రంగుల మేడ - ఆపాసా

Rangula Meda

రవి ఆఫీసుకి వెళ్ళబోతూ, రంగారావుగారితో తెగేసి చెప్పాడు.

‘ఈ దిల్లీ వదిలివెళ్లి, నేనెప్పటికీ మనూర్లో ఉండే ప్రసక్తి లేదు. రంగులమేడ తప్ప ఏముంది నాన్నా పట్టుకు వేళ్ళాడ్డానికి అక్కడ? ఎప్పటికైనా అది అమ్మాల్సిందే. అమ్మేయండి. దాంతో, ఆవూరితో ఉన్న ఆ ఒక్క బంధం తెగిపోతుంది.’

బంటీకి స్కూలు యూనిఫారం వేస్తూ శారద, రవి అన్నది విని, ‘ఇక మాఁవగారు ఆ రంగులమేడ అమ్మేయడం ఖాయం!’ అని ఆనందించింది.

రవి అన్నదానికి రంగారావుగారు బాణందెబ్బ తిన్న లేడిలా విలవిలలాడిపోయారు. నిస్సహాయంగా రవివైపు చూశారు. ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ, “రంగులమేడతో నా బంధం ఈనాటిది కాదు! నీకంటే మీ అమ్మకంటే ముందే ఏర్పడ్డ బంధం! నాతో పెనవేసుకుపోయిన విడదీయలేని బంధం! అది కట్టాకే నా ఉనికి ‘రంగులమేడ రంగారావు’గా అందరికీ తెలిసింది. అదే లేనినాడు నా అస్తిత్వమే లేదు!” అన్నారు, స్థిరంగా.

శారద అక్కసుగా, ‘అక్కడకి ఇతనికేదో అస్తిత్వమున్నట్టూ, ఆ రంగులమేడేదో పేద్ద చారిత్రాత్మక కట్టడమైనట్టూ! ఉన్న ఆవొక్క ఆస్తీ ఊడిపోతే, అప్పుడు తెలిసొస్తుంది ఇతని విలువేంటో!’ అని గొణుక్కుంది. బంటీ రెక్క పుచ్చుకుని గురగుర హాల్లోకి ఈడ్చుకొచ్చింది. బంటీని రవి దగ్గర వదిలేసి, రవి వైపే ఉత్సుకతతో చూసింది. రంగారావుగారికేం సమాధానం చెప్తాడో విందామనే కుతూహలంతో అక్కడ్నుంచి కదల్లేదు. అక్కడే హాల్లొనే నిలబడిపోయింది.

రవి, రంగారావుగారితో, ‘రంగులమేడ ఉన్నన్నాళ్ళూ మీ మనసటే లాగుతుంటుంది నాన్నా! మీరొక్కరే అక్కడుంటే, నేనక్కడకి రాలేకా ఇక్కడుండలేకా సతమతమైపోవాలి. మిమ్మల్నలా దిక్కులేనివాడిలా వదిలేశాననే అపరాధభావంతో నేనిక్కడ బాధపడాలి. అమ్మి పారేస్తే ఏ ఊగిసలాటా లేకుండా నాదగ్గరే స్థిరంగా ఉంటారని, అలా అన్నాను. నన్నర్థం చేసుకోండి నాన్నా! ఇంతకంటే మీకేం చెప్పలేను. మీయిష్టం!’ అని తన బాధ వెళ్ళగక్కి బంటీని తీసుకుని బయటపడ్డాడు.

శారద అసహనంతో గిరుక్కున తిరిగి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. పక్కమీద దుప్పటి సర్రున లాగింది. పెద్ద శబ్దమయ్యేలా కసిగా దులిపింది. పక్క సర్దుతూ పక్కమీద దబదబా బాదింది. అయినా మాఁవగారి మీద కోపం చల్లారలేదు, కసి తీరలేదు. ఏం చెయ్యలేక సణగడం మొదలెట్టింది.

‘గడ్డివాము దగ్గర కుక్క కాపలాలా, అది ఛస్తుందే కానీ, గడ్డి తినదూ వేరొకర్ని తిననివ్వదు. అది చచ్చేంతవరకు మనం చొంగలు కారుస్తూ ఉండాల్సిందే. పైగా అలా కాపలా కాస్తోందని దాన్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోవాలి. దాణా వెయ్యాలి. వెధవ బతుకు!’ అని గట్టిగా పక్క మీద మరో చరుపు చరిచింది.

రంగారావుగారికి ఎక్కడో చళ్ళుమంది. ఆ క్షణం రంగారావుగారికి, తనున్న నేల ఉన్నపళంగా క్రుంగిపొతే బావుణ్ణనిపించింది. క్రుంగలేదు. గుండె బద్దలయింది. హార్ట్ ఎటాకొచ్చి పోతే హాయనిపించింది. పోలేదు. ఏమీ జరగలేదు! కానీ, తక్షణమే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

అడుగు బయటకి వేశారు.

దాంతో ఎవరూ ఊహించనిది జరిగింది.

--:ooOoo:--

కొద్దిసేపట్లో పనిమనిషొచ్చి శారదతో, ‘ఎవరో ఒక ముసలతను మన కాలనీదగ్గరే బస్సుకింద పడ్డాడుట. పెద్దాసుపత్రికి తీసుకెళ్ళారు. పాపం! తోవలోనే ప్రాణం పోయింది.’

అంతే! శారదకి పై ప్రాణం పైనే పోయింది. గుండె దడ మొదలయింది. రవికి ఫోన్ చేసి, పనిమనిషి తెచ్చిన వార్త సంగతి చెప్పింది.

“నువ్వేం గాభరాపడకు. అతనికేం కాదులే! అయినా అతనొకరు! మీదగ్గరో సెల్ ఉంచుకోండి నాన్నా అంటే వినరు.

‘నాకెందుకురా సెల్లూ! అంతగా కావాలంటే పి.సి.ఓ.లుంటాయిగా’ అని కొట్టి పారేస్తారు.

అయినా అతని జేబులో మనందరి ఫోన్ నెంబర్లు ఎడ్రసులూ ఉన్న చిన్న పోకెట్ డైరీ ఉంటుంది. అతనికేం అయుండదు. నువ్వు నిశ్చింతగా ఉండు. నేనింటికి వచ్చేస్తున్నాను.” అని శారదకి ధైర్యం చెప్పాడు.

శారదకైతే ధైర్యం చెప్పాడు కాని, అతడికి మాత్రం ఆందోళన మొదలయ్యింది. ‘జీవితం మీద విరక్తితో ఏ అఘాయిత్యమైనా చెయ్యలేదు కదా, కొంపదీసి బస్సుకింద పడింది నాన్న కాదు కదా! ఏక్సిడెంటప్పుడు, జేబులోంచి పోకెట్ డైరీ తుళ్ళిపోవచ్చుగా! అది ఎవరికీ కనిపించకపోయివుండొచ్చుగా! ....’ అంతే! ఒక్క ఉదుటన లేచాడు.

బస్ స్టాప్­లు, షాపింగ్ కాంప్లెక్సులూ, లైబ్రరీలూ, పార్కులూ, రంగారావుగారు తిరిగే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి తిరిగి చూశాడు.

నిరాశతో ఇంటికి చేరాడు. తలుపు తెరుచుకోగానే ‘వచ్చేరా?’ అని ఆత్రుతతో అడిగాడు, శారదని.

శారద, నీరసంగా, ‘లేదు!’ అని తల అడ్డగా ఊపింది.

‘పద, పెద్దాసుపత్రికి వెళ్దాం!’ అన్నాడు రవి తెగించి.

‘ఛఛ! అలా భయపడకండి! ఇప్పుడే తెలిసింది. ఏక్సిడెంటయినతను మన కోలనీ అతను కాదు! మరో కోలనీ అతను!’

రవికి మనసు మనసులో లేదు. ‘అయితే ఇక, పోలీసు రిపోర్టివ్వక తప్పదు. మరో దారి లేదు!’ అన్నాడు, శారదవైపు చూస్తూ.

అంతలో, రవి సెల్ మోగింది. గబుక్కున అందుకుని, పేరు చూసి, స్పీకర్ ఆన్ చేశాడు. అట్నుంచి ఖంగుమని తమవూరి లాయర్ నారాయణరావుగారి గొంతు వినపడింది –

‘కంగారు పడకు రవీ. మీ నాన్నగారు క్షేమంగా ఉన్నారు. ఢిల్లీనుంచి రైల్లో ఇక్కడికొస్తున్నారు. రేపు సాయంత్రం చీకటిపడేలోగా మనూరు చేరిపోతానని చెప్పారు. భోపాల్ స్టేషన్లో, టెలిఫోన్ బూత్ కనిపించడంతో ఫోన్ చేశారు. హఠాత్తుగా బయల్దేరడంతో, మీకు చెప్పలేక పోయానన్నారు. రంగులమేడ గురించి ఒక నిర్ణయానికి వచ్చారుట.’ అని ఒక గుక్కలో చెప్పి, ఒక క్షణం ఆగారు. ఊపిరి పీల్చుకున్నారు.

శారద, తన మనసులోనే, ‘సరే! ఇన్నాళ్టికి బుద్ధొచ్చిందన్నమాట ముసలాడికి! ఇక ఆ పాడు కొంప పీడ విరగడయిపోతుంది.’ అని నిశ్చింతపడింది.

తిరిగి లాయర్ గారి గొంతు స్పీకర్ లోంచి వినిపించసాగింది. అవి బంటీ చెవుల్లో కూడా పడుతున్నాయి.

“అసలు రంగారావుగారు మీయిద్దరికీ చెప్పకుండా హుటాహుటిన బయల్దేరి ఒక్కరూ ఇక్కడకి ఎందుకు రావాల్సొచ్చింది? అతనేకాదు, ఎవరైనా, వృద్ధులు తనవాళ్ళనుంచి ఆశించేది ఆహారం ఆచ్ఛాదన కాదు; ఆప్యాయత ఆదరణ! అవే కరువైననాడు, అతని గోడు వినేవాళ్ళూ అతన్ని పట్టించుకునేవాళ్ళు లేనినాడు, ఆయింట్లో ఉంటేనేంటి ఊడితేనేంటి? వేళకింత పడేస్తే నీ బాధ్యత తీరిపోతుందనుకుంటే; మీ నాన్నకీ, జైల్లో ఖైదీలకీ తేడా ఏంటి? అలాటప్పుడు, తళతళలాడే నీ హంగులమేడకంటే, వెలవెలబోయిన ఈ రంగులమేడే నయం! మీదగ్గరుండి ఏమీ లేనివాడిలా కుమిలేకంటే, దూరంగా పోయి చావుకోసం ఎదురుచూడ్డమే మేలు! దూరంగా ఉన్నాననే బాధొక్కటే ఉంటుంది.

రోజురోజుకీ మన దేశంలో సమష్టి కుటుంబాలు తరిగిపోయి, విదేశాల్లోలాగా వ్యష్టి కుటుంబాలెక్కువైపోవడం; ఎదుటివారి గురించి ఆలోచనే లేకుండా, ఎంతసేపూ నేను నాది అనే స్వార్థం పెరిగిపోవడంతో, మనలాంటి ఇళ్ళల్లో సైతం పెద్దలంటే గౌరవం, భయం భక్తీ పోయాయి. మనదేశంలో సైతం వృద్ధాశ్రమాలు క్రుద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఏం జరిగివుంటుందో నేనర్థంచేసుకోగలను.

నువ్వు మీ నాన్న దగ్గర కూర్చొని ఐదు నిముషాలన్నా ఆప్యాయంగా మాట్లాడి ఎన్నాళ్ళయిందో గుర్తుతెచ్చుకో!” అనేసరికల్లా ఒళ్ళు ఝల్లుమంది రవికి. ‘నిజమే! నాన్న దిల్లీ చేరిన రోజు, అంటే ఆర్నెల్ల క్రితం మాటే! అంతే! ఆతరవాత లేదు.’ అనుకున్నాడు.

లాయర్ గారి మాటలు సాగుతూనేవున్నాయి.

“ఇలాగే ఒకసారి ఏదో మాటవరసకి నేను, ‘రంగారావుగారూ, ఇక మన బతుకు కుక్క బతుకేనండి. ముసలాళ్ళమైపోయాము కదా, మనమెవరికీ అక్కరలేదు.’ అంటే అతను, ‘ఛఛ అలా ఎందుకనుకోవాలి? నన్ను బంటీకంటే ఎక్కువగా చూసుకుంటుంది మా శారద!’ అని నిన్నూ శారదనీ వెనకేసుకొచ్చారే కాని, పల్లెత్తుమాట అనలేదు. మన ఇళ్ళల్లో రంగారావుగారిలాటి మంచివాళ్లు ఎందరో! కానీ మనం?! ...” అని అర్థవంతంగా ఆపారు.

రవీ శారదా ఒకరి మొహాలొకరు చూసుకోలేక అపరాధభావంతో తలలు దించుకున్నారు.

తిరిగి లాయర్ నారాయణరావుగారే, ‘రవీ, రంగులమేడ వ్యవహారం నీ సమక్షంలో తేల్చడం సవ్యంగా ఉంటుంది. అది అమ్మేశాక, రంగారావుగారు నీతో వస్తారా? అది శారదకిష్టమేనా? అతను రానంటే ఏంచెయ్యాలి? ఇలాటివన్నీ ఆలోచించాలి. ఎల్లుండికల్లా నువ్వూ వచ్చెయ్యి. రిజిస్ట్రేషన్ అదీ చెయ్యాలన్నా సులువుగా ఉంటుంది.’ అన్నారు.

రవి, ‘తప్పకుండా వస్తాను అంకుల్’ అని శారదవైపు చూశాడు.

బంటీ, గుడ్లప్పగించి తల్లి మొహంలోకి చూస్తున్నవాడు కాస్తా, ఉన్నట్టుండి ‘నాన్నా! పెద్దయ్యాక నేను పెళ్ళి చేసుకోను. పెళ్ళిచేసుకుంటే నువ్వూ తాతయ్యలాగా మనూరు వెళ్ళిపోతావుకదా! అది నాకిష్టం లేదు.’ అన్నాడు.

ఇద్దరూ అవాక్కయారు!

--: ooOoo :--

రవి రైలు దిగి స్టేషన్ బయటకొచ్చాడు. వయసులోవున్న వాళ్లు నడిపే ఆటోలు, వయసు పైబడ్డ వాళ్ళు నడిపే రిక్షాలు, మన సంస్కృతికి దీటుగా కొత్తపాతల సహజీవనాన్ని సూచిస్తూ కనబడ్డాయి. ఆటో వైపు నడిచాడు. ఇంతలో ఒక రిక్షావాడు, రవి చేతిలో బ్రీఫ్ కేస్ అందుకుంటూ, ‘ఆటోచార్జీ కంటే పది రూపాయలు తక్కువియ్యండి బాబూ, పది నిముషాల్లో దించేస్తాను.’ అన్నాడు. రవికి రిక్షా సింహాచలం గుర్తుకొచ్చాడు. వెంటనే, ‘పద’ అని, వాడితోపాటే అడుగేశాడు. తను వెళ్ళాల్సిన వీధి పేరు చెప్పాడు. రిక్షావాడు బ్రీఫ్ కేస్ రిక్షాలో పెడుతూ, ‘కూకోండి బాబు’ అన్నాడు. బండి తీస్తూ,

‘రంగులమేడ ఈదికా? ఏయింటికెల్లాల?’

‘రంగులమేడకే!’

‘రంగారావుగారేటవుతారేటి?

‘మా నాన్నగారు!’ అన్నాడు కొంచెం గర్వంగా.

రిక్షా సాగుతోంది, రవి ఆలోచనలతోపాటే.

మజిలీ చేరడంతో రిక్షావాడు, ‘ఎట్టావుండీ రంగులమేడ ఎట్టా అయిపోయింది బాబూ!’ అన్నాడు బండి ఆపుతూ. రవి ఆలోచనలకి బ్రేక్ పడింది. రంగులమేడ వంక చూశాడు. నిజమే! ఒకప్పుడు కళకళలాడుతూవుండే భవంతి ఇప్పుడు కళావిహీనమై వెలవెలబోతు కనిపించింది. ఈలోగా రిక్షావాడు బ్రీఫ్ కేస్ దించి నిలబడ్డాడు. రవి జేబులోంచి పర్సు తీసి, వాడికి ఆటోచార్జి ఇచ్చాడు. అతడు డబ్బులు తీసుకుని, చేతులు జోడించాడు. ‘బాబూ రంగులమేడ అమ్మేస్తారని ఇన్నాను. నిజమా! అమ్మకండి బాబూ!’ అని చెప్పి, రిక్షా వెనక్కి తిప్పాడు. ఆమాటకి రవి మొహం కళ తప్పింది. రంగులమేడ గురించీ, రంగారావుగారి గురించీ ఆలోచిస్తూ అడుగు లోపలకి వేశాడు.

రవిని చూసి రంగారావుగారు ఆశ్చర్యపోయారు! జరిగిందేంటో ఊహించారు. ‘ఓహో! లాయరు నారాయణరావు నిన్ను రమ్మన్నాడన్నమాట!’ అన్నారు.

‘అవును! రంగులమేడ వ్యవహారంలో రిజిస్ట్రేషన్­కి దానికీ నేనుండాలి రమ్మన్నారు. నా అవసరం ఏముంది నాన్నా! మీరెంతంటే అంతేకదా!’ అన్నాడు.

‘నారాయణరావునే అడుగు.’ అని చెప్పి అక్కణ్ణుంచి లోపలకి వెళిపోయారు.

రవి అయోమయంలో పడ్డాడు. ‘సరే! లాయరంకుల్­­నే అడుగుదాం’ అని రెండిళ్ళవతలున్న నారాయణరావు గారింటికి బయల్దేరాడు.

--: ooOoo :--

రవిని చూస్తూనే, ‘రా రవీ! కూర్చో’ అంటూ లాయర్ నారాయణరావుగారు చెప్పనారంభించారు.

‘రంగారావుగారు రిక్షా సింహాచలం సాయంతో బయటకి వెళ్ళొస్తుంటారు. టీకొట్టు అప్పారావు రోజుకి రెండుసార్లు కావలసినవి ఇచ్చి వెళ్తుంటాడు. ఇదంతా పనిమనిషి రత్తాలు చేసిన ఏర్పాటు. అలా వాళ్ళ ముగ్గురి సహకారంతోటే రంగారావుగారికి గడుస్తోంది.

నిన్న మీనాన్నగారు నన్ను పిలిచి రంగులమేడ గురించి సలహా అడిగారు. నేను మంచి బేరం వచ్చింది, నీతో సంప్రదించి అమ్మేయమన్నాను. అతను అమ్మే ఉద్దేశ్యం లేదని కరాఖండిగా చెప్పారు. నన్ను న్యాయం అడిగారు. అమ్మడం, అమ్మకపోవడం అతనిష్టం అని చెప్పాను. అయితే, అతని తదనంతరం రంగులమేడ పై సర్వహక్కులూ నీకూ బంటీకి చెందుతాయని చెప్పాను.

అతను, విసురుగా, ‘నా స్వార్జితం కాబట్టి, దారే పోయే దానయ్యకైనా రాసే హక్కు నాకుంది.’ అన్నారు. నేను, వేరే ఎవరి పేర్న రాసినా, రవికాని లేదా ఉత్తరోత్తరా బంటీకాని మీరు రాసింది చెల్లదని కోర్టుకెళ్ళొచ్చు.’ అని నచ్చజెప్పచూశాను. వినిపించుకోలేదు.

‘రవిక్కాని, బంటీక్కాని ఇక్కడికొచ్చి ఉండే అవసరం లేదు. వారి పేర్న రాస్తే, వెంటనే అమ్మిపారేస్తారు. అప్పుడు రంగారావుతోటే రంగులమేడ చరిత్ర కూడా ముగిసిపోతుంది.’ అని మండిపడ్డారు.

ఎలాగైతేనేం వీలునామా రాసి పెట్టుకోడానికి ఒప్పించాను. అతని తదనంతరం అది మానవత్వం ఉన్న మంచి మనుషుల చేతిలోనే ఉండాలనీ, అందుకు సింహాచలం, రత్తాలు, అప్పారావులే సరయినవారనీ వారి పేరనే విల్లు రాయమన్నారు. సరే! 60 దాటాక చాలామందిలో ఇది మామూలే, తామెందుకు కొరగానివారమైపోయామని, గోరంతలు కొండంతలు చేసుకుని తనవారినే శత్రువులుగా భావిస్తారు. కుమిలిపోతారు. అందుకని అతను అన్నదేం పట్టించుకోలేదు. ఆ ముగ్గుర్నీ పిలిచి, వారి ఉద్దేశమేంటని అడిగాను. మూకుమ్మడిగా ఒకటే అన్నారు –

‘ఒక మనిషికి, తోటి మనిషిగా సాయం చేశాం. అంతేగాని రంగులమేడ మీద ఆశతో కాదు! మాకొద్దు బాబూ మరోళ్ళ సొమ్ము! రంగారావుగార్ని మాయచేసి, రంగులమేడ రాయించీసుకున్నాం అని, తరతరాలు అనుకోరా! మాకొద్దు ఆ మేడా, ఆ చెడ్డ పేరు!’ అన్నారు.

‘న్యాయవాదినైన నేనే న్యాయం చెప్పలేకపోతున్నాను. న్యాయం నువ్వే చెప్పు.’ అని రవి మీద భారం వేసేసి ఊపిరి తీసుకున్నారు.

“నేనిక్కడకి బయల్దేరే ముందు, బంటీ మాయిద్దరికీ షాక్ ఇచ్చాడు! దాంతో, ‘కొడుకు పెళ్ళయి, కోడలు కాపురానికొస్తే, తండ్రి కొడుక్కి దూరంగా వెళ్ళిపోవాలి. మా ఆచరణలో బంటీకి మేమందించిన ఆదర్శం అది!’ అని మాయిద్దరికీ అర్థమయింది. చాలా బాధ వేసింది. శారద బావురుమంది. తేరుకున్నాక, నాకో మంచి సలహా ఇచ్చింది.

‘బంటీ ఇంకా చిన్నపిల్లడు. పెద్దయాక వాడెక్కడుంటాడో ఎవరు చెప్పగలరు? మీరు మన ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చినట్టు, బంటీ, మనదేశంనుంచి వేరే దేశానికి వెళ్లి అక్కడే స్థిరపడిపోవచ్చు. మనుషులు దూరానున్నంతమాత్రాన మనసులు దూరమవుతాయా; మన భ్రమగాని! ఏబంధమైనా మనసుకి సంబంధించినది. అంతా మనం అనుకోవడంలో ఉంది. అంతే!

అలాగే, యవ్వనం శాశ్వతం కాదు. మనమూ ముసలాళ్ళవుతాం. అయితే అప్పుడు మనల్నెవరయినా ఇష్టంగా ఆదరించాలి గాని కష్టంగా భరించకూడదు. చివరికి మన కోడలయినా సరే, మనల్ని గుదిబండలా అనుకోకూడదు. అది నామనసుకి నచ్చదు. అది ఇన్నాళ్ళూ అర్థం చేసుకోలేకపోయాను. నేను కోరినట్టు జరగాలంటే, ఆవయసులో కూడా మనకో వ్యాపకం ఉండాలి. అది నలుగురికీ పనికొచ్చేదైతే మరీమంచిది.’ అని స్పష్టంగా చెప్పింది శారద.

దానికి రంగులమేడే ఉత్తమం! మేమిక్కడికే వచ్చి ఉంటాం. అంతవరకు నాన్నకీ ఇదొక వ్యాపకంగా ఉంటుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. రంగులమేడని అమ్మను. పునరుద్ధరిస్తాను. వెలవెలబోతున్న మేడలో, కాంతులు విరజిమ్మేలా చేస్తాను. నాన్నలాటి, నాలాటి ఆత్మాభిమానులెందరికో ఆశ్రయం కలగజేస్తాను, ఆలంబనవుతాను. తమకంటూ ఒక గూడు లేక కొట్టుమిట్టాడుతున్న కొందరికైనా నీడనిస్తాను.

ఇప్పుడే దానికి శ్రీకారం చుట్టాలి. పదండి నాన్నతో మాట్లాడదాం. అతనికి తృప్తిగా ఉండేలా చేద్దాం.’ అని ముగించాడు రవి లేస్తూ.

లాయర్ నారాయణరావుగారు కూడ లేస్తూ, “బావుందయ్యా నీ ఆలోచన! ‘రంగులమేడ’లాటి ఆశ్రయాలలో చేరదామని ఉత్సుకత చూపేవారికంటే, అలాటి ఆశ్రయాలు కల్పించేవారి సంఖ్య పెరగాలని ఆశిద్దాం!” అన్నారు.

--: ooOoo :--

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల