మంచి రోజులు ముందున్నాయి - Chandrashekhar Panakanti

Manchi rojulu mundunnayi

నా ఉద్యోగ రీత్యా చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాను, మొన్నే నాకు హైద్రాబాద్ కి బదిలీ అయింది, మా అక్కవాళ్ళు నల్లకుంటలో ఉంటారు, ఎప్పుడు బదిలీలపై ఊళ్ళు తిరిగే నాకు ఒక్కసారి అయినా వాళ్ల దగ్గరలో ఉండాలి అని అనిపించింది అందుకనే సరియైన వసతి ఉన్న ఇల్లుకోసం వాళ్ళు ఉండే ప్రాంతంలోనే వెతుకు ఉన్నాను. చివరికి ఎక్కడ దొరకక , ఇల్లు వెతికిపెట్టే ఒక ఏజెన్సీ వాళ్ళను కలిశాను. హైద్రాబాద్ లో ఇదో పెట్టుబడి లేని వ్యాపారం, ఇళ్లు చూపిస్తే అద్దెలో సగం వాళ్ళకి ఇవ్వాలి. ఇండిపెండెంట్ ఇల్లు అద్దె కోసం వెతికితే అవి నా స్థోమతిని మించి ఉన్నందున, అపార్ట్మెంట్ అయితే బాగుంటుంది అని మా అక్క ఇచ్చిన సలహాతో, ఆ ఏజెన్సీ వాళ్ళతో కలిసి అపార్ట్మెంట్లో అద్దె కోసం నా వేటను ఆరంభించాను. నేను ఆ ఏజెన్సీ నుండి వచ్చిన ఒక 20 సంవత్సరాల పిల్లోడు కలిసి నా బైక్ పైన బయలుదేరాం. నా ఆలోచనలు ఆగలేదు , ఆలోచిస్తూనే ఉన్నా......ఇంతకీ ఎక్కడో పల్లెటూళ్ళో పెంకుటింట్లో ఉండి చదువుకొని ఇలా ఒక ఉద్యోగస్థున్ని అయిన నాకు అపార్ట్మెంట్ అనేది ఒక కొత్త ప్రయోగమే. ఈ మధ్య ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ సంస్కృతినే కదా, ఖాళీ జాగా కనపడితే అందులో ఆగిపెట్టల్లాంటి గదులతో నిర్మించే పిచ్చుక గూళ్లను మనం కొత్తగా అపార్ట్మెంట్ అని అంటున్నాం. మన మనసుల్లాగే ఇప్పటి ఇల్లు కూడా కుచించుకుపోయి అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లాగా చిన్నగా మారిపోయాయి. అప్పుడే ఆ ఏజెన్సీ కి చెందిన పిల్లవాడితో మాటకలిపాను, ఏం తమ్మి (హైద్రాబాద్ లో ఇలాగే అన్న , లేదా తమ్మి అనే మొదలెడతారు మాటలు) ఏం పేరు నీది, నా పేరు ప్రవీణ్ సర్ , నేను: ఏ ఊరు, ప్రవీణ్: ఈ ఊరే సర్ , నేను: ఏం చదివినవ్ తమ్మి ప్రవీణ్: ఇంటర్మీడియట్ చదివిన నేను: ఏం చదువు ఆపేసినవా ఏంది... ప్రవీణ్: లేదు సర్ , నేను డిగ్రీ జేస్తున్న , ఇల్లు చూపించి మీలాంటోళ్లకి పక్కా చేపిస్తే నాకు రోజుకి 200 రూపాయలు ఇస్తరు. నేను : సరే , మంచిగ చదువుకు తమ్మి.. ప్రవీణ్ : సరే సర్.... ఎప్పుడు ఇంగ్లీష్ పదాలను తెలుగులో తెలుసుకోవాలనే నాకు అపార్ట్మెంట్ ని తెలుగులో ఏం అంటారా అని అనిపించింది నేను : తమ్మి గింతకి అపార్ట్మెంట్ ని తెలుగుల ఏమంటారు తెలుసా..... ప్రవీణ్ : ఏమో సర్ , అపార్ట్మెంట్ అనే అంటరేమో నాకు కూడా తెలియక, గూగుల్ తల్లి ని ఆశ్రయిస్తే తను కూడా అపార్ట్మెంట్ అని తెలుగు లిపిలో చూపించేసరికి, ఖంగుతిన్నాను. ఇంకా వెతికితే , బహుళ అంతస్తుల భవనం అని వచ్చింది. మనసులో నవ్వుకున్నాను. అంతలో శ్రీ వెంకటేశ్వర అపార్ట్మెంట్ కి చేరుకున్నాం. ప్రవీణ్ అక్కడే వాచ్మెన్ గా పనిచేస్తున్న సూర్య ని కలిసి మాట్లాడాడు. సూర్య వాచ్మెన్ గా ఆ అపార్ట్మెంట్ లొ సెల్లార్ లో ఉండే ఒక రూమ్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. తనకి భార్య ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉంటారు. ప్రవీణ్: నమస్తే సూర్య అన్నా....సర్ కి ఇల్లు కావాలె...మీ అపార్ట్మెంట్ల 103 ఫ్లాట్ ఖాళీ ఉన్నది కదా, చూపిస్తవా..... సూర్య: సరే, రండి.... నమస్తే సర్ అని చిరునవ్వుతో పరిచయం చేసుకొని, ఫ్లాట్ చూపించాడు. సూర్య: సర్ ఇదిగో చూడండి, ఇదే ఫ్లాట్, అద్దె 10000 , maintenance 1000 రూపాయలు ఉంటుంది సర్. మీకు ok అయితే చెప్పండి సర్. సరిగ్గా నా బడ్జెట్ లో ఉన్న ఇల్లు , అయేసరికి నేను ఒప్పుకున్నాను. అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి సూర్య, సూర్య: రెండు నెలలు సర్ , ఓనర్స్ ఇక్కడ ఉండరు , వాళ్ల అకౌంట్ నెంబర్ ఉంది అందులో వేయండి , వేసి నాకు చెప్పండి. మీరు రేపే ఇంట్లోకి రావొచ్చు సర్....అన్ని రెడి గా పెడ్తాను సరే నా సర్..... అని చెప్పి తన పనిలో పడిపోయాడు సూర్య...... కొద్ది రోజుల్లోనే మేము ఆ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యాము. సూర్య అపార్ట్మెంట్ లో అందరికీ తలలో నాలుకగా ఉండేవాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకి చెప్తే ప్రతిఫలం ఆశించకుండా పని చేసిపెట్టేవాడు. ఇలా అందరికీ సహాయపడే సూర్యని కొందరు తమ ఇంట్లో మనిషిగా చూసేవాళ్ళు. కొంతమంది ఉన్నారు, ఎప్పుడూ డబ్బు యావ, కనీసం మనిషిగా కూడా చూసేవాళ్ళు కాదు, సూర్య కి జ్వరం వచ్చి ఒకరోజు పనిచేయకపోతే ఇక అంతే, నువ్వు పనికి రాకపోతే నీ జీతం ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు కోసేస్తం అని అనేవారు. పాపం సూర్య తనకి జ్వరం ఉన్న వచ్చి పని చేసేవాడు. ఇంత పనిచేసే సూర్య కి ఇచ్చేది నెలకి 6 వేల రూపాయలు మాత్రమే. నాకైతే ఇది శ్రమదోపిడి లాగా అనిపించేది. ఇలా సూర్య ఎక్కువ పనిచేస్తూ , తక్కువ జీతానికి ఎందుకు పనిచేస్తున్నది తెలుసుకోవాలని అనిపించి, ఒక ఆదివారం రోజు మధ్యాహ్నం అపార్ట్మెంట్ సెల్లార్ లో సరిగా వెలుతురు కూడా రాని సూర్య వాళ్ళు ఉండే గదికి వెళ్ళాను. సూర్యకి పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు, సూర్య భార్య అనిత అపార్ట్మెంట్ లోని ఇళ్లలో పాచి పనిచేస్తూ భర్తకి చేదోడు వాదోడుగా గ ఉండేది. పిల్లలు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో చదువుతున్నారు. సూర్య....ఉన్నవ.....ఏం చేస్తున్నావ్..... సూర్య : ఆ sir..... ఉన్నాను.....ఏం sir గిట్ల ఒచ్చిండ్రు..... నేను: ఏం లేదు సూర్య ఊరికనే, మొన్న జ్వరం వచ్చింది కదా ఎట్లున్నవ్ అని అడగడానికి వచ్చిన..... సూర్య : ఏంటి sir, నాతో బాగా పనిచ్చేయించుకోనేటాల్లే ఎవరు ఎట్లున్నవ్ అని అడగరు....మీరు అడుగుతున్నారు అంటే చాలా సంతోషం గా ఉన్నది sir..... హా మంచిగానే ఉన్న sir..... నేను : ఇంతకీ ఏ ఊరు సూర్య, గీ వెలుతురు రాని రూమ్ లో ఎట్లుంటున్నరు.....నిజంగా నాకైతే మంచిగనిపిస్తలేదు.... సూర్య : ఏం జేస్తం sir , బైట కిరాయికి ఉండేటట్టు లేదు, ఇక్కడైతే కిరాయి కిరి కీరి లేదు , పిల్లలకి స్కూల్ దగ్గర ఉంటది, నేను కూడా ఈడనే పని చేసుకుంటూ ఉంట. ఇంతకీ చెప్పనే లేదు కదా sir , మాది నల్గొండ జిల్లా sir, మాల్ అని ఒక చిన్న ఊరు sir, ఈడ నుండి ఒక 70 కిలో మీటర్లు. నేను: మరి అక్కడినుండి ఈడికి ఒచ్చిండ్రు, ఊళ్ళో ఏం లేదా సూర్య...... సూర్య : ఉంది sir, ఊళ్ళో ఒక చిన్న ఇల్లు, 5 ఏకరాల పొలం ఉంది, మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. నేను: అంటే ఐదు ఎకరాల ఆసామివి అన్నమాట..... సూర్య : ఏం ఆసామి sir, వ్యవసాయం అనేది చేయలేక , ఓడిపోయి ఈడికి వచ్చిన sir..... నేను: ఏం గట్ల అంటావ్, వ్యవసాయం చేస్తే మస్త్ ఉంటది అంట, మొన్నటికి మొన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో ఎకరానికి కోటి రూపాయలు సంపాదించినడు కదా.....కోటి కాకపోయినా అందులో పది శాతం చేసిన మంచిగానే ఉంటది కదా......ఫుల్ పైసలు..... సూర్య : ఏమో sir, ఆయనకి ఎట్లా కోటి రూపాయలు వచ్చినాయి నాకైతే తెల్వదు sir. వ్యవసాయం ఈ కాలం లో కష్టం అయిపోయింది sir, కష్టపడడానికి ఏం ప్రాబ్లెమ్ లేదు sir, గ్యారంటీ లేని జూదం లాగా తయారయ్యింది sir వ్యవసాయం. నేను : ఏమైంది గిట్ల జూదం, గీదం అని పెద్ద మాటలు మాట్లాడతున్నవ్...... సూర్య : గట్లనే ఉంది sir పరిస్థితి, పంటపై పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి sir. కొన్ని నెలల క్రితం టొమాటో రేట్ కిలో 50 రూపాయలు , ఇంకా పెరుగుతుంది అని టీవీ ల చెప్పిండ్రు, మేము కూడా అది నమ్మి మూడు లక్షల రూపాయలు బ్యాంక్ లో అప్పు తెచ్చి టొమాటో పంట వేసినం. అంత మంచిగానే ఉండే, అన్ని ఖర్చులు పోను ఒక లక్ష రూపాయలు మిగులుతాయి అని అనుకుంటే ఇప్పుడు రేట్ చుసిండ్రా sir, కిలో 5 రూపాయలు sir..... నేను: అదేంటి ఇక్కడ కిలో ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు, సూర్య : అంతే sir, కనీసం ఆ రేటు వచ్చిన మా ఖర్చులకి డబ్బులు మిగులుతుండే, కానీ మా దగ్గర టోకుకి 5 రూపాయల లెక్కకు కొని మీకు ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు sir ఈ దళారీలు. మా కష్టాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు sir, నేను: ఇదంతా శ్రమ దోపిడీ, ఇది మోసం లాగా అనిపించడం లేదా సూర్య..... సూర్య : మోసం అంటే మోసమే sir, కాదు అంటే కాదు sir. ఇలా మోసపోయిన వాళ్ళలో నేను మొదటివాడిని కాదు, చివరివాడిని కాదు. పంట పండించే రైతుకి లాభం పక్కన పెడితే పెట్టుబడి తిరిగి వస్తుంది అనే నమ్మకం లేదు sir. అదే కష్టం ఇక్కడ పడితే కనీసం నెల నెలా జీతం వచ్చి మా అందరి నోట్లో ఒక ముద్ద దిగుతుంది sir. నేను: రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కదా, మీకు పెట్టుబడి కూడా ఇస్తుంది కదా.... సూర్య: ఏం చర్యలు sir, మాకు ఏ చర్యలు, పెట్టుబడులు, "శ్రామిక బంధులు" అవసరం లేదు sir, పెట్టుబడికి , కష్టానికి తగిన ఫలితం ఉంటే చాలు sir. Maa దురదృష్టానికి ఎవరూ ఆ మాట మాట్లాడరు sir. ఎకరానికి 4000 పెట్టుబడి అని శ్రామిక బంధు పథకం అని ఇస్తున్నారు, ఎవరికి కావాలి sir , మా పెట్టుబడికి రక్షణ, మా పంట మా శ్రమ దళారీల దోపిడీకి గురి కాకుండా ఉంటే నేను మా ఊర్లోనే ఉండేవాడిని sir...... నేను: నువ్వు చెప్పింది నిజమే, వ్యవసాయం కష్టమే. మరి 5 ఎకరాలు ఉంది కదా, మీ ఊరు కూడా హైదరాబాద్ కి దగ్గర్లోనే ఉంది, భూమి అమ్మేస్తే మంచిగా పైసలు వస్తాయి కదా.....ప్లాట్లు చేసి అమ్మేస్తారు. సూర్య : ఏం sir, పైసలకోసం మా భూమిని అమ్మేయాల్నా......నన్ను నేను అమ్ముకుంట కానీ, నేను భూమిని అమ్మ sir..... మా అమ్మ sir ఆ భూమి....మా తాతల తండ్రుల నుండి వచ్చిన ఆస్తి sir.... నేను చచ్చిన అమ్మను. అయినా అందరూ భూమిని అమ్ముకుంటూ పోయి ఇల్లు కట్టుకుంటూ ఉంటే, ఇంక మనం ఏం పండించాలే, ఏం తినాలె...... నాకు నమ్మకం sir, వ్యవసాయానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని. నేను: సూర్య చెప్పింది అక్షరాల నిజం అన్నింటికీ ఒక ప్రత్యామ్నాయం ఉంది కానీ తిండి కి లేదు అని మనసులో అనుకొని. ఇంత బాగా మాట్లాడుతున్నావ్ ఏం చదువుకున్నవ్ సూర్య.... సూర్య: ఇంటర్ దాకా చదివిన sir.. నేను: సరె, ఇంతకీ వయవసాయానికి మంచిరోజులు అంటే ఎట్ల చెప్తావా..... సూర్య: ఏం లేదు sir, simple, 1) పంట వేసినప్పుడే ధర నిర్ణయించాలి ఒకవేళ ధరలో ఏదైనా మార్పులు ఉంటే ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించి రైతుకు నష్టం లేకుండా చూడాలి. 2) చాలా ప్రాంతాల్లో రైతు పండించిన పంటలు నిల్వ ఉంచడానికి గిడ్డంగులు లేవు, ప్రభుత్వం చొరవ తీసుకొని గిడ్డంగులు కట్టించాలి. 3) మీకు తెలుసా sir, టొమోటో రేటు ఎంత తక్కువైన , మనం తినే టొమోటో సాస్ రేటు మాత్రం అలాగే ఉంటది. అంటే మన వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేసి అమ్మే ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థని నెలకొల్పాలి. 4) ఒకవేళ అనుకొని విపత్తులు వస్తే రైతుకి పంట నష్టాన్ని ఇవ్వాలి. ఇంకా చాలా ఉన్నాయి sir, ఇవన్నీ చేస్తే మాకు ఏ పథకాలు, రుణ మాఫీలు అవసరం లేదు sir..... మాకు మేమే రాజు లాగా ఉంటాం. ఇదంతా విని, సూర్యని భుజంపై తట్టి , నువ్వేం భయపడకు నిజంగా మనకు మంచి రోజులు వస్తాయి, నాకు నమ్మకం ఉంది అని చెప్పి అక్కడినుండి నేను బయలుదేరాను..

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు