మనిషి నల్లన..మనసు తెల్లన.. - బోగా పురుషోత్తం

Manishi nallana manasu tellana

పెద్ద పెద్ద జరి అంచుల పంచకట్టు, గుబురు మీసాలు, కండలతో అజానుబాహుడైన బంగారయ్య పెద్ద జమీందారు. పట్టణాల్లో అతనికి బంగారం దుకాణాలు చాలా ఉన్నాయి. ప్రతి రోజూ అప్పు కావాలని వేల సంఖ్యలో అతని దుకాణాల వద్దకు వస్తుంటారు. ఓ రోజు పక్క ఊరు నుంచి వీరయ్య రొప్పుతూ ఆయాసంతో బంగారయ్య వద్దకు వచ్చాడు.
బంగారయ్య అతడిని పరీక్షగా చూశాడు. అతని ఎడమ చేతిలో ఓ పెద్ద చీటి వుంది. కుడి చేతిలో మిలమిల మెరుస్తున్న గాజులు ఉన్నాయి. అతడిని చూసి ఏదో ఆపదలో వున్నాడని చెప్పక ముందే ఊహించాడు బంగారయ్య.
‘‘ ఏంటయ్యా?’’ నీ గోల ప్రశ్నించాడు బంగారయ్య.
వీరయ్య గొంతును కాస్త సవరించుకుని ‘‘ స్వామీ ఇవి తాకట్టు పెట్టుకుని అర్జంటుగా ఓ రెండు లక్షల రూపాయలు ఇవ్వండి.. మా అమ్మాయి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫీజు కట్టాలి.. లేకుంటే పరీక్షకు కూడా కూర్చోనివ్వరట.. అసలు హాల్‌ టికెట్‌ ఇవ్వనని తల అడ్డం తిప్పుతున్నారు సామీ..రెండు రోజుల్లో ఫీజు కట్టాలంట.. ఎలాగైనా మీరే ఆదుకోండి..’’ కాళ్ల మీద పడేంత పనిచేశాడు వీరయ్య.
బుర్ర మీసాల బంగారయ్య అదేమీ వినిపించుకోలేదు. కుర్చీ మీద కూర్చున్నవాడు నిద్ర పోతున్నట్లు వున్నాడు. ఉలుకుపలుకు లేదు. వీరయ్య ఇంకాస్త నోటికి పనిపెట్టి
‘‘ అయ్యా..సామీ నా మొర ఆలకించయ్యా..’’ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. ఆ అరుపునకు లోపల వున్న క్యాషియర్‌, క్లర్కు, సెక్యూరిటీలు అక్కడికి పరుగెత్తుకొచ్చారు.
‘‘ ఎవరయ్యా.. నువ్వు.. అలా మా ఓనర్‌ ముందే అలా అరుస్తున్నావు..అసలు నిన్ను ఎవరు లోనికి రానిచ్చారు?’’ సెక్యూరిటీ కళ్లు చింత నిప్పుల్లా మండాయి.
బంగారయ్య కళ్లు తెరవక ముందే వీరయ్యను ఇద్దరు సెక్యూరిటీలు తలో భుజం పట్టుకుని లాగి బయటకు తోశారు.
వీరయ్య ఎంత మొత్తుకున్నా ఆలకించలేదు. తన అమ్మాయికి ఫీజు కట్టడానికి రెండు లక్షలు కావాల్సి వుంది. వున్న రెండు పాడి ఆవులను అమ్మేశాడు. అవి బక్కచిక్కిపోయాయని పాలు కూడా ఇవ్వడం కష్టమని దీన్ని కొన్నా ఉపయోగం లేదని అందరూ తిరిగి వెళ్లిపోతుంటే సంతలో తీసుకెళ్లి ఒక్కోటి పాతిక వేలు చొప్పున యాభై వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని అమ్మేశాడు. వచ్చిన డబ్బు ఒక్క రోజు కూడా నిలువలేదు. ఇంటి చుట్టూ అప్పులే.. నెల క్రితం పెద్దమ్మాయికి ప్రసవం ఖర్చులకి చేసిన అప్పు తీర్చడానికి సరిపోయింది. ఇక్క రెండో అమ్మాయి ఇంజనీరింగ్‌ కాలేజీ ఫీజు చెల్లించాల్సి వుంది. వీరయ్య మనసులో మళ్లీ పిడుగు పడిరది. నాల్గు రోజులే గదువు వుంది. ఏమి చేయాలో దిక్కుతోచలేదు. తెలిసిన వాళ్లు, బంధువులను కలిసి అమ్మాయి చదువుకు ఆర్థిక సాయం అందించాలని కాళ్లావేళ్లాపడి వేడుకున్నాడు. ఎవరూ కనికరించలేదు. ఇక లాభం లేదని ఆ రాత్రంతా దీర్ఘంగా ఆలోచించాడు. పోయిన ప్రాణం లేసొచ్చినట్లు అడుగంటుతున్న ఆశ చిగురించినట్లైంది. ఎగిరి గంతేసినంత పనిచేశాడు వీరయ్య.
ఎక్కడో పెళ్లిలో తన భార్యకు పుట్టింటి వాళ్లు పెట్టిన బంగారు నగ గుర్తొచ్చింది. పాత ఇనుప పెట్టెలో దాచిపెట్టిన నగను వెతకసాగాడు. పెట్టె నిండికి వున్న పాత చీరలు దుమ్ము పట్టి వున్నాయి. వాటిని దులిపి ఒక్కొక్కటి కింద వేశాడు. అడుగున ధగధగ మెరిసింది. వీరయ్య కళ్లు ్ల కూడా ధగధగ మెరిశాయి. దాన్ని చేతికి తీసుకుని రుణం కోసం పట్టణమంతా కాళ్లరిగేలా తిరిగాడు. ఎవరూ ఇవ్వలేదు. చివరకు పక్కింటి వాళ్లు చెప్పుకుంటుండగా విన్నాడు వీరయ్య. వెళ్లి జమీందారు బంగారయ్య బంగారు దుకాణం వద్దకు వెళ్లి ప్రాధేయపడ్డాడు. జమీందారు నిద్ర మేల్కోకముందే సెక్యూరిటీలు తనను ఈడ్చి బయటకు తోశారు. ఎంత మొత్తుకున్నా తన మొర ఆలకించే వారు కరువయ్యారు. ఇక ఫీజు కట్టడానికి ఒక రోజే గడువు వుంది. ఏమి చేయాలో తెలియక మళ్లీ బంగారయ్య ఇంటి వద్దకు పరుగు పెట్టాడు.
బంగారయ్య ఇంటి వద్ద అప్పుడే కారు నిలబడి ఉంది. గుమస్తా ఒకడు కారు డోరు తీశాడు. ఆరు అడుగులు ఆజాను బాహుడు బంగారయ్య ఇంటి గేటు దాటి నడిచి వస్తున్నాడు. భుజం మీద కండువా వేలాడుతోంది. నిమ్మకాయలు నిలబెట్టేంత గుబురు మీసాలు, తెల్లని జరి తో నేసిన పంచె కట్టు ఆయన భూస్వామి అని చెప్పకనే చెబుతున్నాయి. ఆయన నడుస్తుంటే వరుసగా అటు ఇటు నిల్చొన్న నౌకర్లు ‘‘ దండాలు సామీ..’’ అని చేతులెత్తి నమస్కరిస్తుంటే ఆయన చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తున్నాడు. బయట రోడ్డులో నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు వీరయ్య. ఆయన వద్దకు వెళ్లాలంటే గుండె ధైర్యం చాల్లేదు వీరయ్యకు. బంగారయ్య వచ్చి కారు ఎక్కాడు. కారు స్టార్ట్‌ అయ్యింది. ఇక రయ్‌ మని దూసుకెళ్లడానికి సిద్ధంగా వుంది. వీరయ్యకు ముచ్చెమటలు పడుతున్నాయి. అడుగులు తడబడుతున్నాయి. ఊపిరి బిగబట్టి కారు ముందుకు అడ్డంగా వెళ్లి ‘‘ సామి.. సామి.. పేదోడ్ని.. మా అమ్మాయి ఇంజనీరింగు చదువుతోంది.. ఒక్క రోజులో రెండు లక్షలు ఫీజు కట్టాలి.. తెలిసిన చోటల్లా తిరిగాను ఎవరూ సాయం చేయలేదు.. దయచేసి ఈ నగను తాకట్టు పెట్టుకుని రెండు లక్షలు అప్పు ఇవ్వండి.. మా అమ్మాయి చదువు అయిపోయి ఉద్యోగం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాను.. దయచేసి ఆదుకోండి సామీ..’’ దీనంగా చేతులు జోడిరచాడు వీరయ్య.
కారు అద్దాల్లోంచి గమనిస్తున్నాడు బంగారయ్య. వేగంగా దూసుకెళ్లడానికి ఎక్స్‌లేటర్‌పై కాలు పెడుతున్న డ్రైవర్‌ని ‘‘ నువ్వుండవయ్యా.. ఆగు..’’ గట్టిగా అరిచాడు బంగారయ్య. వీరయ్యను ‘‘ ఇటు రా..’’ సైగ చేశాడు.
వీరయ్య అతని వద్దకు వెళ్లాడు. ఒకటి రెండు మాటల్లో తన బాధను ఏకరువు పెట్టాడు వీరయ్య.
బంగారయ్య విని ‘‘ అలాగా.. అయితే మన బంగారు దుకాణంలో ఇది చూపించు.. నీకు అవసరమైనంత అప్పు ఇస్తారు..’’ అన్నాడు బంగారయ్య.
ఆ మాటతో వీరయ్య మనసు చల్లబడిరది. బంగారయ్య ఇచ్చిన ఐడెంటిటీ కార్డును చేతికి తీసుకుని జేబులో పెట్టుకుని ‘‘ నీ మేలు ఈ జన్మలో మరిచి పోలేను సామి..’’ రెండు చేతులెత్తి నమస్కరించాడు.
‘‘ అదేమి అంత పెద్ద సాయం కాదులే ..’’ అని కారులో దూసుకుపోయాడు బంగారయ్య.
వీరయ్య ఇంటి కెళ్లి చద్దన్నం తిని బంగారం దుకాణం వద్దకు వడివడిగా నడిచాడు.
ఎండ తీవ్రంగా వుంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఐదు కిలోమీటర్లు నడిచాడు. ముఖం అంతా ముచ్చెమటలు పట్టి జిడ్డుజిడ్డుగా వుంది. వళ్లంతా చమట వాసన భరించలేనంతగా వుంది. తిన్న చద్దన్నం అరిగిపోయి కడుపులో పేగులు అరుస్తున్నాయి. దాహం వేస్తోంది. దారిలో రోడ్డుపై వున్న చలివేంద్రం వద్దకు వెళ్లి రెండు గ్లాసులు చల్లటి నీళ్లు తాగి నీడలో నిలబడ్డాడు. కొంచెం నీరసం తగ్గాక మళ్లీ నడక దారి పట్టాడు. పదినిమిషాల్లో బంగారయ్య దుకాణం వద్దకు చేరుకున్నాడు. ఇక రెండు నిమిషాల్లో లోనికి వెళ్లి డబ్బు తీసుకోవచ్చనుకున్న అతని ఆశ ఆవిరైంది. హఠాత్తుగా బంగారు దుకాణం మూసి వేశారు. వీరయ్య గుండెలో మళ్లీ గుబులు మొదలైంది. ఇంటి తలుపు తట్టిన అదృష్టం దూరమైందే అని తలపట్టుకుని కూర్చున్నాడు.
అక్కడే చూస్తున్న సెక్యూరిటీ వీరయ్య వద్దకు వచ్చి ఎవరయ్యా..నువ్వు?’’ అడిగాడు.
క్షణం ఆలస్యం చెయ్యకుండా ఉదయం జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు వీరయ్య.
‘‘ అయ్యో.. పది నిమిషాలు ముందే వచ్చి వుంటే పని అయ్యేది కదయ్యా.. అయ్యగారి భార్య చనిపోయింది.. ఇక ఇప్పుడెక్కడ దుకాణాలు తెరుస్తారు.. పది రోజులు పట్టొచ్చు..’’ అన్నాడు సెక్యూరిటీ.
వీరయ్య గుండెల్లో మళ్లీ పిడుగు పడ్డట్లైంది. ఇక లాభం లేదనుకుని రోడ్డు మీదికి నడిచాడు. నిరాశ, నిస్పృహ ఆవహించాయి. తన బతుకంతా ముళ్ల బాటలో నడుస్తున్నట్లు ఆనిపించింది. మార్చడం ఎవరి తరం కాదనుకుంటూ నడిచాడు. కాస్త మెయిన్‌ రోడ్డుకు కుడి పక్కగా వెళుతుండగా యాభై రూపాయల నోటు తళతళ గాలికి ఎగురుతూ కనిపించింది. ఆశగా చేతికి తీసుకుని జేబులో పెట్టుకుని పూల దుకాణం వద్దకు నడిచాడు. చామంతి పూలతో కట్టిన చిన్న మాలను తీసుకున్నాడు. చేతిలో వున్న యాభై రూపాయలు సరిపోయింది. మాల తీసుకుని బంగారయ్య ఇంటి వైపు నడిచాడు. నెత్తి మీద సూరీడు ఎర్రగా మండుతున్నాడు. చెమటలు పట్టినా నెమ్మదిగా నడిచాడు. మధ్యాహ్నం రెండుగంటలు సమయంలో బంగారయ్య ఇంటి వద్దకు చేరుకున్నాడు. బయటే నిల్చొని బంగారయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. పది నిమిషాల తర్వాత పెద్ద అంబులెన్స్‌ వచ్చి ఆగింది. ఆగీఆగక ముందే చుట్టూ ఓ పది మంది నౌకర్లు చేరారు. డోర్‌ తీసి బంగారయ్య భార్య మృతదేహాన్ని పట్టుకుని కిందికి దించి ఇంట్లోకి తీసుకెళ్లసాగారు. ఆ వెనుకే బంగారయ్య విషణ్ణ వదనంతో లోనికెళ్లాడు. అతడిని చూసి వెనుకే నడిచాడు వీరయ్య. మృతదేహాన్ని కింద పెట్టగానే పూల మాలలు వేసేందుకు క్యూ కట్టారు. ఆ క్యూలో నిల్చొన్నాడు వీరయ్య. మృతదేహం పక్కనే కూర్చున్నాడు బంగారయ్య. క్యూలో నిల్చొన్న వీరయ్య అడుగుమీద అడుగు వేసుకుంటూ బంగారయ్య దగ్గరకు వచ్చాడు. కంట్లో కన్నీరు ఆగలేదు. చేతిలోని పూల మాల వేసి చేతులు జోడిరచి వెనక్కి తిరిగాడు. వీరయ్యను చూసిన బంగారయ్య ‘‘ నువ్వు ఫీజుకు కావాల్సిన డబ్బు తీసుకున్నావా? వీరయ్యా..’’ ప్రశ్నించాడు.
ఆ మాట విని ఇటు తిరిగాడు వీరయ్య.. ‘‘ లేదు సామీ.. నేను దుకాణం వద్దకు వచ్చే లోపు మూసేశారు..’’ నెమ్మదిగా అన్నాడు.
‘‘ అలాగా అయితే ఇటు రా..’’ అని వీరయ్యను తన ముందుకు రమ్మన్నాడు.
వీరయ్య వచ్చి నిలబడ్డాడు. ఆ లోపే సెక్యూరిటీని పిలిచి ఇంట్లోంచి రెండు లక్షలు క్యాష్‌ తెప్పించి ‘‘ ఇదిగో వీరయ్యా.. వెళ్లి మీ అమ్మాయి ఫీజు చెల్లించు..’’ అన్నాడు.
వీరయ్యకు పోయిన ఊపిరి లేచివచ్చినట్లయింది.
నోట్ల కట్టలు తీసుకుని ‘‘ ఈ పరిస్థితిలో కూడా నేను గుర్తున్నానా సామీ..’’
ఆ గుర్తు లేకేం వీరయ్యా.. నీలా ఎందరో చదువుకోలేని బిడ్డలను చదివించాలి.. పేదల కన్నీళ్లు తుడవాలి.. అదే ఈ జీవితానికి చాలు..’’ అన్నాడు బంగారయ్య.
బంగారయ్య మంచి మనసుకు కృతజ్ఞతలు తెలిపి ‘‘ మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను సామీ..’’ అన్నాడు వీరయ్య.
‘‘ ఎంతో ఆవేదనలో వున్నా నా కష్టాలను గుర్తించిన మీరు ఎంతో ఉన్నతులు.. మంచి మనసున్న వాళ్లు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు సామీ’’ అన్నాడు వీరయ్య.
‘‘ అలా నా గొప్పేం లేదులే వీరయ్యా.. పేదోళ్లకు.. ముఖ్యంగా చదువుకోలేని వాళ్లకి సాయం చేయడంలో వున్న తృప్తి కన్నా గొప్ప ఇంకేమి వుంటుంది?’’ బంగారయ్య అంటుంటే వీరయ్య ఔన్నత్యాన్ని వర్ణించడానికి నోరు చాలలేదు. మరో సారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు వీరయ్య.
ఇంటికి చేరుకున్న వీరయ్యకు ఆందోళనతో ఎదురుచూస్తున్న కూతురు కన్పించింది. ఇంటి గుమ్మం కూడా తొక్కకుండా కళాశాల వద్దకు వెళ్లి రెండు లక్షల ఫీజు చెల్లించాడు.
వీరయ్య మనసు కాస్త కుదుట పడిరది. మూడేళ్లు గడిచాయి. చివరి సంవత్సరం వీరయ్య కూతురు కాలేజి టాఫర్‌గా నిలిచింది. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఆమె ప్రభుత్వ పరీక్షలు రాసి ఆ కార్పొరేషన్‌ డీఇగా నియమితులైంది. ఆ తర్వాత ఒక్కో ప్రమోషన్‌ పొందుతూ కలెక్టరేట్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగానికి అధిపతి అయ్యింది. వీరయ్య ఇప్పుడు ధనవంతు డయ్యాడు. ఓ పెద్ద భవంతిని నిర్మించాడు. అందులో ఏసీ రూంలో కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతూ ఆనందంగా గడిపాడు.
ఓ రోజు ఉన్నట్లుండి వీరయ్య ఇంటి మీదికి పది మంది రౌడీలు కర్రలు, సైకిల్‌ చైనులతో వచ్చారు. వీరయ్య బిత్తర చూపులు చూస్తూ ‘‘ ఎవరు మీరు..?’’ అడిగే లోపే ఇంట్లోకి వచ్చి ఫర్నీచర్‌, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు.
పది నిమిషాల్లో ఆ ఇంటి ముందు పోలీసు జీపు ప్రత్యక్షమైంది. వీధి రౌడీలు పారిపోవడానికి యత్నించారు. వారిలో ముగ్గురిని పట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. దాడికి పాల్పడ్డ వారు కోర్టు బోనులో నిలబడ్డారు. వీరయ్య కూతురు వారికి ఎదురు బోనులో నిలబడిరది. వ్యాజ్యం మొదలైంది. వాది, ప్రతివాదుల న్యాయవాదుల వాదనలు హోరాహోరీగా సాగుతున్నాయి. వీరయ్య కూతురు కోపంతో రగిలిపోతోంది. దాడి జరిగిందనడానికి సాక్షిని ప్రవేశపెట్టాలన్నారు జడ్జి. ప్రత్యక్ష సాక్షి వీరయ్య భుజంపై కప్పుకున్న కండువతో వణుకుతూ నడుస్తున్నాడు. అడుగు మీద అడుగేస్తూ బోను దగ్గరకు వచ్చాడు. దించిన తలను ఒక్క సారిగా పైకెత్తి అవాక్కయ్యాడు. ఎదురుగా ప్రత్యర్థుల వాదనలకు మద్దతు పలుకుతున్న బంగారయ్య ముఖం చూశాడు. వీరయ్య వెన్ను నెమ్మదిగా కంపించింది. ‘‘ చెప్పు.. దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? ఎలాంటి ఆయుధాలు వాడారు?’’ న్యాయవాది ప్రశ్నిస్తుంటే తికమక పడ్డాడు. ‘‘ సామీ.. దాడి చేసిన వారెవరూ వీరిలో లేరు..నాకు ఒక్కడూ కన్పించలేదు..’’ వీరయ్య గొంతు తడబడిది.
తడబడుతున్న తండ్రి మాట విని నిశ్చేష్టురాలైంది వీరయ్య కూతురు. వారి తరపు న్యాయవాది అవాక్కయ్యాడు. నిజం ఏమిటో తెలుసుకునే లోపే జడ్జి కేసును మరుసటి రోజుకు వాయిదా వేశాడు.
కోర్టు బోను దిగి బయటకు నడిచాడు వీరయ్య. కోర్టు ఆవరణలో ప్రత్యర్థులతో మాట్లాడుతున్న బంగారయ్య వద్దకు వడివడిగా నడిచి ‘‘ దండాలు సామీ..దండాలు’’ చేతులెత్తి దండం పెట్టాడు వీరయ్య.
‘‘ వీరయ్యా.. నువ్వా.. బాగున్నావా? ఆ డిఇ మీ అమ్మాయేనా?.. అయ్యో నాకింత వరకు తెలీదే.. ఈ రైతులు బెదిరించిన సంగతి నాకు తెలియదు..లేదంటే వారించే వాడిని..’’ అన్నాడు బంగారయ్య.
‘‘ స్వామీ మీరు గొప్పోళ్లు.. మీ సాయంతోనే మా అమ్మాయి అంత చదువు చదివింది.. ఇంతకీ మీతో మాకెందుకీ రచ్చ..?’’ ఎదురు ప్రశ్న వేశాడు వీరయ్య.
‘‘ వీరయ్యా.. ఈ ఊళ్లో ఓ నీటి పారుదల ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారట. అందుకు ఊళ్లో వున్న ఎకరా, అర ఎకరా పొలం వున్న నిరుపేదల పొలాలను అందుకు ఎంచుకున్నారట.. ఆ ప్రాజెక్టు నిర్మాణం మీ అమ్మాయి నేతృత్వంలో సాగుతోంది.. ఇప్పుడు పేదల పొలాలను లాక్కుని ప్రాజెక్టు నిర్మిస్తే వారు జీవనం కోల్పోయి బతుకులు వీధిన పడి దుర్భరమవుతాయి.. అదే వారి ఆగ్రహం..అందుకే మీ ఇంటి పడ్డారు..’’ గొంతు సవరించుకుంటూ అన్నాడు బంగారయ్య.
‘‘ అదా విషయం.. నాకు ఇంతవరకు తెలియదు.. ఆగండి.. ఇప్పుడే వెళ్లి పేదల జీవితాలతో ఆడుకోవద్దని మా అమ్మాయిని గట్టిగా మందలిస్తాను..’’ అన్నాడు వీరయ్య.
‘‘ అవసరం లేదు నాన్నా.. నీటి పారుదల ప్రాజెక్టు నిర్మిస్తే రైతులందరికీ ఉపయోగం.. ఇప్పుడు కొందరు పేదలు నష్టపోతే పోయారు.. రేపు వేల ఎకరాలకు నీరు అంది వేల మంది లాభం పొందుతారు..’’ సర్ది చెప్పపోయింది వీరయ్య కూతురు.
‘‘ అమ్మా.. నువ్వలా పేదలను కష్టపెట్టొద్దు...వారికి కన్నీరు తెప్పించొద్దు..మనమూ ఓ రోజు నిరుపేదలమే అన్న సంగతి మరిచిపోవద్దు..’’ హితవు పలికాడు వీరయ్య.
వీరయ్య కూతురు వినలేదు.. ‘‘ నాన్నా.. ఇది నా నిర్ణయం కాదు.. ప్రభుత్వ నిర్ణయం..దీన్ని ఎవరూ ఆపలేరు..’’ చెప్పి విసురుగా వెళ్లబోయింది వీరయ్య కూతురు.
ఆ మాటతో అక్కడే వున్న పేద రైతులు వీరయ్య కూతురు మీదికి దాడికి ఉరికారు.
అది చూసిన బంగారయ్య తన మనుషులను పంపి రైతులను పక్కకు తోయించాడు. వెంటనే అక్కడ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. వీరయ్య కూతురికి రక్షణ కల్పించారు. రైతులపై లాఠీచార్జి చేశారు. ఒకరిద్దరికి చేతులు విరిగాయి. మరి కొందరికి వళ్లంతా వాతలు తేలాయి. ఒకరిద్దరిని అరెస్టు చేస్తుండగా బంగారయ్య తన మంచి తనంతో ఎస్‌పీని అక్కడికి రప్పించారు. ఎంఎల్‌ఏ కూడా అక్కడికి వచ్చాడు. చర్చలు ప్రారంభమయ్యాయి. బంగారయ్య తన మనసులోని మాట బయట పెట్టాడు. ‘‘ అయ్యా.. ఎంఎల్‌ఏ గారూ..పేదల భూములు వద్దు.. కావాలంటే ప్రాజెక్టుకు ఎన్ని ఎకరాలు అవసరమవుతుందో చెప్పండి.. నా భూములే ఇస్తాను.. నయా పైసా అక్కర్లేదు..’’ అన్నాడు బంగారయ్య. ఎంఎల్‌ఏ సంతోషించాడు.. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఖరారు చేస్తా..’’ హామీ ఇచ్చాడు.
బంగారయ్య వారం రోజులు ఎదురుచూశాడు. నెల తర్వాత మంత్రితో పాటు ప్రాజెక్టు నిర్మాణ అంచనా బృందం బంగారయ్య పొలం వద్దకు వచ్చింది. బంగారయ్య మాట ప్రకారం తన భూమి మూడు వందల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ సంతకం పెట్టాడు. వీరయ్య కూతురు పర్యవేక్షణలో నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చకచక సాగింది. రెండేళ్ల తర్వాత ప్రారంభానికి సిద్ధమైంది.
మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రాజెక్టు ప్రారంభోత్సవం వాయిదా పడిరది. బంగారయ్య సేవకు ప్రతిరూపంగా ఆ నియోజకవర్గ ప్రజలు ఎంఎల్‌ఏ పట్టం కట్టారు. ఊహించని విధంగా బంగారయ్యకు నీటి పారుదల శాఖ మంత్రి పదవి దక్కింది. రెండు నెలల తర్వాత మంత్రి హోదాలో బంగారయ్య ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇప్పుడు అందరూ ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నారు. వీరయ్య కూతురు కూడా సెల్యూట్‌ చేసి మంత్రి పక్కనే నిలబడిరది. వీరయ్య దూరంగా నిలబడి చూస్తున్నాడు. నిరాడంబరంగా ప్రాజెక్టును ప్రారంభించారు మంత్రి బంగారయ్య. ‘‘ నీళ్లు పరవళ్లు తొక్కుతూ పొలాల్లో ప్రవహిస్తుంటే నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. పేదలకు ఎలాంటి కష్టం లేకుండా ప్రాజెక్టును పూర్తి చేసిన వీరయ్య కూతురును పొగడ్తలతో ముంచెత్తాడు మంత్రి. ఈ సేవలో తాను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా వుందని చెబుతుంటే ప్రజలు హర్షద్వానాలు తెలిపారు.
కోట్ల రూపాయల ఆస్తి పలికే భూములను మంచి మనసుతో ఇచ్చిన బంగారయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంది వీరయ్య కూతురు. ఆయన సాయంతోనే తాను ఇంతగా అభివృద్ధి చెందినందుకు గర్వంగా వుందని సభలో చెబుతుంటే బంగారయ్య ఉద్వేగానికి గురయ్యాడు. ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని మంత్రి పొగడ్తలను తిరస్కరించాడు.
ఇన్నాళ్లు పేదలను తనపైకి ఉసిగొల్పింది బంగారయ్యేనని భావించిన వీరయ్య కూతురు ఆయన మంచి మనసు గుర్తించకపోయినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది.
వ్యక్తి గతంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతామనుకున్నా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అయినా బంగారయ్యను పలుకరించాలన్న కుతూహలం పెరిగింది. తన ఆలోచనను తండ్రి వీరయ్యకు చెప్పింది. వీరయ్య సరే అన్నాడు. మరుసటి రోజే వీరయ్య అతని ఇంటి ముందు తన కూతురితో నిలబడ్డాడు. అక్కడి సెక్యూరిటీ ‘‘ఎవరయ్యా? నువ్వు ..వెళ్లు.. వెళ్లు’’ ఆగ్రహించాడు.
‘‘ సార్‌ను కలవాలి..ఆయన మాకు బాగా తెలిసిన వారు..’’ అన్నాడు వీరయ్య.
‘‘ అయితే ఏం? ఆయన్ని కలవాలంటే ముందు పర్మిషన్‌ కావాలి.. తీసుకున్నారా?’’ సెక్యూరిటీ ప్రశ్నించాడు.
వీరయ్య తల అడ్డం తిప్పాడు.
అయితే ఇక్కడ నిలబడవద్దు.. దూరంగా వెళ్లు.. వెళ్లవయ్యా..సారు ఆఫీసుకు వెళ్లే టైం అయ్యింది..’’ వీరయ్యను మెడపెట్టి గెంటేంత పని చేశాడు సెక్యూరిటీ.
అప్పుడే మంత్రి బంగారయ్య అక్కడికి వచ్చాడు. సెక్యూరిటీని వారించాడు. వీరయ్య దగ్గరకు వెళ్లి భుజం పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. తండ్రి వెనుకే మంత్రి వెంట వెళ్లింది వీరయ్య కూతురు. మంత్రితో వారి అనుబంధం చూసి అవాక్కయ్యాడు సెక్యూరిటీ. మంత్రి వారికి నీళ్లు అందించారు. పళ్లెంలో అన్నం వడ్డించాడు. అందులో ఘుమఘుమలాడే తాళింపులు ఉన్నాయి. వీరయ్య కుర్చీమీద కూర్చొని తినడానికి కాస్త అసౌకర్యానికి గురయ్యాడు. బంగారయ్య స్వయంగా వీరయ్య భుజం పట్టుకుని కుర్చీమీద కూర్చోబెట్టాడు.. ‘‘ వీరయ్యా నువ్వేం భయపడొద్దు.. ఇది మన ఇల్లే జంకు లేకుండా తిను..’’ అన్నాడు.
‘‘ మీరు ఎంతైనా చెప్పండి సామీ.. మీరు ఉన్నోళ్లు.. మేము లేనోళ్లం.. మేమున్న చోట మేము ఉండాలి.. అంతే ..’’ అని కింద కూర్చోబోయాడు వీరయ్య.
బంగారయ్యకు కోపం చిర్రెత్తుకొచ్చింది. గొంతు సవరించుకున్నాడు. ‘‘ వీరయ్యా ఉన్నోళ్లు.. లేనోళ్లు అంటూ ఏమీ లేదు.. మనిషి పుట్టక ముందు ఏమీ లేకుండా వచ్చాడు..చనిపోయిన తర్వాత ఏమీ లేకుండా పోతాడు.. మధ్యలో వచ్చిన ఈ భేదాలు ఎందుకు? దేవుడు ఇచ్చిన ఆస్తిలో ఎంతో కొంత పేదలకు సాయం చేసి ఆదుకోవాలని నా ఆశ..అంతే అంతకు మించి ఈ పదవి కూడా నాకు అక్కర లేదు..ఈ ఆస్తులు, అంతస్థులు మన వెంట రావు కదా..ఆకలితో అలమటిస్తూ అన్నం కోసం అర్థించే అన్నార్తుల కోసం, వీధుల వెంట తిరుగుతూ చలికి వణుకుతు, ఎండకు ఎండుతు, వర్షంకి తడుస్తూ పడరాని పాట్లు పడుతున్న అభాగ్యులను ఆదుకోవాలనేదే నా లక్ష్యం.. అప్పుడే నా మనసుకు తృప్తి.. ఆనందం..’’ అన్నాడు బంగారయ్య.
మనిషి నల్లగా వున్నా అతని మనసు ఎంత తెల్లనో ఇప్పుడు అర్థమైంది వీరయ్య కూతురుకి.
ఇన్నాళ్లు సమాజ ఉద్ధరణకు కృషి చేయాలనుకున్న తనకు అడుగడుగునా అడ్డువస్తున్న లంచం ఎరను తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. ఏ మాత్రం తృప్తి నివ్వని ఉద్యోగానికి ఆ మరుసటి రోజే రాజీనామా ఇచ్చి తన ఊహలకు ప్రతిరూపం ఇచ్చింది. ఆ మరుదినం మంత్రి బంగారయ్య పీఏగా చేరి ఆయన ఆలోచనలను అద్భుతంగా అమలు చేస్తూ సేవే పరమావధిగా సమాజ అభ్యున్నతి కోసం ముందుకు నడుస్తోంది వీరయ్య కూతురు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి