పాటల పోటీ - ఆపాసా

Paatala potee

అవి నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న రోజులు.

అప్పట్లో మా చిన్నక్క సంగీతం నేర్చుకోవడానికి, ఒక సంగీతం మాష్టారుగారి దగ్గరకి వెళ్ళేది. ఆమెకు తోడుగా నేను వెళ్ళేవాణ్ణి. వాళ్ళింట్లో కూడా మాయింట్లోలాగే స్తంభాలుండేవి.

ఉదయం పూట స్కూలు అయిపోగానే పీకలమొయ్యా అన్నం తినేసేవాణ్ణి. కళ్ళు బరువెక్కుతూవుండేవి.

అప్పుడనేది నాతో, “పదరా, సంగీతం విందువుగాని” అని.

ఒక గొల్లవాడు కన్నె(పలుపు) పట్టుకుని గేదెని ఈడ్చుకుని వెళ్ళినట్టో, ఒక పిల్లవాడు బెల్టు పట్టుకుని కుక్కని ఈడ్చుకుని వెళ్ళినట్టో, నాచెయ్యి పట్టుకుని బలవంతంగా నన్నీడ్చుకుని వెళ్ళేది.

అక్కడ, ఈమె, మాష్టారుకి ఎదురుగా బాసింపట్టు వేసుక్కూర్చుని, తొడలు బాదుకుంటూ, “రార వేణు గోపా బాల ...” అని గొంతెత్తి ఖూనిరాగాలు తీస్తుంటే, వినలేక చచ్చేవాణ్ణి.

ఆమె చాప మీద కూర్చుంటే, నేనామెకు కొంచెం వెనగ్గా నేలమీద కూర్చునేవాణ్ణి. ఆమె అలా రాగాలు తీస్తుంటే సంగీతం మాష్టారు కూడా మైమరచిపోయి తల ఊపేస్తూ, దానికి తగ్గట్టు లయబద్దంగా తొడలు బాదేసుకుంటూవుండేవారు.

నేను చెవులు మూసుకోలేక ఏం చెయ్యాలా అని అయోమయంగా అయిపోయేవాణ్ణి.

అప్పుడు మెల్ల మెల్లగా అలా కూర్చునే, దొంగలా వెనక్కి వెనక్కి డేకేవాణ్ణి. వీపుకి స్తంభం తగిలేది.

అమ్మయ్య అని దానికి జారబడి కళ్ళు మూసేసుకునేవాణ్ణి.

క్షణాల్లో కునుకు పట్టేసేది.

మా చిన్నక్క సంగీతంలో అంత మత్తుందనుకునే వాణ్ణి.

అదే, సినిమా పాటలు వింటుంటే మాత్రం, మత్తెగిరిపోయేది.

అప్పట్లో మా స్కూల్లో, నాకు తెలిసిన ఇద్దరు అబ్బాయిలు చాలా స్నేహంగా ఉండేవారు.

వారిద్దరి మధ్య స్నేహాన్నీ ఫెవికోల్లా విడరాని బంధంలా చెయ్యటానికి ‘సినిమా సంగీతం బాగా పనిచేసింది.

ఒకబ్బాయికి ‘ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను’, ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ లాటి విషాద గీతాలు, నేపథ్య గీతాలు అంటే ఇష్టం. ఎక్కువగా అలాటివే పాడుకుంటుండేవాడు. పాడుకుంటూ ఒళ్ళు మరచిపోయేవాడు.

అతడి స్నేహితుడికి హుషారైన పాటలు, కామెడీ సాంగ్స్ అంటే ఇష్టం. అతడు కూడా ‘జోరుగా హుషారుగా షికారు పోదమా, ‘నిలువవే వాలుకనుల దానా లాటి కొక్కిరి పాటలు పాడుకుంటూ వాటిలో లీనమైపోతూవుండే వాడు.

ఒకరి పాటలంటే, ఒకరికి చాలా ఇష్టం. ఒక్కొక్కసారి ఇద్దరూ కలిసి కూర్చొని కచేరీ చేసేవారు. జుగల్­బందీ అన్నమాట! అతడొక పాట పాడితే, ఇతడొక పాట. వినేవాళ్ళుండేవారు కాదు. వారే గాయకులు, వారే శ్రోతలు! అలా వారిద్దరూ గంటలు గంటలు పాడుకుంటూ మైమరచిపోతూ ఉండేవాళ్ళు.

ఒకమారు, వారి ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాలకి సినిమా పాటల పోటీ పెట్టారు.

ఇంకేముందీ! ఈ జంట గాయకులిద్దరూ ఉరుకున వెళ్ళి, పోటీకి తమ తమ పేర్లిచ్చేశారు.

ఆ పాటల పోటీ రోజు, పాటలు వినడానికి, అన్ని తరగతుల విద్యార్థులు, అమ్మగార్లు, మాష్టర్లు వచ్చారు. స్కూల్లోని మధ్య హాల్లో గోడలకి దగ్గరగా (బహుశః నిద్రవస్తే గోడకానుకుని పడుకోవచ్చని కాబోలు) బెంచీలన్నీ చేర్చి, ఒకదాని ప్రక్కన ఒకటి ఆన్చి వేసేశారు. మధ్య మధ్యలో కుర్చీలు.

ఆ పోటీలో, చాలామంది పిల్లలు, ఒకరి తరవాత ఒకరు చాలా మంచి మంచి పాటలు పాడారు.

మన ఇద్దరిమిత్రుల వంతు వచ్చింది.

ఒకబ్బాయి తను కూర్చునివున్న బెంచీ మీదే నిలకడగా, కూర్చునే, కళ్ళుమూసుకున్నాడు.

‘గుడిగంటలు సినిమాలోని ‘జన్మమెత్తెతిరా అనుభవించితిరా’ అని ఎన్.టి. రామారావుని తలచుకుంటూ ఘంటసాల పాట, లీనమయిపోయి పాడాడు. పాట అయిపోయి, కళ్ళు తెరిచి, ఈలోకంలోకి వచ్చేసరికి, హాలంతా నిశ్శబ్దం! ఒక క్షణం ఆగి, ఆ హాలంతా కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయింది.

ఇక అతడి మిత్రుడి వంతు.

గభాల్న బెంచిమీద కూర్చున్నవాడు కాస్తా లేచి నించున్నాడు.

‘గుండమ్మకథ సినిమాలోని ‘లేచింది నిద్ర లేచింది అని అతడూ ఎన్.టి. రామారావుని తలచుకుంటూ ఘంటసాల పాటలోనే అతడూ లీనమయిపోయి పాడాడు. పాట ఇలా అయిందో లేదో, ఆ హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

ఆ తరవాత ‘స్కూలు ఏనివర్సరీ’ రోజు స్టేజీ మీదకి పిలచి ప్రథమ, ద్వితీయ పురస్కారాలు అందించారు.

ప్రథమ బహుమతి ‘లేచింది నిద్ర లేచింది పాట పాడిన అబ్బాయి అందుకున్నాడు.

ద్వితీయ బహుమతి ‘అహనా పెళ్ళియంట’ పాట పాడిన అమ్మాయికి దక్కింది.

--: oo(O)oo :--

ఆ తరవాత నాలుగో తరగతి రాజు మాష్టారు, ‘జన్మమెత్తితిరా పాడిన అబ్బాయిని పిలిచి, "నాన్నా! నువ్వు బాగా పాడేవు. కానీ నీకు ప్రయిజు రాలేదు. ఎందుకో తెలుసా! ఎవరికీ మన ఏడుపు అక్కరలేదు. మనం పంచిపెట్టే హుషారే కావాలి." అని చెప్పారు.

ఆ అబ్బాయి అప్పట్నుంచి విషాద గీతాలు తనకోసం, హుషారైన పాటలు ఇతరులకోసం పాడ్డం మొదలెట్టాడు.

అలా అప్పుడు ఓడిపోయినా, ఆ తరవాత చాలామంది మనసుల్ని గెలుచుకుని విజయుడయాడు.

ఆ ఓడిపోయింది ఎవరనుకుంటున్నారు?

‘నేనే!’

--: oo(O)oo :--

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ