అయిందెదో అయిపోయింది - ఇందు చంద్రన్

Ayindedo ayipoyindi

“ఇప్పుడేంది? ఏదో కోపంలో కొట్టేసినా,అది మాత్రం నాకు ఎదురుజెప్పొచ్చునా?మొగోడని లెక్కలేకండా తిరుక్కోని మాట్టాడొచ్చునా?మొగోడన్నేక పదిచోట్లకి పోతాడు వొస్తాడు.వొచ్చిపొయ్యెదంతా దానికి చెప్తా కూచోనుండాలా? ఇంగేంపనిలేదా నాకి? అయినా దానికేం తక్కువ జేసినా? ఇంట్లో తేరకి కూచోని తింటాది కదా ఆ కొవ్వు బలిసిండాది.ఇంకో రెండు పడినాయంటే దార్లోకొస్తాది.” అంటా పళ్లు కొరకతా భార్య సుశీలని చూస్తా ఉండాడు క్రిష్ణ. “సర్లేమ్మే అయిందెదో అయిపోయింది.ఆయబ్బ మాత్రం కావాల్సికని కొట్టలేదంట కదా.ఇంగైనా చెప్పినట్టు ఉండు, నీ పని ఏందో అది సూడు.” అంది సుశీల వాళ్లమ్మ పైకి లేస్తా. “అంటే... ఎవుర్ని ఏం అడగ్గూడదంటారు అంది సుశీల కొంగుతో ముక్కు తుడుచుకుంటా. “ఇంతమంది చెప్తాంటే మళ్ళా అదే మాట అంటాండావేంది మే? పైత్యం తలకెక్కిండాదా ఏంది? మొగోడన్నేక సవాలక్ష పనులుంటాయి అన్ని నీకి చెప్పిపోతారా? నువ్వు వొండి పెట్టి నీ బిడ్డల్ని సూసుకోని బతికేది సూడు అంతేగాని ఇట్ట అడ్డం మాట్టాడి దెబ్బలు తినబాక. ఫోను జెసేసరికి ఎడవి ఆడ్నే వొదిలేసి ఎలబారి వొచ్చేసినాం పొద్దుబోక ముందే పోవాల వొదినా.అది తిక్కల్ది మీరే అట్ట బుద్దిమద్ది సెప్పి సూసుకోండి.” అంది సుశీల వాళ్ళమ్మ వియ్యపురాలి చెయ్యి పట్టుకొని చెప్పిపోతా. సుశీల వాళ్ల నాయన వొచ్చిన కాడ్నించి గమ్మున్నా కూచోనుండి పొయ్యేటప్పుడు గూడా సక్కంగా బయటికొచ్చి తలదించుకొని.వస్తా ఉంటే లోపల బిడ్డ మొకం మీద కమిలిన గుర్తులు కండ్లలో మెదలతా ఉంది.ఎందుకట్ట కొట్టినావని అల్లుడ్ని అడిగే దానికి ఎందుకో గొంతు పైకి రాల.పక్కనే నడస్తా ఉండే పెళ్ళాం దిక్కు సూసినాడు. అప్ప్పిట్లో ఆయమ్మ తలకాయ పగలకొట్టిన రోజుని గుర్తుకు చేసుకుని మనం సక్కంగా ఉంటే ఒకర్ని అడగొచ్చు అనుకున్నేడు బాధగా. కొంచేపటికి అక్కడుండే వాళ్ళు ఒక్కొకరుగా జారుకున్నేరు. క్రిష్ణ వాళ్ళ నాయనమ్మ మాత్రం ఒక మూలన కూర్చోని వొక్కాకు తిత్తిలో సున్నాన్ని ఆకు మీద పూస్తా చూస్తా ఉండాది. క్రిష్ణ కుర్జీలో కూర్చోని “ఇంగైనా ఒళ్ళు దగ్గిరబెట్టుకొని మాట్లాడు,మొగుడు మాట పెళ్లాం వినాల , పెళ్లాం మాట మొగుడు కాదు.”అన్నేడు ఓరగా చూస్తా. అప్పిటి దాక గడపకి ఆనుకోని ఉన్న మనిషి కొంచెం జరుక్కుంటా లోపలికిపోయింది సుశీల. కిష్టా...నేం గూడా ఎలబారతారా అంది వాళ్ళనాయనమ్మ నిదానంగా ఓ చేత్తో గోడనిబట్టుకుని లేస్తా. “ఇప్పుడేడబోతావు లేవ్వా,తెల్లార్తబోదువులే అన్నాడు క్రిష్ణ గొంతు తగ్గిస్తా ఈ రేత్రికి ఇడ ఉండి మాత్రం ఏం జేస్తా సెప్పు?” అంది వొక్కాకు నమలతా “రాత్రికి ఇడనే ఉండి దానికి మొగోడ్తో ఎట్టమాటాడాల,మొగుడితో ఎట్ట మాట్టాడాలో చెప్పియ్యి,అన్ని చూసిందానివి” అన్నాడు క్రిష్ణ. వాళ్ళనాయనమ్మ నవ్వాతా…“నువ్వెట్టంటే అట్నే” అంది. ఇంట్లో ఆపక్క ఈపక్క ఏదో పనిజేస్తా తిరగతా ఉంది సుశీల.నిన్నటిదాంక మొగుడు కొట్టేసినాడని లబోదిబోమని మొత్తుకుని ఏడ్చిన పిల్ల ఇప్పుడు ఏం జరగనట్టే, ఏం జరిగినా ఏది మారదన్నట్టే తీరుమానిచ్చుకునేసిందేమో నిన్నమాదిరి బాధ లేదు మొకంలో యాష్ట తప్ప. బయట చీకటి పడంగానే ఇంట్లో దీపాలన్నీ వెలిగినాయి.వాకిట్లో పిలకాయలు జిల్లంకోడి,పందేలాట ఆడతా ఉండారు.వాళ్ళని చూస్తా కూచోని ఉండారు క్రిష్ణ వాళ్ళ నాయనమ్మ.ఉన్నట్టుండి ఎవురో ఏడస్తా అరస్తా ఉన్నట్టనిపించి ఈదిలోకి తొంగి చూసినారు.రెండిండ్లవతల ఒకాయన వాళ్ళ పెళ్ళాన్ని జుట్టు పట్టుకొని లాగి కొట్టి ఈపు మీద పిడి గుద్దులు గుద్ది నెట్టెసినాడు. ఆయమ్మ కిందపడి ఏడస్తా మూలుక్కొని కూర్చోని ఉంటే ఒకరిద్దరు ఆయబ్బని పట్టుకొని లాగతా ఉంటే ఆయమ్మ చుట్టూ చేరిపోయినారు. "ఎవుర్రా కిష్టా?అంది వాళ్ళనాయనమ్మ "గోయిందన్నలెవ్వా,వాళ్ళింట్లో ఎప్పుడు రచ్చలేలే,రచ్చలేకపోతే అదిశయం అన్నాడు ఒక మాదిరి నవ్వతా. వాళ్ళవ్వ లోపలికి పోయి తిరిగొచ్చి క్రిష్ణ పక్కనే కూచునింది. "అవున్లే కిష్టా,మొన్నటొరకు నువ్వు మీ తాతమాదిరి నాయన మాదిరి కాదనుకున్నే, నువ్వుగూడా వాళ్ళమాదిరే ఉండావు. మొదులొకటైతో కొన ఇంగొటి ఎట్టాఅవతాది.ఆయెమ్మి ఏంవనేసిందని అట్ట కొట్టినావు? అనింది మెల్లంగా "నీకేం తెలస్తాదితినేసి ఇంట్లో కూచోని కతలు మాట్టాడతావు,మొగోడికే గదా బాధలు అన్నేడు కసురుకుంటా “కిష్టా...ఆయెమ్మి తిరిక్కొట్టదనే ధైర్న్యంతో కొట్టెసినావు.ఒకటి సెప్తా ఎవనుకోబాక మీసాలుంటే మొగోడైపోడు.ఇంటి ఆడది కండ్ల నీళ్ళు పెట్టుకుంటే ఇల్లు బాగుంటాదా? మీతాత నన్ను కొడతాంటే మీ నాయన ఏడస్తా ఈదిలో వాళ్ళని లాకొచ్చేటోడు. మళ్ళా మీ నాయనే మీయమ్మని కొట్టినాడు నువ్వు ఏడస్తా సీకట్లో సేలో నీళ్ళు గడతా ఉంటే మా దెగ్గిరికొచ్చినావు. "రావ్వా మా నాయన మాయమ్మ ని కొడతాండాడు అని ఏడ్చితోడుకొని పోయినావు.నిన్న నువ్వు మీనాయన మాదిరే ఆయెమ్మిని కొట్టినావు నీ బిడ్డలుంటే వాళ్ళు నీ మాదిరే ఏడస్తా ఎవర్నో ఒకర్ని పిలిచేదానికి పొయ్యింటారు.అయినా ఆయెమ్మి నిన్ను కొట్టలేకండా దెబ్బలు తినిందనుకుండావా? మొగుడు పెళ్లానికి ఎన్ని ఉన్నా గడప దాటి బయటికి రాగూడదని మాయమ్మ నాకి చెప్పినట్టే వాళ్ళమ్మ అమ్మికి సెప్పుంటాది దానికే గమ్మునుండాది. నేను కాపరానికి వొచ్చినప్పుడు పన్నెండ్లేండుంటాయి,రోజు మీ తాత ఇంట్లో ఆడబిడ్డలు మరిదులు ఉన్నేగాని అందరి ముందరా ఈడ్చి తన్నేటోడు.తెల్లారేకాడికి నేం గూడా రేత్రి జరిగిందానిగురించి వొదిలేసి నా పని సూసుకునేదాన్ని అట్నే అలవాటైపోయినాది.మీ నాయన కి పెండ్లి జేసినాక మీయమ్మని కొట్టినాడు.నాకు మీయమ్మ ఏడస్తా ఉంటే నన్ని సుసుకున్నట్టే అనిపించినాది.వాడికి సెప్పాలని సూసినా నా మాట ఇనలేదు. మీ తాత ఎందుకు కొట్టేటోడో తెల్సేది కాదు, మీ నాయన మీ అమ్మ అడిగిందానికి సెప్పలేదని కొట్టినాడు.నువ్వు అయెమ్మి తిరుక్కోని మాట్టాడిందని కొట్టినావు.నీకు ఆయమ్మి ని కొడతాంటే ఒక్క తూరి గూడా మీయమ్మ ఎడ్సింది గుర్తుకురాలా? ఆడది పెండ్లి సేసుకున్నేక అంతా మారిపోతాది.తినే తిండి కాడ్నించి కట్టుకునే గుడ్డలు దాక మొగుడి మాట ఇనాల్సిందే.అన్నిటికి సర్దుకుని ఓర్చుకొని ఉండాలి లేకపోతే ఆడదానికి ఇలువే ఉండదు.పెండ్లి అయినాక ఆడబిడ్డ తిరిగి పుట్టింటికి పోతే బారంగానే సూస్తార్రా. ఏడకి పోతాది సెప్పు? ఏడకిబోయినా తిరిగి మొగుడుకాళ్ళ కాడికే రావాలి గదా అని మీ మొగోళ్ళకి గండకావరం ఎక్కిపోతాది.నువెట్టున్నా ఎట్టమాట్టాడినా , నీక్కావల్సినవన్నీ సేసి పెట్టి నీకోసం ఎదురుసూస్తా ఉంటాది.నువ్వు అడగొచ్చు గాని ఆయెమ్మి నిన్నడగ్గుడదా?నువ్వు ఏం జేస్తాండావో నీ పెళ్ళాం గాకపోతే ఇంకెవురు అడగాల్రా?నీకు ముప్పై మూడు సేసి పెట్టేదే గాకండా నీతో తన్నిచ్చుకోవాలా? అనింది ఒక మాదిరి నవ్వతా “నువ్వేందమ్మా తల్లే , నేనెం నీ మొగుడు మాదిరి కొడుకు మాదిరి రోజు కొట్టలా, ఏదో కోపంమొచ్చి కొట్టేసినా అది గూడా ఇదే ఒకతూరి అన్నేడు లుంగీ మడిచి కడతా. "నువ్వు వాళ్ళ మాదిరే సరాసరి మొగోడే కదా? అనింది మళ్ళా "మొగుడుపెళ్లామన్నేక ఇయన్నీ మాములే కద,నా పెళ్లాన్నే గద కొట్టినా ఊళ్ళో వాళ్ళ పెండ్లాన్ని కొట్టలే గదా. ఎందుకు నువ్వు గూడా ఆయమ్మి మాదిరే మాట్టాడతావు అన్నాడు చిరగ్గా మొహం పెట్టి. "ఒరే కిష్టా…అందరూ ఆడోళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నేగాని మళ్ళా వాళ్ళ కూతుళ్ళకి మొగుడు సెప్పినట్టే సర్దుకోనిపో అంటారే గాని కొడుకుల్ని పిల్సి నిన్ను నమ్ముకొచ్చిన ఏం చేసినా గాని బిడ్డ మీద సెయ్యెత్తబాక, ఏదైనా ఉంటే కూసోని మాట్టాడుకుని సరిసేసుకోండి అని సెప్పర్రా. నేనా తప్పు సేసినా నా కొడుకు నా మాట ఇనలేదు. నిన్నట్ట మాదిరి వొదిలేయన్రా. నా బతుకుని మార్చుకోలేకపోయినా,మీయమ్మ బతుకుని మార్చాలనిపించినాది.ఇప్పుడు సుశీల మామాదిరే ఉండాది.ఎన్నో మారతా ఉండాయి కాని ఆంకారం నిండుకోని మొగోడు నేం మొగోడు అని సెప్పుకొని మీరు తప్పితే. నువ్వు ఇంకో తూరి ఆయెమ్మి మీదకి సెయ్యెత్తినావని తెల్సినాదనుకో నీతో మాట్టాడేదానికి ఏంవుండదు సెప్పాల్సిన చోట సెప్తా.ఈ ముసిల్దానికి ఏం తెలస్తాది వొక్కాకేసుకొని ఈదిలో కతలు మాట్టాడతా ఉంటాదనుకోబాక.ఏడబోయి సెప్తే నీ తోలు తీసి డోలు కడతారో నాకి బాగా తెల్సు.ఒక్కఫోను గొడితే సాలు నిన్ని అట్టే సుట్టుకొని ఎత్తుకొనిపోతారు. అనింది నవ్వతా. ఇంతలో ఈదిలోకి ఒక జీపు రయ్ మని వస్తా ఉండాది.జీపు మీద ఎర్ర రంగులో సైరన్ మోగతా ఉండాది.ఆ శబ్దానికి ఈదిలో అందరూ గుంపుగా వొచ్చి మాట్టాడుకుంటా సూస్తా ఉన్నారు. ఊర్లోకి అది ఈ టయానికి జీపు ఎందుకొచ్చినాది. కొట్లాటలప్పుడు,ఏదైనా మీటింగులప్పుడు ఇట్ట సైరన్ బండొస్తాది ఇప్పుడెందుకొచ్చినాది అనుకుంటా మాట్టాడుకుంటా ఉన్నేరు. నేరుగా గోయిందడి ఇంటి ముందు ఆగింది.ఇద్దరు ఆడోళ్ళు ఖాకీ యూనీఫారంలో దిగి గోయిందడి పెళ్ళాన్ని పిలిచి అడిగతా ఉన్నేరు.వాళ్ళని సూడంగానే పోలీసులని అందరికి అర్థమయిపోయినాది.ఇంతలో ఒక పోలీసాయమ్మ గోయిందన్ని పిలిచి దవడకి బట్టి ఒక్కటిచ్చినాది దెబ్బకి మొగోళ్ళంతా ఉలిక్కిపడినారు. దూరంగా క్రిష్ట చెంపని తడుముకుంటా ఎనక్కి తగ్గి నిలబడినాడు. "ఇంట్లో ఆడోళ్ళని గాని కొట్టినారని గాని తెల్సిందంటే...తోలు తీసి డోలు కడతా, మొగుడైతే పెళ్ళాన్ని కొట్టొచ్చు అనుకునే మూర్ఖులకి చెప్తాండా, మొగుడు, మొగోడు అట్లాంటి పెత్తనాల్ని తగ్గించుకుంటే మంచిది లేకుంటే స్టేషన్ కి తోడుకోనిబోయి పెండ్లి జేస్తా.ఆడోళ్ళకి సమస్యుంటే మాకు ఫోను చెయ్యండి,ఎక్కడైనా ఇట్టాంటి గొడవలు చూసినా ఫోన్ చెయ్యండి మూట గట్టుకొని ఎత్తుకొనిపోతాం అంది ఒక పోలీసామో లాఠీని తిప్పతా. ఆ మాట వినగానే పక్కనున్న వాళ్ళనాయనమ్మ ని చూసినాడు. తిత్తిలో ఉన్న పోను తీసి "ఇంత బిన్నే వొస్తారనుకోల అనింది వాళ్ళనాయనమ్మ తిత్తిలో పోను పెడతా.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ