
' ఇదేమిటి ఇలా తలుపులు బార్ల తెరిచేసి వెళ్లిపోయారు?' అనుకుంటూ తలుపు వేద్దామని వెళ్ళగానే ఎదురుగా అవధాని గారు. "ఏమ్మా !సార్ ఉన్నారా?" అంటూ లోపలికి వచ్చారు. "ఏమోనండి... వాకింగ్ కో, షికార్ కో వెళ్లినట్లున్నారు. సిరికిం చెప్పడు, ఏ గజేంద్రుడు పిలిచాడో... శంఖచక్రాలు లాంటి పర్స్, మొబైల్ కూడా వదిలేసి వెళ్లారు." అంటూ కూర్చోమని సైగ చేయగానే గొడుగు మడిచిపెట్టి కూర్చున్నారు.
"అసలే భాద్రపదం వచ్చేసింది. వర్షాలు ఈసారి గట్టిగానే పడుతున్నట్లు ఉన్నాయి"అన్నాను. "అవునండి. మన భాగ్యనగర్ లో కూడా ఆరెంజ్ అలర్టు, రెడ్ అలర్టు అని ఏమేమో చెబుతున్నారు.మన చిన్నప్పుడు ఇవేమీ ఎరగం" అన్నారు. ఎందుకు వచ్చారో అని కారణం అడిగే లోపు, "ఇంట్లో ఎవరితో ఆబ్దికం అన్నారు కదా!"అని మొదలుపెట్టారు. "అవునండి. మా అమ్మగారిదే. భాద్రపద శుక్లాష్టమి. ఈసారి తిధి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది" అన్నాను. ఆయన పంచాంగం తీసి "ఇందులో కన్ఫ్యూషన్ కి తావేముంది? అపరాహ్నం సమయంలో ఏ తిధి వస్తే ఆ రోజే ఆబ్దికం. ఈసారి ఆదివారం వచ్చిందమ్మా " అన్నారు.
ఎదురుగా ఉన్న గోడ గడియారం నుంచి చిన్న చెక్క తలుపులు తీసుకొని ఒక కోయిల బయటికి వచ్చింది. శ్రావ్యంగా శబ్దం చేసి తన పని పూర్తి అయినట్లుగా లోపలికి వెళ్లి తలుపులు బిడాయించుకుంది. "శుభం. మరింకే కోయిల కూడా కన్ఫామ్ చేసింది" అంటూ పంచాంగం మూసేసారు. "కొంచెం మజ్జిగ పుచ్చుకోండి" అని అంటున్నా లెక్క చేయకుండా "ఇంకా చాలా పనులు ఉన్నాయి అమ్మా!" అని లేచి వెళ్లిపోయారు అవధాని గారు. ఆయన అటు వెళ్లారో, లేదో సగం తడిచిన తల తుడుచుకుంటూ ఇంటికి చేరారు మా శ్రీవారు. "అదేమిటి సెల్ ఫోన్ కూడా వదిలేసి వెళ్లిపోయారు?" అన్నాను. "ఇదిగో ...ఎదురింటి వికాస్ వచ్చి అర్జెంట్గా అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్ అంటే వెళ్ళా. ఆ సిక్స్త్ ఫ్లోర్లో ఇల్లీగల్ గా కట్టిన పెంట్ హౌస్ కూల్చేయాలని హైడ్రా వాళ్లు నోటీసు ఇచ్చారట" అన్నారు.
అవథాని గారు వచ్చిన విషయం ఆదివారం తిధి గురించి వివరించాను. "సర్లే నేను ఫోన్ చేస్తాలే. వంట మనిషి, భోక్తలు కూడా ఆయన్ని చూడమంటాను, ఏమంటావు?" అన్నారు. "నేను అనడానికి ఏముంది? అత్తగారి శ్రాద్ధం శ్రద్ధగా పెడితే అదే చాలు" అన్నాను. " మాటిచ్చి ఒప్పుకున్నాక తప్పేదేముంది, మాట ఎప్పుడూ తప్పని వాడే ఈ శేషు గాడు అని మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది" అని మా అత్త గారిని గుర్తు చేస్తూ తనకు తాను కితాబిచ్చుకున్నారు . అవును నిస్వార్ధమైన ప్రేమ నిష్కల్మషమైన ప్రశంసలు అమ్మల నుండి బిడ్డలు పొందే వరాలు. అవే వారి వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు.
ఆదివారం రానే వచ్చింది. పొద్దున్నే మొదలైంది హడావుడి. వంట వాళ్ళు చెప్పిన సమయానికి వచ్చి ఎవరి పనుల్లో వారు దిగిపోయారు .భోక్తలు రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది .నిజం చెప్పాలంటే రోజు పెట్టే ఉరుకులు పరుగులు పొద్దున్నే కాఫీలు టిఫిన్లు లంచ్ బాక్సులు ఈ ప్యాకింగ్లు లేకపోవడంతో ఇలాంటి విశేష దినాల్లో నాకైతే పొద్దున కొంచెం రిలీఫ్ గానే అనిపిస్తుంది. బహుశా వంట వారి సహకారం వల్ల కావచ్చు. బ్రాహ్మణుడు అమ్మ పేరు అడుగుతున్నాడు. "వెంకటలక్ష్మి భాస్కరం" అన్నారు మా వారు. ఒక్క క్షణం ఆగి పురోహితులు మళ్లీ నిర్ధారణ చేసుకున్నారు .ఎందుకంటే, భాస్కరమన్నది మామూలుగా అబ్బాయిలకు పెట్టుకునే పేరు. వారి తల్లి గారి పేరు అంటూ మూడు తరాల పేర్లు అడుగుతున్నారు అక్కడే నిలబడి ఉన్న నేను ఎదురుగా ఉన్న, కు కూ క్లాక్ నీ, అమ్మ ఫోటో ని చూస్తూ అలా నిలబడే గతంలోకి జారుకున్నాను.
బెజవాడ( అదే ఇప్పటి విజయవాడ) తాసిల్దార్ గారు మూడవ సంతానంగా మగ పిల్లవాడు పుడతాడని ఎదురు చూశారు.మొగ బిడ్డ పుడితే ఆ వంశాంకురం పేరు భాస్కరం అని దినకరుడి పేరు పెట్టదలుచుకున్నారు. కానీ, ఆ స్థానంలో మా అమ్మ పుట్టింది. అందుకనే భాస్కరం అని ముద్దుగా మగ బిడ్డ పేరు పెట్టుకున్నారు. ఆ కాలంలోనే అమ్మ బిఏ ఆనర్స్ చేసింది. హిందీ భాషా ప్రవీణ పట్టాదారు. హార్మోనియం మెట్లమీద అలవోకగా సరిగమలు సుస్వరాలు వాయించేది. పెద్ద జడ, గుండ్రని మొహం చామన చాయ, చక్కటి చిరునవ్వే ఆమె ఆభరణాలు. పెళ్లి, మొదటి కాన్పు అవ్వగానే హార్మోనియంతో సహా అన్ని సర్టిఫికెట్లు అటక ఎక్కాయి. అదేమీ విచిత్రమో అమ్మకు కూడా మగ పిల్లలు లేరు. నాన్నగారికి అమ్మకి వయస్సులో పద్నాలుగు సంవత్సరాల వ్యత్యాసం ఉండేది. అందుకేనేమో ఆయన తదనంతరం ఆమె సుమారు పద్దెనిమిది సంవత్సరాలు జీవించింది. కొన్ని రోజులు నా దగ్గరికి, కొన్ని రోజులు చెల్లి దగ్గరికి వెళ్లి ఉంటూ ఇద్దరినీ సమంగా చూసుకునేది. ముఖ్యంగా మార్చి నెలలో ప్రతి సంవత్సరం ఇయర్ ఎండ్ క్లోజింగ్ వర్కు ఎక్కువగా ఉంటుందని నా దగ్గరే ఉండి నన్ను, నా బిడ్డని,శ్రీవారిని చూసుకునేది. నిజం చెప్పాలంటే నాకంటే వాళ్లతోటే ఎక్కువ సమయం గడిపేది. ఎందుకంటే నేను కొన్ని రోజులు రాత్రి ఏ ఒంటిగంటకో ఇల్లు చేరుకునేదాన్ని.మార్చి నెలలో పదహారు నుంచి ఇరవైగంటల వరకు కూడా కొన్నిసార్లు పనిచేయాల్సి వచ్చేది.ఈ హడావుడిలోనే మధ్యలో మా అత్తమామలు కూడా వచ్చి వెళ్లేవారు.
ఆరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఇల్లు చేరాను. పొద్దున్నే ఐదు గంటలకల్లా స్టేషన్ కి వెళ్లి వాళ్లని రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్లు ఉన్న వారం రోజులు బాగానే వంటలు చేసి హాట్ ప్యాక్ లో సర్దిపెట్టిది. అటు ఆఫీస్ ఇటు ఇల్లు. ఇటు ఇంట్లో చిన్నదాన్ని అన్నిటిని సమర్ధించుకుంటూ బాగానే జరిగింది అనుకున్నా. అయినా ఎందుకో వాళ్ళు వెళ్ళిన దగ్గర్నుంచి మా వారు ముభావంగానే ఉన్నారు. తర్వాత ఇయర్ ఎండ్ క్లోజింగ్ అయిపోవడం వల్ల నేను సమయానికి ఇల్లు చేరుకుంటున్నాను కానీ ఆయన పోటీగా బాగా లేటుగా రావడం అలవాటు చేసుకున్నారు. ఇద్దరికీ ఎడమొహం పెడ మొహం గానే కాలం నడుస్తోంది. ఈ విషయం అమ్మ పసిగట్టింది. "అమ్మాయి! రేపు అల్లుడుగారు పుట్టినరోజు కదా! చంటిది నా దగ్గర ఉంటుంది. మీరు ఇద్దరు ఎటైనా వెళ్ళిరండి సరదాగా ఒక రెండు రోజులు" అంది అమ్మ. "లేదమ్మా !అల్లుడు గారికి తీరికలేదు" అని దాటవేశాను. అల్లుడని అడగకుండానే సమాధానం చెప్పానని తెలియని అమాయకురాలు కాదు అమ్మ. ఆయనగారి పుట్టినరోజు రానే వచ్చింది. పుట్టినరోజు తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కూతురికి మాత్రం బై చెప్పి కార్లో తుర్రుమన్నాడు అల్లుడుగారు. ఆయన అటు వెళ్ళగానే మొదలుపెట్టింది అమ్మ. చెప్పాగా ఆవిడ అల్లుడు గారికి ఎప్పుడు సపోర్ట్ అని. "ఏమే! అల్లుడికి గిఫ్ట్ ఏమి ఇచ్చావు?" అంది. నేను తెల్ల మొహం వేసాను. "కారణం ఏదైనా కావచ్చు కానీ మీరిద్దరూ ఇట్లా ఉంటే నాకు మనసు ఏం బాగాలేదు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. ఈరోజు అతను పుట్టిన రోజు అతను సంతోషంగా ఉంచడం నీ బాధ్యత" అంది. ఇంకా ఏం చేయాలి? పొద్దున్నే జీడిపప్పు కిస్మిస్ వేసిన వేడి పాయసం మెక్కి తిని బాగుందని చెప్పకుండా తురుమన్నాడు. " సర్లే అది అందరి మగవాళ్ళు చేసేది" అంది అమ్మ. నా కోపం నసాలాని కి అంటింది. " నువ్వు నాకు ఎప్పుడూ సపోర్టు ఇవ్వవు" అన్నాను. ఉక్రోషంగా. " అలా కాదమ్మా! జీవితంలో రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని మధురంగా మార్చుకుంటేనే జీవితంలో కొన్ని అయినా తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అన్ని మధుర క్షణాలు భగవంతుడు ఇవ్వడు, కొన్ని మనమే సృష్టించుకోవాలి." అంది. నా హ్యాండ్ బ్యాగ్, లంచ్ బ్యాగు,కార్ కీస్ తీసుకుంటూ విసుగ్గా అడిగా "అయితే ఇప్పుడు ఏం చేయమంటావ్ చెప్పు కాకిలా అరవకుండా" అన్నాను. "సాయంత్రం వచ్చేటప్పుడు అల్లుడికి పుట్టినరోజు బహుమతిగా ఏదైనా తీసుకురా" సౌమ్యంగా అయినా తెగేసి చెప్పింది అమ్మ. నిజం చెప్పాలంటే, అమ్మ ఆమని కోయిల లాగా సున్నితంగా ఆహ్లాదంగా మధుర క్షణాలని సృష్టించుకోమని సందేశం ఇస్తుంది. నేనే కాకి లాగా కావు కావుమని అమ్మ మీద అరిచి ఇంట్లోంచి బయటపడ్డా. సాయంకాలం ఎంత తొందరగా పని ముగించుకోవాలనుకున్న అప్పుడే ఏడు అయింది. పాండి బజార్ మొదట్లోనే కార్ పార్క్ చేసి ఎదురుగా ఉన్న భగవాన్ తంగమాలిగై లోపలికి దూరాను. గతంలో అక్కడే ఆయన గారికి పుష్యరాగం ఉంగరం, బ్రేస్లెట్ కొన్నాను. ఏవి పెట్టుకోడు. వెంటనే ఆ షాపు నుంచి బయటపడి ఎదురుగా ఉన్న బర్మా బజార్ కు వెళ్లా. ఇంపోర్టెడ్ వాచీలు, షర్ట్స్, పెర్ఫయూమ్స్, జువెలరీ అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ నచ్చలేదు. ఒకపక్క టైం అయిపోతోంది. గిఫ్ట్ లేకుండా ఇంటికి వెళితే అమ్మ తిడుతుంది. నా పుట్టినరోజు బహుమతిగా ఒక కుందేలు బొమ్మ ఇచ్చాడు. తనకి ఇల్లు అలంకరించే వస్తువులు ముఖ్యంగా షోకేస్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం. అలా షాపులు తిరుగుతూ ఒక వాచీల షాప్ ముందుకు వచ్చాను. అక్కడ ఆకర్షించింది కుక్కు క్లాక్. తెలుగులో కోయిల గడియారం అనాలి అనుకుంటా. చిన్నగా తలుపులు తెరుసుకొని ఒక పక్షి వస్తుంది రెక్కల అల్లారుచుకుంటూ.ఎన్ని గంటలు అయితే అన్నిసార్లు కుక్కు కుక్కు అని శబ్దం చేస్తుంది. అలా కూయడం అవ్వగానే లోపలికి వెళ్లి తలుపులు వేసుకొని చక్కగా కూర్చుంటుంది. బాగుందనిపించింది. అదే గిఫ్ట్ గా డిసైడ్ అయిపోయా. కానీ రిపేర్ వస్తే మా దగ్గరికి మాత్రమే తీసుకురావాలన్నాడు షాప్ అతను. బిల్లు కట్టేసి అట్టపెట్ట మోసుకుంటూ... కొంచెం పెద్దగానే ఉంది అమ్మని తిట్టుకుంటూ పార్కింగ్ కు ఆ తర్వాత ఇంటికి చేరాను. అయ్యగారు తొందరగా వచ్చి గంటు మొహం పెట్టి కూర్చున్నారు. చేతిలో అట్ట పెట్టి చూసి అమ్మ మొహం చింకిచాట అంత అయ్యింది. ముందుగా చంటిది వచ్చింది. అట్టపెట్టెలోంచి బయటకు తీశా కానీ ఆ క్లాక్ ఎలా అసెంబుల్ చేయాలో నాకు తెలియలేదు. ఈలోపు మావారు వచ్చి మాన్యువల్ చదివి అర్థం చేసుకొని సెట్ చేస్తున్నారు. పాప బాగా ఎక్సైటింగ్ గా ఉంది. అమ్మ కూడా వచ్చి నిలబడి చూస్తోంది. ఆయన బ్యాటరీ సెట్ చేయగానే, ముళ్ళు గీత మీద పెట్టగానే తలుపులు తెరుచుకున్నాయి. బుల్లి పిట్ట బయటికి వచ్చి రెక్కలు ఆడిస్తూ అరుస్తోంది. మా బుజ్జి దానికి తెగ నచ్చేసింది, గెంతులు వేస్తోంది. మా అమ్మ కూడా సంభ్రమంగా చూస్తోంది, వాళ్ల చిన్నప్పుడు వెండి సామాన్లు వీధిలో అమ్మేవారట. వాటికంటే ప్రియంగా చూస్తోంది ఆ గడియారాన్ని. బాగా నచ్చినట్లు ఉంది. మా శ్రీవారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అప్పుడు చెప్పా "హ్యాపీ బర్తే" అని. ఒక చిరునవ్వు మెచ్చుకోలు చూపు విసిరారు. అమ్మ నాకు టీ చేతికి ఇస్తూ "భలే బాగుంది కుక్కు క్లాక్ బహుమతి" అంది. నాకు సంతోషంగా అనిపించింది . "అమ్మయ్య శాంతించావన్నమాట" అన్నాను.
ఆ రాత్రి బెడ్రూంలో మా ఇద్దరి అలకలు తీరాయి. రెండో బెడ్రూంలో అమ్మ దగ్గర పడుకున్న మా చిన్నది నిద్రలోనే ముసి ముసి నవ్వులు నవ్వుతోంది, ఏమి అర్థమయిందో.... ఆ తర్వాత కాలంతో పాటు చాలా పుట్టినరోజులు జరిగాయి. అమ్మ కూడా కాలంతో పాటు వెళ్లిపోయింది.... "అమ్మా! క్రతువు పూర్తయింది, పిండాలకు దండం పెట్టుకోండి.... అన్న బ్రాహ్మగారిమాటతో, ఈ లోకంలోకి వచ్చాను నేను. అప్పుడే చిన్నగా కిర్రు మని తలుపులు తెరుచుకుంటూ వచ్చింది అమ్మ కోయిల. కుక్కు కుక్కు మంటూ పన్నెండు సార్లు కొట్టింది. "అపరాహ్నం వేళ అయ్యింది నేను వచ్చాను అని "చెప్పకనే చెప్పింది, మా ఇద్దరి మధ్య తను సృష్టించిన ఒక మధుర క్షణాన్ని మళ్లీ గుర్తు చేసింది. జీవితమంటే మధురమైన జ్ఞాపకాల సమాహారమే కదా.... ...అయిపోయింది....