ఆర్టీసీ కధలు 8
“రాజన్నగారు ఎక్కడ వుంటారు .” అడిగిందా యువతి హెడ్డాఫీసు గేటు దగ్గిర టీ షాపు దగ్గిర టీ తాగుతున్న ఒకరిని. “ఎందుకు ?” అడిగాడు వారిలో ఒకరు . “నా ఇబ్బంది వారితో చెప్పుకోవాలి .” అప్పటివరకూ ఆ సంభాషణ వింటున్న రాజన్న అడిగాడు “నేనే రాజన్నని . చెప్పమ్మా నీ సమస్య ఏమిటో .” “ విడిగా మాట్లాడాలి సార్.” రాజన్న ఆమెతో కొంచెం దూరంగా వెళ్ళాడు. ఆమె చెప్పింది “ నా పేరు కీర్తన .నేను రిటైర్డు ఐ పి ఎస్ గారి మనవరాలిని . నేను స్టెనోగా చేరి రెండు నెలలయ్యింది . మా ఆఫీసరుగారు అప్పటి నించీ లైంగికంగా వేధిస్తున్నాడు . మా తాతగారికి చెప్పలేదు . ఆయనైతే ఎండీ గారితోనే మాట్లాడేవారు . మా యూనియన్ వాళ్ళకి చెప్పాను . వాళ్ళు ఆయనతో మాట్లాడారు . అప్పటినించీ మరీ ఎక్కువయ్యింది .పైగా నన్నెవరూ ఏం చేయలేరు అంటున్నారు . మీతో చెప్పమన్నారు నా సహోద్యోగులు . అందుకే మీ దగ్గిరకి వచ్చాను .” ఆమె పనిచేసే అధికారి పేరు తెలుసుకుని “ సరే అమ్మా నేను మాట్లాడుతాను . నువ్వు వెళ్ళమ్మా .” అన్నాడతను .
@@@ రాజారావు జూనియర్ క్లర్కుగా విజయవాడలో చేరాడు ఆ ప్రభుత్వ రవాణా సంస్థలో . అతను చేరిన రోజే యూనియన్ లో చేరమని అడిగాడు ఒకాయన . ఆ యూనియన్ గురించి అతను చెప్పిన మాటలు నచ్చటంతో ఆ యూనియన్ లో చేరాడు .తరచుగా ఆ సంఘం తరఫున సమావేశాలు నిర్వహించేవారు . రాజారావులా చాలా మంది కొత్తగా చేరటం వల్ల . ఆ సమావేశాలకి అతను హాజరు అయ్యేవాడు .అంతేకాక అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు . కొన్ని రోజుల తరువాత మేనేజ్ మెంటు కోపంతో వారి జనరల్ సెక్రెటరీని విజయవాడ బదిలీ చేశారు హైదరాబాదు నుంచీ . అతను ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా వచ్చి విజయవాడలో చేరారు . రాజారావు పక్కనే అతని సీటు. అతను మధ్యాన్నం దాకా ఆఫీసు పని చేసేవాడు . భోజనం తరువాత రీజినల్ మేనేజరుతోనో, ఇతర డిపోలలోనో కార్మికుల సమస్యల గురించి మాట్లాడేందుకు వెళ్ళేవాడు . ఆయన రాజారావు చురుకుదనం కనిపెట్టి అతన్ని రీజినల్ కమిటీలో చేర్చాడు. అందువల్ల అతన్ని తన వెంట తిప్పుకునేవాడు. అతనికి యూనియన్ తరఫున ఎలా మాట్లాడాలో, కార్మికులతో ఎలా మాట్లాడాలో తెలిసాయి . జీ ఎస్ కూడా ఇతర కమిటీ సభ్యులతో సమానంగా అతనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. క్రమంగా కార్మికులలో కూడా రాజారావు పట్ల నమ్మకం ఏర్పడింది. ఏడాది తరువాత జీ ఎస్ గారిని హైదరాబాదులోని కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు . ఆయన వెళ్ళేముందు రాజారావుని అడిగాడు హైదరాబాదు వస్తావా అని . ఆయన వుద్దేశ్యంలో అతనిని హెడ్డాఫీసు కమిటీలో, తరువాత కేంద్ర కమిటీలో చేరిస్తే సంఘానికి బాగా ఉపయోగపడతాడని. సంఘ అధ్యక్షుడితో కూడా సంప్రదించాడు. ఆయన అనుమతితో అతను వెళ్ళిన మూడు నెలలకి రాజరావుకి బదిలీ అయ్యింది . జి ఎస్ గారిలాగేఅధ్యక్షుడు కూడా అతన్ని ప్రోత్సహించాడు. రాజారావు కూడా సమస్యలని అధికారులతో సంప్రదించి చక్కగా పరిష్కరిస్తుండటంతో తోటి కమిటీ సభ్యులకి, ఉద్యోగులకి కూడా నమ్మకమేర్పడింది . ఇప్పుడు తమ సమస్యలని చెప్పుకునేందుకు రాజారావు దగ్గిరకే వస్తున్నారు. అతను పూర్తిగా యూనియన్ కే తన సమయం కేటాయించుకోవాలనుకున్నాడు తమ జీ ఎస్ లాగా . అందువల్ల ప్రమోషన్ కోసం నిర్వహించే పరీక్షలకి వెళ్ళేవాడు కాదు. అలాగే పెళ్లి కూడా చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు . ఇరవై ఏళ్ల తరువాత తమ అధ్యక్షుడి స్థానంలో మరొకరు వచ్చారు. అలాగే ప్రధాన కార్యదర్శి స్థానంలో రాజారావు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. అతను కూడా యువకులకి అవకాశం కల్పించాడు కేంద్ర కమిటీలోనే కాక అన్నీ యూనిట్లలో, డిపోలలో . @@@ రాజారావు అన్నీ డిపోలకి,యూనిట్లకి వెళుతుంటాడు ప్రతినెలా నాలుగు రోజులు . అలా అతనికి అందరు కార్మికులలో, ఆఫీసు ఉద్యోగులలో ఆరాధనా భావం ఏర్పడింది. అతను ఎక్కడికి వెళ్ళినా బస్సులలోనే ప్రయాణించేవాడు . రైళ్లలో వెళ్లవలిసి వస్తే స్లీపర్ క్లాసులోనే ప్రయాణించేవాడు. ఆయా వూళ్ళల్లో కూడా సాధారణ హోటళ్లలో వుండేవాడు. కార్మికులందరితో చిన్న చిన్న పాక హోటళ్లలోనే భోంచేసేవాడు. అందువల్ల కార్మికులు కూడా అతనో పెద్ద నాయకుడిగా భావించక తమ తమ ఇబ్బందులని చెప్పుకునేవారు. అతనలా పర్యటనలకి వచ్చినప్పుడు ఎవరింట్లో అయినా శుభకార్యం వుంటే తనే వెళ్ళేవాడు వాళ్ళు పిలవకపోయినా .అతని ఉపన్యాసాలు కూడా ఉర్దూ,తెలుగు సామెతలతో హస్యంగా చెప్తూ అందరినీ ఆకర్షించేవి . ఆ కారణంగా ఇతర యూనియన్ సభ్యులు కూడా ఆయన సభలకి వచ్చేవారు . దూరంగా వుండి వినేవారు వారి నాయకులకి కోపం వస్తుందేమోనని . అలాగే అతనో నియమం పెట్టుకున్నాడు ఎవరు వచ్చి సమస్య చెప్పుకున్నా విని పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు. ఆ వ్యక్తి తన యూనియన్ సభ్యుడా కాదా అని ఆలోచించేవాడు కాదు .తన సభ్యులెవరైనా అభ్యంతరం చెపితే అనేవాడు “ఆ సంఘం వాళ్ళు చెయ్యకే కదా మన దగ్గిరకి వచ్చింది . మన సభ్యత్వం తీసుకుంటాడా లేదా అన్నది అతని ఇష్టం. కార్మికుల ఇబ్బందులు తొలగించాలనే కదా మనం సంఘంగా ఏర్పడ్డాం.” కానీ ఆయనకి తెలుసు కార్మికుడు ఎవరి వల్ల లబ్ధి పొందాడో ఆ సంఘాన్ని మర్చిపోడని. అతని నమ్మకం ఎప్పుడూ వమ్ము కాలేదు . దాంతో ఇతర సభ్యులెవరూ ఏమీ మాట్లాడేవారు కాదు . అలా తన మంచితనం వల్లే సభ్యుల సంఖ్య చాలా పెరిగింది . అందువల్లే గత ఎనిమిది ఏళ్లుగా మెజారిటీ డిపోలలో, యూనిట్లలో గుర్తింపు సంఘంగా గెలిచింది . గమ్మత్తుగా తమకి గెలుపు అవకాశాలు లేవు అనుకున్న చోట్ల కూడా ఇతర సంఘ సభ్యులు అభిమానంతో వోట్లు వేయటం ఆశ్చర్యం అనిపించింది . ఒకసారి వేరే సంఘ సభ్యురాలు ఆయన్ని కలవటానికి వచ్చింది . అందరూ చూస్తున్నారు ఎందుకు వస్తోందో అని . కారణం ఆమె ఇదివరలో ఆయనని అందరిలో అవమానిస్తూ బిగ్గరగా అరిచింది. రాజన్న ఏమీ మాట్లాడలేదు . నవ్వుతూ విన్నాడు. ఆవిడ ఆపాకా, “అయిపోయిందా, దా చాయ్ తాగు .” అని ఆమెకి చాయ్, బిస్కట్ ఇప్పించాడు . ఆమె కూడా ఆశ్చర్యపోతూనే చాయ్ తాగింది . నిజానికి అవతల సంఘం నాయకులు రాజన్న మీద చేసే ప్రచారమే ఆమెని అలా మాట్లాడేలా చేసింది . గమ్మత్తుగా ఒక ఏడాది తరువాత ఆమె మళ్ళీ ఆయన దగ్గిరకి వచ్చింది . “నేను ప్రమాదం జరిగి హాస్పిటల్లో వున్నాను మూడు నెలలు . ప్రమాదం తిరుపతి నించీ వస్తుంటే వొంగోలు దగ్గిర జరిగింది. చాలా మందికి ప్రాణాపాయం తప్పింది కానీ చాలా తీవ్ర గాయాలయ్యాయి. నాకు వొంట్లో ఎముకలన్నీ చితికిపోయాయని చెప్పారు. అక్కడి అధికారులు నా వివరాలతో మన ఏం డీ ఆఫీసుకి ఫోన్ చేశారు. మా అసిస్టెంట్ మేనేజరుగారు వెంటనే మా ఆఫీసునించీ ఇద్దరిని నా దగ్గిరకి పంపించారు. మా అక్క, బావ కూడా వచ్చారు. నన్ను అంబులెన్సులో ఇక్కడికి తీసుకొచ్చి ప్రైవేటు హాస్పిటల్లో చేర్చారు . మూడు నెలల తరువాత డిశ్చార్జ్ చేశారు .మూడు లక్షలైంది . బిల్లులు క్లైముకి పెడితే తిప్పి పంపేశారు. మా సంఘం వాళ్ళకి చెపితే వాళ్ళు అధికారులని అడిగొచ్చి డబ్బులు రావన్నారు . అందుకే మీ దగ్గిరకి వచ్చా. మూడు లక్షలైంది .” ఆవిడ చెప్పింది . ఆమె చేతిలో ఫైల్స్ వున్నాయి . ఆవిడకి చాయ్ ఇచ్చి “నేను కనుక్కుంటాను.రేపు మీరు తార్నాక హాస్పిటల్ కి రండి మీ ఫైల్స్ పట్టుకుని తొమ్మిదిన్నరకల్లా. నేనక్కడే వుంటాను.” చెప్పాడు రాజన్న. ఆయనకి నమస్కారం పెట్టి వెళ్లిపోయిందావిడ . అతని పక్కన వున్న వాళ్ళల్లో ఒకరు అన్నారు . “ఆవిడ మిమ్మల్ని తిట్టింది అందరిలో .ఇప్పుడు సిగ్గులేకుండా వచ్చి సాయం అడుగుతోంది .” “కూల్ భాయ్ కూల్. విన్నావుగా వాళ్ళు చేయలేదు కనుకే మన దగ్గిరకి వచ్చింది. మరునాడు హాస్పిటల్లో ఆవిడని తీసుకుని చీఫ్ మెడికల్ ఆఫీసరు దగ్గిరకి వెళ్ళాడు. ఆయన రాజన్న వచ్చాడు కనుక అంతా విన్నాడు మళ్ళీ . అంతకు ముందు వేరే సంఘం వాళ్ళు అడిగినప్పుడు చెప్పాడు ఆ బిల్లులు పాస్ చేయటం కుదరదు అని. మళ్ళీ చెప్పాడు “ ఆమె మన అనుమతి తీసుకోకుండా ప్రైవేటులో చేరింది . అందువల్ల నిబంధనల ప్రకారం నేనేమీ చేయలేను . “ ఆయనతో ఏమీ వాదన పెట్టుకోలేదు రాజన్న . ఇతర కార్మికుల సమస్యలు మాట్లాడి పరిష్కరించుకున్నాక ఒకటే చెప్పాడు చీఫ్ మెడికల్ ఆఫీసరుతో “ ప్రమాదం చెప్పి జరగదు . ఆవిడని హాస్పిటల్లో చేర్పించేవారికి మన నిబంధనలు తెలియవు . సరే నేను ఎండీ గారితో మాట్లాడతాను.” అని వచ్చేశాడు. తిన్నగా ఎండీ గారి దగ్గిరకి వెళ్ళాడు . విషయం అంతా చెప్పాడు . ఆమె పక్కనే వుంది . ఆయన అంతా విని ఈ డీ (మెడికల్ )తో మాట్లాడతాను అన్నాడు . రాజన్న ఈ డీ మెడికల్ కి అంతకుముందు ఆమె విషయం వివరించి ఎలా ఆమెకి డబ్బులు ఇవ్వవచ్చో నిబంధనల గురించి కూడా చర్చించాడు. రెండు రోజుల తర్వాత ఆమె సంతోషంగా వచ్చింది రాజన్న పని చేసే సెక్షనుకి. అందరి ముందూ రాజన్న చేతులు పట్టుకుని సంతోషంగా చెప్పింది తనకి మెడికల్ బిల్లులు శాంక్షను అయ్యాయని. ఆ విషయం రాజన్నకి ముందురోజే తెలిసింది. అలా చేతులు పట్టుకు వూపుతో “మీరు చాలా గొప్ప మనిషి.దేవుడు. ఆ రోజు మిమ్మల్ని తిట్టాను అందరిల . ఐనా అది దృష్టిలో పెట్టుకోకుండా నాకు సాయం చేశారు . ఈ రోజునించీ నేను మీ సభ్యురాలిని .” అన్నది . అలా సాధ్యం కాదు అనుకున్న అనేక పనులు చేశాడు ఆయన . అవసరమైతే ఛైర్మన్ అనుమతితో .
@@@ రాజన్న కీర్తన పనిచేసే అధికారి దగ్గిరకి వెళ్ళాడు .ఆయన ఇంకో రెండు సంవత్సరాలలో రిటైర్ అవుతాడు. ఆయనకి చాలా పలుకుబడి వుంది రాజకీయ నేతల దగ్గిర. అదే ఆయనని కాపాడుతూ వచ్చింది ఎన్ని దురాగతాలు చేస్తున్నా . గదిలోకి వెళుతూనే రాజన్న చెప్పాడు కుర్చీలో కూచుని “ నీ మీద చాలా ఫిర్యాదులు వచ్చాయి .ఇంతకాలం నీకు రాజకీయ అండ వుండటంతో తప్పించుకున్నావు. ఇక తప్పించుకోలేవు. నువ్వు రిజైన్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో. లేకపోతే నా దగ్గిరున్న సాక్ష్యాలతో నిన్ను డిస్మిస్ చేయించగలను .” అన్నాడు లేస్తూ. ఆయన ఆశ్చర్య పోయాడు. ఇంతకుముందు తనని మీరు అనేవాడు. ఇవ్వాళ ఏకవచన సంబోధన, అసలు విషయం చెప్పకుండా ఇలా తిన్నగా వార్నింగ్ ఇవ్వటం ఆశ్చర్యం వేసింది . రాజన్న ఏదైనా అంటే అతనిదగ్గిర పూర్తి ఆధారాలు వుంటాయి.ఆ విషయం అందరికీ తెలుసు. అతని సమాధానం వినకుండానే బయటికి వెళ్లిపోయాడు రాజన్న. ఆర్టీసీకి కమలాకర్ గారు కొత్త ఎండీగా నాలుగు రోజులక్రితమే చార్జ్ తీసుకున్నారు .ఆయన సీనియర్ ఐ పి ఎస్ అధికారి . నిజాయితీ పరుడు.ముఖ్య మంత్రి చెప్పిన వినేవాడు కాదు.అందువల్ల చాలా సార్లు ఆయనని లూప్ లైన్ పోస్టులలో వేసేవారు. ఆయన అక్కడ కూడా తన ప్రతిభ చూపి ఆ శాఖ పనికిరానిదేమీ కాదు అని నిరూపించాడు. ఆయనకి డీజీపీ ప్రమోషన్ రావాలి అందరి కన్నా సీనియర్ అవటం వల్ల . ఆయన ముక్కుసూటి తనం భరించటం కష్టం అని ఆయనకి ఆ స్థాయి కల్పించి ఆర్టీసీలో ఏం డీ గా పంపేరు. ఆయన కోర్టులో వేసేరు. ఆయన చార్జ్ తీసుకునే ముందే అక్కడి అధికారుల గురించి ఆరా తీశారు. అలా ఆ అధికారి గురించి రిపోర్టు చేశాక కూడా విజిలెన్సు రిపోర్టు ఆయన చూశారు. రాజన్న మొదటి రోజు ఆయనని అభినందించాటానికి వెళ్ళాడు తన కమిటీ సభ్యులతో. ఇప్పుడు ఆ అధికారి గురించి చెప్పటానికి వెళ్ళాడు. ఆయన చెప్పింది విన్నాడు. ఆయన అప్పటికే ఆ అధికారి గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు .పైగా తన మొదటి మీటింగులోనే చెప్పాడు అధికారులకి అవినీతిని సహించను అని. దానికి తోడు కీర్తన ఒక మాజీ ఐ పీ ఎస్ అధికారి కూతురు అని తెలియటం ,ఆయన దగ్గిర అనేక చోట్ల అతను పనిచేయటం వల్ల ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజన్న వెళ్ళగానే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఈ డీ గారిని పిలిచాడు. ఆయనతో చర్చించారు. ముందుగా ఆయన అతనికి చెప్పాలి రిజైన్ చెయ్యాలి,లేకపోతే సస్పెండయ్యి ,రిమూవ్ కావాలి. అతనే ఎన్నుకోవాలి . ఇరవై నాలుగు గంటలే సమయం. రేపు సాయంత్రం నాలుగు లోపు రాజీనామా చేయకపోతే సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుంటాడు. ఆ అధికారికి ఎండీ గారి నిర్ణయం తెలియగానే తనకి తెలిసిన రాజకీయ నాయకులకి ఫోన్ చేశాడు. అందరూ ఒకటే చెప్పారు. కమలాకర్ ఎవరి మాట వినడు. ఆయనకి ఎవరూ చెప్పలేరు. అతనికి అర్ధం అయింది.తనకి బయటి సాయం అందదు. తను నిర్ణయం తీసుకోవాలి. ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి రిమూవ్ ఐతే అంతకన్నా అవమానం వుండదు. రాజీనామా చేయటానికే నిర్ణయించుకున్నాడు. @@@@ ఇంకా ఐదేళ్లు సర్వీసు వుండగానే రాజన్న తమ సంఘ సర్వ సభ్య సమావేశంలో చెప్పాడు. “వచ్చే సమావేశంలో కొత్త జీ ఎస్ ని ఎంపిక చేసుకోండి. నేను ఈ పదవి నించీ తప్పుకుంటున్నాను” అని . ఎవరూ ఒప్పుకోలేదు .అతను వారికి చెప్పాడు “నేను సామాన్య కార్యకర్తగానే వుంటాను కొత్త వారు రావాలి సంఘం బలంగా వుండాలి.అలా ఎంపిక అయిన వ్యక్తికి అందరం పూర్తి సహకారం ఇద్దాము.” అతను అంతగా చెప్పాక అందరూ అంగీకరించారు.@@

