ఉపదేశం - మద్దూరి నరసింహమూర్తి

Vupadesam

రఘురామ్. ఈ పేరు ఇద్దరు వ్యక్తుల -- కాదు కాదు -- ఇద్దరు మిత్రుల పేర్ల కలయిక. రఘు మరియు రామ్ ఇద్దరూ ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు. వారు పరిచయమైనదే పనిచేసే కార్యాలయంలో. ఇద్దరి అభిరుచులు ఆలోచనలు కలియడంతో పరిచయమైన మూడు నెలలకే ఘనిష్ఠ మిత్రులై, మరో నెలకి ‘ఏరా అంటే ఏరా’ అనుకునేటంతగా దగ్గరయేరు. రామ్ కంటే రఘు ఏడాది పెద్ద. రామ్ సరదాగా రఘుని గురూ అని పిలుస్తుంటాడు. రఘు కూడా రామ్ ని శిష్యా అని అభిమానంగా పిలుస్తుంటాడు. ఇద్దరూ వారి వారి భార్యలతో స్వంత ఊళ్ళకి స్వంత కుటుంబాలకి దూరంగా ఉంటున్నారు.

రఘుకి సుమతో పెళ్ళై ఏడాది దాటింది. రామ్ కి లతతో పెళ్ళై ఆరు నెలలైంది. రెండు కుటుంబాలు ఒక రెండేళ్ల పాటు పిల్లలొద్దు అనుకున్నవారే. సుమ, లత ఇద్దరూ చదువుకున్నవారైనా ఉద్యోగస్తులు మాత్రం కారు. రోగి కోరుకున్నదే వైద్యుడు చెప్పేడన్న సామెత ప్రకారం - వారికి బయట తిరిగి ఉద్యోగం చేయాలన్న కోరిక లేదు, మగవారిద్దరికీ కూడా వారి భార్యలు అలా ఉద్యోగం చేయాలన్న కోరిక లేదు. పిల్లా పీచు లేని సంసారాలు కాబట్టి సుమ, లత ఇద్దరూ ఇంటినుంచి లాప్టాప్ తో చేయగలిగే పనులు చేయగలిగినంత చేస్తూ, తీరిక సమయాన్ని చక్కగా వినియోగించుకోవడమే కాకుండా, కాసింత ఆర్ధిక స్వతంత్రం కూడా అనుభవిస్తున్నారు. వారు చేసే ఆ పనులతో వారి వారి భర్తల మెప్పు కూడా పొందుతున్నారు. అంతేకాకుండా, ఇల్లు నడపవలసిన బాధ్యత భర్తదే కనుక, ఆ ఆర్జన మీ స్వంతం అని వారి వారి భర్తలు వారికి చెప్పి సంసారాలు అన్యోన్యంగా ఆనందంగా నడిచేటట్టుగా చేసుకున్నారు. వారాంతాలలో ఒకరి ఇంటికి ఒకరు వస్తూ పోతూ ఉండడంతో సుమ, లత కూడా బాగానే దగ్గరయేరు. అలా ఎవరు ఎవరింటికి వెళ్లినా ఆ రోజు భోజనం నలుగురూ కలిసే చేస్తారు.

అలాంటి ఒక సాయంత్రం రఘు శ్రీమతితో కలిసి రామ్ ఇంటికి వచ్చేడు. సుమ, లత ఇద్దరూ కలిసి కబుర్లాడుకుంటూ వంట గదిలో ఉన్నారు.

"ఏంటి గురూ, నువ్వు వేసుకున్న బట్టలు కొత్తవి అనుకుంటాను"

"అవును శిష్యా. కిందటి నెల అత్తవారింటికి వెళ్ళినప్పుడు మా అత్తవారు పెట్టేరు."

"అత్తగారు పెట్టారా - మామగారా"

"అదంతే, చచ్చి చెడి డబ్బులు సమకూర్చుకొని మామగారు అల్లుడికి బట్టలు కొని తెస్తే, అత్తవారు ఇచ్చేరంటారు కానీ, ఎవరూ మామవారిచ్చేరనరు" అని నవ్వేడు రఘు.

"అసలే అన్ని ఖర్చులూ పెరిగిన ఈ రోజుల్లో, కొద్ది రోజులకోసమైనా అత్తవారింటికి వెళ్లి వారికి భారంగా ఉండడం, వారు పెట్టే బట్టలు దండుకోవడం అవసరమా గురూ. నీకు ఏం తక్కువని."

"అలా ఆలోచిస్తున్న నీకు, ఈ విషయంలో కాస్త ఉపదేశం చెయ్యాలి శిష్యా. అయితే, ఇక్కడ కాదు. మీ అపార్ట్మెంట్ కాంపౌండ్ లో నడుస్తూ మాట్లాడుకుందాం, పద."

-2-

రామ్ లోపలికి వెళ్లి లతతో "మేమిద్దరం బయటకి వెళ్లి వస్తున్నాం" అని చెప్పి వచ్చేడు.

రఘు, రామ్ నడుస్తూ మాట్లాడుకుంటున్నారు అనేకంటే, గురువుగా రఘు బోధ చేస్తున్నాడు - శిష్యుడిగా రామ్ వింటున్నాడు, అని చెప్పుకోవాలి. రఘు చెప్పే ఉపదేశం ఆరంభమైంది.

“పెళ్ళైన తరువాత, పిల్లలు పుట్టేలోపల, అప్పుడప్పుడు అత్తవారింటికి వెళ్లి వస్తే, ఆ అనుభవం మాటల్లో చెప్పడం కష్టం. ఎవరికీ వారికే అది అనుభవైకవేద్యం. ఆ అనుభవం సంతోషం భార్యకో భర్తకో ఏ ఒక్కరికో కాదు, ఇద్దరూ అనుభవిస్తారు. వారికంటే, భార్య పుట్టింటి కుటుంబ సభ్యుల సంతోషం వారి వదనాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, ‘పిల్లని ఎవరో తెలియని వాడి చేతిలో పెట్టేం, ఆ పిల్ల ఎలా ఉందో’ అన్న బెంగ ఉంటుంది కదా వారికి. వారి కళ్ళ ఎదుట కూతురు అల్లుడు అన్యోన్యంగా తిరుగాడుతూంటే, ఆ బెంగ పోయి వారి మనసులు హాయిగా కుదురు పడతాయి.

అయితే, ఈ ప్రయాణాలు చేసే విధానాలు కూడా వేరే ఉన్నాయి.

తొలిసారి, ఇద్దరూ కలిసి వెళ్ళాలి కలిసి వచ్చేయాలి.

మలిసారి, ఇద్దరూ కలిసి వెళ్లి ఒకరోజు లేదా రెండు రోజులుండి, భార్యని పుట్టింటిలో వదిలి భర్త వెనక్కి వచ్చేసి, కొద్ది రోజుల తరువాత వెళ్లి తీసుకొని రావాలి.

మరొకసారి, భార్యని ఒక్కర్తినీ పంపించి, నాలుగు లేక వారం రోజుల తరువాత భర్త వెళ్లి భార్యని తీసుకొని రావాలి. అలా వెళ్ళినప్పుడు భర్త ఒక రోజు లేదా రెండు రోజులు ఉండడానికి తయారుగా వెళ్ళాలి.

ఇంకొకసారి, భార్యని ఒక్కర్తినీ పంపించి, తన రాకకోసం ఎదురు చూడాలి.

ఇలా చేస్తే, దంపతుల మధ్య విరహం పెరిగి, మానసికంగా మరింత దగ్గరై, ఆకర్షణ జోడై, మధురమైన ప్రేమైక జీవనం గడుపుతారనడానికి ఉదాహరణ సుమ, నేనే.

కాబట్టి నువ్వు, లత కూడా నేను చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేసి చూడండి. ఆ తరువాత - 'గురూ, నువ్వు చెప్పింది అక్షరసత్యం' అని నువ్వే చెప్తావు."

"నువ్వు చెప్పినది వినడానికైతే బాగుంది. అనుభవంలోకి తేవడానికి లతతో మాట్లాడి ప్రయత్నం చేస్తాను."

"అక్కడే ఉంది అసలు సంగతి. భార్య 'ఏమండీ మా పుట్టింటికి వెళదామా' అనో లేక 'ఏమండీ మా పుట్టింటికి నేను వెళ్లీదా' అని అడిగితే కాదనకూడదు. అంతేకానీ, మగవాడు భార్యతో తనంతట తానుగా 'పుట్టింటికి వెళ్తావా' అని అడగకూడదు, 'పుట్టింటికి వెళ్ళు' అని చెప్పకూడదు. ఎందుకంటే, ఉత్తి పుణ్యానికి తనను 'పుట్టింటికి వెళ్ళు' అని ఎందుకు అంటున్నాడని భార్యకి అనుమానం రావొచ్చు. అది మరీ ప్రమాదం - పుణ్యానికి పొతే పాపం ఎదురైనట్టవుతుంది."

"నయం ఈ సంగతి తెలియకపోతే, లతతో గొడవ వచ్చేదన్నమాట. ఇక ఇంటికి వెళదామా"

-3-

"నీకొచ్చిన మరో సందేహం - అత్తవారు పెట్టే బట్టలు.

అలా అల్లుడికి బట్టలు పెట్టడం అనాదిగా వచ్చే సాంప్రదాయం. అత్తవారు అది ఆనందంగా భరిస్తారు. పెట్టిన వాటిని అల్లుడు కాదంటే, ఆ పెట్టినవి ‘అల్లుడికి నచ్చలేదేమో, ఇంకొంచెం ఖరీదైనవి కొనవలసింది కాబోలు’ అని అపోహ పడతారు. ఇంకా కొంతమందైతే, 'బట్టలు బదులుగా ఏదేనా ఖరీదైన వస్తువు ఇవ్వవలసినదేమో' అని బాధపడతారు. నువ్వు ఆ బట్టలు వద్దంటే, ముందుగా బాధపడేది నీ భార్యే, గుర్తుంచుకో. అత్తవారు, వారి అమ్మాయి చేతే అడిగిస్తారు 'అల్లుడికి ఇంకేమేనా కావాలో కనుక్కో అమ్మా' అని. అందుకే, నిశ్శబ్దంగా వారిచ్చినది పుచ్చుకొని - అత్తమామల పాదాలకి నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకో. నువ్వు హాయి. వారు హాయి."

"నువ్వు చెప్పినది బాగానే ఉంది. కానీ వారికి అనవసరం ఖర్చు కదా, మనమేమేనా కావాలని అడిగేమా"

"ఏ అల్లుడూ అలా అడగడు. అలా అడిగేడంటే వాడసలు మనిషే కాడు. మనం కొన్ని సాంప్రదాయాలని గౌరవించాలి, తప్పదు. అయితే, నువ్వు ఒక పని చేయొచ్చు."

"ఏమిటది"

“నీ భార్యని ఒక్కర్తినీ ఆమె పుట్టింటికి పంపినప్పుడు, అక్కడున్నవారందరికి పెద్దదో చిన్నదో ఏదో గిఫ్ట్ పంపించు. అలాగే ఆమెతో నువ్వు వెళ్ళినప్పుడు కూడా పట్టుకొని వెళ్ళాలి. నువ్వు ఆమెతో కూడా వెళ్లినా, ఆ గిఫ్ట్ లు నీ భార్యనే ఇమ్మని చెప్పు. అలా గిఫ్ట్ లు ఇస్తే, నువ్వు వాళ్ళ మనసులకెంత దగ్గరవుతావో నీకే తెలుస్తుంది. అంతేకాక, నీ భార్య నిన్నెంతో అధికంగా ప్రేమిస్తూ, తన వారి దగ్గర నీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంది.”

"ఇంకొక నియమం జాగ్రత్తగా విను. నువ్వు అత్తవారింటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు 'మీ అమ్మాయి సంసారం చూద్దురుగాని, మా ఇంటికి రండి' అని మీ అత్తమామలకు నీ ఇంటికి రమ్మని ఆవ్హానించడం మరచిపోకు. అంతేకాదు, నీ భార్యని పుట్టింటికి ఒక్కర్తినీ పంపించినప్పుడు, ఆమె తిరిగి రావడానికి నువ్వు వెళ్లలేనప్పుడు, వారే ఎవరో తోడొచ్చి దిగబెడతారు కదా. అలా వచ్చినవాళ్లు వెళ్ళేటప్పుడు, మంచి బట్టలు పెట్టు వాళ్లకి. అత్తవారి ఊరికి విమానాశ్రయం ఉంటే, వారిని విమానంలో నీ ఖర్చుతో పంపించు. లేకపోతే, రైల్ లో AC సెకండ్ క్లాస్ టికెట్ నీ డబ్బుతో తీసి పంపించు. ఇంకా అవసరమైతే, వారిని ప్రత్యేకంగా ఒక టాక్సీలో నీ సొమ్ముతో పంపించు. ఒక్క సంగతి ఎప్పుడూ గుర్తుంచుకో – ‘ఆలి తరఫు వారు ఆత్మ బంధువులు.’ నీ భార్య పుట్టింటి వారిని నువ్వు అభిమానించు, నీ భార్య నిన్ను తన కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది. నీ మీద ఈగ కానీ దోమ కానీ వాలనివ్వదు. దాంతో నీకు కలరా, మలేరియా, డెంగు లాంటి జబ్బులు రానే రావు. బోధపడిందా."

-4-

"నువ్వు ఇంత విశదంగా వివరిస్తే, బోధపడకుండా ఎలా ఉంటుంది. వచ్చే నెల దసరాకి మా అత్తవారు పిలవక మానరు కదా. అప్పుడు, నువ్వు చెప్పేదంతా పాటిస్తాను.”

"ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి ఈ ఉపదేశం ముగిస్తాను."

"ఇంకా ఉపదేశం మిగిలిపోయిందా"

“అవును. ఇదే అతి ముఖ్యమైన ఉపదేశం. జాగ్రత్తగా విను. నీ భార్యని తెచ్చుకుందికి నువ్వు వెళ్లలేనప్పుడు ఆమె ఒక్కర్తే పుట్టింటినించి ఒంటరిగానో లేక ఆమె తరఫు వారెవరితోనో వస్తున్నప్పుడు, వారొచ్చేసరికి ఆ సమయం ప్రకారం టిఫినో భోజనమో నువ్వే చెయ్యి కాల్చుకొని, అదీ వేడి వేడిగా, సిద్ధం చేసి ఉంచు."

"నేను కోరి చెయ్యి కాల్చుకోవడం ఎందుకు, మళ్ళా దానికోసం డాక్టర్ దగ్గరకి పరిగెత్తడం ఎందుకు"

"చెయ్యి కాల్చుకోవడం అంటే - ఆ ‘కాల్చుకోవడం’ కాదు. నువ్వే వండు అని."

"ఇలా ఆర్డర్ ఇస్తే, అలా వచ్చిపడే సదుపాయాలు బోలెడు ఉంటే, నేనే వండడం ఎందుకు. ఏదేనా పొరపాటై చెయ్యి కాల్చుకోవడం ఎందుకు"

"నువ్వెక్కడ అలాటి వెధవ ఆలోచన చేస్తావో అనే ఈ విషయం మరి మరి చెప్తున్నాను. నువ్వు వండి పెట్టడంలోనే అసలు మజా అంతా ఉంది. నీ భార్య కోసం, అందునా తన వారి కోసం, అలా నువ్వు వండి ఉంచితే నీ మీద మీ అత్తవారికి అభిమానం ఎక్కువవుతుంది, నీ భార్యకి నీ మీద ప్రేమ రెట్టింపవుతుంది. ఇక మీ ఇద్దరికీ ప్రతీ రాత్రీ నిద్రలేమి రాత్రే.

నేను చెప్పినవన్నీ తు చ తప్పకుండా పాటించు. నీ వైవాహిక జీవితం పెద్దగా సుఖమయం చేసుకో.”

"నీ ఉపదేశానికి చాలా ధన్యవాదాలు, గురూ. పద భోజనం చేద్దాం, ఇప్పటికే చాలా ఆలస్యం అయినట్టుంది.”

**********

మరిన్ని కథలు

Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం