‘చెన్నయ్ సంబంధం అయితే నా కూతురుకి ససేమిరా వద్దు! నా చిన్నప్పట్నుంచి చెన్నైలో నీళ్ళకి ప్రోబ్లమే!’ అన్నాడు భగీరథరావు స్పష్టంగా, తన బావమరిది చక్రితో.
చక్రి సౌమ్యంగా, ‘పెళ్ళికొడుకు మా కజిన్ బ్రదర్ కొడుకనీ, ఆ కుటుంబం మంచిదనీ పట్టు పడుతున్నాను బావా! అయినా జాహ్నవి పెళ్ళి భారం నామీద వేశావు కదా! నాకొదిలెయ్. ఒకసారి పెళ్ళివారింటికి వెళ్ళి, నాకళ్ళతో నాలుగూ చూసొస్తాను.’ అని బోధపరచాడు.
భగీరథరావు, బావమరది మాటని కాదనలేకపోయాడు.
అలా చక్రి, చెన్నైకి ప్రయాణమయాడు.
--:oo(O)oo:--
చక్రిని చెన్నై రైల్వేస్టేషన్లో, పెళ్ళికొడుకు గంగాధర్ ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు.
ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెడుతూనే, చక్రీ వాళ్ళ వదినగారు ‘చక్రీ, వేగం స్నానం అదీ కానిచ్చేయండి. అరగంటలో నీళ్ళ వాల్వ్ కట్టేస్తారు. ఒరేయ్ గంగా, బట్టలు జాడించిన నీళ్లు పారపోసెయ్యకు. వేరే బకెట్లో ఉంచు ఫ్లష్ చెయ్యడానికి పనికొస్తాయి.’ అని చెప్పింది.
చక్రి, “వదినా నీ మాటలు వింటుంటే, మా అక్క భాగ్యలక్ష్మే గుర్తొస్తోంది. ఒకసారి నేను వాళ్ళూరు వెళ్ళినప్పుడు, గుమ్మంలోనే నిలబెట్టింది. ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం తెచ్చి అందులో కాళ్లు పెట్టమంది. చెంబులో సగం నీళ్లు తెచ్చి ‘ఒక్క చుక్కయినా కింద పడకుండా పళ్ళెంలోనే కాళ్లు కడుక్కో.’ అని నాకు అర్ఘ్యపాద్యాలిచ్చింది. ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటుందా! అని అయోమయంగా ఆమెవైపు చూశాను.
నా తల తిరిగిపోయేలా, ‘అలా చూస్తావేంటిరా సన్నాసీ! నీ కాళ్ళు కడిగిన నీళ్ళు మొక్కలకి పనికొస్తాయి.’ అని నాకు నీరోపదేశం చేసింది.”
మాటల్లోనే గంగాధర్ తండ్రి వచ్చాడు. చక్రిని పలకరించాడు.
--:oo(O)oo:--
అందరూ హాల్లో కూర్చున్నారు. గంగాధర్ తండ్రి, ‘చక్రీ! నువ్వు తెచ్చిన సంబంధం బాగుంది. ఇంకా ఏమైనా మేము తెలుసుకోవలసినవి ఉంటే దాచకుండా అన్నీ ఇప్పుడే చెప్పేయ్.’ అన్నాడు.
చక్రి, ‘ముఖ్యంగా చెప్పవలసినది ఒకటి ఉంది’ అని మొదలెట్టాడు. మిగిలిన ముగ్గురూ ఆసక్తిగా వినసాగారు.
“జాహ్నవికి చిన్నప్పట్నుంచీ నీళ్ళంటే పిచ్చి! ఆమె చిన్నతనంలో, రైల్లో కొళాయిలుంటాయని, వాటికి బుర్రలుంటాయని, అవి నొక్కితే నీళ్ళొస్తాయనీ; తెలిసి విస్తుపోయింది!
అప్పట్నుంచి ఏవూరు వెళ్ళాలన్నా రైల్లోనే వెళ్దామని అల్లరి చేసేది.
వాళ్ళ అమ్మ భాగ్యలక్ష్మి, అదే మా అక్కయ్య సంగతి, ఇందాకే చెప్పేశాను.
అలాగే మరో నీళ్ళ పిచ్చోడు మా బావ భగీరథం.
చిన్నప్పట్నుంచీ ‘నీళ్ళు నీళ్ళు’ అని కలవరింతలే; నీళ్ళ కలలే!
‘మా బావ నీళ్లు తోడుదామని తాడు-బాల్టీ కోసం బావి దగ్గర ఇటూ అటూ చూస్తాడుట. ఈలోగా పొయ్యిమీద పాలు పొంగినట్లు, నూతిలో నీళ్ళు బుసబుస పొంగిపోవడం మొదలెడతాయిట. నూతి గట్టు మీంచి ఒకటే ధార! గబగబ అక్కడున్న గుండిగలు, డేగిసాలు, కాగులు, బిందెలు, ఒకటేంటి అన్నీ నీళ్ళతో నింపేస్తుంటాడు. నూతిలోనే చెంబు ముంచి ఆబగా నీళ్లు పోసేసుకుంటుంటాడు. అయినా ఆ ప్రవాహం ఆగదుట.’
అన్నీ అలాటి కలలే.
జాహ్నవికి ఎన్ని మంచి మంచి సంబంధాలొచ్చినా ఏదోవొక ఒంకతో పడనిచ్చేవాడు కాదు.
నేనొక రోజు, ‘ఇలా అయితే ఎలా బావా! ఈజన్మకి జాహ్నవి పెళ్ళయినట్టే!’ అని చిరాకుపడితే, అప్పుడు చెప్పాడు అసలు సంగతి.
‘ఎప్పుడూ నిరాటంకంగా కొళాయిల్లోంచి నీరు పడుతుండే ఇంటికే జాహ్నవినిస్తాను.’ అని.
భగీరథం బావ చవిచూసిన అనుభవాలే అతడికలాటి నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేశాయి.
ఒకసారి విజయనగరంలో, మా బావ చిన్నప్పుడు, వగరుస్తూ ఇంటికొచ్చాడు. మా అత్తతో, ‘అమ్మా అమ్మా! అక్కడ నీళ్ళటాంకు ఏరియాలో నీళ్లు వదిలారే. పైపులైన్లలోనుంచి హోరుమని శబ్దాలొస్తున్నాయి. మన వీధి కొళాయిలో కూడా నీళ్ళొచ్చెస్తాయేమో!’ అన్నాడు ఆశగా.
మా అత్త, మా బావ ఆశల మీద నీళ్లు కుమ్మరిస్తూ, ‘నీళ్ళటాంకు దగ్గరనుంచి మెల్లగా అటు మండపం వీధి మిగిలిన వీధులు, ఇటు రాజారావు మేడ, అంబటి సత్రం, మూడులాంతర్లు ఆ తరవాత వీధులు సందులు అన్నీ దాటి మనవరకు చేరేసరికి, హోరుమని వచ్చేది నీళ్లు కాదు; గాలే. మనకు గాలే!’ అంది.
అయినా ఆరోజుల్లో, వీధి కొళాయి దగ్గర ప్రతిరోజు రామరావణ యుద్ధం జరిగేది. కొన్ని బిందెలు సొట్టలు పడేవి. సిగపట్లు, బూతులే. మేము వినోదం చూస్తుండేవాళ్ళం. ఇంట్లో మంచినీటి బావి ఉండేది కాబట్టి సరిపోయేది. అయినా త్రాగడానికి మాత్రం ఒక బిందెడు నీళ్లు కొళాయి దగ్గర పట్టుకునేవాళ్ళం. అదీ ఆ కొళాయి భాగోతం ముగిసాక ఎవరైనా కనికరిస్తే, మాకు దక్కేవి నీళ్ళు. లేకపోతే కన్నీళ్ళు!
మిగిలిన రోజువారి వాడకానికి కావలసిన నీళ్లన్నీ నూతిలోంచి తోడుకోవలసిందే. ఆ బాధ్యత పాపం మా బావ భగీరథానిదే.
తరవాత ఉద్యోగం, పెళ్లి; విశాఖపట్నంలో కాపురం. అక్కడే పుట్టింది జాహ్నవి. ద్వారకానగర్‌లో అద్దెకి ఉండేవాడు.
కొత్త ఇల్లని, ఇంట్లోనే నుయ్యి ఉందని, కొళాయి కూడా ఉందని తెగ సంబరపడిపోయాడు. ఎప్పటికీ కొళాయి రాకపోయేసరికి పక్కింటతన్ని అడిగాడు.
అతను ‘బుఱ్ఱ ఉందేమో చూడండి. ముందది తీసేయండి. అది ఉంటే వచ్చే బిందెడు నీళ్ళన్నా రావు.’ అన్నాడు.
మా బావ అయోమయంగా అటూయిటూ చూశాడు. ఆ తరవాత పక్కింటతను ఏ బుఱ్ఱ గురించి అలా అన్నాడో అర్థం చేసుకుని, చప్పున కొళాయి బుఱ్ఱ తీసేశాడు.
అయినా నీళ్ళు రాలా!
ఇక నూతి నీళ్ళే గతి! తీరా నోట్లో వేసుకుంటే ఉప్ప ముద్ద. స్నానం చేసేటప్పుడు సబ్బు విరిగిపోయేది. తలంతా, ఒళ్ళంతా బంకలా అయిపోయేది. స్నానం చెయ్యకుండా ఉంటేనే నయం, శుభ్రంగా హాయిగా ఉండేది.
ఒకరోజు ఆఫీసుకి వెళ్తున్నవాడు కాస్తా, ఆశీలమెట్ట దగ్గర కొళాయి వచ్చిందని తెలిసి, ఆపసోపాల మీద ఇంటికి తిరిగొచ్చాడు భగీరథం బావ. పరుగు పరుగున పెరట్లోకెళ్ళాడు. బావ వెనకే మా అక్క భాగ్యలక్ష్మీ పరుగెత్తింది.
బుఱ్ఱ లేదుగా, కొళాయి వైపు దీనంగా చూశారు. ఒక్క చుక్క నీళ్లు రాలా.
పక్క వాళ్ళ పెరట్లోంచి బిందెలో నీళ్లు పడుతున్న చప్పుడు సన్నగా వినిపించింది. మా అక్క ఒక్క అంగలో మందడిగోడకి చేరింది.
‘వదినగారూ మీకు నీళ్ళొస్తున్నాయా?’ అనడిగింది.
‘ఏదో నా తలకాయ్, భాగ్యం! సన్నగా వస్తున్నాయి. ఎంతసేపొస్తాయో. ఎప్పుడు కట్టేస్తాడో ఎప్పటికి బిందె నిండుతుందో తెలీదు!’ అని నూతిలోంచి, ఐ మీన్ అలాటి పాతాళంలోవున్న గోతిలోంచి వినిపించింది పక్కింటావిడ గొంతు.
ఆ తరవాత భోగట్టా చేస్తే అసలు కిటుకు తెలిసింది. ఆ వీధే కాదు, ఆవూరిలో కొత్తగా కట్టుకున్న అన్నిళ్ళల్లోనూ ఇదే ప్రోబ్లంట.
రోడ్డుకి ఎత్తుగా ఇల్లు ఉండాలని ఎత్తు ఎత్తుగా పునాదులు ఆపైన ఇళ్ళు కట్టేసుకున్నారుట. చివరకి కొళాయి కనెక్షన్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చేసరికి, ఇంగ్లీషు జెడ్ ఆకారంలో కొళాయి గొట్టాలు రోడ్డుకి మీటరున్నర రెండు మీటర్ల ఎత్తులో తప్ప దిగువకి ఇంట్లోకి వచ్చేవి కావు. ఇక నీళ్ళేంటి వస్తాయి! అదీ సంగతి!
అది తెలుసుకున్న తెలివైన వాళ్ళు ఇలా పెరట్లో నూతుల్లాటి గోతులు తవ్వుకుని అక్కడకి వీధిలోంచి ఒక సరళరేఖలో కొళాయి గొట్టాలు వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారన్నమాట.
అలా మా బావ కూడా తెలివి తెచ్చుకుని అఫీషియల్‌గా ఫిర్యాదు చెయ్యవలసిన వాళ్లకి ఫిర్యాదు చేసి, అనఫీషియల్‌గా ఎవరెవరి కాళ్లు పట్టుకోవాలో పట్టుకుని, చేతులు తడపాలో తడిపి, నీళ్ళతో కాదు సుమా, గొట్టాలు తిన్నగా చేయించుకుని గోతులో పడ్డాడు.
అక్కడితో ఊపిరి పీల్చుకున్నాననుకున్నాడు.
ఆ తరవాత తెలిసింది; కొళాయి ఎప్పుడొస్తుందో జ్యోతిష్కులు కూడా చెప్పలేరుట. నిర్దిష్టమైన టైమంటూ లేదుట. అలా అర్ధరాత్రివేళ మా భగీరథుడు అరడజను మెట్లు దిగి గోతిలో బుఱ్ఱలేని కొళాయికెదురుగా కూర్చునేవాడు. అక్కడే కునికిపాట్లు పడుతూ ఎన్ని సార్లో తల గోడకి తగిలి బొప్పి కట్టించుకున్నాడు. ఒకసారి నీళ్లు పైకి తెస్తూ మెట్ల మీద కాలు జారిపడ్డాడు. ముణుకులు చెక్కుకున్నాయి. ముక్కు విరిగింది. బిందె సొట్టపడింది. చాలా బాధపడ్డాడు – నీళ్లన్నీ నేల పాలయ్యాయని.
కొన్నాళ్ళకి హైదరాబాద్ చేరాడు. అక్కడితో తన నీళ్ళ కటకట తప్పిందనుకున్నాడు.
అక్కడ ఒక నిర్దిష్టమైన వేళకి నల్లా వచ్చేది. అమ్మయ్య అనుకున్నాడు. తనుంటున్న ఇంటివరకు నీళ్ళొచ్చేవి కావు! లోతుల్లోకెళ్ళి పరిశోధిస్తే తెలిసింది. ఆ టైముకి అందరూ దొంగతనంగా మోటార్లు పెట్టి కొళాయిగొట్టాల్లోంచి ఎక్కువ నీళ్లు లాగేస్తున్నారని. దాంతో ఫోర్స్ తగ్గిపోయి వీళ్ళింటివరకు రావట్లేదని.
మావాళ్ళు, ‘మనం కూడా ఒక టుల్లూ పంప్ కొందాం.’ అన్నారు భగీరథంతో.
మనం అలాంటి పనికిమాలిన పనులు చెయ్యకూడదు. ఠాఠ్ ఠూఠ్ వద్దన్నాడు.
కొన్నాళ్ళకి నేనక్కడకి వెళ్ళినప్పుడు మా బావతో దెబ్బలాడి, అతను వారించినా వినకుండా, నేనే మోటారు కొని బలవంతంగా కొళాయి లైనుకి ఫిక్స్ చేయించాను. ఇక పంపు నీళ్ళు, పంప్ చేసేయడమే ఆలస్యం!
అప్పటికే వాటర్ సప్లయి డిపార్టుమెంటుకీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకీ మధ్య రహస్యంగా ఏవో మంతనాలు సాగుతున్నాయట. అవి ఆరోజుకి ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా ఆ రోజునుండే ఆ రెండు విభాగాల వాళ్లు కుమ్మక్కయి, నల్లా వచ్చే టైముకి కరెంటు సప్లయి కట్ చేసేసేవాళ్లు. అదీ తడవలు తడవలుగా ఒక ఏరియా తరవాత మరో ఏరియా. దాంతో టుల్లూ లేదు తుళ్ళూ లేదు; పంపు లేదు సంపు లేదు. అందరికీ సరిసమానంగా చారెడు చారెడు నీళ్ళొచ్చేవి.
ఆ తరవాత ఇక్కడ చెన్నైలో మా జాహ్నవికి ఉద్యోగం దొరికింది. ఆమె ఇక్కడికొచ్చిన కొద్దిరోజులకే వరదలు వచ్చాయి. అప్పుడు జాహ్నవి గురించి మా బావ ఎంత కంగారుపడ్డాడో చెప్పలేను.
అలాటి వరదలొచ్చిన చెన్నైలోనే ఇప్పుడు నీటి ఎద్దడి అంటే నమ్మలేకపోతున్నాను! మీ స్వంత బిల్డింగులోనే మీరు టైము చూసుకుని నీళ్ళ వాల్వ్ కట్టేయడం, పొదుపుగా వాడుకోవడం చూస్తుంటే భయమేస్తోంది! ఇదంతా మా బావక్కాని తెలిసిందంటే, మళ్ళీ ఏం పేచీ పెడతాడోనని నాకు కాళ్ళూచేతులు ఆడటంలేదు. అలాగని, మీ సంబంధం వదులుకోవడం నాకిష్టం లేదు.
మీరే ఏదైనా ఉపాయం చేసి మా బావ వచ్చినపుడు మాత్రం – ‘ఎప్పుడు ఎడ తెగక నీరు పారున్’ లా ఉండేలా, చేస్తే చాలు! గండం గట్టెక్కినట్టే. ఈ ఒక్క సాయం చేసిపెట్టండి.” అని ముగించాడు.
చక్రి కజిన్, ‘దానికేముంది చక్రీ, ఫరవాలేదు! ప్రస్తుతం ప్రయివేట్ టాంకర్ లారీ లోడ్ మామూలు ధరకంటే పదిరెట్లు పలుకుతోంది. అంతేగాని, నీళ్ళు దొరక్కపోవడం అంటూ లేదు. కాకపోతే సప్లయి అవడానికి వారం-పదిరోజులు పడుతుంది. అందుకని మీ బావ ఎప్పుడు వచ్చేదీ కొంచెం ముందుగా చెప్పు. చాలు! ఆ రెండు రోజులు మాయింట్లో నీరు ఏరయి పారున్ అని ఋజువు చేసి మీ బావని మభ్యపెడదాం. సరేనా!’ అని చక్రికి హామీ ఇచ్చాడు.
ఆనందంతో చక్రి భగీరథానికి ఫోన్ చేశాడు.
--:oo(O)oo:--

