గుణాలు మున్నగు వాటిని విన్నది. తనకు అతడే భర్తయని నిర్ణయించుకున్నది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి రూపం, వివేకం, సత్ప్రవర్తన, సద్గుణాలు అన్నిటి గురించి తెలుసుకున్నాడు. తప్పక ఆమెనే పరిణయమాడాలని నిశ్చయించుకున్నాడు. చుట్టాలందరూ కూడా వీరిద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని అనుకొన్నారు.


రుక్మి తన చెల్లెలును, మిత్రుడు చేది దేశాధిపతి శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు. రుక్మిణి రానున్న ప్రమాదాన్ని గ్రహించి అగ్నిద్యోతనుడు అనే విప్రుని ద్వారా శ్రీకృష్ణునికి తన పరిస్థితిని వివరించి, వచ్చి తనను పరిణయమాడమని రాయబారం పంపింది. అగ్నిద్యోతనుడు ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుడిని కలిసి “పెండ్లి కొడుకువు కమ్ము” అని ఆశీర్వదించాడు.


తర్వాత ఆ విప్రుడు రుక్మిణి సందేశాన్ని ఇలా విన్నవించాడు. “స్వామీ! సందేశం స్వీకరించండి. భీష్మక మహారాజు గారి కుమార్తె రుక్మిణీదేవి తమ గురించి విన్నారు. తనను పరిణయమాడమని దేవరవారికి మనవి చేయమని నా ద్వారా ఈ శుభ సందేశం పంపింది – ‘ఓ పద్మనాభా! నా ఇష్టానికి వ్యతిరేకంగా మా అన్న నా వివాహం శిశుపాలునితో జరిపిస్తున్నాడు. చిన్నప్పుడే నీగురించి అంతా విని నా హృదయం నీకు సమర్పించాను. నేను నిన్నుతప్ప వేరెవరినీ వివాహం చేసుకోలేను. నీకు ఇక్కడ అడ్డేమీ లేదు. రేపే నీవు చతురంగబలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఓడించి రాక్షస వివాహపద్ధతిలో నన్నెత్తుకొని వెళ్ళు. నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను. పెళ్లికి ముందుగా “మా ఆచారం ప్రకారం పెళ్ళి కుమార్తెను మంగళగౌరిని కొలవడానికి పంపుతారు. మా ఊరి బయట నున్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. ఆ సమయంలో నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళు.’ అని మీకు తెలియచేయమని చెప్పింది” అని అగ్నిద్యోతనుడు విన్నవించాడు.


ఈ విధంగా విదర్భ రాజకుమారి పంపిన వార్తను, ఆమె రూపం, చక్కదనం మున్నగు విషయాలను శ్రీకృష్ణుడు సావధానంగా విన్నాడు.ఆ విప్రుని చేయి పట్టుకొని “రుక్మిణి మీద నాకూ చాలా ఇష్టం ఉంది. రుక్మి గురించి కూడా నీకు తెలుసు. నేను తప్పక వచ్చి ఆ కన్యారత్నాన్ని గైకొంటానని చెప్పు. విరోధులు నన్ను అడ్డుకుంటే వారిని హతమారుస్తానని కూడా చెప్పు.” అన్నాడు. శ్రీకృష్ణుడు అగ్నిహోత్రునితోబాటు రథం ఎక్కి ఒకే రాత్రి పయనించి విదర్భ చేరాడు. అక్కడ నగరమంతా అలంకరించి వివాహానికి కావలసిన ఏర్పాట్లు జరుపుతున్నారు. బలరామకృష్ణులు వస్తే తరిమికొట్టి శిశుపాలునితో రుక్మిణి పెళ్ళి జరిపించడానికి జరాసంధుడూ, దంతావక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రక వాసుదేవుడు మొదలైనవారు చతురంగ బలాలతో కదిలి వచ్చారు. ఈ విషయం తెలిసి తమ్ముడు కృష్ణునికి సాయంచేయడానికి హలధారుడైన బలభద్రుడు అసంఖ్యాక సైన్యంతో బయలుదేరి విదర్భకు పయనమయ్యాడు.


విదర్భ చేరిన బలరామకృష్ణులను భీష్మకరాజు శాస్త్రోక్తంగా ఆహ్వానించి కానుకలు సమర్పించాడు. అంతఃపురంలో కృష్ణుడు వస్తాడా రాడా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న రుక్మిణికి ఈ వార్త తెలిసి ఎంతో సంతోషించింది. అలంకరించుకొని చెలికత్తెలతో కలిసి దుర్గాపూజకు అంతఃపురం నుండి గుర్గగుడికి బయలుదేరింది. పూజ అనంతరం గుర్గాదేవికి మ్రొక్కి కానుకలు సమర్పించింది. ఆ సుందరి ముకుందుని రాకకు ఎదురుచూస్తూ కాలినడకతో బయలుదేరింది. అలా వస్తూ జగములను మోహింపజేసే జగన్మాథుడైన శ్రీకృష్ణుని దర్శించింది. వెంటనే రథం ఎక్కాలని కుతూహలపడింది. రుక్మిణిని అవలోకించిన మాధవుడు శత్రు సమూహం చూస్తూ ఉండగానే సకలరాజలోకాన్నీ లెక్కచేయకుండా రాకుమారిని రథమెక్కించుకున్నాడు. బలరాముడు వెంటరాగా శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకానగర మార్గం పట్టాడు. శత్రువీరులు రథంపై బాణాలు గుప్పించారు. కృష్ణుడు రుక్మిణితో దేవీ! చూస్తూ ఉండు, మన యాదవవీరులు శత్రుసైన్యాన్ని చీల్చి చండాడుతారు. అన్నట్టుగానే బలరాముని నేతృత్వంలోని యాదవ సైన్యం శతృసైన్యంలో నెత్తురు టేరులు పారేటట్లు చేసారు. భయంతో వెనుదిరిగి పరుగెట్టి పోయిన జరాసంధుడు మొదలైన వీరులందరూ ఒక్కచోట చేరి శిశుపాలుణ్ణి ఓదార్చారు.


రుక్మిణి అన్న రుక్మి మాత్రం శ్రీకృష్ణుడు రాక్షస వివాహ విధానంలో తన సోదరిని ఎత్తుకు పోవడం ఓర్చుకోలేక ఒక అక్షౌహిణి సేనతో యాదవ సైన్యం వెనుక వెళ్ళి “ఓ యాదవా! వెన్న దొంగా! ఆగు. మా చెల్లెల్ని వదలిపెట్టు, వదలకపోతే కదన రంగంలో నీ గర్వం సర్వం హరిస్తాను.” అని హెచ్చరించాడు. రుక్మి ఈ విధంగా పలికిన వెంటనే మాధవుడు నవ్వుతూ వాడి బాణాలతో రుక్మి రథాశ్వాలను కూల్చాడు, సారథిని చంపాడు, రుక్మి దేహం తూట్లు చేశాడు. హరి ఒర నుండి ఖడ్గం దూసి రుక్మిశిరం తెగనరకడానికి ముందుకు వస్తుండగా రుక్మిణి తన అన్నను క్షమించి ప్రాణ బిక్ష పెట్టమని ప్రార్థించింది.యదువల్లభుడు రుక్మిని చంపక అతని మీసం తల పాయలు పాయలుగా కత్తిరించి కురూపిని చేసి వదలిపెట్టాడు. రుక్మి ఆ వికార రూపానికి చింతిస్తూ శ్రీకృష్ణునిపై పగ తీర్చుకొని గాని మరల కుండని నగరం ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి నగరం బయటనే ఉండిపోయాడు.


శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో సహ ద్వారకానగరం చేరి నగరవాసులందరి సమక్షంలో రంగరంగ వైభోగంగా ఆమెను వివాహం చేసుకొన్నాడు. రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకా నగరవాసులు గొప్ప గొప్ప కానుకలు సమర్పించి పండుగ చేసుకున్నారు. ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో సుఖిస్తున్న శ్రీకృష్ణుని చూచి పట్టణంలోని ప్రజలందరూ ఆనందంతో సుఖంగా ఉన్నారు.

జాంబవతి, సత్యభామ


యాదవరాజ్యంలో సత్రాజిత్తు అనే రాజు ఉండేవాడు. సత్రాజిత్తు సూర్య భగవానుని పరమ భక్తుడు. ప్రతిరోజు అచంచలమైన భక్తితో సూర్యుడిని పూజించేవాడు. ఒకరోజు ఆయన సముద్రతీరంలో తిరుగుతూ ఉండగా సూర్యదేవుడు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను అని చెప్పి ‘శమంతకం’ అనే మణిని బహూకరించాడు. ఆ మణి ఎంతో శక్తి కలది. అది ఉన్నచోట శత్రుభయం నశిస్తుంది, మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది. రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇచ్చి సంపదను పెంచుతుంది. సత్రాజిత్తు ఆ మణిని తీసుకొని నగరానికి తిరిగి వచ్చాడు. ప్రజలు సూర్యునివలె వెలిగిపోతున్న ఆయనను చూసి దైవస్వరూపంగా భావించారు. సత్రాజిత్తు ఆ మణిని రోజూ పూజిస్తూ దాని వలన వచ్చిన సంపదతో దానధర్మాలు చేస్తూ ఉన్నాడు.

ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని ఉగ్రసేన మహారాజుకి ఇమ్మని, దానివలన రాజ్యానికి శత్రుభయం పోయి మంచి జరుగుతుందని సూచిస్తాడు. సత్రాజిత్తు నిరాకరించడంతో కృష్ణుడు వెనుదిరిగి తన నివాసానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆమణిని సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు తన మెడలో ధరించి క్రూరమృగాలను వేటాడే నిమిత్తం అడవికి వెళ్లాడు. అడవిలో ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని నోట కరుచుకొని వెళ్ళుతుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని అందుకున్నాడు. జాంబవంతుడు ఆ మణిని తన ప్రియ కుమారునకు ఆటబంతిగా ఉపయోగించుకొనడానికి ఇచ్చాడు.


ఇక్కడ సత్రాజిత్తు తన తమ్ముడు వేటకు వెళ్ళి రాకపోయేసరికి శ్రీకృష్ణుడు ప్రసేనుని సంహరించి మణిని దొంగిలించాడని బ్రమపడి, ఊరంతా చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు ఈ నింద తొలగించుకొనుటకై అడవిలో వెతుకుతూ నేలకూలిన గుర్రాన్ని, ప్రసేనుణ్ణీ, ప్రసేనుణ్ణి చంపిన సింహం మృతదేహాన్ని చూసాడు. అక్కడ నుండి కాలి గుర్తుల ద్వారా జాంబవంతుని గుహ దగ్గరకు చేరాడు. తన వెంట వచ్చిన సైన్యాన్ని అక్కడ వదిలి గృహంలో ప్రవేశించాడు.

అక్కడ ఒక బాలుని ఊయలకు కట్టిఉన్న మణిని చూసాడు. దానిని తీసుకుందామని తలిచాడు. కొత్త మనిషిని చూసి దాది వేసిన కేకలు విని జాంబవంతుడు అక్కడకు వచ్చాడు. తన ప్రభువైన శ్రీరామ చంద్రుడని తెలియక యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు ఇరువది ఎనిమిది రోజులు పోరాటం చేసి జాంబవంతుడి ఓడించాడు. జాంబవంతుడు తనను ఓడించింది శ్రీరామచంద్రుడేనని గ్రహించి శ్రీకృష్ణుని స్తుతించాడు. శమంతకమణితో బాటు తన కుమార్తె జాంబవతి అనే పేరుగల కన్యకామణిని హరికి కానుకగా ఇచ్చాడు. మణితో, బాలామణితో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి ద్వారకా పురవాసు లందరూ సంతోషించారు. అందరి సమక్షంలో జాంబవతీదేవిని రెండవ పట్టపురాణిగా చేసుకున్నాడు.


తరువాత సత్రాజిత్తును రాజ్యసభకు రప్పించి ప్రసేనుని మరణవార్తను చెప్పి మణిని అప్పగించాడు. సత్రాజిత్తు తన తొందరపాటుకు సిగ్గుపడి, శ్రీకృష్ణుని క్షమాపణ కోరి తన కుమార్తె సత్యభామను వివాహం చేసుకోమని కోరాడు. శమంతక మణిని కానుకగా ఇవ్వబోయాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహము చేసుకొనుటకు అంగీకరించి మణిని నిరాకరించాడు. సత్రాజిత్తు శ్రీకృష్ణునికి తన కుమార్తె సత్యభామనిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. ఎన్నో కానుకలు సమర్పించాడు. భూదేవి అవతారమైన సత్యభామను శ్రీకృష్ణుడు పరిణయమాడి తన మూడవ పట్టమహిషిగా చేసుకున్నాడు.


కాళింది


ఒకసారి పురుషోత్తముడు పాండవులను చూసి రావాలని సాత్యకి మొదలైన యాదవులతో కలిసి ఇంద్రప్రస్థనగరానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడిని దర్శించి పాండవులు, ద్రౌపతి, కుంతీదేవి ఎంతో సంతోషించి సాదరంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో ప్రజలకు నేత్రానందం కలిగిస్తూ కొన్ని నెలలపాటు ఉన్నాడు.


ఒకనాడు అర్జునుడు అశ్వారూఢుడై శ్రీకృష్ణుడితో కలిసి అరణ్యానికి వెళ్లాడు. ఎంతో ఆసక్తితో జంతువులను వేటాడాడు. అప్పుడు అర్జునినకు దాహం వేసింది. నరనారాయణుల ఇద్దరూ యమునా నదికి వెళ్ళి దాహం తీర్చుకొని ఒడ్డున ఇసుకలో కూర్చున్నారు. అప్పుడు వారు యమునా తరంగాలలో సర్వాంగ సుందరి సూర్యుని కుమార్తెను చూసారు. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె వద్దకు వెళ్ళి “ సుందరీ, నీవెవరు? నీ పేరేమిటి? ఎందుకు ఇక్కడ ఉన్నావు? నీ విషేషాలన్నీ చెప్పు. నీ మనస్సులో ఉన్న కోరిక తప్పక నెరవేరుతుంది” అన్నాడు.

ఆమె అర్జునునితో “ఓ వీరాధి వీరా! నేను సూర్యుని కుమార్తెను. నా పేరు కాళింది. పద్మాక్షుడైన శ్రీకృష్ణుడిని వివాహమాడదలచి తపస్సు చేస్తున్నాను. శ్రీకృష్ణులవారు వేటకు వచ్చి నన్ను వివాహమాడగలరని నా తండ్రి నాకు తెలిపాడు. అందువలన ఆయన రాకకు ఎదురు చూస్తున్నాను” అని చెప్పింది. కాళింది చెప్పిన మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి తెలిపాడు. శ్రీహరి ఆమెను స్వీకరించి, రథమెక్కించుకొని ధర్మరాజు దగ్గరకు వెళ్లాడు. పాండవులు కాళిందితో కలిసి వచ్చిన శ్రీకృష్ణుని స్వాగతించారు. వారి కోరికపై విశ్వకర్మ నగరాన్ని తీర్చిదిద్ది చిత్ర విచిత్రంగా అలంకరించాడు.

కొద్ది రోజుల తరువాత శ్రీకృష్ణుడు పాండవుల వద్ద శలవు తీసుకొని సహచరులతో కలిసి ద్వారకకు తిరిగి వచ్చాడు. బందువు లందరి సమక్షంలో కాళిందిని పరిణయమాడి నాల్గవ పట్టమహిషిగా చేసుకున్నాడు.


మిత్రవింద


అవంతీ నగరాన్ని విందానువిందులు అనే ఇద్దరు సోదరులు పరిపాలిస్తున్నారు. వారి తల్లియైన రాజాధిదేవి శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది. వారు తమ చెల్లెలు మిత్రవిందకు స్వయంవరం ప్రకటించారు. రాజులందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడు ఎదురులేని తన పరాక్రమం చూపించి అందాలరాణి అయిన మిత్రవిందను స్వయంవరంలో గెలుచుకున్నాడు. మిత్రవింద శ్రీకృష్ణుని అయిదవ పట్టమహిషి అయ్యింది.


నాగ్నజితి


కోసల దేశాన్ని ధర్మపరుడైన నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు వద్ద వాడి కొమ్ములు కలిగి మదించిన ఏడు ఆంబోతులు ఉన్నాయి. ఆవృషభాలను తన బాహుబలంతో ఎవరైతే పట్టి కట్టి పెడతారో వారికే ఆమెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఎందరో రాజులు ప్రయత్నించారు కాని ఫలితం లేకపోయింది.


ఆ వృషభాలను జయించినవాడే ఆ కన్యకు భర్త అని తెలిసి శ్రీకృష్ణుడు సేనా సమేతంగా కోసలదేశానికి వెళ్లాడు. కోసలరాజు వారిని గొప్పగా గౌరవించాడు. రాజకుమారి త్రిలోక పూజితుడైన ఆయననే తన భర్తగా భావించింది. తను పూర్వజన్మలో నోచిన నోము ఫలించిందని, చక్రధరుడు తనను వివాహం చేసుకుంటాడని నమ్మింది. శ్రీకృష్ణుడు కోసలరాజుతో “నీ కుమార్తెను నేను కోరుకుంటున్నాను. రాజులు పరులను యాచింపరు. మేము కన్యాశుల్కం ఇచ్చేవారము కాదు” అన్నాడు.


కృష్ణుడి మాటలు విన్న రాజు “నా కుమార్తెను వివాహమాడడానికి నీ కంటె తగిన వారెవ్వరూ లేరు. నాకు కన్యాశుల్కం అక్కర లేదు కాని ఈ వృషభాలను ఎవరైతే కట్టడి చేస్తారో వారికే నా పుత్రికనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాను. నీవు సర్వ సమర్థుడవు. ఈ రోజు వాటితో పోరాడి జయించి నా కుమార్తె నాగ్నజితిని చేపట్టు” అన్నాడు. శ్రీకృష్ణుడు పై వస్త్రాన్ని నడుముకు బిగించి విచిత్ర రీతిలో ఏడు మూర్తులు ధరించి పర్వతాలవంటి ఆ ఏడు వృషభాలను పట్టుకొని గ్రుద్ది అవలీలగా నేలపై కూలద్రోశాడు. నగ్నజిత్తు తన కుమార్తె నాగ్నజితిని కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. నూతన దంపతులను రథమెక్కించి ఎన్నో కానుకలిచ్చి సాగనంపాడు.


ఇంతకు ముందు నాగ్నజితిని వివాహమాడడానికి వచ్చి ఆబోతులను ఓడించలేక పరాజితులైన రాజు లందరూ మాధవుడు ఆ కన్యను వివాహమాడిన విషయం తెలిసుకొని శ్రీకృష్ణుని జయించడానికి సైన్య సమేతంగా వచ్చి మార్గ మధ్యంలో అడ్డగించారు. శ్రీకృష్ణుడు తన గాండీవం నుండి వదలిన బాణాలతో శత్రువుల నందరినీ సంహరించాడు. బంధువులంతా సంతోషించారు. ఇలా శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్లాడి ద్వారకానగరానికి వచ్చాడు. నాగ్నజితిని తన ఆరవ పట్టమహిషిగా చేసుకున్నాడు.


భద్ర, లక్షణ


కేకయదేశాధిపతి శ్రుతకీర్తి కుమార్తె, తన మేనత్త కూతురు అయిన భద్రను శ్రీకృష్ణుడు వివాహమాడాడు. శత్రువులనందరినీ ఓడించి మద్రరాజ కుమార్తె లక్షణను పరిగ్రహించాడు. వీరిద్దరితో శ్రీకృష్ణునికి అష్టమహుషులు అనగా ఎనమండుగురు పట్టపురాణులు.


పదహారు వేల రాకుమార్తెలు


శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసివెళ్శి యుద్ధంచేసి భూదేవి కుమారుడైన నరకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించాడు. ఆ రాక్షసుడు వద్ద బందీగా ఉన్న పదివేలమంది రాజకుమార్తెలను విడిపించాడు. ఆ రాకుమార్తెలు శ్రీకృష్ణుడి సౌందర్యం, చాతుర్యం, గాంభీర్యం చూసి ఆకర్షితులై అతడే తమ ప్రాణవల్లభుడని భావించారు. శ్రీకృష్ణుడు వారికి చీరలు, ఆభరణాలు, పూమాలలూ ఇచ్చి వారిని పల్లకీ లెక్కించి ద్వారకకు పంపించాడు. అనంతరం సత్యభామతో కలిసి దేవేంద్రుడి పట్టణమైన అమరావతి నగరం వెళ్ళి, అతని అహంకారం అణచివేసి, పారిజాత వృక్షంతో తిరిగి ద్వారకా నగరం వచ్చాడు. ఒక శుభ ముహూర్తాన పదహారువేల భవనాలలోనున్న పదహారువేలమంది రాకుమార్తెలను, పదహారువేల రూపాలతో శాస్త్రోక్తంగా వివాహమాడాడు. శ్రీకృష్ణుడు పదహారువేల మంది భార్యల పట్ల సమానభావాన్ని ప్రదర్శించడంలో తన సామర్థ్యాన్ని చూపించాడు. అందరూ శ్రీకృష్ణుడు పగలు రాత్రి నా దగ్గరే ఉన్నాడు అని సంబరపడుతూ ఆదరాభిమానాలతో ఆరాధించారు. శ్రీకృష్ణునికి ఎనమండుగురు పట్టపురాణులు, వందమంది గోపికలు, పదివేలమంది రాకుమార్తెలతో కలిసి మొత్తం పదివేల ఒకనూరు ఎనిమిదిమంది (10,108) భార్యలు.


శ్రీకృష్ణుని సంతానం


రుక్మిణీదేవి వలన శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు అనే పదిమంది కుమారులు, చారుమతి అనే ఒక కుమార్తె కలిగారు. సత్యభామకు భాను, స్వభాను, సుభాను, భానుమాను, ప్రభాను, అతిభాను, ప్రతిభాను, శ్రీభాను, బృహద్భాను, చంద్రభాను అని పదిమంది కుమారులు కలిగారు. జాంబవతికి విజయ్. కృతు, సాంబ, సుమిత్ర, ద్రవిన్, శతజిత్, పురుజిత్, వాసుమన్, శస్రజిత్, చిత్రకేత్ అనే పదిమంది కుమారులు కలిగారు.


కాళింది, మిత్రవింద, నాగ్నజితి, మాద్రి, భద్రలకు కూడా ఒక్కొక్కరికి పదిమంది అందమైన కుమారులు ఉదయించారు. పదహారువేలమంది భార్యలలో ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు శ్రీకృష్ణునికి కలిగారు. ఆ పుత్రులందరికీ మళ్ళీ పుత్రులు కలిగారు. ఈ విధంగా పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు. యాదవ, వృష్ణి భోజ, అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్య నేర్పు గురువర్యులు మూడు కోట్ల ఎనభైవేల ఒక్క వందమంది ఉన్నారంటే ఇక ఆ రాజకుమారుల వైభవం వర్ణించడం బ్రహ్మకైనా, పరమేశ్వరునికైనా సాధ్యమవుతుందా?


*శుభం*

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల