విషనాగులు - కొల్లా పుష్ప

Vishanaagulu

వర్షం పడే లోపల ఇంటికి చేరాలని వడివడిగా నడుస్తోంది, ఆఫీసు నుంచి బయలుదేరిన నీరజ. ఇంతలో కరెంటు పోయింది. ఒక పక్క భయం. ఈలోగా ఎవరో తన వెనుకే వస్తున్నట్టు అనిపించి మరింత భయానికి లోనయింది, ఏలాగో మొత్తం మీద ఇంటికి చేరింది. వెంబడిస్తున్న వ్యక్తి కూడా, వడివడిగా నడుస్తూ చీకట్లోకి వెళ్ళిపోయాడు. గభాలున ఇంట్లోకి వెళ్లి తలుపు వేసింది. పాపను చూడడానికి పెట్టిన ఆయాను ఇంటికి పంపించి, గబగబా వంట చేసి పాపకు పెట్టింది. తరువాత పాపను జోకొడుతూ పొద్దున ఆఫీస్ లో జరిగిన సంఘటన గురించి ఆలోచించ సాగింది నీరజ. ఈమధ్య తన పై ఆఫీసర్ శేషగిరి, ఫైల్స్ చెక్ చేసే నెపంతో తన కాబిన్ కి పిలిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఉదయం అయితే, చెయ్యి పట్టుకుని "రాత్రికి హోటల్ కి వెళ్దాం, రాకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి"అని బెదిరించాడు. చెయ్యి విదిలించుకుని బయటికి వచ్చింది. ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే బాధపడింది. తోటివారి వెకిలి నవ్వులు, తన నిస్సహాయత తలుచుకుని బాధ పడింది. 'సమాజంలో ఒంటరిగా బతకడం కష్టం' అని ఆలోచిస్తూ గతంలోకి జారిపోయింది నీరజ. *** డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే ప్రేమ పేరుతో తనను మోసం చేసింది చాలక తన దగ్గర ఉన్న నగలు కూడా పట్టుకుని పారిపోయాడు ఓ దౌర్భాగ్యుడు. అప్పటికే నెల తప్పడంతో తల్లిదండ్రులకు మొహం చూపించలేక, పుట్టిన పాపను పెంచుతూ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంది. అయితే, ఇక్కడ రోజురోజుకీ శేషగిరి లాంటి వాళ్ళ అకృత్యాలు పెరిగి పోసాగాయి. గతంలోంచి బయటకు వచ్చిన నీరజ చాలా సేపు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత హాయిగా నిద్రలోకి జారుకుంది. *** ఉదయాన్నే పాపని స్కూల్లో దిగబెట్టి ఆఫీస్ కి వెళ్ళిన నీరజ, రాత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉద్యోగానికి రాజీనామా లెటరు రాయసాగింది. ఇదంతా గమనిస్తున్న ఆమె పక్క సీటు సుగుణ "ఏం చేస్తున్నావ్ ఉద్యోగం మానేసి బయటకు వెళితే బతకగలవా, అక్కడ ఇంతకంటే మేక వన్నె పులులు ఉండొచ్చు" అన్నది . ఆ మాట వినగానే తనను రోజూ వెంబడిస్తున్న వ్యక్తి గుర్తుకొచ్చాడు నీరజకు. అయితే ప్రస్తుతానికి ఎలాగైనా ఈ శేషగిరి నుంచి తప్పించుకోవాలి అనుకుని, గిరిజ చెప్పినట్లు మెడికల్ లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. *** మూడు సంవత్సరాల కాలం గిర్రున తిరిగింది. ఆ రోజు, కొంచెం ఆలశ్యంగా ఆఫీసుకి వచ్చిన శేషగిరికి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ఆర్డర్స్ ఇచ్చాడు మేనేజర్. అవి తీసుకుని, ఆశ్చర్యపోతూ, "ఎందుకు?" అని అడిగాడు మేనేజర్ ని. "నువ్వు , నీతో పనిచేసే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నావని" అని చెప్పాడు మేనేజర్. "నేనా? అయినా దానికి ఋజువు ఏంటి" అడిగాడు శేషగిరి. "వెళ్లి కొత్తగా చేరిన జనరల్ మేనేజర్ గారిని అడుగు" చెప్పాడు ఆ మేనేజర్ . **** "ఎక్సక్యూజ్ మి" అంటూ జీఎమ్ గదిలోకి అడుగుపెట్టాడు శేషగిరి. "చెప్పండి "అంటూ ఇటు తిరిగింది ఆమె. శేషగిరి అవాక్కయ్యాడు, ఆమెను చూసి. "ఈమెకు ఇంత హోదా ఎలా వచ్చింది? ఆరోజు తనకు భయపడి వెళ్లి పోయిన మనిషి ఇంత ధైర్యంగా మంచి హోదాలో ఎలా ఉంది?" అనుకుంటూ వెంటనే తల వంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, ఏమీ అడక్కుండానే. శేషగిరి వెళ్లగానే మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తుకొచ్చింది నీరజకు. *** ఉద్యోగానికి శెలవు పెట్టి ఆ రోజు పాపను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిశ్చయించుకొని ఇంటికి వచ్చిన నీరజకు, కాలింగ్ బెల్ శబ్దం వినబడింది. వెళ్లి తలుపు తీసి చూసేసరికి రోజూ తనను వెంబడిస్తున్న వ్యక్తి గుమ్మంలో ఉన్నాడు. వెంటనే తలుపు వేయబోయింది, తోసుకుంటూ లోనికి ప్రవేశించాడు మొరటుగా ఉన్న ఆ వ్యక్తి. వెంటనే ధైర్యం తెచ్చుకుని టేబుల్ మీద కత్తి తీసి రెడీగా పట్టుకుని "మర్యాదగా వెళ్ళిపో లేకపోతే అరిచి గోల చేస్తాను" గట్టిగా అరిచింది నీరజ . ఆ వ్యక్తి కుర్చీలో కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు నీరజకు. ఉన్నట్టుండి ఆ వ్యక్తి కుర్చీలోంచి లేచాడు. భయంతో నీరజ తలుపు దగ్గరికి పరిగెత్తబోయింది. ఆ వ్యక్తి టేబుల్ దగ్గరికి వెళ్లి పుస్తకం, పెన్ను తీసుకుని వ్రాయటం మొదలు పెట్టాడు. నీరజకు భయం ఎక్కువయింది 'తనను మానభంగం చేసి చంపేసి, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉత్తరం రాస్తున్నాడేమో, తనని సంతకం పెట్టమని అంటాడేమో ??? అలా అయితే తన పాప గతి ఏమిటి' అనుకుంటూ ఆలోచిస్తోంది నీరజ. రాయడం పూర్తవగానే పుస్తకంలోని ఆ కాగితాన్ని సర్రున చింపి నీరజకు ఇచ్చాడు. ఉత్తరంలో ముత్యాల్లాంటి అక్షరాలు. నీరజ కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెట్టాయి. "నీరజ గారికి నేనెవరో మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. నేను ఈ వీధి చివరే ఉంటాను. మీ ఆఫీస్ బాయ్ ని మచ్చిక చేసుకుని మీరు ఆఫీసులో పడుతున్న ఇబ్బందులు అన్నీ తెలుసుకున్నాను. సరే, నేను ఎవరో మీకు చెప్తాను. నేనూ, మా చెల్లి వరంగల్ లో ఉండేవారము. నేను పుట్టుకతో మూగవాణ్ణి, అందుకే నేను ఎవరితో కలవను. కానీ మా చెల్లెలు అందరితో కలివిడిగా ఉండేది. అది విచ్చలవిడితనం అనుకొని కొన్ని రాబందులు నా చెల్లిని పొడిచి పొడిచి ఆత్మహత్య చేసుకునేలా చేసాయి. నేను ఇక అక్కడ ఉండలేక ఓ సంవత్సరం క్రితం ఈ ఊరు వచ్చేశాను. మిమ్మల్ని చూడగానే మా చెల్లాయి గుర్తుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచి మిమ్మల్ని గమనిస్తూ వెంబడిస్తున్నాను, మీకు కాపలాగా. ఈరోజు మీరు వేళకాని వేళలో వచ్చారు. ఆఫీస్ లో జరిగింది కూడా తెలుసుకున్నాను. మీరు కూడా ఆత్మహత్య చేసుకుంటారేమోనని, బలవంతంగా తలుపు తోసుకొని లోనికి వచ్చాను, మిమ్మల్ని కాపాడాలని. చెల్లాయ్, భయపడకు. నీకు నేనున్నాను. నువ్వు ఎవరి దగ్గర అయితే అవమాన పడ్డావో వాళ్ళ రోగం కుదిర్చే స్థాయిలో నీవు వుండాలి. నీకు అండగా నేను ఉంటాను. అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను చక్కగా చదువుకో. ఇట్లు అన్నయ్య కృష్ణ" అంతే, ఆ ఉత్తరం చదివి, కాలనాగులు ఉండే ఈ సమాజంలో వాటి పీచమడిచే కృష్ణ లాంటి అన్నలు కూడా ఉంటారని ధైర్యం తెచ్చుకుని, సజల నయనాలతో అతని వైపు చూస్తూ ఉండిపోయింది నీరజ. ఆ రోజు నుంచి పాపని చూసుకుంటూ ఆమె దగ్గరే ఉన్నాడు. అతని ఆర్ధిక సహాయంతో పట్టుదలగా ఎమ్బియ్యే చదివి అవసరమైన ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడికే పెద్ద హోదాతో వచ్చింది . ప్రతి మగ వాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టు, తనలాంటి స్త్రీలకు ఈ అన్నయ్య లాంటి వ్యక్తుల ఆలంబన దొరికితే వారిజీవితం ఎంతో బాగుంటుంది కదా ? అనుకుంటూ వాస్తవం లోకి వచ్చింది నీరజ, ఎదురుగా ఉన్న కేలండర్ లోని కాళీయమర్ధనం చేస్తున్న శ్రీకృష్ణుడు నవ్వుతూ చూస్తుండగా. ***** *శుభం* *******

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి