తప్పిన ప్రమాదం - జీడిగుంట నరసింహ మూర్తి

Tappina pramadam

నూనె రేటు మార్కెట్లో ఇష్టమొచ్చినట్టు పెరిగిపోతోందని వీలు దొరికినప్పుడల్లా అయిదేసి ప్యాకెట్లు తెచ్చి పడేస్తూ ఉండేవాడు రామారావు .

ఒక్కసారిగా అంత నూనె చూసిన కామాక్షికి ఆనందంతో పూనకం వచ్చేసేది .

" ఇదిగో తోటకూరతో పకోడీలు చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి "అంది ఒక రోజు అతని భార్య కామాక్షి ఏదో కొత్త ప్రయోగం చేసినట్టుగా మొగుడివైపు చూస్తూ .

" సూపర్ . . హోటల్ వాళ్ళు ఇలాంటివి ఎందుకు చెయ్యరో ?" అన్నాడు వేడి వేడివి నోట్లోకి వేసుకుంటూ .

మొగుడు విమర్శిస్తాడేమో అని భయపడింది కానీ అతను మెచ్చుకోవడంతో ఆమె ఉత్సాహం రెట్టింపయ్యింది.

మరో రోజు ఏమండీ శ్రీవారూ " గోధుమ పిండితో కూడా పచ్చిమిరపకాయ బజ్జీలు చేయొచ్చని ఎక్కడో చదివి ఇవాళ శాంపిల్ గా కొద్దిగా చేశాను మీకు నచ్చితే మళ్ళీ చేస్తాను రేపెప్పుడో. " అంటూ నోటికి అందించింది కామాక్షి. బయట వర్షం పడి చలి చలిగా ఉన్న సమయంలో భార్య తెచ్చిన వేడి వేడి పచ్చిమిరప కాయ బజ్జీలు అతని ప్రాణానికి హాయిగా, ఎంతో రుచిగానూ అనిపించాయి. .

" ఇదేదో బాగుందోయ్ .గోధుమ పిండితో బజ్జీలు చెయ్యడం కొత్తగా వింటున్నాను. నిజమేలే. శెనగపిండి ఆరోగ్యానికి మంచిది కాదు. తిన్న తర్వాత కడుపులో గ్యాస్ తన్నేస్తూ ఉంటుంది. శెనగపిండి పడని వాళ్ళకు ఈ గోధుమ పిండి బజ్జీలు ఒక వరం. రుచిగానే ఉన్నాయికానీ నూనె బాగా లాగేస్తాయేమో ?" మెచ్చుకుంటూనే అనుమానం కూడా వ్యక్త పరిచాడు రామారావు. .

ఇలా రోజూ కాకపోయినా మూడు నాలుగు రోజులకొకసారైనా ఏదో ఒక పిండి వంటకం చేసి మొగుడిని మెప్పించాలని చూస్తూ వచ్చిన కామాక్షి ఒకరోజు బాంబు పేల్చింది .

" మీరు తెచ్చిన నూనె నిండుకుంది . సాయంత్రం వచ్చేటప్పుడు రెండు మూడు ప్యాకెట్లు తీసుకురావడం మర్చిపోకండి " అంటూ మంద్ర స్వరంతో చెప్పింది మొగుడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని కొద్దిగా భయపడుతూ .

రామారావు మొహంలో క్రమంగా రంగులు మారాయి. .

"ఏమిటీ నూనె అయిపోయిందా మొన్నే కదా ఐదు ప్యాకెట్లు తెచ్చాను. . అడ్డమైన పిండి వంటలన్నీ చేసేస్తున్నావు. . ఏదో ఒకటి రెండు సార్లు బాగున్నాయి అనగానే ఇక ఒళ్ళు పైన తెలియడం లేదు నీకు . డబ్బు సంపాదిస్తూ ఉంటే తెలుస్తుంది. నీ అక్కలను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నువ్వు కూడా ఇలా ఏవేవో టీవీలలోనూ, పుస్తకాలలోనూ వంటలు చూసి ఫోటోలు తీసి వాళ్ళకు ఫార్వార్డ్ చేసి గొప్పలు ప్రదర్శించుకోవాలని ప్రయత్నం చేస్తావు. అసలే నీది పెద్ద చెయ్యి. మర్నాటికి కూడా మిగిలిపోయి ఆ తర్వాత అవి పాడైపోయి ఎందుకు పనికిరాకుండా పారేస్తున్నావు. అమ్ముకునే వాళ్ళు కూడా అంత భారీ ఎత్తున చెయ్యరు . . ఇక కూరలలో నువ్వేసే నూనె అంతా ఇంతా కాదు. డబ్బా పట్టుకుని వంచెయ్యడమే . డాక్టర్లు ఒక స్పూను కన్నా ఎక్కువ నూనె వాడారంటే గుండె రోగాలు మీ ఇంట్లో కాపురముంటాయి అని హెచ్చరించినా మీ ఆడాళ్ళు వినరు. నువ్వేమి చేస్తావో నాకు తెలియదు రేపటినుండి నెలకు రెండు లీటర్లు నూనె తెచ్చి పడేస్తాను. వంటలన్నీ దానితోనే. నూనెలో ములిగే పిండి వంటలు ఇంట్లో పూర్తిగా బంద్. అసలు నూనె లేకుండా హాయిగా రోజూ ఇడ్లీ చేయొచ్చుగా ? అంతకూ ఎప్పుడో ఒకసారి తినాలనుకుంటే ఏ గారులో, బజ్జీలో బయట నుండి తెస్తాను . ఇక ఈ క్షణం నుండి ఇంట్లో నూనె వాడకం తగ్గించేయ్యాలి . . అర్ధమయ్యిందా?" అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రామారావు

"మళ్ళీ అన్ని రుచులూ కావాలి. నూనె పేరు ఎత్తితే మాత్రం అంత ఎత్తున లేస్తారు . నేనేమేనా గొట్టం కట్టుకుని తాగేస్తున్నానా ? మీలాంటి వాళ్ళకు ఏ ప్రకృతి ఆశ్రమమమో సరైనది. అక్కడ పచ్చి కూరలు అలవాటు చేసేస్తారు . రోగం కుదురుతుంది . మీరు నూనె తీసుకు రాక పోతే రేపటినుండి ఊరగాయలతోనే భోజనం . ఇక మీ ఇష్టం " అంటూ ఖరాఖండిగా మోహమ్మీద చెప్పేసింది కామాక్షి .

నిజానికి ఒక రోజు కూరలో నూనె కొద్దిగా తగ్గినట్టుంటే "పోపులో నూనె వెయ్యలేదా ?ఉడకబెట్టిన ముక్కలే నా మొహాన పడేసినట్టున్నావు " అంటూ కోపంగా కంచం పక్కన జరిపేశాడు రామారావు. .

కూరలు రుచిగా ఉండాలంటే ప్రత్యేకంగా వేరే టెక్నిక్ అంటూ లేదు . నూనెకు చూసుకోకుండా గుమ్మరిస్తే చచ్చినట్టు అన్ని వంటలూ అద్భుతంగా ఉంటాయి అని చాలా మందికి తెలుసు కాబట్టే కొందరిళ్ళల్లో నూనె గురించి లెక్కలు చూసుకోరు. కానీ రామారావు ఒక సామాన్య ఉద్యోగి. నిన్న మొన్నటి వరకు తల్లి తండ్రులు అతని దగ్గరే వున్నారు. కొన్నాళ్లు తమ్ముడి దగ్గర కూడా ఉండొస్తాం అంటూ ఒక పదిహేను రోజుల క్రితమే వెళ్లారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చే టైమ్ కూడా అయ్యింది. పెద్ద కుటుంబం దృష్ట్యా ఖర్చులను అదుపు చేయాలని ఈ మధ్యే రామారావు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ కామాక్షి బాగా పెద్ద కుటుంబం నుండి వచ్చినది. నగలూ, చీరలు కావాలంటూ అడక్కపోయినా ఇంట్లో తిండి దగ్గర మాత్రం రాజీ పడటం ఇష్టం ఉండదు. ఏ రోజూ మొగుడికి పచ్చళ్లతో అన్నం పెట్టింది లేదు. పొద్దున్న ఒక కూర, పులుసో , ఏదో ఒక ద్రవ పదార్ధం ఉండాల్సిందే. .

మొగుడు నూనె దగ్గర షరతులు విధించడంతో తప్పనిసరిగా ఒక్కోసారి కూర , పులుసులు వండటం తగ్గించేసి పచ్చళ్లతో సరిపెట్టాల్సిన తప్పని సరి పరిస్తితి వచ్చింది ఆమెకు.

"ఇవాళ కూరలు ఏమీ లేవు . నిన్నటి ఉల్లిపాయ పులుసు, కంది పచ్చడి వుంది. ఈ పూటకు తినేసెయ్యండి. నాకు కూడా ఓపిక అస్సలు లేదు" అంది కామాక్షి ఒక రోజు.

"కూరలు లేవని ఇప్పుడు చెపుతావా ? ఇంట్లో పాలు అయిపోయినా, కూరలు అయిపోయినా చివరి నిమిషంలో చెప్పడం నీకు అలవాటు. కింద కూరల బండి వాడు గంటలకొద్దీ మొత్తుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు. కాస్త వినిపించుకుని వాడి దగ్గర కూరలు కొనొచ్చుగా ? హు హు ఆ పని చెయ్యవు. ఈ అపార్ట్మెంట్లో వున్న వాళ్ళను చూడు చక్కగా ఆకు కూరలు, మిగతా కూరలను లిఫ్ట్ పనిచెయ్యకపోయినా మెట్లు దిగి వెళ్ళి బండి వాడి దగ్గర కొనుక్కుని తెచ్చుకుంటారు. . నేను కూరలు తెస్తే కానీ ఇల్లు నడవని పరిస్తితి. కాస్త ఒళ్ళు కదుల్చు. ఇప్పుడు ఈ రాత్రి వేళ కూరలు కొని తెస్తే అన్నీ చచ్చులు, పుచ్చులు , ముదురు టెంకణాలు తెచ్చానని ఒకటే సతాయిస్తావు. ఎలా చచ్చేది నీతో ?" అన్నాడు విసుగ్గా రామారావు .

"ఏమో మీరేం చేస్తారో నాకు తెలియదు. ఒక్క పూట కూర లేకపోతే మీకు నోట్లోకి ముద్ద దిగదు. పైగా ఈ మధ్య నూనె ఎక్కువగా వాడొద్దు అంటూ నా మొహాన రెండు లీటర్లు తెచ్చి పడేశారు. మీరంటున్నారు కానీ అసలు ఈ అపార్ట్మెంట్లో వున్న వాళ్ళు చాలా మంది కూరలే వండుకోరు. వూరగాయలు పెట్టుకుని సంవత్సరం పొడుగునా వాటితోనే కానిచ్చేస్తారు. అందుకే వాళ్ళకు నూనె ఖర్చు ఉండదు. వాళ్ళకు ఆహారం మీద కన్నా, హారాల మీద మోజు ఎక్కువ. మన ఇంట్లో ప్రతి రోజూ కూర లేకపోతే నోట్లో ముద్ద దిగదు . మీకన్నీ కావాలి. నూనె ఖర్చైతే అంత ఎత్తున లేస్తారు . " అంటూ కామాక్షి కూడా మొగుడి మీద తిరగబడింది.

కామాక్షి మాటలు పట్టించుకోకుండానే కట్టుకున్న లుంగీతోనే చిన్న సంచీ చేతిలో పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు రామారావు . .

మరో అరగంటలో ఇంటికి తిరిగి వచ్చిన రామారావు "ఇదిగో కూరలు మంచివి కనపడలేదు. ఈ రోజుకు " బంగాళా దుంపల చిప్స్ " తెచ్చాను. అవి నంచుకుని తినేస్తానులే . కూరల విషయం రేపు చూద్దాం " అంటూ చిప్స్ పొట్లం టేబుల్ మీద పెట్టి అందులోంచి రెండు నోట్లో వేసుకుని " వీళ్ళ దుంపతెగ. ఎలా చేస్తారో కానీ స్వర్గానికి ఆమడ దూరంలో ఉన్నట్టుగా భ్రమింప చేస్తారు. అప్పుడప్పుడు ఇవి తెచ్చుకోవడం నయం " అన్నాడు లొట్టలు వేస్తూ. .

కామాక్షికి రోడ్డుమీద తెచ్చినవి ఏమీ నచ్చవు. ఇంట్లో నూనె ఖర్చు విపరీతంగా అయిపోతోందన్న భయంతో రామారావు ఇలా ఒక రోజు మిర్చి బజ్జీలు, ఇంకోరోజు చిప్స్ , ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో పడేస్తూ కూరలు తేవడం బద్దకించేస్తున్నాడు. మొగుడు చేస్తున్న పనికి కామాక్షి పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు .దానితో రామారావుకు పెళ్ళాం మీద అనుమానం వచ్చేది తను ఆఫీసుకు వెళ్లినప్పుడు ఒక ప్యాకెట్ నూనె తెప్పించుకుని దానితో ఏదో ఒక టిఫినో, ఇష్టమైన కూరలు చేసుకుంటుందేమో అని. .

ఒకరోజు రామారావు అన్నగారు ఒకాయన ఫోన్ చేశాడు మహారాష్ట్ర టూరు వెళ్తున్నామని, . మార్గ మధ్యంలో మీ ఇంట్లో రెండు మూడు రోజులు వుండి వెళ్లాలని అనుకుంటున్నామని మీ ఇంటి అడ్రెస్ , రూట్ మ్యాప్ వాట్స్ యాప్లో పెడితే రావడం సులువుగా ఉంటుందని " అదీ సమాచారం.

తన అన్నగారు కుటుంబంతో వస్తున్నాడని ఇంట్లో వార్త అందించాడు రామారావు .

"పోనీలెండి . ఈ మధ్య వాళ్ళను చూసి చాలా రోజులయ్యింది. వాళ్ళున్న రెండు రోజులు ఖర్చుకు చూడకుండా ఇంకో రెండు మూడు నూనె ప్యాకెట్లు తెచ్చి పడేయ్యండి . మీ అన్నయ్యకు టిఫిన్లు అంటే బాగా ఇష్టం కదా." మీ ఇంటికొచ్చినప్పుడు నీ చేతి టిఫిన్లు రుచి చూపించమ్మా . నువ్వు బాగా వంటలూ, టిఫిన్లు చేస్తావని మన బంధువర్గంలో నీకు బాగా పేరుంది '" అని అంటూండే వారు . ఈ మధ్య నేను ప్రయోగం చేసిన గోధుమ పిండి మిర్చి బజ్జీలు, సమోసాలు లాంటివి చేసి పెడతాను " అంది ఇంత మొహం చేసుకుని. పాపం కామాక్షి ఇంటికి ఎవరైనా చుట్టాలు రావాలని కోరుకుంటూ ఉంటుంది.

"అదే ఆ అత్సుత్సాహమే వద్దనేది. ఇంట్లో ఏ టిఫినూ చెయ్యడానికి వీల్లేదు. నేను ఒకసారి అనుకున్నానంటే ఖచ్చితంగా పాటిస్తాను. వాడు ఉన్న రెండు రోజులూ అన్నీ బయటనుండే తెస్తాను. తేగానే ఒకసారి ఓవెన్ లో పెట్టు వేడి వేడిగా ఉంటాయి. . ఏదైనా దోషం ఉంటే వేడి చేయగానే పోతుంది " అన్నాడు రామారావు తెలివిగా. .

" మీ ఇష్టం. మీరే నవ్వుల పాలవుతారు. నిన్న మొన్నటివరకు మనం ఎన్నో ఇంట్లో వండుకుని తిన్నాము. అది ఎవరికీ తెలియదు. తీరా ఇప్పుడు వాళ్ళ ముందు బయట పదార్ధాలు తెచ్చుకుంటూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ? మీరు మారరు. నాకు మాత్రం తలకొట్టేసినట్టుగా ఉంటుంది .గుర్తు పెట్టుకోండి " అంటూ నిష్కర్షగా చెప్పేసింది.

అనుకున్నట్టుగా రామారావు అన్నగారు కుటుంబంతో సహా దిగాడు.

"ఏరా అమ్మ , నాన్నా ఇంకా తమ్ముడి దగ్గరే ఉన్నారా ఏమిటి ? " అని అందరి క్షేమ సమాచారాలు అడిగాడు రామారావు అన్నయ్య.

" వస్తారు ఇంకో వారం రోజుల్లో. ముందు మీరు స్నానాలు కానిచ్చేయండి. ఎప్పుడు తిన్నారో ఏమిటో వేడి వేడి టిఫిన్లు తిందురు గానీ " అన్నాడు రామారావు భార్యకు వేడి నీళ్ళు పెట్టమని పురమాయిస్తూ.

"బయట టిఫిన్ తెస్తే తెచ్చారు కానీ ఆ వెధవ నూనె వస్తువులు మాత్రం వాళ్ళు ఉండే రెండు మూడు రోజులు మాత్రం తేకండి. వేడి వేడి ఇడ్లీ ఎక్కడ దొరుకుతుందో చూసి తెండి " అని మరీ మరీ మొగుడిని పక్కకు పిల్చి చెప్పింది కామాక్షి.

" అన్నయ్యా. పదా. ఈ వూళ్ళో టిఫిన్లు బాగా ఉంటాయి. ఇక్కడే మంచి హోటల్ ఉంది టిఫిన్ పార్సిల్ చేయించుకొద్దాం." అన్నాడు రామారావు అన్నగారిని ప్రేరేపిస్తూ .

రామారావు అన్నగారు కొద్దిగా ఇబ్బందిగా చూస్తూ " సరే పదా. " అంటూ అతనితో పాటు బయలుదేరాడు.

కామాక్షి ఇడ్లీ మాత్రమే తెమ్మని చెప్పడం గుర్తుకొచ్చి హోటల్లో అడిగినా ఇడ్లీ అయిపోయింది వేడివేడిగా మినప వడలు, మైసూర్ బజ్జీలు ఉన్నాయి తీసుకు వెళ్ళండి అని హోటల్ వాడు చెప్పడంతో అవే తీసుకోక తప్పలేదు రామారావుకు

ఎంతగా చెప్పినా మొగుడు మళ్ళీ నూనె పదార్ధాలే తేవడంతో కామాక్షి మొహం మాడిపోయింది. మొగుడి ప్రవర్తన నానాటికీ అసహ్యం పుట్టేటట్టుగా అనిపించసాగింది ఆమెకు . పోనీ ఇడ్లీకి ఇంట్లో పప్పు నాన పోద్దామ్ అనుకుంటే ఈ హడావిడిలో ఎక్కడ కుదురుతుందని కామాక్షి బద్దకించడంతో మర్నాడు కూడా రామారావు టిఫిన్ కోసం హోటళ్ళకు వెళ్ళక తప్పలేదు. వట్టి ఇడ్లీ బాగుండదు అని దానితో పాటు మళ్ళీ వడలు, మైసూర్ బజ్జీ , పూరీలు పార్సిల్ చేయించుకుని వచ్చాడు. ఈ సారి తన వెంట అన్నగారిని తీసుకెళ్లలేదు.

వరసగా తన తమ్ముడు ఇలా ఇంట్లో టిఫిన్ చేయించకుండా హోటళ్ళ మీద ఆధార పడటం చూస్తూంటే అన్నగారికీ, అతని భార్యకు మనసులో విపరీతమైన కోపం వచ్చినా కక్కాలేక , మింగాలేక మళ్ళీ వీళ్ళ గుమ్మంలో అడుగుబెట్టకూడదు అని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నారు.

ఆ రోజు అన్నగారి కుటుంబం తిరిగి వాళ్ళ వూరు వెళ్లిపోయే రోజు. ఆయన రామారావును , అతని భార్యను ఒక ఐదు నిమిషాలు కూర్చోమని చెప్పి "ఒరేయ్ అబ్బాయి . మీ ఇద్దరికీ ఇష్టమున్నా లేకపోయినా ఒక సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను. నీకు బయట పరిస్తితి అసలు తెలుస్తున్నట్టు లేదు. ఇప్పుడు బజార్లో దొరుకుతున్న ఆయిల్స్ ఏ మాత్రమూ నమ్మదగ్గవి కావు. ఈ మధ్య జంతు కళేబరాలనుండి కూడా ఆయిల్స్ విరివిగా తీసి మంచి మంచి బ్రాండులుగా లేబుళ్ళు వేసి అమ్మేస్తున్నారు. ఇంకా ప్రమాద కరమైన విషయం ఏమిటంటే పెట్రోల్ నుండి అవశేషాలను సేకరించి వాటిని కూడా వంట నూనెల్లో యదేచ్చగా కలిపేస్తున్నారు. బయట టిఫిన్ సెంటర్లు, బజ్జీల బళ్ళ వాళ్ళు అంత తక్కువ ఖరీదుతో తిను బండారాలు ఎలా అమ్ముతున్నారని అనుకుంటున్నావు ? అవన్నీ చాలా వరకు కల్తీవి, తక్కువ ధరలో దొరుకుతున్నాయి కాబట్టి. అలాగే మనం బజార్లో తక్కువ ధరకు వస్తోందని ఏ ఆయిల్ పడితే అవి కొన్నా నిండా రోగాల బారిన పడిపోవడమే కాకుండా కిడ్నీలు, లివర్లు పూర్తిగా దెబ్బతిని ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉండదు. చాలా రోజులుగా మా టీం రకరకాల ఆయిల్స్ మీద చేస్తున్న పరిశోధనలో తేలిందేమిటంటే తొంబై పర్సెంట్ ఆయిల్స్ కల్తీ చేసి అమ్ముతున్నవేనని. ఇదే కాదు మనం కొంటున్న ప్రతి వస్తువూ యధాశక్తిగా కల్తీ జరిగిపోతోంది. అడుగడుగునా ప్రమాదం పొంచి చూస్తూ ఉంటుంది. తక్కువ ధరకు వస్తోంది అని ఏదైనా వస్తువు కొన్నాము అంటే మన గొయ్యి మనం తీసుకున్నట్టే లెక్క. ఈ విషయంలో మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే డబ్బు ఆదా చేయకపోవడం అటుంచి ఆసుపత్రుల పాలవడం ఖాయం. ఖరీదైనా కాస్త మంచి ఆయిల్స్ చూసి కొనుక్కుని సాద్యమైనంతవరకు ఇంట్లోనే వండుకుని తినండి . ఇలా చెప్పానని మీ ఇద్దరూ మరోలా అనుకోకండి. మీరు ప్రమాదంలో పడకుండా నా బాధ్యతగా చెప్పాను " అంటూ ఒక భయంకరమైన హెచ్చరిక చేసి రామారావు అన్నగారు కుటుంబంతో సహా తిరుగు ప్రయాణం కట్టాడు.

అన్నగారి మాటలకు రామారావు నేరస్తుడిలా తల దించుకున్నాడు.అతనికి తను చేస్తున్న పొరపాట్లేమిటో బాగా అర్ధమయ్యి ఇప్పుడు కర్తవ్యం బోధపడింది.

"నిజమే కామూ. రేపటినుండి నేను జాగ్రత్తలు పడదల్చుకున్నాను. ఇక నూనెల విషయంలో రాజీ పడదల్చుకోలేదు. ఎంత ఖరీదైనా సరే మంచి నూనెలు చూసుకుని వాడుకుందాం. వేరే ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం . సాధ్యమైనంతవరకు బయట తినుబండారాలుకు స్వస్తి చెపుతాను. ఓపిక చేసుకుని ఇంట్లోనే తయారుచేసుకోవడం మళ్ళీ మొదలు పెట్టు ..." అన్నాడు భార్య కామాక్షి కళ్లలోకి అనునయంగా చూస్తూ.

భర్తలోని వచ్చిన మార్పుకు కామాక్షి గుండెలు తెలికపడ్డట్టయ్యి హాయిగా ఊపిరి పీల్చుకుంది *****

సమాప్తం

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి