భాగవత కథలు -25 బలరాముని పరాక్రమం - కందుల నాగేశ్వరరావు

Balaramuni parakramam

భాగవతకథలు -25

బలరాముని పరాక్రమం

బలరాముడు ఆదిశేషువు అవతారం.శ్రీకృష్ణ పరమాత్మకు అన్నగా అవతరించాడు. దేవకీదేవి గర్భంలో ప్రాణం పోసుకుని గర్భసంకర్షణ వల్ల రోహిణీ దేవి గర్భం నుండి జన్మించాడు. అందుకనే బలరామునికి ‘సంకర్షనుడు’అని, అత్యంత బలవంతుడు కావున ‘బలభద్రుడు’అని పేర్లు వచ్చాయి.

బాల్యంలో బలరామ శ్రీకృష్ణుల క్రీడలు చూసి యశోదా నందులతోబాటు వ్రేపల్లెలో అందరూ ఆనందం పొందేవారు. బలరామకృష్ణులు మనోహరంగా వేణువులు ఊదుతూ అందరినీ ఆకర్షించేవారు. అతి చిన్న వయస్సులోనే శత్రువుల బొమ్మలు తయారుచేసి వాటితో యుద్ధం చేస్తూ ధ్వంసం చేసేవారు.

ధేనుకాసురుడు:

ఒకసారి గోపబాలురంతా ఆడుకుంటున్నారు. అప్పుడు కొందరు గోపబాలురు ఆకలివేసి పండ్లు కావాలని బలరాముని అడిగారు. బలరాముడు అక్కడ ఉన్న తాళవృక్షాన్ని పట్టి గట్టిగా ఊపి పండ్లను క్రింద పెద్ద చప్పుడుతో రాలి పడేటట్టు చేశాడు. ఆ చప్పుడు విన్న ధేనుకాసురుడనే రాక్షసుడు గార్ధబాకారంలో వచ్చి పళ్ళు పరపరా నూరుతూ బలరాముణ్ణి గుండెలపై ఒక తన్ను తన్నాడు. బలరామునికి అరికాలి మంట నెత్తి కెక్కింది. ఒక్కసారిగా దాని నాలుగు కాళ్ళు పట్టి గిరగిరా గాలిలో తిప్పి ఒక తాటిచెట్టు కొనపైకి విసిరాడు. అంతే ఆ రాక్షసుడి ప్రాణాలు గుటుక్కు మన్నాయి.

ప్రలంబాసురుడు:

బలరామకృష్ణులు గోపబాలురతో కలిసి ఆడుకుంటున్నారు. ప్రలంబుడు అనే రాక్షసుడు గోపబాలుడి వేషంలో వారితో కలిసి పోయాడు. ఆటలో భాగంగా బలరాముణ్ణి మోస్తూ వడివడిగా అడుగులు వేస్తూ దూరంగా తీసుకు వెళ్ళడం మొదలెట్టాడు. బలరామకృష్ణులను హతమార్చాలనే ఉద్ధేశంతో వాడు వచ్చాడు. రాక్షసుడి సంగతి తెలిసిన బలరాముడు తన శరీరాన్ని పెంచుతూ పోతున్నాడు. రాక్షసుడు ఆ బరువు మోయలేక నిజరూపం లోకి వచ్చాడు. అపుడు బలరాముడు విజృంభించి ఆ రాక్షసుని పిడికిలితో గుద్ది తల బ్రద్దలు కొట్టి చంపాడు.

శంఖచూడుడు:

ఒక వెన్నెలనాడు బలరామకృష్ణులు తెల్లటి వస్త్రాలు, పూలదండలూ ధరించి, చందనం పూసుకొన్నారు. బృందావనంలో గోపసుందరులు తమ చుట్టూ పరివేష్టించి ఉండగా మనోహరంగా మధురగీతాలు ఆలపించారు. వారి వేణునాదం చెవిని పడగానే గోప వధువులు పారవశ్యంలో ములిగిపోయారు. ఆసమయంలో కుబేరుని అనుచరుడైన శంఖచూడుడు అనే ఒక యక్షుడు రామకృష్ణుల రక్షణలో నున్న గోపకాంతలను తన యోగబలంతో బలాత్కారంగా తీసుకు పోసాగాడు. వారు ‘బలరామా, శ్రీకృష్ణా’ అంటూ ఆక్రందన చేశారు. వారి మొర ఆలకించిన బలరామకృష్ణులు ఒకరు యముడు ఇంకొకరు మృత్యువు అన్నట్లుగా వాడి వెంటపడ్డారు. వాడు గోపికలను వదలిపెట్టి పరుగుపెట్టాడు. గోపికలను కాపాడుతూ ఉండమని బలరాముడికి అప్పగించి, శ్రీకృష్ణుడు వాడిని తరిమి పట్టి చంపి, వాడి తలపై ఉన్న చూడామణిని తెచ్చి అన్న బలరాముడికి ఇచ్చాడు.

కంసుడు:

బలరామకృష్ణులను హతమార్చాలనిఆలోచన చేసిన కంసుడు, వారిని మథురానగరానికి ధనుర్యాగానికి ఆహ్వానించి తీసుకురమ్మని అక్రూరుని పంపించాడు.యశోదానందులకు ఈ విషయం చెప్పి అక్రూరినితో రామకృష్ణులు కట్నాలు కానుకలు తీసుకొని మథురానగరం బయలుదేరి వెళ్లారు.

మథురలో బలరామ సహితుడైన మధుసూదనుడు,కంసుడు పంపిన కువలయాపీడనమనే మత్తకరీంద్రమును కాలితో త్రొక్కి, చేతితో దాని దంతాలు ఊడబెరికి, బాది ప్రాణాలు తీసాడు. మల్లయుద్ధానికి రమ్మని సవాలు చేసిన చాణూరుని శ్రీకృష్ణుడు గిరగిర త్రిప్పగా నోటి నుండి నెత్తురు కారి నేలపై పడి ప్రాణాలు విడిచాడు. బలరాముడు అపార బాహుబలంతో బలవంతుడైన ముష్టికుణ్ణిపట్టుకొని త్రిప్పి త్రిప్పి క్రింద పడవేయగానోటి నుండి నెత్తురు వరదలా పారింది. అటుపిమ్మట బలరాముడు ముష్టికుణ్ణి , అతని మిత్రులైన కూటుడు, తోసలుడు, శల్యుడు అనువారిని తన కాలి తాపులతో తలలు పగులగొట్టి యమపురికి పంపాడు.

తరువాత శ్రీకృష్ణుడు సింహాసనంపై కూర్చొన్న కంసుని జుత్తుముడి పట్టుకొని ఏనుగును ఈడ్చినట్లుగా లాగి మల్లరంగస్థలం మీదికి విసిరాడు. కంసుడు నేలపై పడి అక్కడి కక్కడే మరణించాడు. బలరాముడు రౌద్రమూర్తియై ‘పరిఘ’ అనే ఆయుధంతో కంసుని సోదరులను ఒక్కొక్కరిని చెండాడి యమపురికి పంపాడు.

రుక్మి:

శ్రీకృష్ణుడి మనుమడైన అనిరుద్ధుని వివాహం రుక్మి మనుమరాలైన ‘రుక్మలోచన’తో జరిగింది. ఆ వివాహ సమయంలో రుక్మి బలరాముని జూదానికి ఆహ్వానించాడు. బలరామకృష్ణులపై ద్వేషం ఉన్న రుక్మి జూదంలో బలరాముడు గెలిచినప్పటికీ ఒప్పుకోకుండా స్నేహితులతో కలిసి బలరామునిపై వ్యక్తిగత దూషణకు దిగి అవమానించాడు.ఆ అవమానాన్ని తట్టుకోలేని బలరాముడు కోపంతో పరిఘను తీసుకొని ఒక్క దెబ్బతో రుక్మిని పైలోకానికి పంపించాడు.

కాళిందీ నది:

ఒకనాడు బలరాముడు వ్రేపల్లెలో కాళిందీ నదీతీరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడి సందేశం గోపకాంతలకు వినిపించి వారి దుఃఖాన్ని తొలగించాడు. కాళిందీనది ఒడ్డున ఉన్న ఉద్యానవనాలలో సుందరీమణులతో స్వేచ్ఛగా విహరించాడు. అప్పుడు వరుణుని ఆజ్ఞ వలన వారుణీదేవి ఆ వనమంతా మదన వాసనలు వెదజల్లింది. ఆ క్రొత్త వాసనలు ఆఘ్రాణించిన బలరాముడు గోపకాంతలతో కలిసి మద్యం సేవించాడు. ఆనందంగా ఆడుతూ పాడుతూ అలిసిపోయాడు. అప్పుడు అతనికి జలక్రీడ గాలించారని అనిపించింది. యమునా నదిని ‘ఇటురా’ అని పిలిచాడు. కాళింది బలరాముని ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు.

అప్పుడు కోపించిన బలరాముడు ‘నిన్ను నా నాగలితో వేయి ముక్కలు చేస్తాను’ అనిఉగ్రుడై పరాక్రమించాడు. అప్పుడు కాళింది స్త్రీ రూపం ధరించి వచ్చి బలరాముని పాదాలపై పడి కరుణించమని ప్రార్థించింది. అప్పుడు బలభద్రుడు శాంతించి కాళిందిని పూర్వంవలె ప్రవహించమని పలికాడు.ఆనందంగా గోపకాంతలతో కలిసి జలక్రీడలాడాడు. జలక్రీడ ముగించి సంతోషంగా ఉన్న బలరాముడికి కాళింది పట్టు వస్త్రాలు, రత్నాలంకారాలు సమర్పించింది. బలరాముని హలంతో ఏర్పడిన కాళిందీ నది చీలిక ఈనాటికీ కూడా ఆయన బాహుబలానికి గుర్తుగా ప్రఖ్యాతి గాంచింది.

ద్వివిదుడు అనే వానరుడు:

సుగ్రీవుడి మంత్రి మైందుడు. మైందుడి తమ్ముడు ద్వివిదుడు అనే పేరు గల వానరుడు. వాడు నరకాసుకునికి మిత్రుడు. పెద్ద గర్విష్టి. తన మిత్రుడైన నరకుని పగ తీర్చడానికి శ్రీకృష్ణుడు పాలించే పట్టణాలను పల్లెలను నాశనం చేయడం, ఆవులను బెదిరించడం, ఇళ్ళను పడగొట్టడం, పండిన చెట్లను విరగ గొట్టడం లాంటి పనులతో అందరినీ బాధిస్తూ ఉండేవాడు.

ఒకనాడు మనోహరమైన సంగీతం వినబడగా ద్వివిదుడు రైవత పర్వత గుహ దగ్గరకు వచ్చాడు. పండు వెన్నెలలో, తెల్లని దేహంతో, నల్లని వస్త్రాలు ధరించి, మత్తు పానీయం త్రాగి యువతుల మధ్యలోనున్న బలరాముని చూసాడు. ఆ వానరుడు బలరాముని ముందు ఉన్న చెట్టు కొమ్మలను ఊపుతూ, ఒక చెట్టు నుండుఇంకొక చెట్టు పైకి దూకుతూ, నాలుక బైటపెట్టి వెక్కిరిస్తూ, పండిన పండ్లను కొరికి విసురుతూ అన్ని రకాల వికృతచేష్టలు చేయసాగాడు. బలరాముడికి కోపం వచ్చి ఆ వానరుణ్ణి ఒక రాయితో కొట్టాడు.

బలరాముణ్ణి లక్ష్య పెట్టకుండా ద్వివిదుడు ఆ పరివారాన్ని సమీపించి వారి వస్త్రాలు చించాడు. అప్పుడు నాగలి పట్టి ప్రళయంనాడు విజృంభించే కాలయముడిలాగ బలరాముడు ద్వివిదుణ్ణి అదిలించి నిలబడ్డాడు. వానరుడు కూడా మహా పరాక్రమంతో ఒక చెట్టు పెకిలించి బలరాముని తలపై కొట్టాడు. ఇలా దెబ్బ తిన్న బలరాముడు కాలసర్పంలా చెలరేగి బంగారు కట్లు వేసిన ‘సునంద’ అనే రోకలితో ద్వివిదుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు వానరుడి శరీరం అంతా రక్తం చిమ్మింది.

ఆ దెబ్బకు మూర్చపోయిన వానరుడు కాస్సేపటికి తేరుకొని ఒక పెద్ద చెట్టు పెరికి బలరామునిపై విసిరాడు. బలరాముడు ఆ వృక్షాన్ని పట్టుకొని ముక్కలు ముక్కలు చేశాడు. బలరాముడు ద్వివిదుని మెడ పట్టి గట్టిగా బిగించాడు. అప్పుడు ఆ వానరుడి నోటినుండి చెవులనుండి రక్తం కారింది. వాడు దభీలుమని నేలపై పడి ప్రాణం విడిచాడు.

హస్తినాపురం:

దుర్యోధనుడి కుమార్తె పేరు ‘లక్షణ’. ఆమె సమస్త శుభలక్షణాలుగల కన్య. శ్రీకృష్ణుడి కుమారుడైన ‘సాంబుడు’, ఆమెపై మనస్సు పడ్డాడు. దుర్యోధనుడు వేరొకరితో కుమార్తె వివాహం నిశ్చయించాడు. వివాహ సమయంలో సాంబుడు వచ్చి లక్షణను తీసుకొని పారిపోయాడు. అది చూసిన బటులు ఈ వార్తను దుర్యోధనుడికి చెప్పారు. వెంటనే కర్ణ, శల్య, దుర్యోధనాదులు యుద్ధసన్నద్ధులై రథాలెక్కి సాంబుణ్ణి వెంబడించారు.సాంబుడు ధైర్యసాహసాలతో ధనుర్ధారియై వారి ఎదుట నిలిచాడు. అపార పరాక్రమంతో కౌరవులపై బాణాలను ప్రయోగించి వారి రథాలను, గుర్రాలను, కవచాలనూ పొడిపొడి చేసి వారి శరీరాలను గాయపరిచాడు. అప్పుడు కౌరవులు అందరూ మూకుమ్మడిగా చుట్టి కన్యకాసహితంగా సాంబుణ్ణి పట్టుకున్నారు. ఈ యాదవులు మనని ఏమి చేయగలరు అనుకుంటూ సాంబుణ్ణి చెరసాల్లో బంధించారు.

నారదుని ద్వారా ఈ వార్త తెలిసిన యాదవ వీరులు సర్వసైన్య సమేతంగా యుద్ధానికి కదిలారు. బందుప్రీతి గల బలరాముడు వారిని ఆపి, తన రథాన్ని ఎక్కి కుల వృద్ధులతోనూ, విప్రులతోనూ కలిసి హస్తినాపురం వెళ్లాడు. నగర పొలిమేరల్లో విడిది చేసి తన రాక చెప్పమని ఉద్దవుణ్ణి కౌరవుల దగ్గరకు పంపాడు. ఉద్దవుడు అలా చెప్పగానే దుర్యోధనుడు తనవారితో కలిసి వచ్చి బలరామునికి ఆహ్వానసత్కారాలు చేశాడు. అప్పుడు బలరాముడు “దుర్యోధనా! మా బాలకుణ్ణి ఒక్కడిని చేసి బంధించడం తప్పు అయినా మా రాజైన ఉగ్రసేనుడు బంధుప్రీతితో మిమ్ములనుక్షమించాడు” అన్నాడు. ఈ మాటలు దుర్యోధనుడికి రుచించ లేదు. యాదవులను నిందిస్తూ, పరుషంగా మాట్లాడుతూ తన రాజభవనానికి వెళ్ళిపోయాడు.

బలరాముడికి చాలా కోపం వచ్చింది. దుర్యోధనుడి మాటలకు కళ్ళు ఎర్రబడ్డాయి. తనతో వచ్చిన యాదవ వృద్ధులతో ఇలా అన్నాడు. “ రాజమదంతో దుర్యోధనుడి కళ్ళు మూసుకుపోయాయి. మన యాదవులను అవమానపరిచాడు. శ్రీకృష్ణుడూ మిగిలిన యాదవ వీరులు యుద్ధానికి వస్తానంటే బంధుప్రీతితో నేను వారిని వారించాను.ఈ భూమిపైన కౌరవ సామ్రాజ్యం అనేది లేకుండా చేస్తాను. మరో మార్గం లేదు”. ఇలా అంటూ తన చేతిలో నాగలిని ఎత్తి పట్టుకున్నాడు.

హస్తినాపురం దక్షిణంలో చిట్టచివరి భాగంలో నాగలికొనను చొప్పించి పైకి ఎత్తాడు. ఆ పట్టణాన్ని మొత్తం గంగలో కలపడానికి తయారయ్యాడు. ఆసమయంలో హస్తినాపురం మొత్తం ఒక ప్రక్కకు ఒదిగిపోయి నీళ్ళలో ములిగిన పడవలా తయారయ్యింది. ప్రజలు భయంతో హాహాకారాలు చేశారు. బలభద్రుని కోపం తగ్గించడానికి వేరే మార్గం లేక భీష్మ దుర్యోధనాదులు పరుగెత్తుకు వచ్చి బలరాముణ్ణి శరణు వేడారు. కన్యకతో సహా సాంబుణ్ణి సమర్పించారు. అనేక మణిమయభషణాదులు కానుకలిచ్చి మమ్ము రక్షించు అని ప్రార్థించారు.కౌరవుల స్తుతికి బలరాముడు సంతోషించి అభయం ఇచ్చాడు. దుర్యోధనుడు కూతురుకీ అల్లుడికీ అరణంగా దాసీలనూ, గుర్రాలను, ఏనుగులను, రథాలను ఆనందంగా ఇచ్చాడు. బలరాముడు సంతోషంగా ద్వారకకు తిరిగి వచ్చాడు. హస్తినాపురం ఈ నాటికి కూడా దక్షిణం వైపు పైకి లేచి, ఉత్తరాన గంగానది వైపు క్రుంగి ఉంటుంది.

తీర్థయాత్ర:

బలరాముడు కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదనితెలుసుకొని ఇరుపక్షాలవారికీ కావలసినవాడు కాబట్టి తీర్థయాత్ర నెపంతో ద్వారక నుండి వెళ్ళిపోయాడు. ప్రభాస తీర్థంలో స్నానం చేసి పెద్దలకు తర్పణాలు వదిలాడు. అక్కడ నుండి బయలుదేరి అన్ని పుణ్య నదుల్లో స్నానం చేస్తూ నైమిశారణ్యంలో ప్రవేశించాడు. అక్కడ మునులు దీర్ఘ సత్రయాగం జరుపుతున్నారు. వారంతా బలరామునకు ఎదురేగి వినయంతో స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు.

తక్కిన మునుల్లాగ తనకు స్వాగతమిచ్చి అతిథి పూజలు చేయకుండా ఉన్నతాసనంపై కూర్చున్న సూతుణ్ణి బలరాముడు చూశాడు. “ఈ సూతుడు వ్యాసునివద్ద కొన్ని కథలూ, గాథలు నేర్చి విద్వాంసుడనని విర్రవీగుతున్నాడు. మేము ధర్మరక్షణ కోసం పుట్టాము. అటువంటి మమ్ము గౌరవించని దుష్టుని శిక్షించ వలసిందే” అని అంటూ తన చేతిలోని ఆయుధంతో సూతమహర్షిని వధించాడు.

ఇది చూసిన అక్కడి మునులందరూ హాహాకారాలు చేశారు. వారు బలరాముడితో ఇలా అన్నారు. “మహాత్మా! ఇతనికి మేము యాగం నిర్వర్తించడానికి బ్రహ్మాసనం ఇచ్చాము. అందువలన నీవు వచ్చినపుడు ఇతను లేవలేదు. నీకు తెలియని ధర్మం ఉంటుందా? తెలిసి తెలిసి బ్రహ్మహత్యా పాపానికి ఒడిగట్టావు. ఈ పాపం పోవాలంటే నీవు తప్పక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి”.

అప్పుడు బలరాముడు “నా తొందరపాటు వల్ల ఇంతటి పాపం చేశాను. నా యోగశక్తితో సూతుణ్ణి బ్రతికించి మహాశక్తిమంతునిగాచేస్తాను. ఈ సూతపుత్రుడు ఆయువునూ, ఆత్మశక్తినీ, రోగంలేని శరీరాన్ని విద్యాదక్షతనూ పొందినవాడై ఈ లోకంలో ప్రకాశిస్తాడు” అని పలికి సూతుణ్ణి బ్రతికించాడు. మరల మునులతో “నేను తెలియక చేసిన అపరాధం శాంతించేలాగ మనకిష్టమైన కార్యం ఏదన్నా చేస్తాను, చెప్పండి అన్నాడు.

మునులు “బలరామా! ఇల్వలుడు అనే రాక్షసుని కొడుకు పల్వలుడు. వాడు బలగర్వంతో ప్రతీ పండుగకు వచ్చి మా యజ్ఞశాలల్లో మద్యమాంసాలు, మలమూత్రాలు కురిపించి మా పూజలు పాడు చేస్తున్నాడు. ఆ రాక్షసులని నీవు చంపితే మేము సంతోషిస్తాము” అని చెప్పారు.

మరునాడు పర్వదినం.మునులు పూజకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. పల్వలుడు అక్కడకు వచ్చి నానా బీభత్సం చేశాడు. కాటుక కంటిలాంటి శరీరము, పొడవైన నాలుకా, మెడలో ఎముకల హారం, నిప్పులు చిమ్మే చూపులతో ఆకాశంలో సంచరిస్తున్న పల్వలుణ్ణి బలరాముడు చూశాడు. బలరాముడు స్మరించిన వెంటనే రాక్షస సంహారానికి పనికివచ్చే ఆయుధాలైన నాగలి, రోకలి ప్రత్యక్షమైనాయి. ఆకాశంలో సంచరిస్తున్న పల్వలుని కంఠాన్ని నాగలితో క్రిందకులాగి రోకలితో నడినెత్తో మీద బలంగా మొత్తాడు. ఆ దెబ్బకు పల్వలుడు బుగబుగ నెత్తురు కక్కుకుంటూ భూమిపై బోర్లాపడి ప్రాణాలు విడిచాడు.

మునులు సంతోషించి బలరాముణ్ణి పవిత్ర జలాలతో అభిషేకించారు. వారి వద్ద శలవు తీసుకొన్నబలరాముడు కౌశికా నదిలో స్నానమాచరించి, ప్రయాగఅయోధ్య గయక్షేత్రాలు దర్శించిపులస్త్యాశ్రమంప్రవేశించాడు. అక్కడి నుండి గంగాసాగర సంగమం దర్శించి మహేంద్రపర్వతం చేరాడు. అక్కడ పరశురాముణ్ణి సందర్శించాడు.సప్త గోదావరి, కృష్ణవేణీ, పంపా, భీమా నదులను దాటి శ్రీశైలం, తిరుమల, కాంచీపురం దివ్యక్షేత్రాల మీదుగా కావేరీ నది మధ్యలో వేంచేసిన శ్రీరంగనాథుణ్ణి బలరాముడు సేవించాడు. తరువాత మథుర, రామేశ్వరం, కన్యాకుమారిని , గోకర్ణ క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి దర్శించి తిరిగి ప్రభాస తీర్థం చేరాడు. అక్కడ నుండి వింధ్యాచలందాటి ద్వారక చేరుకున్నాడు.

బలరాముడు అక్కడ కొన్నాళ్ళు ఉండి మరల నైమిశారణ్య వెళ్లాడు. అక్కడ యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దానాలు దక్షిణలు ఇచ్చి సంతృప్తి పరిచాడు. భార్య రేవతీదేవితోను, బందువులతోనూ కలిసి అవభృథస్నానం చేశాడు. నూతన వస్త్రాభరణాలు ధరించి పున్నమి చంద్రునివలె అందరికీ ఆనందం కలిగించాడు.

తరువాత మహాబలశాలి, పరాక్రమవంతుడు అవతారపురుషుడు అయిన బలరాముడు మిక్కిల వైభవంతో ద్వారకకు వెళ్ళి అక్కడ సుఖంగా ఉన్నాడు.

*శుభం*

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి