మాధవీయం... - hemavathi bobbu

Maadhaveeyam
జమీందారీ పోయింది!!!
తాతల రాశులు కరిగిపోయాయి!!!
కానీ మా మావయ్య కి తన పొగరు మాత్రం తగ్గలేదు.
మిగిలింది పెంకుల ఇల్లు ఒక్కటే.
ఉన్న ఒక్క కొడుకు అదే నా మొగుడు ఆయనకు వారసుడు ఆ పొగరులో.
ఇద్దరూ ఇద్దరే.
మీసాలు తిప్పుకుంటూ బ్రతకడానికి.
పెద్దిల్లు అని మా నాయన నన్ను ఆ ఇంటి కోడలు చేశారు.
ఇల్లేమో పెద్దదే. ఎకరా పైమాటే.
ఇల్లు ఊడ్చాలంటే నడుములు విరగాల్సిందే.
ఎక్కడ చూడు రాలే సున్నం, విరిగిన పెంకులకు అతుకులు మా జీవితాలకి లానే.
ఎలా బ్రతుకుతాను నేను అనుకున్నాడో ఏమో ఆ దేవుడు నాకు ఒక దారి చూపెట్టాడు.
చిన్నప్పటి నుండి అమ్మ చీరలు అంటే నాకెంతో ఇష్టం.
రంగు రంగుల చీరలు నన్ను ఆకర్షించేవి.
వాటిని అలా చుట్టుకొని ఇలా దోపుకొని పైన వేసుకుని నడుము క్రింద కుచ్చిళ్ళు తో భుజం పై పైట గా కప్పుకొని కొంగు ముడి వేసుకుని అనందించేదాన్ని...
అబ్బో ఎన్నో ఎన్నెన్నో కలలు ఆశలు ఆ చీరలు.
ఆ అందాల చీరల ఆశ నన్ను ఎంతో ఆకర్షించేది.
కాలంతో నేను ఎదగడం తో పాటు నా చీరల ఆకర్షణ కూడా ఎదిగింది.
ఏ చీర ఎలా కట్టుకోవాలి ఎన్ని రకాలు గా కట్టుకోవాలి అన్నది నాకు ఒక విద్యగా మారింది.
ఏ స్నేహితురాలి పెళ్లి చూపులు అయినా నేనే ముందుండాలి.
వారికి నేను చీరను అందంగా అలంకరించాలి.
నేను చీర వారికి చుడితే చాలు పెళ్ళి కుదిరిపోయేది....
నా చీరల ఎంపిక ఎంత బాగా ఉండేదంటే లావాటి వాళ్లను సన్నగా పొట్టి వాళ్ళను పొడుగుగా ఇట్టే మార్చేయగలను.
ఇక వారి పెళ్ళికి నన్ను చీరల ఎంపిక కోసం కంచికి ధర్మవరానికి వెంకటగిరి కి తిప్పేవారు.
ఆ అద్భుత మంత్ర దండం నా దగ్గర ఉండడంతో నేను బ్రతికి పోయాను.
పల్లెలో కాపురం నాకొద్దని పట్నం చేరిపోయాను.
గూడూరు కూడా వద్దని నెల్లూరు లో కాపురం పెట్టా
నా మొగుడిని వస్తే రా లేకపోతే పాయే అనుకొంటూ....
ఎక్కడికి పోతాడు ఎనకమ్మడి రాక....
ఊరి చివర ఇల్లు బాడుగకు తీసా....
నాలుగు అల్మరాలు కొన్నా....
చెన్నై పోయా... కంచికి వెళ్ళా....
వాయిదాలలో డబ్బు చెల్లించేలా చీరలు తెచ్చా.
నెలసరి వాయిదాలలో ఇమ్మని చీరలు ఆడాళ్లకి అమ్మాను.
గుట్టుగా కాపురం లాక్కోస్తూ గట్టిగా నిలబడి డబ్బు వసూలు చేశా.
నా విద్యని చూపి ఆదరంతో నేనున్నాను అంటూ నిలబడి ఎన్నో పెళ్ళిళ్ళు కుదిర్చా.
దేవి శారీస్... దేవి పెళ్ళి పందిరి...అమ్మ పేరు మీదుగా...షాప్ తెరిచా నెల్లూరు కూడలిలో...
మా ఆయన నన్ను దేవత లాగా కొలుస్తూ...మాధవి మాధవి అంటూ
మా మావయ్య నన్ను తమ కుల దైవం అని పొగడుతూ..
చాలు ఈ జీవితానికి అనుకొంటున్నంతలో...
చెల్లెమ్మా నువ్వు ఈసారి పోటీలో నిలబడాలి...అని ఎక్స్ ఎమ్మెల్యే అడిగినప్పుడు కాదనలేక...
రాజకీయాలు నాకేమి వచ్చు అన్నా అంటుంటే...
నీ మంచితనమే రాజకీయం అమ్మా....
నేను ముందుంటా నువ్వు నిలబడు అంటూ ప్రోత్సాహించి...
నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి...
మీ ఊరి ఆడబిడ్డ గా ఆదరించినందుకు నెల్లూరు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు...
నా సేవ ఎప్పుడు మీకేనని చెప్పడానికి ...
నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఏ సహాయానికైన అని చెప్పడానికి ఆనందిస్తున్నాను....

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు