నిజమైన స్నేహం - hemavathi bobbu

Nijamaina sneham
అమృత గుర్తుకు రాగానే మనస్సంతా తియ్యగా మూలిగింది. అమ్ము తో ముందే పరిచయం అయ్యుంటే ఎంత బాగుండేది. శనివారం బిర్లా మందిర్ కి వెళ్ళడం హైదరాబాద్ వచ్చినప్పటి నుండి అలవాటు. రెండు నెలల క్రితం అలవాటుగా శనివారం బిర్లా మందిర్ వెళ్ళడానికి ఆటో ఎక్కాను. ఆటో నెమ్మదిగానే వెళుతోంది కానీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి. ఆటోలో నా ఆఫీస్ బాగ్ వదలి ఆటో దిగేసాను. ప్రశాంతంగా గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని కళ్లు మూసుకుని కూర్చున్నా. నా కళ్ళ ముందు చిటికెల చప్పుడు విని కళ్లు తెరిచి చూసా. అమ్మాయి నన్నే చూస్తూ. నన్నేనా పిలిచింది అని అటూ ఇటూ చూసా. "మిమ్మలేనండి"...అంటూ చిరునవ్వుతో..."ఈ బాగ్ అంది"..."ఓహ్ నాదే"...అంటూ ఆ అమ్మాయి వైపు చూసా...అంత మా లోకం అయితే ఎలాగండి! బాగ్ మర్చిపోయారు. నేను ఆటోలో మీ పక్కనే ఉన్నాను కాబట్టి గమనించాను అంది. థాంక్యూ అని చిరునవ్వు తో అన్నాను.
"వట్టి నవ్వేనా ...కాఫీ ఇప్పించండి". నేను తనని ఆశ్చర్యంగా చూస్తున్నా. కొత్త పాత లేదా ఈమెకు అని. కనీసం పేరు కూడా తెలుసుకోకుండా ఏదో జన్మ జన్మల నుండి పరిచయం ఉన్న దానిలాగా మాట కలుపుతుందే అనుకున్నాను. ఏమి మీరు కొత్త వారని మొహమాటం లేకుండా అడిగాను అనుకుంటున్నారు కదా. మీకు నాకు పూర్వజన్మ నుండి అనుబంధం ఉందిగా. పూర్వ జన్మ నుండా! అప్పుడే నా మనస్సును చదివేసిందా? అమెను సంభ్రమంగా చూస్తున్నాను! ....కాదండి ఏడు జన్మల నుండి! అప్పటికి అర్థం అయింది తను నాతో ఆడుకుంటుంది అని. నేను వెంటనే అన్నాను " ఓ అలాగా! మరి నాకు మీకు ద్వాపరయుగము నుండి పరిచయము. మనము రాధాకృష్ణులము కదా! పదండి కాఫీ కోసం కాకాలు ఎందుకు" అన్నాను నేను నవ్వుతూ. ....ఆ రోజు కాఫీ డేస్ లో పార్టీ ఇచ్చా.... అప్పటి నుంచి అడపా దడపా మాటలు. అప్పుడప్పుడు షికార్లు. కొంచెం గిల్టీ గా ఉంది మనసులో నాకు పెళ్లి అయ్యింది అని తనకు చెప్పలేదని. ఒకరోజు మాటల్లో నేను నాకు పెళ్లి అయ్యింది అని మాటల్లో చెప్పేశా. "మీరు ఎంత మంచివారు. మా ఇంటి పేరు మబ్బు కాదండి బొబ్బు" అని ...నన్ను చూసి పక పక నవ్వుతూ "నాకు ఫేస్ రీడింగ్ వచ్చు . మాకు తాళి ఉన్నట్లు మీకు తాళం అన్నది" నన్ను చూస్తూ. నేను అమ్ము తో "తాళం కాదు సంకెళ్లు ఎటు పోకుండా, కానీ గుండె ఖాళీ గా ఉంది" అన్నాను ఆకాశం వైపు చూస్తూ. రోజులు గడిచే కొద్దీ మాటలతో మాకు ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది. అమ్ము నన్ను చూడకుండా ఉండలేక పోయేది. నేను అమ్ము ని ప్రతిరోజూ కలవకుండా ఉండలేక పోయేవాడిని. ఒక రోజు నేను అమ్ము తో చెప్పాను మనము పెళ్లి చేసుకుందామా...నేను నా భార్యకు విడాకులు ఇస్తాను అని. అమ్ము నా వైపు చూసి తర్వాత చెప్తాను. నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి అన్నది. ఎదురు చూస్తుంటాను నీ జవాబు కోసం అన్నాను అమ్ము కళ్ళలోకి చూస్తూ.
ఇంతలో ఊరు నుండి కబురు రావడంతో వారం రోజులు సెలవు మీద వెళ్ళాను. తిరిగి హైదరాబాద్ రాగానే అమ్ము కొసము కాల్ చేసి, సాయంత్రం కలుద్దాం కాఫీ డే లో అన్నాను. సాయంత్రం త్వరగా ఆఫీసులో పని ముగించుకుని వెళ్లాను. నాకంటే ముందే అక్కడకు వఛ్చి ఎదురు చూస్తున్నది. వారం రోజుల ఎడబాటు లో తాను పింక్ ఛుడిధర్ లో దేవ కన్య లాగా కనిపించింది. వావ్ బ్యూటిఫుల్! అన్నాను...తనకి ఇష్టమైన మల్లెపూలు చేతికి ఇస్తూ. "హా మల్లెలు ఎప్పుడు అందమైనవే.మరి చంద్రుడు మల్లెల కంటే అందగాడు కదా" అన్నది నా వైపు చూసి నవ్వుతూ. ఇప్పుడు చెప్పు ఊరిలో విశేషాలు అన్నది. నేను సంతోషం తో నాకు కొడుకు పుట్టాడు. ఆ చిన్ని చిన్ని చేతులు, బుజ్జి నోరు, చిన్ని కండ్లు, ఆ బుల్లి కాళ్ళు....అబ్బో వాడిని నాకు అలాగే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది అన్నాను. అమ్ము నేను నా కొడుకు సంగతులు చెప్తూ ఉంటే నా వైపే మురిపంగా చూస్తూ ఉంది.
నేను తనతో ఈ వారమంతా ఏమి చేసావు అన్నాను. చిన్నగా నా కండ్లల్లోకి చూస్తూ అమ్ము అన్నది... పెళ్లి కి ప్రేమ అవసరం లేదు. కానీ పెళ్లి తో బాధ్యత మొదలవుతుంది. ప్రేమ కన్నా బాధ్యత ముఖ్యం. పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య అనుకూలత కన్నా పెళ్లిని నిలుపుకోవాలనే నిబద్ధత ముఖ్యం. పిల్లలు కలిగాక, పిల్లల జీవితం, వారి భవిష్యత్తు మన కర్తవ్యం . చిన్నగా నేను ఇద్దరినీ చూసుకుంటాను అన్నాను తన కళ్ళలోకి చూడలేక ఎటో చూస్తూ. అమ్ము నవ్వుతూ త్రాసు ఎప్పుడు బరువు ఏ వైపు ఉంటే ఆ వైపు తూగుతుంది. ఎవ్వరికి న్యాయం చెయ్యలేవు. నీ శరీరానికి మనస్సుకు యుద్ధం జరుగుతుంది. మనశ్శాంతి కరువవుతుంది కుటుంబము లోని అందరికీ. పిల్లలు ఒకరిని చూసి ఇంకొకరికి ఈర్ష్య ద్వేషాలు పెరిగి సమాజానికి శత్రువులు గా మారుతారు అన్నది.
రామాయణం మనకు ఏమి చెప్తుందో తెలుసా....శ్రీ రాముడు తనకు అప్పగించిన కర్తవ్యానికి అంకితమని పదే పదే చెప్తుంది.శ్రీరాముడు రామాయణం లో అనుసరించింది తన బాధ్యత, తన కుటుంబం పట్ల ఇంకా తన రాజ్యంలోని ప్రజల పట్ల. మనము ఎప్పుడూ తప్పుగా అనుకుంటాం....శ్రీ రామచంద్రుడు ధర్మాన్ని పాలిస్తాడు కదా..మరి తానూ పెళ్లాడిన ఆ తర్వాత ఎంతో ప్రేమించిన సీతను ఎందుకు అడవుల పాలు చేసాడు అని. ఆ మహా పురుషుడు తన ప్రేమ కంటే రాజ్యం అదే ప్రజలు ముఖ్యం....అది తన బాధ్యత అని భావించి సీతను అంటే తన ప్రేమని అడవుల పాలు చేసాడు. ముందు మనల్ని నమ్ముకున్న వారి గురించి ఆలోచించాలి.తరువాత మనల్ని గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎలా స్నేహితులుగా ఉన్నామో అలాగే ఉందాము ఎప్పటికి అంటూ చేయి చాపింది నా వైపు. నేను అమ్ము మాటలతో ఏకీభవిస్తూ తన చెయ్యి తో నా చెయ్యి కలిపా.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి