ఆసరా - కొల్లా పుష్ప

Aasaraa

"అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారు?" అన్నది చిన్నారి చిట్టితల్లి తన ముద్దు మాటలతో. "రేపు వినాయకుడి పండగ కదా! పాలవెల్లి కట్టి ముస్తాబు చేస్తాను నువ్వు సాయం చేస్తావా?" అన్నారు పూర్ణమ్మ పాపతో. "ఓ చేస్తాను" అన్నది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. పాపతో కబుర్లు చెబుతూ పాలవెల్లి కట్టి చక్కగాపూలతో, పళ్ళతో అలంకరించారు. "ఏంటమ్మా పాప విసిగిస్తుందా?" అని అడిగింది సునంద, పూర్ణమ్మకు కాఫీ ఇస్తూ. "లేదమ్మా నాకు సాయం చేస్తుంది. పూజకు పత్రి, పనసాకులు తెచ్చారా?" అని అడిగింది సునందను. "ఆ తెచ్చానమ్మా" అంది సునంద. "అయితే అన్నీ కడిగేసి ఇవ్వు పనసాకులతో బుట్టలు కుడతాను, రేపు కుడుములు పెట్టడానికి అన్నది పూర్ణమ్మ. ఆవిడ చేస్తున్న పనులన్నీ చూస్తున్నారు సునంద, పాప రాశి ఆశ్చర్యంగా. మర్నాడు ఉదయం కుడుములు, ఉండ్రాళ్ళు, ధనం పెట్టి ,పాయసం అన్నీ చేసి "పాప నీ పుస్తకాలు తేమ్మ" అన్నారు పూర్ణమ్మ పాపతో. "ఎందుకు అమ్మమ్మ"అని అడిగింది పాప. "ఎందుకంటే తొలి పూజలు అందుకునేవాడు గణపతి. అందుకని ఆయన దగ్గర పుస్తకాలు పెట్టి పూజిస్తే నీకు బాగా చదువు వస్తుంది" అని చెప్పారు. మట్టితో చేసిన చక్కటి వినాయకుడిని తెచ్చాడు విరించి. పూజ అంతా ఆమె దగ్గరుండి చేయించారు సునంద, ఆమె భర్త విరించి, పాప రాశి చక్కగా ఆమె చెప్పినవన్నీ చేసి పూజ పూర్తి చేశారు. కథ అక్షంతలు తలపై వేసుకున్నారు. పూర్ణమ్మ గారి కాళ్లకు నమస్కారం చేశారు. "నిండు నూరేళ్లు చల్లగా ఉండండి బాబు" అని దీవించింది. మధ్యాహ్నం విందు భోజనం చేశారు ఆనందంగా. అలసటగా ఈజీ చైర్ లో పడుకుని కునుకు తీసింది పూర్ణమ్మ. విరించి ఫోన్లో ఎవరితోనో "సరే, సరే తీసుకొస్తాను" అని చెప్తుంటే మెలకువ వచ్చింది పూర్ణమ్మకు. "ఆంటీ ఫోన్ వచ్చింది బయలుదేరుదామా!" అన్నాడు విరించి పాపని ఎత్తుకుంటూ. "నాన్నగారు అమ్మమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు" అని అడిగింది పాప. "ఈ రెండు రోజులు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఆశ్రమం వారు ఆమెను తీసుకెళ్లాలి" అన్నాడు విరించి పాపను ముద్దులాడుతూ. "వద్దు నాన్న, అమ్మమ్మని మనమే ఉంచేసుకుందాం నాకు మంచి, మంచి కథలు మన బుజ్జి గణపతి మీద ఎన్ని కబుర్లు చెప్పారో తెలుసా? ప్లీజ్ నాన్న వద్దు అమ్మమ్మని తీసుకెళ్లొద్దు" అని తండ్రి గడ్డం పట్టుకుని ఊపింది. "అవునండి అమ్మ ఉంటే నాకు తోడుగా ఉంటారు ...మీరు క్యాంపులకి వెళుతుంటారు కదా! మా అమ్మే మళ్ళీ ఈ రూపంలో వచ్చిందనుకుంటాను" అన్నది సునంద విరించి భుజం మీద చెయ్యి వేసి. 'పాప తన ఫ్రెండ్స్ ఇళ్లలో తాత, నానమ్మ, అమ్మమ్మ లతో గణపతి పూజ చేసుకుంటున్నారని పేచిపెడితే వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చాడు వాళ్ళ పర్మిషన్ తో రెండు రోజులకు... ఇలాంటి తల్లిని వదులుకోవడానికి వాళ్లకు మనసు ఎలా ఒప్పిందో ఆమె పిల్లలకు' అనుకున్నాడు విరించి. "ప్లీజ్ మరొకసారి ఆలోచించండి" అన్నది సునంద. 'నిజమే తనకు సునందకు ఎవరూ లేరు. తామిద్దరూ కూడా అనాథ ఆశ్రమంలో పెరిగి, పెద్దయి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంటికి పెద్దదిక్కు ఉంటే బాగుంటుంది అనిపించింది. సునంద గర్భవతి అయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తామిద్దరూ ...తనకు కూడా ఈ ఆలోచన చాలా నచ్చింది ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా ఆ వినాయకుడి దయవల్ల అధిగమించి ఆమెను తమ ఇంట్లోనే ఉంచేయాలని' నిర్ణయించుకున్నాడు విరించి. విరించి ముఖం చూసిన సునందకు అర్థమైంది "పాపా ఇక నుంచి అమ్మమ్మ గారు ఇక్కడే ఉంటారు" అన్నది సునంద భర్త చేతిలో నుంచి పాపని తను తీసుకుని ఎత్తుకుంటూ. పూర్ణమ్మ కళల్లో ఆనందం 'ఆ వినాయకుడి దయవల్ల మళ్లీ తన జీవితం ఒక మంచి కుటుంబంతో ముడి పడిందని తనకొక ఆసరా దొరికిందని అనుకుంది' కళ్ళల్లో నుంచి వచ్చిన ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ. పాప ఆనందంగా అమ్మని, అమ్మమ్మని పట్టుకుని గంతులేసింది.

మరిన్ని కథలు

Mister Vinayak
మిస్టర్ వినాయక్
- యిరువంటి శ్రీనివాస్
Window seat
విండో సీటు
- ఎం వి రమణారావ్
Swayam vupadhi
స్వయం ఉపాధి
- మద్దూరి నరసింహమూర్తి
Neelambari
నీలాంబరి
- రాము కోలా దెందుకూరు.
Indradyumnudu
ఇంద్రద్యుమ్నుడు
- కందుల నాగేశ్వరరావు
Vyapari telivi
వ్యాపారి తెలివి
- ౼డా.బెల్లంకొండ & ౼డా.దార్ల
Sundaramidi palle
సుందరామిడి పల్లె
- సి.లక్ష్మి కుమారి
Snehadharmam
స్నేహ ధర్మం
- భానుశ్రీ తిరుమల