జమ్మలమడుగు ప్రొద్దుటూరు మధ్యలో పెన్నా నది తీరాన దేవగుడి అనే ఊరులో, కోట లాంటి ఆ మేడలో దీపం నిశ్చలంగా వెలుగుతోంది. శ్రీమంతురాలు రాజేశ్వరి దేవి కిటికీలోంచి పెన్నా నది వంక చూస్తోంది. ఆ ఇంటి యజమానురాలు, అపారమైన ఆస్తికి వారసురాలు అయిన ఆ వృద్ధురాలు దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె చుట్టూ ఉన్న బంధువులు ఆస్తి కోసం రాబందుల్లా ఎదురుచూస్తున్నారు. ఆమె భర్త ఉన్నంత కాలం అతని రక్షణ లో సురక్షితంగా ఉన్న ఆస్తి, ఆమె వైదవ్యం పొందిన వెంటనే, తన చుట్టూ ఉన్న బంధువుల కళ్ళలో ఆస్తిపై ఉన్న కాంక్ష ఆమెకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకు సంతానం లేదు, కానీ తన తండ్రి నుంచి వచ్చిన ఈ వెయ్యి ఎకరాల భూమిని, ధనాన్ని దురాశాపరుల పాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఒకరోజు ఆమె తన నమ్మకస్తుడైన వకీలు రామశాస్త్రిని పిలిపించి.... "శాస్త్రి గారు, ఈ ఆస్తి నా తండ్రి కష్టం. ఇది రక్తం పంచుకు పుట్టిన మా దాయాదులకు చెందడం ముఖ్యం కాదు, సంస్కారం పంచుకున్న వారికే చెందాలి. దురాశాపరుల చేతిలో పడితే ఈ భూమి కన్నీరు పెడుతుంది. అందుకే నాకు ఒక నిజాయితీ గల వారసుడు కావాలి" అని చెప్పింది. వకీలు కొంతమంది పండితులను, గురువులను నియమించి... " ప్రతి ఊరులోనూ తెలివైన పేదరికం ఉన్న పిల్లలను వెతకండి. వారికి పద్యాలు, శతకాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఎంతవరకు తెలుసో పరిశీలించండి. చురుకైన తెలివైన పిల్లలను పది ఏండ్లు నిండని వారిని గుర్తించి తీసుకురండి " అని చెప్పాడు. పండితులు సమీపంలోని ప్రాంతాలు, దూరప్రాంతాలు అన్నీ తిరిగి కొంతమంది పిల్లలను ఎంపిక చేశారు. గురువులు పిల్లలను తీసుకుని వస్తున్నారని ఆమెకు వర్తమానం అందిన మీదట, ఆమె ఆ పిల్లలందరిని తన ఇంటికి పిలిపించిన తరువాత, దాయాదులతో...."నాకు పిల్లలు లేరు కదా! ఈ పిల్లలందరికీ, వీరిని నా దగ్గరే ఉంచుకుని ఏడాది పాటు విద్యబుద్దులు నేర్పించి, భోజనం పెడతాను " అని చెప్పింది. బంధువులు ఆమె మాటలు నమ్మి " ఏదో పుణ్యం చేసుకుంటుందిలే " అని ఊరుకున్నారు. పిల్లల తల్లితండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సంతోషంగా ఒప్పుకున్నారు. ఎంపిక చేయబడిన ఆ పది మంది పేద బాలురకు ఏడాది పాటు ఆమె ఆశ్రయం ఇచ్చింది. వారిని తన ఇంట్లోనే ఉంచుకుని, వారికి చదువుతో పాటు క్రమశిక్షణ, నిజాయితీ నేర్పించింది. వారిలో శివ అనే బాలుడు వస్తువుల మీద కంటే, ఆమె చెప్పే నీతి కథల మీద ఎక్కువ శ్రద్ధ చూపేవాడు.పిల్లలందరూ చదువులో గొప్పగా రాణిస్తున్నారు. అయితే పిల్లలకు కేవలం తెలివి ఉంటే సరిపోదు, నిజాయితీ కూడా ఉండాలి అని ఆమెకు అనిపించింది. ఒకసారి ఆమె కావాలనే తన బంగారు గొలుసును ఇంటిలో నేలమీద వదిలేసింది. మిగిలిన పిల్లలు అది చూసి దాచేయాలని చూస్తే, శివ మాత్రం దాన్ని తెచ్చి ఆమె చేతికిస్తూ... "అమ్మా, ఇది మీది....పోయిందని మీరు బాధపడతారని భయమేసింది" అన్నాడు. ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది....వారసుడు దొరికాడని! ఆ ఏడాది కాలంలో శివ ఆమె మనసు గెలుచుకున్నాడు. ఇంటిలో ఒకచోట ధనాన్ని ఉంచి " మీకు అవసరం అయినప్పుడు చిరుతిండి కోసం కొంచం తీసుకోండి " అని చెప్పింది. మిగిలిన పిల్లలు అపుడప్పుడు ధనం తీసుకునేవారు. కానీ శివ మాత్రం నేర్చుకోవడం మీద ద్రుష్టి పెట్టాడు. ఆమె పెట్టిన ఆహారం తిని క్రమశిక్షణ తో ఉండేవాడు. ధనంపై ఆశ లేని, చదువుపై శ్రద్ధ ఉన్న శివను ఆమె తన రహస్య వారసుడిగా ఎంచుకుంది. ఏడాది గడిచింది. ఏడాది తర్వాత పిల్లలందరినీ ఇళ్లకు పంపే సమయం వచ్చింది. ఆమె శివను పిలిచి రహస్యంగా ఇలా చెప్పింది... "నాయనా శివా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లడం లేదు.. నీ గమ్యం మారుతోంది. నీ తెలివికి, నిజాయితీకి నేను ఇచ్చే బహుమతి ఈ చదువు. వకీలు గారు నిన్ను కాపాడతారు" అని చెప్పింది. ఆమె బంధువులకు మాత్రం, "పిల్లలకు చదువు అయిపోయింది, పంపేస్తున్నాను" అని నమ్మబలికింది. కానీ లోలోపల ఒక బలమైన విత్తనం నాటింది. తన ఆస్తిలో కొంత భాగాన్ని ఆ పిల్లలందరి కోసం ఆ ఊరిలోనే ఒక స్కూలు కట్టడానికి కేటాయించి, మిగిలిన వెయ్యి ఎకరాల భూమిని శివ పేరున రాస్తూ అతనికి పద్దెనిమిది వయస్సు వచ్చేవరకు వకీలును ట్రస్టీ గా నియమించి వీలునామా సిద్ధం చేసింది. రెండేళ్ల తర్వాత రాజేశ్వరి దేవి కన్నుమూసింది. ఆమె మరణవార్త వినగానే దాయాదులంతా మేడ మీద పడ్డారు. "ఇక ఈ సామ్రాజ్యం మనదే!" అని ఒక బంధువు అరుస్తుంటే, మరొకడు, "ఈ భూములన్నీ పంచుకుందాం రండి" అని కత్తులు నూరుతున్నారు. కానీ వారందరిలో ఎదో అనుమానం. ఆమె ప్రశాంతంగా ఈ ఆస్తి వదిలి పోదు, ఏదో చేసింది అని అనుమానం. వారు తమలో తాము కలహించుకుంటూ, ఆస్తి కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పుడు వకీలు కోర్ట్ సమక్షంలో వీలునామా బయట పెట్టాడు. దాయాదులు హతహాసులై, పిల్ల వాడైన శివ మీద పగబట్టారు అదే సమయంలో, దూరంగా ఉన్న శివ గ్రామానికి వకీలు పంపిన మనిషి చేరుకున్నాడు. శివ తండ్రి రామయ్యకు విషయం అర్థమైంది. "రామయ్యా! రాజేశ్వరి దేవి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దాయాదులు శివను వెతుక్కుంటూ వస్తారు. మీరు వెంటనే బయలుదేరాలి. ఆస్తి కోసం కాదు, ఆ తల్లి నమ్మకాన్ని కాపాడటం కోసం!" అని హెచ్చరించాడు వకీలు పంపిన దూత. అది అమావాస్య రాత్రి. రామయ్య తన భార్యను, శివను, అతని ఇద్దరు తమ్ముళ్లను, చిన్న చెల్లిని నిద్రలేపాడు. "ఎవరూ శబ్దం చేయకండి. మన చేతిలో దీపం కూడా ఉండకూడదు. ఆ చీకటే మనకు రక్షణ," అని రామయ్య గంభీరంగా చెప్పాడు. వారు తమకున్న కొద్దిపాటి బట్టలను మూటగట్టుకుని వెనక దారి గుండా బయలుదేరారు. ప్రధాన రహదారి మీద దాయాదుల మనుషులు కాపలా ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు అటవీ మార్గాన్ని ఎంచుకున్నారు. వానాకాలం కావడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామయ్య శివను, చిన్నపిల్లలను భుజాల మీద వేసుకుని మోకాళ్ల లోతు నీళ్లలో నడిచాడు. పొదల్లో పాముల బుసలు, దూరంగా తోడేళ్ల అరుపులు వినపడుతున్నాయి. చిన్న చెల్లి భయంతో ఏడుస్తుంటే, శివ ఆమె నోరు మూసి, "చెల్లీ, భయపడకు.. మనల్ని ఆ రాజేశ్వరి అమ్మ దీవెనలు కాపాడుతున్నాయి" అని ధైర్యం చెప్పాడు. ఆ రాత్రంతా వారు ముళ్ల పొదల్లో, కొండ కోనల్లో నడుస్తూనే ఉన్నారు. వారి కాళ్లు రక్తమోడుతున్నాయి, కానీ మనసులో మాత్రం "మంచితనం ఓడిపోకూడదు"అనే గట్టితనం ఉంది. తెల్లవారేసరికి ఎవరికీ చిక్కకుండా, వకీలు చెప్పినట్లు సురక్షితమైన ఆ మేడకు చేరుకున్నారు. మర్నాడు ఉదయం ఊరి జనం ముందు, బంధువులందరి సమక్షంలో వకీలు వీలునామా చదివాడు. కోర్ట్ ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా చదివి వినిపించాడు. "ఈ వెయ్యి ఎకరాల భూమి, నగదు అంతా శివ అనే బాలుడికి చెందుతాయి. అతనికి పద్దెనిమిది ఏళ్లు వచ్చే వరకు ఈ ఆస్తి ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంటుంది" అని ప్రకటించాడు. దాయాదులు షాక్ తిన్నారు. వారు ఆ బాలుడిని అడ్డుకోవాలని చూసినా, అప్పటికే శివ మరియు అతని కుటుంబం చట్టబద్ధమైన రక్షణలో ఉన్నారు. అంతేకాదు, ఆ వివేకవంతురాలు మరో గొప్ప పని చేసింది. శివతో పాటు చదువుకున్న మిగిలిన పిల్లలందరి కోసం ఆ ఊరిలో ఒక పెద్ద పాఠశాలను నెలకొల్పేలా ఆస్తిలో కొంత భాగాన్ని దానం చేసింది. ఆ పిల్లలందరికీ ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఏర్పాటు చేసింది. కాలం వేగంగా కదిలింది. శివ సకల విద్యలు నేర్చుకున్నాడు. పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత, శివ ఒక ధీశాలిగా మేడలోకి అడుగుపెట్టాడు. బలవంతంగా ఆస్తిని లాక్కోవాలని చూస్తున్న బంధువులను శివ పిలిపించి తన గంభీరమైన కంఠంతో... "బాబాయ్! పెదనాన్న! మావయ్యలు!ఈ ఆస్తి రాజేశ్వరి అమ్మ నాకు ఇచ్చింది నా స్వార్థం కోసం కాదు, ఈ ప్రాంతం బాగుపడటం కోసం. ఇందులో మీ వాటా ప్రేమతో అడిగితే ఇస్తాను, కానీ పన్నాగంతో లాక్కోవాలని చూస్తే చట్టం ఊరుకోదు" అని వార్నింగ్ ఇచ్చాడు. తనను పెంచిన తల్లి ఆశయాలను గుర్తుంచుకుని, ఆ వెయ్యి ఎకరాల భూమిని ఆధునిక పద్ధతుల్లో సాగు చేయించాడు. పెన్నా నది తీరంలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో శివ పేరు మారుమోగిపోయింది. శివ తన గట్టితనంతో దాయాదులను అదుపు చేశాడు, తన మంచితనంతో మిగిలిన పేద పిల్లల చదువు బాధ్యత తీసుకున్నాడు. రాజేశ్వరి దేవి కోరుకున్నట్లుగానే, ఆ వెయ్యి ఎకరాల భూమి ఒక నందనవనంగా మారింది. పెన్నా నది సాక్షిగా ఒక పేద బాలుడు, ఒక గొప్ప వివేకవంతురాలి వారసత్వాన్ని సగర్వంగా నిలబెట్టాడు. రాజేశ్వరి దేవి పటం ముందు నిలబడి శివ అన్నాడు...."అమ్మా, ఆస్తి అంటే భూమి కాదు.. మీరు నాకు ఇచ్చిన వివేచన" అని అన్నాడు. అతని ఏడు తరాలు ఆ భూమి మీద గొప్ప కుటుంబంగా వెలుగొందాయి. అతను తన దాయాదులను తరిమికొట్టలేదు. "ద్వేషం కంటే ప్రేమ గొప్పది" అని నమ్మి, తనను చంపాలనుకున్న బంధువులకు కూడా అవసరమైనప్పుడు సాయం చేస్తూ, ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ ఆపద్బాంధవుడు అయ్యాడు. ఒక సాధారణ పేద బాలుడు, ఒక వివేకవంతురాలి చలవ వల్ల ఆ ప్రాంతానికే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు.

