ఆర్టీసీ కథలు 7
విశ్వనాథశర్మగారు తన కందించిన కాయితం చూసి ఆశ్ఛర్యంగా ఆయన వంక చూసారు ఎండీ గారు ఇదేంటన్నట్లు. ### విశ్వనాథశర్మగారు డిప్యూటీ ఛీఫ్ ఎక్కౌంట్స్ అధికారి1గా పని చేస్తున్నారు. విజయవాడలో.ఆ పదవిలో ఆర్టీసీలో వున్న వారిలో ఆయన సీనియర్. సమర్థుడు, నిజాయితీ పరుడుగా పేరు. పైగా తన రీజియన్ లో వున్న అన్ని డిపోలలో అన్ని రికార్డులు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా వుండేలా చూసేవారు. తను నిజాయితీగా వుండటమే కాక తన దగ్గర పనిచేసే అధికారుల నించీ కింద స్థాయి ఉద్యోగుల వరకూ అంతే నిజాయితీగా వుండాలనేవారు.ఎవరైనా తప్పు చేస్తే మొదటిసారి అది తప్పు, అలా చేయద్దని చెప్తారు.రెండోసారి కఠిన చర్యలు తీసుకుంటారు.అలాగే తన దగ్గరి ఉద్యోగులని ఎవరైనా అవమానించినా సహించేవారు కాదు.అతనినే సమర్ధించేవారు ఎంత పెద్ద ఉన్నతాధికారి ముందు అయినా. తన ఉద్యోగి అసలు తప్పు చెయ్యడన్న నమ్మకం.వారి సమర్థత మీద నమ్మకం.ఎందుకంటే ప్రతి ఉద్యోగికి అతను చేసే పని విషయంలో తన అధికారులతో శిక్షణ ఇప్పిస్తారు. కొత్త ఆదేశాలు కేంద్ర కార్యాలయం నించీ రాగానే దాని నకలులు అందరికీ ఇప్పించేవారు.ఆఖరికి అటెండర్లకి కూడా.దాని గురించి వివరణలు వారితోనే చెప్పిస్తారు.అందువల్ల వారి నైపుణ్యం పెరుగుతుంది.వారి మీద వారికి నమ్మకం కలుగుతుంది. ఆయన స్వతహాగా ఆస్థిపరుడు.ఉద్యోగం అన్నది తను చదివిన సి ఏ ని సద్వినియోగం చేయాలని.ఇప్పుడు ఆర్టీసీలో ఎకౌంట్స్ లో అత్యున్నత పదవి ఛీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ మరియు ఫైనాన్షియల్ మేనేజరు పదవికి ఖాళీ రాబోతోంది. సాధారణంగా అప్పటి వరకు రైల్వే నుంచో,ఆడిట్ జనరల్ నుంచో ఆ స్థాయి అథికారిని డెప్యుటేషన్ పై నియమించేవారు. దానికి ప్రభుత్వ అనుమతి కావాలి. ఈ సారి అది కొంత ఆలస్యమయ్యేలా వుండటంతో తమ సంస్థలోని ఉద్యోగులకే ప్రమోషన్ మీద ఇవ్వటానికి తాత్కాలిక అనుమతి తీసుకున్నారు ప్రభుత్వం నించి. ⁷ అర్హులైన డిప్యూటీ ఛీఫ్ ఎకౌంట్స్ అధికారులని ఇంటర్వ్యూ చేసి నియమిస్తారు.దానికోసం ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారి ఒకరు కమిటీలో వుంటారు. అలా అర్హులైన అధికారులు ఐదుగురు వున్నారు.వారిలో విశ్వనాథశర్మ సీనియర్, సమర్థుడు.అందువల్ల ఆ పదవి ఆయనకే దక్కుతుందని అందరూ అనుకుంటున్నారు ఆయనతో సహా. #
## ‘ఙ్నానేశ్వర్ గారు మీకు పదివేలు ఇవ్వాలిట. నాతో పంపించారు.’ అంటూ పదివేలు వున్న కవరు శర్మగారి టేబుల్ మీద పెట్టబోయాడు కార్తికేయన్. కార్తికేయన్ వాళ్ళ తాతల నుంచీ స్ర్కాప్ వ్యాపారం చేస్తున్నారు. చెన్నైలో వుంటారు.అన్ని రాష్ట్రాల ఆర్టీసీలలో టెండర్ల ద్వారా స్ర్కాప్ కొనుగోలు చేసి అమ్ముతారు.వాళ్ళకి తమిళనాడులోని అధికార పార్టీతోనే కాక ప్రతిపక్ష పార్టీ నాయకులతో మంచి పరిచయాలు వున్నాయి.కొందరు మంత్రులు, ఎమ్మేల్లేలు, ఎంపీలు వారి ఆర్థిక సాయంతో గెలిచిన వారే. స్ర్కాప్ వేలంలోనో,టెండర్లలోనో దక్కించు కున్నాక విడతల వారిగా నియమిత కాలపరిమితి లోగా డబ్బు కట్టి తీసుకు వెళుతుంటారు.అలా తీసుకు వెళ్ళేందుకు అనుమతి పత్రం స్టోర్సు అధికారి ఇస్తే,డబ్బులు కట్టేది శర్మ గారి ఎకౌంట్స్ సెక్షన్ లో,అదీ ఆయన అనుమతితో.ఆ పని మీద వచ్చాడు కార్తికేయన్. శర్మ గారు కఠినంగా అన్నాడు ‘ఆ కవరు అక్కడ పెట్టకు.నువ్వు ఇస్తే ఎలా తీసుకుంటా ననుకున్నాడు వాడు.వాణ్ణే తెచ్చి ఇవ్వమను.రాస్కెల్, డీలర్ల దగ్గిర తీసుకుం టాడు.’ వాళ్ళిద్దరూ క్లాస్ మేట్స్.అందుకే ఆ చనువు.శర్మ గారి అనుమానం స్ర్కాప్ తీసుకెళ్ళే అనుమతి ఇచ్చేందుకు ఇతని దగ్గిర డబ్బులు అడిగి వుంటాడు, ఆ సొమ్ము తన అప్పు తీర్చేందుకు పంపివుంటాడని.అదీగాక శర్మగారు డీలర్ల దగ్గిరే కాదు తన సహచరుల వద్ద కూడా అప్పు చేయడు. ఆ అవసరమూ ఆయనకి లేదు. ఈ సంభాషణ జరుగు తుండగానే విజిలెన్స్ అధికారులు లోపలికి వచ్చారు.తనతో పని వుండి వచ్చి వుంటారని శర్మగారు భావించారు.కూర్చోమని కుర్చీ వేపు చూపిస్తుంటే, ‘మేము మీ మీద కేసు బుక్ చేయటానికి వచ్చాము.మీరు ఇతని దగ్గిర లంచం తీసుకుంటున్నారని మాకు తెలిసింది.’ శర్మగారు కార్తికేయన్ వంక చూసారు అతను జరిగిన విషయం చెప్తాడేమోనని.అతను తల దించుకొని వున్నాడు.శర్మగారికి అర్థం అయింది.ఇది ట్రాప్ అని.తను జరిగింది చెప్పాడు.అదే రాత పూర్వకంగా ఇచ్చాడు.గమ్మత్తుగా కార్తికేయన్ ఆయన లంచం అడిగినట్లు చెప్పాడు.వాళ్ళని చూసి డబ్బులు తీసుకోలేదన్నాడు. విజిలెన్స్ వాళ్ళు ఙ్నానేశ్వర్ ని అడిగితే తనకి ఆ డబ్బుతో సంబంధం లేదన్నాడు.శర్మగారికి బాకీ వున్న మాట నిజమే కానీ అది ఇలా ఇతని ద్వారా తీర్చాలను కోననీ. మొత్తానికి శర్మగారు సస్పెండవటమే కాక రిమూవ్ కూడా అయ్యారు.ఆ స్థాయి అధికారి రిమూవ్ కావటం తొలిసారి ఆర్టీసీలో.అదో సంచలనం అయింది.ఆయనకి రావలసిన అత్యున్నత పదవి వినయన్ కి దక్కింది. ### శర్మగారు హై కోర్టుకి వెళ్ళారు.కోర్టు పోలీసులు సమగ్ర విచారణ జరిపి రిపోర్టు ఇవ్వమన్నారు.ఆ పరిశోధనలో గమ్మత్తైన విషయం బైట పడింది.అదంతా జరగటానికి ఐదేళ్ళు పట్టింది. అత్యున్నత పదవి దక్కించుకున్న అధికారి వినయన్ కార్తికేయన్ ద్వారా ఆ తతంగం నడిపించాడు.ఆ విషయం కార్తికేయన్ ఒప్పుకోవటంతో కోర్టు శర్మగారికి అనుకూలంగా తీర్పు ఇవ్వటమే కాక, అతనిని అత్యున్నత పదవిలో నియమించటమే కాక, ఆ రోజు నించీ ఆయన జీత భత్యాలు ఎరియర్స్ తో సహా ఎనిమిది శాతం వడ్డీతో నెల రోజులలో చెల్లించాలని ఆదేశించారు. పైగా వినయన్ ని ఉద్యోగం నించీ తొలగించటమే కాక అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయమన్నారు.అంత వరకు అత్యున్నత పదవిలో అతనికి చెల్లించిన జీత భత్యాలు వసూలు చేయాలన్నారు. ##
# శర్మగారు గర్వంగా తన కొత్త సీటులో ఆశీనులయ్యారు.ఉన్నతాధికారులంతా వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు.శర్మ గారు అర్జెంటు ఫైల్స్ తనకి పంపమని అన్ని శాఖలకు తన పి ఏ ద్వారా కబురు చేసారు. వినయ్ పెండింగ్ పెట్టిన కేసులు,సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన కేసులు తన అధికారులతో సంప్రదించి సంతకాలు చేసారు. సాయంత్రం ఐదు గంటలకి ఎండీ గారి అనుమతితో ఆయనని కలిసి తన రాజీనామా పత్రం సమర్పించారు.ఆయన అడిగితే చెప్పారు ‘పరువు కాపాడుకునేందుకు పోరాటం చేసా.అంతే.శలవిప్పించండి.’ అని హుందాగా బయటికి నడిచారు.##

