దారి తప్పిన పడుచు - హేమావతి బొబ్బు

Daari tappina paduchu
మా మేనత్త జయమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం... బారెడు జడ...చారెడు కండ్లు...నవ్వుతుంటే పలువరుస నక్షత్రాలను తలపించేది.అందరూ అనేవాళ్ళు నీలమ్మ నీకు మీ మేనత్త పోలికలు వచ్చాయి అని. నాకు దగ్గర ఉండి స్నానం చేపించేది. తలకు నూనె బాగా పట్టించి జడలు వేసేది. నా చిన్నతనంలో అమ్మ దగ్గర కంటే అత్త దగ్గర ఎక్కువగా ఉండేదాన్ని. రాత్రిళ్ళు కథలు చెప్తూ నిద్రపుచ్చేది. నాకు పూల జడ వేసి మా యమ్మ నీలమ్మ...నీ అందం చందం ఎవ్వరికీ రాదే అంటూ మెటికలు విరుస్తూ దిష్టి తీసేది. చమ్మ చక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేసి రత్నాల చెమ్మ చెక్క రంగులేసి ....అంటూ ఆడుకునేదాన్ని నేను మా అత్తమ్మ ఇద్దరం. గోళీలాట, కబడ్డీ, క్రికెట్, కోకో, ఒకటేమిటి అన్ని ఆటలు ఆడేవాళ్ళము. మా అత్తమ్మ వీధిలో పిల్లలందరిని పోగేసేది ఆటలకు. అప్పటికి మా అమ్మ అరుస్తూ ఉండేది ఏంటే మీకు మగ పిల్లల ఆటలు. కొంచెం సద్దుగా ఉండండి అని. మేము వింటేనా... నవ్వుకుంటూ అలాగే అంటూ మా ఆటలు మావి. మా అమ్మ మాటలు ఆమెవి.
సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళము నేను మా అత్త పోటీ పడి. రంగుల ముగ్గులతో మా వీధి మొత్తం అలంకరించే వాళ్ళం. గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు అలంకరించే దాన్ని నేను. అత్తకు పెళ్ళి అన్నారు. " ఏమే నీల ఇక మీ అత్త నీకు కన్పించదే" అంటుంటే నాకు ఏడుపు వచ్చింది. అత్త నువ్వు ఇక నాకు కనిపించవా... "నీ మొగుడు ఇంటికి పోతావా"...అని దిగులుతో అడిగితే...నేను ఎక్కడికి పోతానే నిన్ను వదిలి పక్క వీధి లోకే కదా...ముందు నువ్వే నాకు అన్నీ...తరువాతే నా మొగుడు అని చక్కలిగిలి పెట్టి నవ్వింది. మా మేనత్త పెళ్లి అయ్యింది.అప్పటికి నాకు పదేళ్లు. నాకు మా అత్తకు ఎడం ఎనిమిదేళ్లు.
చాలా ఆడంబరంగా జరిగింది పెళ్లి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూల బంతులు ఆడేది ఇంకా నాకు..గుర్తు. పెళ్ళి రోజు జోరున వర్షం. పెళ్లికి వచ్చిన వారందరూ ఎలా ఇంటికి తిరిగి చేరేది ఈ వానలో... బండి కట్టేవాడు కూడా ఎవ్వరూ లేరు అని తిట్టుకుంటూ తడుచుకుంటూ వెళ్తుంటే చూసాను నేను. పెళ్లి అయిన నెల రోజులకు, ఇంట్లో ఒకటే ఏడుపులు. తాత కోపంగా చూస్తూ ఎక్కడైనా చావని..మీరు వెతకవద్దు....మీరు వెతికితే నేను చచ్చినట్లే అని ఉరుముతూ కోపంగా గొడ్ల చావిట్లోకి పోతా ఉంటే చూసాను నేను. అమ్మ ఏడుస్తూ ఉంది. చిన్నగా మాటల్లో నాకు అర్థమైంది...రాత్రి......మామ వచ్చి చెప్పాడట.... రాత్రి నుండి....తన భార్య అంటే మా మేనత్త కనిపించలేదు....అని అంతా వెతికారు....ఎక్కడా కనిపించలేదు అని నాన్న అమ్మతో చెప్తుంటే నేను విన్నాను. అత్తకు ఏమైందో అని నేను ఆ రోజంతా అన్నం తినకుండా ఏడుస్తూ ఉన్నాను. పక్కింటి సరోజ నా చెవిలో చిన్నగా అన్నది.. మెయ్... మీ అత్తని.. మీ మామ చంపేసి ఉంటాడు..ఎక్కడో చెరువు లోనో...బాయి లోనో పడేసి ఉంటాడు...అంటే అట్ట అనబాక...మా మామ మంచోడు అన్నాను నేను...అది కాదే...మా అమ్మ...మా నాయన మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అంతే...నాకేమీ తెలియదే అనింది.
ఎవరో చెప్పారు...రెండు రోజుల తర్వాత....కదిరి లో కనిపించింది అని....ఒకరు అన్నారు...తిరుపతి బస్ ఎక్కింది అని.... ఎక్కడకు పోయిందో తెలియక తాతయ్య తర్వాత చాలా దిగులు పడ్డాడు. నాన్న, బాబాయ్ తిరుపతి కి కూడా పోయి వచ్చారు. కనిపించలేదు....పరువు పోయింది....అని ఇంట్లో వాళ్ళు ఎవరి మొహం కూడా చూడలేక పోయారు. ఏడు నెలల తర్వాత ఒకరోజు నిండు చూలాలు గా గేట్ ముందు నిలబడింది...దిగులుగా మా అత్తమ్మ. తాతకు కోపం వచ్చినా నాన్న సర్ది చెప్పగా ఇంటి పక్కనే ఉన్న మిద్దె లో ఉండనిచ్చారు. అత్తమ్మ మొహంలో ఏ సంతోషం లేక నిస్సారంగా... ఏదో అమ్మ పెట్టింది అంత తినేది... నేల పైనే కొంగు పరుచుకుని పడుకుంటుంటే చూసాను నేను. గాలిలోకి చూస్తూ...తనలో తానే మాట్లాడుకుంటూ....ఏమి జరిగింది అన్నది నాన్నకు చెప్పినట్టు ఉంది...నాన్న కన్నీళ్లు పై పంచకు తుడుచుకుంటూ అత్త ఇంట్లో నుంచి వస్తూ ఉంటే నేను చూసా. అప్పుడు అమ్మ చెప్పింది నాతో.. అత్త చేసిన తప్పు ఇల్లు దాటి వెళ్ళడం. ఇంతకుముందు లా నాతో మాటలు లేవు. నన్ను చూసి దిగులుగా బాగా చదువుకో నీలమ్మ అని కళ్ళు దించుకునింది. అత్తకు ఏ శ్రీమంతం లేదు... అచ్చట ముచ్చట లేదు....అత్తకు నొప్పులు వస్తూ ఉంటే తాత మొహం తిప్పుకున్నాడు...కాన్పు జరిగిన తరువాత అమ్మ, పిన్ని తోడుగా ఉండి హాస్పిటల్ నుంచి అత్తని ఇంటికి తీసుకువచ్చారు.అత్తకు కొడుకు పుట్టాడు.....వానికి మునిశేఖర్ అని పేరు పెట్టింది. ఒక రోజు మామ వచ్చి తను ఇంకొక పెళ్లి చేసుకున్నట్లు తాతకి చెప్పాడు.మామకి ఆ భార్య ద్వారా తర్వాత ముగ్గురు కూతుర్లు పుట్టారు. మామ తర్వాత శేఖర్ తన కొడుకే అని ఒప్పుకున్నాడు.
తర్వాత కాస్త పెద్దయ్యాక బాబాయ్ చెప్పాడు...అత్త కాలేజీ లో చదివేటప్పుడు అక్కడ క్యాంటీన్ లో మేనేజర్ గా పనిచేసే గుణ అత్తకు పరిచయం. అతను చెప్పిన మాయ మాటలు అత్త నమ్మేసింది. దాని నే ప్రేమ అనుకునింది. వాడిని ప్రేమించానని ఇంట్లో చెప్తే ఒప్పుకోరేమోనని బయపడింది. అత్తకు పెళ్లి అయ్యాక కూడా అతను అత్తను కలిసినట్లు..నువ్వు లేకుండా నేను ఉండలేను... చచ్చిపోతాను...ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా అంటే...అతనితో కలిసి బెంగళూరు వెళ్ళింది. బెంగళూరులో ఇల్లు ఒకటి బాడుగకు తీసుకొని ఉన్నట్లు..... అక్కడికి వెళ్ళాక మూడు వారాలకు అతను తన దగ్గర ఉన్న డబ్బు అయిపోయాక....అత్త నగలు కూడా తాకట్టు పెట్టి ఖర్చులకి వాడుకున్నారు. ఇక ఖర్చు పెట్టడానికి ఏమి లేనప్పుడు...మనం మైసూర్ పోదాం... అక్కడ ఒక స్నేహితుడు మనల్ని ఆదరిస్తాడు అని చెప్పి... అతను అత్తతో...బెంగళూరు బస్ స్టాండ్ లో...ఇక్కడే ఉండు...ఇప్పుడే తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అని చెప్పి.... ఎంతకు రాలేదు అతను. ఇక ఏమి చేయాలో తెలియక అత్త తిరిగి ఆ బాడుగ ఇంటికి వెళితే, ఆ ఇంటి ఓనరు.... మీ ఇంటికి చెప్పి పంపిస్తాము అంటే అత్త భయపడి, ఇంట్లో వాళ్ల మొహం చూడలేను, నన్ను కొద్ది రోజులు ఇక్కడే ఉండనీయండి అంటే....ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండమ్మ , నువ్వు ఎన్ని రోజులు ఉన్నా మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ ఆదరణతో అక్కడ ఉన్నట్లు చెప్పింది. కొన్ని రోజులయ్యాక మేమందరమూ గుర్తుకు వస్తే తిరిగి వచ్చింది. జీవితం పెద్ద దెబ్బ కొట్టింది అత్తమ్మను. ఇప్పటికీ అత్త ఆ దిగులు బయటకు కనిపించని విధంగా నవ్వుతూ ఉంటుంది. సంవత్సరాలు గడిచేకొద్ది అత్త ఆమెకు ఉన్న బాధని లోపల దాచేసింది. కొడుకు శేఖర్ కూడా నెమ్మదిగా నాన్నకి చేరువ అయ్యాడు................
అప్పటి నుంచి ప్రేమ పెళ్లి అంటే భయం నాకు...

మరిన్ని కథలు

I love you
ఐ లవ్ యు
- సి హెచ్ . వి. యస్ యస్ పుల్లం రాజు
Ishtame kashtamaina vela
ఇష్టమే ... కష్టమైనవేళ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnapakala teneteegalu
జ్ఞాపకాల తేనెటీగలు
- వారణాసి లలిత, వారణాసి సుధాకర్
Maa baamma biography
మా బామ్మ బయోగ్రఫీ
- వారణాసి సుధాకర్
Apaardham
అపార్థం
- పద్మావతి దివాకర్ల