మా బామ్మ బయోగ్రఫీ - వారణాసి సుధాకర్

Maa baamma biography

వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే, మా కుటుంబం అందరికీ మా బామ్మ లక్ష్మీనరసమ్మ గారు, వైకుంఠప్రాప్తి పొందిన విధానం గుర్తొచ్చి తీరుతుంది. ఆరోజు ఆవిడ, తన 90వ ఏట, వీధిలోకి... దేవుడు పల్లకీ ఎక్కి, ఊరేగింపుగా వస్తే, పళ్ళెంలో బియ్యం, బెల్లం ముక్క, రెండు అరటిపళ్ళు, ఒక అగరత్తి పెట్టుకునివెళ్ళి, ఇచ్చి, దేవుడి ఆశీస్సులు తీసుకుని, తిరిగి ఇంట్లోకి వస్తూ, వీధి అరుగుమీదే కూలబడిపోయి, సునాయాస మరణం పొందిన పుణ్యాత్మురాలు, ధన్యజీవి ! 🙏🙏🙏 ఏబాధా పడకుండా, ఎవర్నీ బాధ పెట్టకుండా, ప్రాణం విడవడం అనేది ఒక వరం అని అందరూ భావిస్తారు, కోరుకుంటారు, దేవుడికి మొక్కుకుంటారు ! అలాంటి వరాన్ని పొందిన మా బామ్మ మా అందరి కళ్ళలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. 💐💐 బాల్యం - పెళ్ళి ************ ఆవిడ 1920 ప్రాంతంలో పుట్టినట్టు చెబుతుండేది. ఆవిడకి పుట్టిన తేదీ సర్టిఫికెట్టే లేదు. "బామ్మా, నువ్వు ఎప్పుడు పుట్టావు ?" అని మేవడిగితే, "గాంధీగారు మావూరు వచ్చినప్పుడు, మా అమ్మకి నెప్పులు మొదలయ్యాయిట, అప్పుడు మానాన్న పరిగెత్తుకెళ్ళి, మంత్రసాన్ని తీసుకొచ్చాట్ట" అని చెప్పేది. గాంధీ గారు ఎప్పుడు వాళ్ళ వూరు వెళ్ళారో, ఇప్పుడు మనం గూగుల్లో వెతకాలి ! 😊😊 "బామ్మా, నువ్వెంతవరకు చదివావ్ ?" అనడిగితే, "ఆరోక్లాసు, ఆనర్సు" అని చెప్పేది ! ☺️☺️ ఆవిడకి చదువుకోవాలని చాలా కోరిక వుండేదిట, కానీ, ఆరోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి కాకుండానే, పెళ్ళిచేసెయ్యాలనే సంప్రదాయాన్ని పెద్దలు నిక్కచ్చిగా పాటించేవారుట ! అందుకని, మా బామ్మకి పదకొండో ఏటనే 'శారదా యాక్ట్' నుంచి తప్పించుకోడానికి యానాం తీసుకెళ్ళి, అక్కడ పెళ్ళి చేశారట ! అక్కడ ఫ్రెంచ్ వాళ్ళ పాలన కాబట్టి, అక్కడ ఆ చట్టం వర్తించదుట ! "అప్పట్లో నీకు నచ్చే తాతయ్యని చేసుకున్నావా?" అని అడిగితే, కాబోయే అత్తగారి వడ్డాణం నచ్చి చేసుకున్నానని చెప్పేది ! 😂😂 మా బామ్మకి పదమూడే ఏటే మా పెద్దత్తయ్య పుట్టిందిట ! వరసగా ఆరుగుర్ని కన్నా... మా బామ్మ ఏనాడూ చీది, మూలిగి ఎరగదుట. అంత గొప్ప ఆరోగ్యం ఆవిడది ! గర్భవతిగా వున్నప్పుడు కూడా, అన్నిపనులూ చేసుకుంటూ, ఎడ పిల్లల్ని చూసుకుంటూ, అత్త మావల్ని సేవిస్తూ గడిపేదిట. ,💐💐 ఆవిడ చూసిన మొట్టమొదటి సినిమా, చిత్తూరు నాగయ్య గారి "గృహలక్ష్మి" ! అప్పట్నుంచీ ఆవిడ అభిమాన 'మెగా సూపర్ స్టార్' నాగయ్య, అభిమాన అందాల తార కన్నాంబ ! కన్నాంబ అందాన్ని, డైలాగ్ డెలివరీని మొన్న మొన్నటి దాకా, మెచ్చుకుంటూ ఉండేది. గృహలక్ష్మి సినిమాని ఆరోజుల్లో యూత్ పది- పదిహేను సార్లు చూసేవారుట. మా బామ్మ, అప్పుడప్పుడు, తమ కాలం నాటి సినిమా డైలాగుల్ని చెబుతూ ఉండేది. ఒక సినిమాలో, హీరోయిన్ కాంచనమాల, తలుపుచాటునుంచి, హీరోతో, "కాఫీ - ఉప్మా రెడీ సార్ " అని భర్తతో సరసమాడితే, నాటి మేటి శృంగార నాయకుడు నాగయ్య, "తినడానికి మేమూ రెడీ సార్" అంటాట్ట ! ఇంక ఆరోజుల్లో ఆ "అత్యంత రొమాంటిక్" డైలాగ్ ని అలనాటి యూత్ అందరూ వైరల్ చేసేసి, తరచుగా దాన్ని గురించే చెప్పుకునేవారుట ! తరవాత రోజుల్లో మాబామ్మకి మల్లీశ్వరి నుంచి, భానుమతి అభిమాన తార అయిపోయిందిట. ఏనోట విన్నా ఆ పాటలే, ఆ సినిమా కబుర్లేట. చాలాకాలం మాబామ్మే, మాఇంటి భానుమతి అయిపోయి, మల్లీశ్వరిలో భానుమతి పాటల్ని ముక్కుతో పాడి, యథాతథంగా దింపేసేది. 🎼🎼 💐💐 నడివయసు: ********** ఆవిడకి 40 ఏళ్ళు వచ్చేసరికి, మాతాత అనారోగ్యంతో చనిపోతే, ముగ్గురు పిల్లల్ని పోషించే బాధ్యత ఆవిడమీద పడింది. ఆవిడ చాలా బాధ పడింది కానీ, కుంగిపోలేదు ! అంతకుముందే, ముగ్గురు కూతుళ్ళకి మాతాతే పెళ్ళిళ్ళు చేసేశాడుట. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఉండేది, ఆలోచించేదిట. తనకి వచ్చే పెన్షన్ డబ్బులతోనే, స్వంత ఇంట్లో ఉంటూ, ముగ్గురు పిల్లలకీ చదువులు, పెళ్ళిళ్ళు చేసి, తన బాధ్యత తీర్చుకుంది. పెద్దకొడుకైన మా నాన్న, తల్లికి అన్నివిధాలా అండగా నిలబడ్డాడుట. 💐💐 అప్పట్లో, మా చుట్టాల్లో కొందరు పెద్దవాళ్ళు, పాతకాలపు "సదాచారాలు" పాటించమని, మా బామ్మకి 'శిరోముండనం' చేయించడం వంశాచారమని, ఒత్తిడి చేస్తే, మాబామ్మ ఎదిరించి నిలబడిందిట ! "నాజుట్టు ఆయనతో రాలేదు, ఆయనతో పోదు" అని నిక్కచ్చిగా చెప్పిందిట. పోయిన వాళ్ళ పట్ల, ప్రేమ, గౌరవం ఉండాలి కానీ, మధ్యలో మతపెద్దలు తెచ్చిన పురుషాధిక్య, ఛాందస కట్టుబాట్లకు ఆవిడ మొదట్నుంచీ వ్యతిరేకమేట ! "ఆచారాలు, నియమ నిబంధనలు, మనుషుల మంచికోసం పెట్టినవే కానీ, బాధపెట్టడంకోసం కాదు" అని, "ఆచారాల్ని కాలానుగుణంగా అవసరాల్ని బట్టి మార్చుకోవాలి" అని, నిక్కచ్చిగా చెప్పగలిగిన సంస్కరణవాది ఆవిడ ! వృద్ధాప్యం. ******** ఆవిడ ఎలిమెంటరీ స్కూలు దాటి చదువుకోకపోయినా, అన్ని విషయాలమీద చాల బాగా మాట్లాడేది. భారత భాగవత రామాయణాలన్నీ చదివేసింది. పురోహితులకు కూడా రానన్ని మంత్రాలు చదివేది ! 💐💐 మా చిన్నప్పుడు, ఆవిడ పక్కనే చేరి, "బామ్మా, కథ చెప్పు" అని అడగడమే ఆలస్యం, రామాయణం, భారతం, భాగవతం, కాశీమజిలీ కథలు, పంచతంత్రం కథలు, ఇంకా ఎన్నోకథలు ఎంత బాగా చెప్పేదో ! కానీ.. షరతులు వర్తించేవి ! అందరు పిల్లలూ తొమ్మిదింటికల్లా పడుకోవాలి, పొద్దున్నే లేవాలి ! మా అమ్మా-నాన్నలకంటే, మాబామ్మంటేనే మాకు భయం - భక్తి ! తిట్టేది కాదు, కొట్టేది కాదు, కంటిచూపుతోనే నిలబెట్టేసేది. ఆవిడ చెప్పిన నీతిచంద్రికలు, క్రమశిక్షణా పద్ధతులే మేము మా పిల్లలకి అందించాం. ఆవిడ చెప్పిన కథల్నే ఇప్పటికీ మా మనవలకి చెబుతున్నాం. మా పిల్లలు, "పెద్ద మామ్మ గారి కథ చెప్పండి " అని అడిగితే, ఆవిడ జీవిత కథని, రాణి రుద్రమదేవి, మగువ మాంచాల లెవెల్లో చెబితే, వీళ్ళు ఆసక్తిగా వినేవారు. 💐💐 మాబామ్మకి ఆరోగ్య సూత్రాలు చాలా బాగా తెలుసు. ఆవిడ స్వయంగా పాటించడమే కాదు, తన పిల్లలు, మనవల చేత కూడా పాటింపజేసేది. తనకెప్పుడైనా, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే, చిట్కా వైద్యాలతో నయం చేసుకునేది. డాక్టర్ దగ్గిరకి వెళ్ళిన సంఘటన నేను చూళ్ళేదు ! బీపీ, షుగరు, కాళ్ళనెప్పులు ఆవిడకి తెలియవు ! ఆవిడ చెప్పిన ఆరోగ్య సూత్రాల్లో మచ్చుకి కొన్ని : ప్రతి పదిహేను / ఇరవై రోజులకీ ఒకసారి, ఇంట్లో అందరూ ఒళ్ళంతా నువ్వులనూనె రాసుకుని, నలుగుపెట్టుకుని, స్నానం చెయ్యాలి, ప్రతి మూడు నెలలకీ అందరూ వంతులవారీగా, ఆముదం/ ఎప్సమ్ సాల్ట్ తాగాలి. "బాహ్య శుద్ధీ, అంతర్ శుద్ధీ" అంటూ వుండేది. మాకు ఆముదం తాగడం కష్టంగా వున్నా, మర్నాటికి ఒళ్ళంతా తేలిగ్గా ఉండేది. (త్రేణుపులూ వచ్చేవి.) 🤮🤮 మా ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే, వాళ్ళ మంచానికి పక్కనే, ఒక బల్లమీద, సగానికి కోసిన ఉల్లిపాయలు పెట్టేది. "ఎందుకు బామ్మా ?" అంటే, "సూక్ష్మజీవుల్ని ఉల్లిపాయ లాగేస్తుంది" అనేది. జ్వరంకూడా, త్వరలోనే తగ్గిపోయేది. డాక్టర్లు ఎక్కువగా లేని ఆరోజుల్లో, ఊళ్ళోవాళ్ళందరికీ ఆవిడ తేలుమంత్రం, పాముమంత్రం వేస్తూనే, ప్రథమ చికిత్స చేసేది. "మంత్రంతో విషం ఎలా పోతుంది ?" అనడిగితే, "మంత్రం వల్ల పోదురా, మంత్రం మీదున్న నమ్మకంతో, వాళ్ళకి కొంత భయం తగ్గి, ధైర్యం వస్తుంది, డాక్టర్ దగ్గిరికి వెళ్ళడం ఎలాగూ తప్పదు" అనేది. 💐💐 మాబామ్మ తన పక్క ఎంత నీట్ గా, మెత్తగా వేసుకునేదో ! దానిమీద పడుకుంటే, మాకు వెంఠనే నిద్రొచ్చేసేది. తన మంచం పక్కనే ఒక స్థూలు పెట్టుకుని, దానిమీద ఒక బాటరీలైటు, విసినికర్ర, కరక్కాయముక్కలు, పటికబెల్లం, తేనె, హనుమాన్ చాలీసా పెట్టుకునేది. ఇంట్లో ఎవరికైనా, చిన్నా పెద్దా అనారోగ్యం వచ్చినా, ముఖ్యంగా చంటిపిల్లలకి తేడా చేసినా, ఆవిడ చెప్పిన చిట్కా వైద్యాలు భలే పనిచేసేవి. "అసలు, మా అమ్మ డాక్టరు చదివుంటే, చాల బాగుండేది" అంటుండేవారు, మా నాన్న. 💐💐 మాబామ్మ, మా ఇంట్లో పండగలు, పూజలు చాలా పద్ధతిగా చేయించేది. పురోహితులు చాలరు ! ఆవిడ బాగున్నంతకాలం, మా ఇంట్లో సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి, నాగుల చవితి, ముక్కోటి ఏకాదశి, కార్తీక పొర్ణమి లాంటి పండగలు, పూజల విశిష్టతలు చెబుతూ, దగ్గిరుండి మా అందరి చేతా అన్ని పనులూ చేయిస్తూ, తానే మంత్రాలు చదువుతూ పూజలు మాచేత చేయించేది. ఇంక ఒడుగులు, పెళ్ళిళ్ళు వస్తే చెప్పేదేముంది ? ఏది, ఎప్పడు, ఎలా చెయ్యాలో చెబుతూ, ఆ సంప్రదాయాలు ఎలా వచ్చాయో చెప్పి, శుభకార్యాలకు మార్గదర్శకత్వం వహించేది. మా వీధిలో అందరికీ ఈవిడ 'బామ్మ' గారే ! ఆవిడ అసలు పేరే మర్చిపోయారు. అందరూ ఏ అవసరం వచ్చినా, ఈవిడ సలహా కోసం వచ్చేవారు. 💐💐 మాబామ్మ కట్టెలు, పిడకల వంట దగ్గిరనించీ, పరిణామ క్రమంలో మారుతూ వచ్చిన బొగ్గులు, రంపంపొట్టు, కిరసనాయిలు, గ్యాస్ స్టవ్ దాకా, రోలు, రుబ్బురోలు, తిరగలి వంటి పాతరాతి యుగం నుంచి, నేటి మిక్సీలు, వెట్ గ్రైండర్ల కొత్తరాతి యుగం దాకా అన్నీ చూడ్డమే కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయింది కూడా ! 👍👍👍 ఎప్పుడూ ఎదో ఒక పని చేస్తూనే ఉండేది. మధ్యాన్నం మాత్రం ఓక అరగంట వంటింటి గడపమీద తలపెట్టి, ఓ కునుకు లాగేసేది. 😴😴 మా అమ్మ, "మీరు రిటైరైపోయారు, ఏపనీ చెయ్యక్కర్లేదు, హాయిగా అలా కూర్చోండి" అంటే, "మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలే, శరీరం అంటే ఒక మిషను, దాన్ని ఖాళీగా ఉంచితే, మన్ని మంచం ఎక్కిస్తుంది !" అంటూ, దొడ్లో కొబ్బరి మట్టలు తీసుకొచ్చి, ఈనెలు తీసి, చీపుళ్ళు కట్టేది. 💐💐 వానలు పడే ముందు, మా అందరిచేతా మట్టి తవ్వించి, పందిళ్ళు వేయించి, వానలు పడేముందు పాదులు, కూరగాయ మొక్కలు పెట్టి, ఎన్నో రకాల కూరగాయలు పండించేది. చిక్కుడుకాయలు, ఆనపకాయలు, దోసకాయలు అరటికాయలు లాంటి కూరలు విపరీతంగా కాస్తే, మా వీధిలో అందరికీ ఉచితంగా డోర్ డెలివరీ చేసే డ్యూటీ మాది ! మేము తిరిగి వస్తుంటే, కావిళ్ళతో కూరలు అమ్ముకునే వాళ్ళు, మాకేసి గుర్రుగా చూసేవాళ్ళు ! 😠😠 💐💐 ఎవరైనా గుడికి వెడితే, అక్కడ మెట్లమీద కూర్చుని అడుక్కునే వాళ్ళకి దానం చెయ్యద్దని, దూరంగా కూర్చున్న అంగవైకల్యం ఉన్నవాళ్ళకి ఇవ్వమని చెప్పేది. ఎందుకంటే, మొదటి మెట్లమీద కూర్చున్నవాళ్ళు, వ్యాపార బిచ్చగాళ్ళుట ! 'అపాత్రదానం పాపం' అని చెప్పేది. 💐💐 ఒక రోజు కనీ వినీ ఎరుగని ఒక విచిత్ర సంఘటన జరిగింది ! మా కుటుంబం అందరం మా వీధివైపు మొక్కల దగ్గిర ఏదో పని చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటుంటే, ఒక బిచ్చగత్తి, నగ్నంగా వచ్చి, అతి దీనంగా మొహం పెట్టి, ఒంటిమీద చిరిగిన బట్ట కూడా లేనంత బీదరాలిగా ఏడుస్తూ, నిలుచుంది. అక్కడ వున్న జనం ఆడా, మగా, పిల్లలతో సహా, అందరం షాక్ తిని, ఖంగారు పడిపోతూ ఇంట్లోకి పరుగెట్టాం. మా అమ్మ చాలా ఖంగారు పడిపోతూ, తాను దండెమ్మీద ఆరేసుకున్న మంచి చీరని కూడా చూడకుండా, దాని ఒంటిమీద కప్పేసింది. ఆ బిచ్చగత్తె, ఆ చీరని సావధానంగా తీసేసి, తన భుజానికి వేలాడే సంచిలో కుక్కేసి, ఎదురింటికి వెడుతోంది ! అలా అప్పటికే, పది - పదిహేను చీరలు సంపాదించి ఉంటుంది. మాబామ్మ ఒక్కసారిగా లేచి, ఇంట్లోకి పరుగెత్తింది. మాబామ్మ అంతగా పరుగెత్తడం మేమెప్పుడూ చూళ్ళేదు ! ఒక కర్ర పట్టుకొచ్చి, ఆ బిచ్చగత్తె వెనకే వెళ్ళి, దాని వీపుమీద గట్టిగా కొట్టేసింది ! ఊహించని ఆ పరిణామానికి, అది భోరున ఏడుస్తూ, పరుగు లంఘించుకుంది. దాని వెనకాలే ఈవిడ పరుగు ! అలాంటి సీను ఒక సినిమాలో పెట్టాల్సిందే ! 😅😂🤣 మొత్తానికి సందు చివరిదాకా దాన్ని తరిమేసి, పలనాటి బ్రహ్మనాయుడులాగ, వెనక్కి వచ్చింది ! మాబామ్మని చూస్తే మాకే గుండెలు దడ దడలాడిపోయాయి ! మళ్ళీ ఎప్పుడూ ఆ బిచ్చగత్తె మా వీధిలో కనపడలేదు ! ఎప్పుడూ నవ్వుతూ, శాంతంగా, సినిమాలో శాంతకుమారిలా వుండే మాబామ్మ , ఆరోజు, పాత సినిమాల్లో, ఆఖరి సీనులో ఆవేశంతో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే కన్నాంబలాగ అయిపోతే చూడ్డం... అదే మొదటిసారి, ఆఖరిసారి ! 💐💐 ఇంకోరోజు, శ్రీరామనవమి సందర్భంగా, ఆంజనేయస్వామి గుళ్ళో ఒకాయన రామాయణ ప్రవచనం చెబుతూ, ఏదో తప్పు చెప్పాట్ట. మాబామ్మ లేచివెళ్ళి, ఆయనకి దణ్ణం పెట్టి, ఏదో చెప్పిందిట. ఆయనకి అహం దెబ్బతిని, మైకులో, "అన్నీ నీకే తెలుసా ? అయితే, మిగిలిన కథ నువ్వేచెప్పు !" అని అలిగాట్ట. అంతే ...మాబామ్మ మైకు అందుకుని, మిగిలిన భాగం చాలాబాగా చెప్పేసిందిట ! జనం నుండి చప్పట్లే చప్పట్లుట ! "👏👏👏👏👏 ఆ ప్రవచనకారుడి తాటి కాయంత మొహం, నిమ్మకాయంత అయిపోయిందిట ! 🍋🍋🍋 💐💐 చివరిగా, ఆవిడ 90 వ ఏట, కొంచెం అనారోగ్యం చేస్తే, మా నాన్న, నేను, 40 ఏళ్ళ డాక్టరు దగ్గిరికి తీసికెళ్ళాం. ఆ డాక్టర్ని " ఏరా అబ్బాయ్"అంటోంది ! ఆయనకీ వాళ్ళ అమ్మమ్మ కనపడిందేమో, నవ్వుతూ ఆవిణ్ణి చెక్ చేస్తూ, కొంచెం దగ్గాడు. "నీకు నిమ్ము చేసిందిరా, అబ్బాయ్, నాల్రోజులు అల్లం రసం తాగి, పడుక్కోబోయేముందు, కాస్త కరక్కాయ్ బుగ్గనెట్టుకో" అని, ఆ కుర్ర డాక్టర్ కి సలహా ఇచ్చింది, ఈ ఓల్డ్ పేషంటు ! 🤭🤭 💐💐 ఈ "మా బామ్మ బయోగ్రఫీలో"... మీ అమ్మమ్మో, బామ్మో కనిపిస్తే మాత్రం, అది కేవలం కాకతాళీయం కానే కాదు ! వాళ్ళని ఉద్దేశించి కావాలని రాసిందే ! కాబట్టి, మీరు కోర్టుకి వెళ్ళకుండా, వాళ్ళని తల్చుకుని, ఒక నమస్కార బాణం వేసుకోండి ! 🏹🏹 వాళ్ళందరి పవిత్ర, పుణ్యాత్మలకి మన అందరి జోహార్లు, నివాళులు ! 🙏🙏🙏

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల