అమ్మాయి పెళ్ళి - హేమావతి బొబ్బు

Ammayi pelli
ఆ అమ్మాయిని చూడగానే చెప్పవచ్చు తన కళ్ళు చాలా బాగున్నాయని, ఎవరినైనా ఇట్టే అయస్కాంతంలా ఆకర్షించే తన చామనచాయ రూపం, అందానికి నిర్వచనం రంగులో లేదని అమరిన తన కనుముక్కు తీరులో ఉందని. సుద్దముక్కకు ఎక్కడైనా ఆకర్షణ ఉంటుందా.


నాకా ప్రొద్దుnపోక అలా తీరుబడిగా ఇంటి వసారా లో కూర్చుని వాలే పిట్టలని, ఎకిరే పక్షులని చూడటం అలవాటు. ఆ పాప పొద్దున్నే పావడ ఓణి లో చలాకీగా తను నవ్వుతూ చకచక పనులు చేస్తూ తిరుగుతుంటే చూడముచ్చట వేసేది. మా ఇంటి యజమాని గూర్చి చెప్పకూడదు, కానీ అబ్బో చండశాసనుడు.మండలం కార్యాలయం లో ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడని పేరుకే కానీ, ఎప్పుడూ ఇంటిపట్టునే ఉంటూ భార్యను, బిడ్డను కంటికి రెప్పలా ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటున్నాడు.


పొద్దున నిద్దుర లేస్తూనే అమ్మ సరోజా మొక్కలకు నీళ్లు పెట్టమ్మా, అమ్మ కాఫీ పట్టుకు రామ్మ, అమ్మాయి పేపర్ తీసుకురా అమ్మా అని ప్రతి క్షణం తనను కలవరించేవాడు. మరి నా గురించి చెప్పనే లేదు కదూ. నేను ఈ మధ్యనే పీలేరు లోని డిగ్రీ కళాశాల లో జంతుశాస్త్రం లెక్చరర్ గా చేరాను. ఇదిగో ఈ అమ్మాయి సరోజ ఇంట్లో బాడుగకు ఒక గదిని అద్దెకు తీసుకొని దిగాను. నాకు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, మాది పెద్ద కుటుంబం అని తెలిసాకే మా ఇంటి యజమాని నాకు గదిని అద్దెకు ఇచ్చారు. ఆ అమ్మాయి మా అమ్మాయి ఒకే ఈడు వాళ్ళు అయ్యిఉండవచ్చని నాకనిపించింది. నేను ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.


ఆ రోజు ఆ పాపకి పెళ్ళి చూపులు.... పూలు పళ్ళు తేవడంలో అటూ ఇటూ మా ఇంటి యజమాని అటూ ఇటూ తిరుగుతున్నా రు . ఆ మనిషి ఇంట్లోకి రావడం, వెంటనే బయటకు వెళ్లడం కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఏంటో ఈ మనిషి అనుకొని "ఎందుకండి అంత తొందర ఊళ్లోకి వచ్చిన వాళ్ళు ఇంటి వరకు రాకపోతారా అన్నాను". "సరోజా ఎంత నెమ్మదస్తురాలో అబ్బో వాళ్ళ నాన్నకు మాత్రం భలే చాదస్తం" అనుకున్నా. ఇంతలో పెళ్లి వారు వచ్చేసారు. ఆయన చాలా సంతోషపడుతూ వాళ్ళకి ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు.


అమ్మాయి అప్పటికే చక్కగా జడ నిండా మల్లెలతో, కంచి పట్టు చీరతో, చేతుల గాజులు, పెదాల మీద రెపరెపలాడే చిరునవ్వు , అమ్మ, పిన్ని తనని తీసుకురాగా ఒద్దికగా వచ్చి కూర్చున్నది. ఎప్పుడూ జీన్స్ లో కనిపించే నా కూతురు గుర్తుకు వచ్చింది నాకు. మల్లియలు, గాజులు, కళ్ళకు కాటుక, మోమున చిరునవ్వు, ఇవి అమ్మాయికి ఎంత అందాన్ని ఇస్తాయి కదా అని తలచా.


అబ్బాయి క్రీగంటి చూపు కి అమ్మాయి సిగ్గుల మొగ్గ అయింది. నన్ను నేను పరిచయం చేసుకుని బాతాఖాని మొదలుపెట్టా. అబ్బాయి బెంగళూరులో పెద్ద MNC కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. చూపులు పూర్తయ్యాక అబ్బాయి ని అమ్మాయితో మాట్లాడుతావా అని అడిగా. అతను ఔనని చెప్పేలోగానే కాబోయే మామగారు జోక్యం చేసుకొని, ...."అబ్బే మా ఇంట ఇలాంటి అలవాట్లు లేవండి, నా కొడుకు శ్రీరామచంద్రుడు, వీడికి నేనెంత చెబితే అంతే" అని మధ్యలో కట్ చేశారు. పాపని లోపలికి తీసుకెళ్ళండని మా ఇంటి యజమాని తన భార్య తో చెప్పాడు.


ఇటు ఆ అమ్మి లోపలికి వెళ్ళగానే బేరసారాలు మొదలు పెట్టారు. "వీడి చదువుకి పది లక్షలు ఖర్చు పెట్టాను. మీ అమ్మాయికి కానుకలు ఏమి ఇస్తారు, ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారు". నా రచయిత కంటికి ఒక్కసారిగా సంతలో గొర్రేల వ్యాపారం కళ్ళకి కట్టినట్లు కనిపించింది. ఆ కుర్రాడు చూస్తే నోట్లో వేలు పెడితే కొరకనా వద్దా అని నాన్నను అడిగేలా ఉన్నాడు. పుత్తడి బొమ్మ సరొజాకి ఇటువంటి సంబంధం.


అతనితో "పది లక్షలు ఇచ్చుకోలేను, అమ్మాయికి పది కాసుల బంగారం పెడ్తా, పెళ్లి చేస్తా, అబ్బాయికి కొత్త మోటార్ సైకిల్ కొనిస్తా" అని చెప్పగానే వెంటనే అతను "నేనేమైనా ముస్టోడిలా కనిపిస్తున్నానా, పిల్ల చూస్తే నల్లగా ఉంది. ఇక కానుకలు, కట్నాలు లేవు, మీకంటే ఆ బుచ్చయ్యగారి సంబందమే బాగుంది అని, ఏరా లే పోదాం" అంటూ వెళ్ళబోయాడు. బావగారు కొంచెం ఆలోచించండి.... అని అడుగుతున్నా వినిపించుకోక ఆ మనిషి గేటు దాటి కారులో కూర్చున్నాడు.
"ఏంటో ఈ కాలం కుర్రాళ్ళు వాళ్ళకి ఏది కావాలో నిర్ణయించుకోలేక పోతున్నారు. పాపని ఎం.సి.ఏ చదివించా, ఈ కాలం కుర్రాళ్ళకి సంపాదన మీద ఉన్న మక్కువ సంసారం మీద ఏది. మనము సర్కారు బళ్ళో చదివి ఉద్యోగాలు చేసి పిల్లలను చదివిస్తే మామగారి మీద ఆశపడక కుటుంబాన్ని గట్టెక్కించాము. ఈ తరం డబ్బు ఎలా సంపాదించాలో తెలియక, డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు" అని కళ్ళ నీళ్ళు పెట్టాడు. నాకు క్షణంలో నా కూతురు గుర్తుకు వచ్చింది.


కుందనపు బొమ్మలాంటి సరోజ లోనే సొట్టలు వెతికిన సమాజం, నా కూతుర్ని, నన్ను ఎలా ఏడిపిస్తుందోనని తలచా.


ఇది దేశంలో ఒక్క తండ్రి బాధ కాదు దేశంలోని తండ్రులందరి భాధ.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి