ఎటువైపు...!! - రాధ కర్రీ

Etuvaipu

ఎందుకో మనసును ఒక్కసారిగా నల్లనిమేఘం కమ్మేసినట్లయింది. అంతా గందరగోళంగా ఉంది. ఎప్పుడూ లేని కొత్త ఆలోచనలు మనసును ఒకవైపు ఊహల పల్లకీ ఎక్కిస్తుంటే, అభిముఖంగా...ఇప్పటివరకు నేను ఉన్న వాస్తవ పరిస్థితులు నన్ను హెచ్చరిస్తున్నాయి. కమ్మని కలలరాగం ఒకవైపు కూలిపోతున్న బంధం ఒకవైపు ఎటు తూగాలో తెలియలేదు. ఎందుకు నా మనసు నా ఆధీనంలో ఉండదో ఎప్పటికీ అర్ధం కాదు. ****** ఆరోజు ముందు వరకు..అంటే అతను నా జీవితంలోకి రాకముందు వరకూ నేను కేవలం ఒక మనిషిని. ఆ రోజు శుక్రవారం. ప్రతివారంలానే ఆ రోజు కూడా గుడికి వెళ్ళాను. ఎప్పటిలానే ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి, ప్రదక్షిణ చేస్తుంటే ఎదురుగా వస్తున్న అమ్మాయి చేయి జారి, తన చేతిలో ఉన్న నూనె, ఒత్తులు అన్నీ నా బట్టలమీద పడిపోయాయి. ఆ అమ్మాయి " అయ్యో! చీరంతా జిడ్డు అయిపోయింది. మన్నించండి ఆంటీ" అంటూ నా చీరను తన చేతిరుమాలుతో తుడుస్తోంది. "పరవాలేదమ్మా" అంటూ అక్కడి నుండి కదిలి, కోనేరు గట్టుకు వెళ్ళాను. చీర శుభ్రం చేసుకుంటుంటే అనుకోకుండా అక్కడ గట్టుమీద ఆడుకుంటున్న పిల్లలు తోసేయడంతో, కోనేటిలో పడిపోయాను. నాకు ఈత రాదు. నీటిలో మునిగిపోతున్న. నీళ్లు నోట్లోకి వెళ్లి ఊపిరాడడం లేదు. సహాయం చేయమని అరవడానికి ప్రయత్నిస్తున్నా, మాట పెగలటం లేదు. చేతులు పైకి చాపి, ఎవరైనా రక్షిస్తే బాగుండును అని మనసులోనే వేడుకుంటున్నా. ఇంతలో ఓ రెండు చేతులు అమాంతం నన్ను ఎత్తుకుని బయటకు తీసుకువచ్చాయి. కొంచెం కుదుటపడ్డాక. ఆ వ్యక్తికి థాంక్స్ చెప్పి నేను ఇల్లు చేరాను. మనసేందుకో దిగులుగా ఉండి మేడమీదకు వెళ్ళాను. ఆరోజు పౌర్ణమి కూడా. వెన్నెలలో, తిరుగుతూ కుండీలలో పెంచే మొక్కలను తాకుతూ ఉంటే, ఒడలంతా ఒక్కసారిగా కొత్త అనుభూతికి లోనైంది. నా స్పర్శ నాకే కొత్తగా అనిపించినా, అదంతా కేవలం ఆ చల్లని సాయంత్రం మహిమ అనుకుని, కొంత తడవ క్రిందకు వెళ్ళిపోయాను. ఇంతలో ఎవరో తలుపు తడుతున్న శబ్దానికి, వెళ్లి తలుపు తెరిచి చూస్తే, ఎదురుగా తను. మళ్ళీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. అతను "లోపలికి రవచ్చా శాంతి గారు" అంటూ నా ప్రమేయం లేకుండానే ఇంట్లోకి వచ్చి సరాసరి కుర్చీలో కూర్చున్నారు. అతని చనువును ముందు అంగీకరీంచలేకపోయినా, వారించే స్థితిలో అయితే మాత్రం కచ్చితంగా లేను. "అక్కడే ఆగిపోయారే, రండి ఇలా కూర్చోండి" అని నా ఇంట్లో నాకే మర్యాద చేశాడు అతను. 'నేను మంత్రించిన బొమ్మలా', అతను చెప్పినట్లు అతనికి అభిముఖంగా కూర్చున్నాను. అతనే గలగలా మాట్లాడుతున్నాడు. కానీ నా నోటి వెంట మాటలేదు. మౌనిలా వింటున్నాను. మళ్ళీ అతనే "శాంతి గారు, నా చొరవ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదనుకుంటా...! నేను " అ.దేం..లేదు, చెప్పండి" తడబడుతూ అన్నాను. "ఇదిగో, ఇది మీ నల్లపూసల గొలుసు. ఉదయం మిమ్మల్ని కోనేటిలో నుండి వెలుపలకు తీసుకువచ్చిన సమయంలో నా గొలుసుకు తగిలి నాతోనే వచ్చింది" తీసుకోమని ఇచ్చాడు. అప్పటికి గానీ, గమనించలేదు. నా మెడలో ఉండాల్సిన నల్లపూసల దండ గురించి. దండ తీసుకుని అతని చూస్తున్న. నా మనసులోని ప్రశ్నలు అతనికి అర్ధమైనట్లు... " మీరెవరో నాకు చాలా బాగా తెలుసండి. ఎలా అంటే నేను మీ ఎదురింట్లోనే ఉండే శ్యామ్ వాళ్ళ బాబాయిని. మొన్నీమధ్యనే వరంగల్ నుండి వచ్చాను. కాబట్టే మిమ్మల్ని వెతికి పట్టుకోవాల్సిన అవసరం రాలేదు" అని తన ప్రస్తుత ఉనికిని నాకు తెలియచేశారు. నన్ను కేవలం ప్రేక్షుకురాలిని చేసి గలగలా మాట్లాడుతూనే ఉన్నాడు. మళ్ళీ అతనే " సరే శాంతి గారు, నేను ఇంక ఉంటాను. శ్యామ్ వచ్చే సమయం అయ్యింది. అవకాశం వస్తే మళ్ళీ కలుసుకుందాం. మీకు అసౌకర్యం కలిగిస్తే మన్నించండంటూ" లేచి వెళ్ళిపోయాడు. అతను అన్నట్లు...మళ్ళీ మేము కలుసుకునే రోజు మరుసటి రోజే వచ్చింది. ఇలా తరచూ కలుసుకోవడం జరుగుతోంది. అతనో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. దాంతోపాటు, సమాజ సేవ కూడా. అతని అభ్యుదయ భావాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. స్తబ్దుగా, నిర్జీవంగా ఉండే నా మనసు ఎందుకో అతనితో మాట్లాడ్తున్నప్పుడల్లా ఆనందంగా ఉండడం నేను గమనించాను. అంతేకాదు, కొలనులో పడిన సాయంత్రం నాలో కలిగిన వింత అనుభూతి నన్ను వెంటాడుతూనే ఉండేది. అది ఎందుకు జరిగిందో అర్ధం కాలేదు. నేను కూడా ఎక్కువగా దాని గురించి ఆలోచించలేదు. రాను రాను , మా మధ్య కొత్తగా స్నేహం అనే చిగురు పుట్టుకొచ్చింది. చరవాణి సంభాషణలు కూడా ఎక్కువయ్యాయి. అవకాశం చిక్కినప్పుడల్లా, అతను చేసే కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించేవాడు. నేను కూడా ఆనందంగానే వెళ్ళేదాన్ని. ఆ కార్యక్రమాలను చూస్తుంటే, నాకు కూడా అలా నా వంతు సమాజ సేవ చేయాలని అనిపించింది. ఆ విషయం చూచాయగా చెప్పడంతో, నాకు కూడా తను సేవ చేసే సంస్థలో సభ్యత్వం ఇప్పించాడు. రోజూ పాప స్కూలుకి, మా వారు ఆఫీసుకు వెళ్లిన తరువాత, నిత్యం ఖాళీగా ఉండే నాకు, ఈ సభ్యత్వం నిజంగా ఓ సదవకాశంగా అనిపించి, పూర్తిగా నిమగ్నమవడం మొదలుపెట్టాను. ఇంచుమించు రోజూ అతనితో అనేక విషయాల మీద చర్చ, తద్వారా కలిసి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగేది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంతలా మారిందంటే 'సూర్యోదయం లేత కిరణం నుండి మిట్ట మధ్యాహ్నపు గాఢమైన ఎండలా.' శుక్లపక్ష చంద్రునిలా రోజు రోజుకూ మా మధ్య సాన్నిహిత్యం కాస్త చనువుగా పరిణితి చెందింది. ఒక్కరోజు కూడా అతనితో మాట్లాడకుండా ఉండలేనంతగా మారింది. అతను మాట్లాడుతున్నంత సేపు ఏదో తెలియని అనుభూతికి లోనయ్యేదానిని. ఎప్పుడో పోగొట్టుకున్న సంతోషం తిరిగి నా చెంత చేరినట్లుండేది. అతనితో అన్ని విషయాలు అరమరికలు లేకుండా చెప్పగలిగేదానిని. ఒక సంవత్సర కాలం గిర్రున తిరిగింది. నాలో కొత్త శాంతి పుట్టినట్లయింది. నా కుటుంబాన్ని కూడా ఇంతకముందు కన్నా, చాలా చక్కగా చూసుకోగలుగుతున్నాను. నాలో పెళ్లి అయిన నాటి నుండి నేటివరకూ మారనిది ఒకే ఒకటి 'దాంపత్యంలో నా నిర్లిప్తత'. హఠాత్తుగా ఒక రోజు మా వారు "శాంతి ... శాంతి! అర్జెంట్ గా రెండు కాఫీలు తీసుకుని రా" కేక వేశారు. నేను కాఫీ కప్పులతో హాల్లోకి వచ్చేసరికి మా వారు , అతను మాట్లాడుకుంటున్నారు. అప్పటి వరకూ మాములుగా ఉన్న నేను, అతనిని చూడగానే , మా వారు ఉన్నారన్న సంగతి కూడా మరిచిపోయి చాలా ఆనందంతో అతనితో గలగలా మాట్లాడేస్తున్నా. అతను కొంచెం ఇబ్బందిగా చూస్తున్నా కూడా గమనించనలేనంతగా..! నాలోని మార్పును మా వారు స్వయంగా చూస్తున్నారు. "శాంతి..! అని మావారు పిలిస్తేగాని నాకు వాస్తవ స్థితి తెలిసిరాలేదు. అతను మాత్రం కొంచెం ఇబ్బందిగా తల దించుకున్నాడు. ఇంతలో మా వారు " రఘురాం గారు..మీరు మా శాంతిని పెళ్లి చేసుకుంటారా" అతనివైపు చూస్తూ అన్నారు. ఆ మాట విన్న అతను, నేను కూడా ఒక్క క్షణం కొయ్యల్లా బిగుసుకుపోయాము. మళ్ళీ మావారే కలిపించుకుని - " చూడండి రఘురాం గారు! నేను చెప్పింది, మీరు విన్నది..రెండూ నిజమే. మా పెళ్లి జరిగి దాదాపు 9వసంతాలు...కాదు..కాదు..9 సంవత్సరాలు గడిచాయి. అంతకు ముందు నేను ఎన్నడూ చూడని శాంతి ముఖంలో సంతోషం , మీ పరిచయం తరువాత నేను చాలా సార్లు చూశాను. అది కూడా కేవలం మీరు తనతో ఉన్న సమయంలోనే. తను మిమ్మల్ని ప్రేమిస్తుందని కూడా గ్రహించాను." 'పెళ్లి చేసుకున్నానే గానీ, తనని ఏనాడు సంతోష పెట్టలేకపోయాను. పెళ్లి అంటే..కేవలం రెండు కుటుంబాలు కలవడం లేదా రెండు శరీరాలు కలవడం మాత్రమే అని అనుకునే నేను, మీ ఇద్దరి స్నేహం, సాన్నిహిత్యం చూశాక, మనసులేని, యాంత్రికంగా సాగే దాంపత్యం వ్యభిచారం కంటే హీనం అని గ్రహించాను." "అంతే కాదు, తను నాతో కూడా చెప్పుకోలేని చాలా విషయాలు మీతో పంచుకోవడం నేను గమనించాను. నన్ను భర్తగానే కాదు, కనీసం స్నేహితుడిగా కూడా అంగీకరించలేదని పూర్తిగా అర్ధమైంది. అందుకే నేను తాళి కట్టిన తనను , తన మనసుకు నచ్చిన మీకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీకు కూడా శాంతి అంటే మనసులో ప్రేమ ఉందన్న విషయాన్ని గమనించాను. కాకపోతే, పరాయి వాని భార్య, అనే విషయం మీ మనసులో మాటను మీలోనే అదిమి ఉంచేలా చేసింది. అందుకే, మీ ఇద్దరి సమక్షంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. చట్టపరమైన అడ్డంకులన్నింటినీ తొలగించి తనను మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను." మీ అభిప్రాయం చెప్పండంటూ మా ముఖాలు మార్చి మార్చి చూస్తున్నారు. రఘురాం నోటి వెంట మాట లేదు. నా కనులవెంట కన్నీరు ఆగడం లేదు. కొంత సమయం తరువాత రఘురాం ను, నన్ను అలా వదిలేసి, మా వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఏంచేయాలో తెలియని రఘురాం నా దగ్గరకు వచ్చి, " శాంతి, మీ చేయి అందుకుని మిమ్మల్ని ఆనందంగా ఉంచాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఎన్నడూ బయటపడలేదు. కానీ, ఇప్పుడు స్వయంగా మీ మెడలో తాళి కట్టిన భర్తే, మీకు నన్ను ఇచ్చి వివాహం చేస్తానంటున్నారు. దేన్ని బలవంతంగా చేయకూడదు. కాబట్టి, ఇప్పుడు నిర్ణయం మీదే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే" అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ప్రస్తావన ముందు వరకూ ఆనందంగా ఉన్న నా మనసు...ఒక్కసారిగా మూగబోయింది. "ఒక ప్రక్క నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచే రఘురాం. మరో ప్రక్క 9 సంవత్సరాలుగా కాపురం చేస్తున భర్త , అతని గుర్తుగా పాప." ఏం చేయాలి ఇప్పుడు...! ఎటు తూగాలి...! మనసుకు ప్రాధాన్యం ఇవ్వాలా...!! బంధాలకు విలువ ఇవ్వాలా...!! ఎటూ తేల్చుకోలేకపోతున్న. ఆడదానికి మనసు ఉండడమే పాపమా..! నా మనసు సంతోషం కోసం రఘురాంని పెళ్లి చేసుకుని, పాపను, వారిని విడిచిపెట్టాలా..! కుటుంబ సంతోషం కోసం... నా మనసు సంతోషాన్ని అణిచివేయాలా...! ఏం చేయాలి ? ఏది చేస్తే తప్పు.. ఏది చేస్తే ఒప్పు..!! ఎవరైనా చెప్పగలరా...!! ఈ చిక్కుముడిని విప్పగలరా...!! *********

మరిన్ని కథలు

Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి