శని భగవాన్ ది గ్రేట్ .... - జీడిగుంట నరసింహ మూర్తి

Sanibhagavan the great

ఏదీ కలిసి రావడం లేదని శని పూజలు చేయించు కుంటే ఫలితం ఉంటుంది అని ఎవరో చెపితే నమ్మి గుడి దాకా వెళ్లి ఆచార్యుల గారిని కనుక్కుని పూజకు ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని అడిగి ఆయన చెప్పిన వస్తువుల లిస్ట్ విన్నాక కంగుతిని వెనక్కి వచ్చేసాడు పరమేశం .అసలే చేతిలో డబ్బు ఆడక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ శని పూజలు చేయించడానికి డబ్బులు ఎక్కడనుండి తేవాలని అతని బాధ .

"పోనీ ఇంట్లో పనికిరాని ఇనప సామాను , ఇంకా పాత బట్టలు, చెప్పులు ఉంటే ఎవరికైనా ఇచ్చేయ్యి. దానితో ఎంతో కొంత శని ప్రభావం తగ్గుతుంది. అప్పుడప్పుడు నల్ల నువ్వులు , నూనె ఉప్పు లాంటివి దానం చెయ్యి. అవి తీసుకునే ప్రత్యేకమైన వ్యక్తులు వుంటారు. గుళ్ళో అడిగితే ఆ వివరాలు చెపుతారు. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తించుకో. . ఈ వస్తువులు ఎవరికిచ్చినా వాళ్ళ చేతికి మాత్రమే ఇవ్వు. అప్పుడే దాని ఫలితం ఉంటుంది. అన్నట్టు ఆ వస్తువులు అంటగట్టి నీ సమస్యలు తొలగించుకోవాలంటే అవతలి వ్యక్తులు అందరూ సిద్దంగా ఉండరు. దానితో పాటు కనీసం ఒక ఏభై రూపాయలైనా వారి చేతిలో పెడితే నీ బాధలన్నీ తొలగిపోవాలని మనసారా దీవిస్తారు. " అంటూ ఇలా ఎంతోమంది ఉచిత సలహా పారేశారు.

ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాల్సినది పోయి తన ఆర్ధిక సమస్యల గురించి కనపడిన ప్రతివారికీ ఏకరువు పెడుతున్నాడు పరమేశం. శని దానం పట్టే వాళ్ళను ,ఇనుము, ఉప్పు, నూనె , పాత బట్టలు లాంటివి ఎవరు తీసుకుంటారో వాళ్ళ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకోమని వాళ్ళ వెంటపడుతున్నాడు. అటువంటి పరిస్తితిలో అతనితో బాగా చనువుగా మసులుకునే అతని మిత్రుడు సుబ్రమణ్యం దేవుడిలా కనపడ్డాడు.

" ఇవన్నీ నీవల్ల కాదు కానీ ఒకసారి శనిసింగనాపూర్ నీ కుటుంబంతో సహా వెళ్లవోయ్. .అక్కడ స్వయంగా ఉద్భవించిన శని భగవానుడు నల్లని రాతి విగ్రహం రూపంలో మనకు ధర్శనమిస్తాడు. రాష్ట్రాల నలుమూలలనుండి అక్కడికొచ్చిన భక్తులు శనీశ్వరుడిగా కొలుచుకుంటూ ముఖ్యంగా ప్రతి శనివారమూ తైలాభిషేకం చేస్తూ ఉంటారు. షిర్డీ, ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎన్నోనాళ్ళుగా నువ్వు పడుతున్న బాధలకు వెంటనే విముక్తి కలుగుతుంది. ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళను వీళ్ళనూ అడుగుతూ వృధా కాలక్షేపం చేయకుండా నా సలహా విని వెంటనే ఆ పని చెయ్యి " అన్నాడు అదేదో అతి తేలిక విషయంగా తీసి పారేస్తూ.

సుబ్రమణ్యం సలహా విన్న పరమేశం మొహం నల్లగా మాడిపోయింది. .

"ఆ పుణ్యక్షేత్రం గురించి నేనూ విన్నానోయ్ సుబ్బూ. అసలే చేతిలో డబ్బు నిలవడం లేదని, రోజు వారీ ఖర్చులు భరించలేక బ్రతుకు భారమైపోతోందనే కదా ఈ శని ప్రభావం నుండి తప్పించుకోవాలని వాళ్ళనూ, వీళ్ళనూ పట్టుకుని దేవులాడుతున్నది. పులిమీద పుట్రలాగా అంత మొత్తం డబ్బు భరించి ఔరంగాబాద్ వరకు వెళ్లగలిగిన శక్తి వుంటే ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు ? అవి అన్నీ గొప్పవాళ్లు , విహార యాత్రలు కోసం బయలుదేరి , మార్గ మధ్యంలో పనిలో పనిగా ఆ శని దేవుని దర్శించుకుని వస్తున్నారు తప్ప ప్రత్యేకంగా అదే పని మీద వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు ? ఇదంతా కాకుండా సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఏదైనా నేను భరించగలిగే ఖర్చులో ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు . " అంటూ సుబ్రమణ్యం సలహాన్ని తిప్పికొట్టాడు .

"ఇదిగో పరమేశం ఏదో నాకు తోచిన ఉపాయం చెప్పాను.నిజానికి నీ కన్నా నాకు శని బాధలు ఎక్కువున్నాయి.పిల్లకు పెళ్లి కావడం లేదు.నా పుత్రరత్నం నాలుగేళ్ళ నుండి పరీక్షలు తప్పుతూనే ఉన్నాడు. .మా ఆవిడకు అంతుపట్టని అనారోగ్యం.శనిదేవునికి శాంతి చెయ్యడానికి ఇంట్లో ఇనుప సామాను గట్రా ఎవరికైనా అంటగడదాం అనుకుంటే మా వాడు బయట అప్పులు చేసి ఉన్న సామాను కూడా అమ్ముకున్నాడు.నాకన్నా నువ్వే నయం.వస్తానురా.మా ఆవిడ అన్నం వండటానికి బియ్యం లేవంది. ఎవరేనా అప్పిస్తారేమో అని వెతుకుతున్నాను.నిన్ను అడుగుదాం అంటే నీ పరిస్థితే ఘోరంగా ఉంది . . నువ్వు చెప్పుకుంటున్నావు. నేను మనసులోనే ఉంచుకుంటున్నాను. " అంటూ నిరాశగా అక్కడనుండి నిష్క్రమించాడు సుబ్రమణ్యం.

** ** **

"ఏం బాబూ బాగున్నావా.ఏమీలేదు.ఈ కూరలు బండి దగ్గర నిలబడి ఎంత సేపని అమ్ముతావు?నా దగ్గర ఒక కుర్చీ నిరుపయోగంగా పడి ఉంది అది నీకు పనికొస్తోంది .బేరాలు లేనప్పుడు దాంట్లో కూర్చో.కాళ్ళు లాగెయ్యవు. అన్నట్టు కొద్దిగా పొట్టయిన బట్టలు కూడా ఉన్నాయి. చక్కగా ఇస్త్రీ చేయించి పెట్టాను.నీకేమైనా ఉపయోగ పడతాయంటే చెప్పు.ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటాం కదా ఎన్నో వస్తువులు పేరుకుపోయాయి. అలాగే ఎర్రని ఎండలో కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంతసేపని నిలబడతావ్ . నాదగ్గర వాడని మంచి చెప్పులు ఉన్నాయి. .రేపొద్దున ఒకసారి నీ కూరల బండి తీసుకుని మా ఇంటివైపు రా.బండిమీద అన్నీ తీసుకు పోదువు గానీ. ఎవరెవరో అడుగుతూ ఉంటారు.తెలిసిన వాడిని నిన్ను పెట్టుకుని వాళ్లకు ఇవ్వబుద్ది కావడం లేదు .రేపు మర్చిపోకుండా రా.. నీ కోసం ఎదురు చూస్తూంటాను సుమా " అని తను అప్పుడప్పుడు పళ్ళు కొనే వీరయ్యకు పనిగట్టుకుని వెళ్లి చెప్పాక కొంత వరకు పనైపోయిందనుకుంటూ ఊపిరి పీల్చుకుని ఇంటికి చేరాడు పరమేశం.

మాటికి మాటికి వీధివైపు తొంగి చూస్తున్న మొగుడిని "ఎవరైనా వస్తున్నారా ఏమిటి ?టీ ఇద్దామంటే చుక్క పాలు కూడా లేవు మీఇష్టం"అంటూ చిరాకు పడింది భార్య.

"ఇదిగో మనింట్లో వాడని తుప్పు పట్టిన దోశెల పెనాలు ఉండాలి కదా.అవి ఈ మూల ఉంచు .ఇక్కడ ఒక కాలు పొట్టిగా ఉన్న ఇనప కుర్చీ కూడా ఉండాలి .అది ఎక్కడ పెట్టావ్?" అన్నాడు చుట్టుపక్కల వెతుకుతూ .

"దాని సంగతి మీకెందుకు? అడ్డంగా ఉందని పక్కింటి పనిమనిషికి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. వచ్చి తీసుకెళ్తుంది కాసేపట్లో " అంటూ చావు కబురు చల్లగా చెప్పింది పరమేశం భార్య .

" ఏడ్చినట్టుంది.అది నేనెవరికో ఇచ్చేస్తానని మాటిచ్చాను.వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను'" అన్నాడు కోపంగా.

అయితే ఇక్కడ మొగుడూ పెళ్లాలిద్దరికీ అవతల వారికి సహాయ పడాలనే ఉద్దేశ్యం కన్నా ఆ వస్తువులిచ్చి ఏదో రకంగా శని ప్రభావం నుండి బయటపడాలనే తాపత్రయమే ఎక్కువ.

వస్తానన్న కూరల బండివాడు ఆ రోజు కాదు కదా ఒక వారం రోజుల పాటు బండి ఎప్పుడూ పెట్టే ప్రదేశంలో కాకుండా ఇంకో చోటెక్కడికో మార్చేశాడు. ఇక లాభం లేదనుకుని వీరయ్యకు తన దగ్గర ఉన్న నెంబర్ చూసి ఫోన్ చేశాడు.

" ఊరికే సామాను ఇస్తానన్నా కూడా మరీ అంత బలుపేమిటయ్యా.చూస్తూంటే మీరే మమ్మల్ని కొనేసేలాగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వచ్చి తీసుకుంటే తీసుకో.లేకపోతే ఇక్కడ తీసుకునే వాళ్ళు క్యూ లో ఉన్నారు.గుర్తు పెట్టుకో " అంటూ కోపంగా ఫోను పెట్టేసాడు పరమేశం.

ఈ పెద్దమనిషికి కోపం వస్తే తన దగ్గర కూరలు కొనడం మానేస్తాడేమో అని అనుకున్నాడేమో వీరయ్య మర్నాడు ఉదయం బండి తీసుకుని వచ్చాడు.

పరమేశం మిత్రుడు చెప్పిన విషయం బాగా గుర్తు పెట్టుకున్నాడు ఇనప సామానులు అవతలి వారి చేతికి ఇచ్చినప్పుడే శని పోతుందని.

"ఇదిగో వీరయ్యా .కాస్త ఈ సామాను అందుకో.చాలా బరువుగా ఉన్నాయి " అంటూ చేతికి ఇవ్వబోయాడు.

"కింద ఉంచండి సార్ ఇనప సామాను చేతితో తీసుకోకూడదు.తీసుకున్న వాళ్లకు శని పడుతుంది అని మా ఇంట్లో వాళ్ళు మరీ మరీ చెప్పారు " అన్నాడు వీరయ్య వాటిని పొరపాటున కూడా చేతిలోకి తీసుకోకుండా.

పరమేశం వీరయ్య మాటలకు కంగు తిన్నాడు.ఓరి వీడి దుంపతెగిపోనూ వీడి జాగ్రత్తలు వీడూ తీసుకుంటున్నాడన్న మాట.అందరూ తెలివి మీరి పోయారు. ఇలా అయితే ఇక తను శని ప్రభావం నుండి తప్పించుకోవడం ఒట్టి విషయమేనన్న మాట. ? పరమేశం ఇన్ని రోజులుగా పడిన తపన బూడిదలో పోసిన పన్నీరైపోయింది.

ఆ తర్వాత వీరయ్యతో పాటు కూరలమ్ముకునే మరో వ్యక్తి ద్వారా తెలిసింది చక్కగా పరమేశం ఇచ్చిన బట్టల మూటను లారీలు తుడుచుకునే వాళ్లకు,ఇనప సామానులు సామాన్ల కొట్టులో అమ్మేసి డబ్బు చేసుకున్నట్టు . .పరమేశం మాత్రం శని ప్రభావం నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక నానా అగచాట్లు పడుతూనే ఉన్నాడు .అవును మరి. చేసిన పాపాలన్నీ చేసి ఎంతో కొంత వాటి ఫలితాలు అనుభవించాల్సింది పోయి అంతా శని దేవుడిమీదకు తోసేసి వేరే అక్రమ మార్గాల ద్వారా శని భగవానుడిని ఈ మానవులు అంత తేలిగ్గా బుట్టలో వేసుకోవాలనుకోవడం ఎంత తెలివితక్కువ తనం ?*****

సమాప్తం

మరిన్ని కథలు

I love you
ఐ లవ్ యు
- సి హెచ్ . వి. యస్ యస్ పుల్లం రాజు
Ishtame kashtamaina vela
ఇష్టమే ... కష్టమైనవేళ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnapakala teneteegalu
జ్ఞాపకాల తేనెటీగలు
- వారణాసి లలిత, వారణాసి సుధాకర్
Maa baamma biography
మా బామ్మ బయోగ్రఫీ
- వారణాసి సుధాకర్
Apaardham
అపార్థం
- పద్మావతి దివాకర్ల