పరగడుపు - జీడిగుంట నరసింహ మూర్తి

Paragadupu

"ఎప్పుడూ ఈ బీరకాయలు, బెండకాయలు తప్ప మీకు ఏ కూరలు దొరకవా ? పోనీ తెచ్చేవి ఏవేనా బాగుంటున్నాయి అనుకుంటే బెండకాయలు ముదుర్లు, బీరకాయలు చేదు. ఆ అమ్ముడు పోనివి అన్నీ మీ మెతకతనం చూసి అంటగట్టేస్తారు. ఇవన్నీ చూసి వండటం నా వల్ల కాదు. నేను నా కొడుకు చేత ఆన్లైన్ లో తెప్పించుకుంటాను. ఇకనుండి మీరు కూరలు తీసుకురాకండి " అని సీరియస్గా అల్టిమేటం ఇచ్చేసింది శ్రీకాంత్ భార్య రాజేశ్వరి.

"అవునవును . నీకు బంగాళా దుంపలు వండటం చాలా తేలిక. అది కాకపోతే చేమదుంపల వేపుడు. ఆలుగడ్డలు వంటరాని వాళ్ళు కూడా ఈజీ గా చేసెయ్యగలరు. కానీ నీకేం ఖర్మ ? ఒక్కొక్క కూరకాయతో పదేసి రకాలు ఎలా చేయొచ్చో అందరికీ చెపుతూంటావుగా. సుగర్ వ్యాధి ఇద్దరం ఒళ్ళంతా పెట్టుకుని ఈ దుంపలు తింటూ కూర్చుంటే చివరకు సుగర్ సూటప్ అయ్యి కాళ్ళూ చేతులు కొట్టేయ్యాల్సి ఉంటుంది. మనం ఏమైనా అడివిలో ఉన్నామా కందమూలాలు తిని బ్రతకడానికి ? ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్ధం కాదు. నేను ఏ కూరలు పడితే అవి తీసుకురాను. . మన కున్న రోగాల బట్టి ఏవి మంచివో, ఏవి ప్రమాదమో నెట్లో, యూట్యూబ్లో చూసి కానీ తేను . నువ్వు వండకపోతే మానెయ్యి. నాకొక్కడికే నేనే వండుకుని తింటాను. అసలు బీరకాయలోనూ, బెండకాయలోనూ ఉన్న ఓషధ గుణాల గూర్చి నీకేమనా తెలుసా?. ఎప్పుడైనా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించావా ? రేపటినుండి బంగాళా దుంపలు ఇంట్లో కనపడటానికి వీల్లేదు. దాని బదులు పచ్చి అరటి కాయలు తెస్తాను. అవి తింటే బ్రైన్ చురుకుదనానికి, కండరాలు ఎముకలు బలంగా ఉండటానికి, బీపీలు , షుగర్లు అదుపులో ఉంచడానికి , ఇంకా సీ విటమిన్ ఇందులో బాగా ఉంటుంది. ఎప్పుడు ఫోనులో రకరకాల వంటలు గురించి మీ ఫోనుల్లో అందరితోనూ అంతగా చర్చలు చేస్తూ ఉంటావుగా ? వాళ్ళెవరూ ఏవి మంచివో ఏవి కావో ఎప్పుడూ చెప్పలేదా ? . నువ్వు నేను చెప్పినవి పెడచెవిన పెడతావనే ఎప్పటికప్పుడు నీ వాట్స్ యాప్లో పెడుతూ ఉంటాను. నా దగ్గర నుండి ఏ మెసేజ్ వచ్చినా నిర్లక్ష్యంతో వాటిని డిలీట్ చేసేసి ఎంతో విలువైన సమాచారాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇంకో అరగంటలో నీకూ, నీ కొడుక్కి , నీ కూతురికి నేను తెచ్చే కూరకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేవో మీ అందరి వాట్స్ యాప్లో పెడతాను. అవి చదవకుండా తీసేశారో ఇక రోగాలు కోరి తెచ్చుకున్నట్టే. ...ఇప్పటికి మనకున్న అష్టైశ్వర్యాలు చాలు. నువ్వైనా, నేనైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది " అన్నాడు శ్రీకాంత్ సీరియస్గా. ఆ గొంతులో కటువుతనం, కర్కశం కనిపించింది. .

రాజేశ్వరి వంటలు వండే విషయంలో తన ప్లాన్లో తనుంటుంది. తను వండే వంటలలో ముఖ్యంగా కారాలు, నూనె బాగా పడి రుచులు అదిరిపోతూ ఉంటాయి. వంకాయ మినప్పప్పు కారం, మెంతి కారం, ఉల్లికారం కూరలు చెయ్యడంలో స్పెషల్. ఇక అన్నంలోకి రోజూ ఏదో ఒక ఊరగాయ ఉండాల్సిందే. ఇలా ఏదో రూపంలో ఉప్పు కిలోల కొద్దీ శరీరంలోకి వెళ్ళి పోతూ ఉంటుంది. ఏ నూనె క్వాలిటీని నమ్మలేని ఈ రోజుల్లో నెలకు కనీసం ఆరు లీటర్ల నూనె ప్యాకెట్లు ఆవిరైపోతూ ఉంటాయి. అవి ఊరుకునే వదిలిపెడతాయా ఆ మొగుడూ పెళ్ళాలు ఇద్దరికీ బీపీలు, షుగర్లు, ఈ మధ్య కొత్తగా కొలెస్ట్రాల్ సమస్య కూడా పట్టుకుంది. ఒక పక్క పేపర్లలోనూ, టీవీలలోనూ కూర్చున్న వాళ్ళే కూర్చుని గుండె నొప్పితో హరీ అంటున్న వార్తలుతో హోరెత్తిచ్చేస్తూ ఉంటే మనకి కాదుగా అనుకుంటూ వాటిని పట్టించుకొని కుటుంబాలు లెక్కకు మించి ఉంటున్నాయి. .

ఆ రోజు శ్రీకాంత్ దగ్గర బంధువు ఒకాయన ఒకాయన ఫోన్ చేసి గుడివాడలో ఒకళ్లు స్వగృహ వంటకాలు అంటూ అన్ని రకాల పచ్చళ్లు, వడియాలు, చల్ల మిరపకాయలు, కారం అప్పడాలు , కారప్పూస ఇంకా ఎన్నో వస్తువులను చక్కగా ప్యాక్ చేసి కొరియర్ ఛార్జీలు కూడా లేకుండా పంపిస్తున్నారు. నేను వెంటనే కొరివి కారం, గోంగూర, నల్ల కారం, ఇంకా అరిసెలు, జంతికలు లాంటివి తెప్పించుకున్నాను. ఎంత బాగున్నాయో చెప్పలేను. ఇంటికి ఎవరైనా వస్తే మెచ్చుకోకుండా వెళ్ళడం లేదు. సాధ్యమైనంతవరకు ఇంట్లో బూర్లమూకుడు పొయ్యిమీద పెట్టదల్చుకోలేదు. . నీకు కావాలంటే చెప్పు. నీ అడ్రెస్ కు పంపించమని చెపుతాను. . ఒకసారి తిని చూడండి. అటువంటి వాళ్ళను మనం ప్రోత్సహించాలి. . అంతగా మనకు నచ్చకపోతే మళ్ళీ ఆర్డర్ ఇవ్వం. అంతేగా. ఒక్కసారి తీసుకోవడంలో నష్టం లేదు. ఏ విషయమో ఈ సాయంత్రానికల్లా చెప్పు . నేను తీసుకున్న ఐటం లన్నీ వాట్స్ యాప్లో పెడుతున్నాను " అంటూ శ్రీకాంత్ ను టెమ్ప్ట్ చేసేశాడు. అవతల బంధువు వాట్స్ యాప్లో పెట్టిన వస్తువులు చూశాక ఆయన మాట కాదనలేక మొహమాటంతో "సరేరా. నా అడ్రెస్ పంపుతున్నాను. పచ్చళ్లు , మిగిలిన తినేవన్నీ ఒక్కొక్కటీ పావు కేజీ కన్నా ఎక్కువ వద్దు.. చల్ల మిరపకాయలు ఎక్కడ చూసినా ఉప్పు నీళ్ళల్లో నానేసి చేస్తున్నారు. అప్పడాలలో కూడా ఉప్పు ఎక్కువుంటుంది. ఇంకా పచ్చళ్ళ గురించి చెప్పనవసరం లేదు. అవి ఊరగాయలు కాబట్టి ఉప్పు లేకపోతే నిలవ ఉండవని బస్తాలు బస్తాలు ఉప్పు కలిపేస్తూ ఉంటారు. ఈ ఆర్డర్ కూడా నేను మా ఆవిడతో చెప్పకుండా ఇస్తున్నాను. ఒక పక్క ఉప్పులు, కారాలు, నూనెలు ఎక్కువైపోయి బీపీలు, పెరిగిపోతున్నాయి అని ఆవిడను రోజూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే నేనే ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నానను అంటే కేవలం నీ మాట తీసెయ్యలేకే ! ఇవి చూశాక మా ఆవిడ గ్యారంటీగా నామీద చెలరేగిపోతుంది. ఎలాగో నా బాధ నేను పడతాను కానీ అన్నీ పావు పావు పంపించగలిగితేనే పంపమను . లేకపోతే వద్దు " అంటూ చెప్పేశాడు శ్రీకాంత్ నిర్మొహమాటంగా. .

మరో రోజు సంగతి .

" ఏమోయ్ ఇది విన్నావా ప్రిజ్జులో ఇరవై నాలుగు గంటల కన్నా ఉంచిన దోసెల పిండి వాడితే విషంగా మారిపోతుందిట . అలాగే ఏదైనా ప్రిజ్జులోంచి బయటకు తీసిన పదార్థాలు గంట లోపు బయట ఉంచకుండా వేడి చేసి తిన్నా అది కూడా విషం అయిపోతుందిట .రేపటినుండి దోసెల పిండి , ఇడ్లీ పిండి ఏ రోజుది ఆ రోజే తయారు చేసుకుందాం కొద్దిగా శ్రమ పడ్డా కూడా . మళ్ళీ మళ్ళీ చెపుతున్నాను .నీ మాటేమో కానీ నేను ఆ విషం తినక కాక తినను.ఇప్పటికే మందుల రూపంలో నా కడుపంతా విషం పేరుకుపోయింది. . ఇప్పుడు నేను బ్రతికే సమయాన్ని ఈ విషాలన్నింటినీ,ఈ కల్తీ నూనెలు తాగుతూ నాలుగేళ్లు తగ్గించుకున్నను.ఇంకా తగ్గించుకుంటే పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యకుండానే పోతానేమో.నీ ఇష్టం,"అన్నాడు సీరియస్గా శ్రీకాంత్ .

"అబ్బబ్బ.ఆ వెధవ యూట్యూబ్లో చూసి ఇంటిల్లిపాదిని బ్రతికుండగానే ఆయుషును హరింపచేస్తున్నారు. వాళ్లేదో అవి చూసి లైకులు కొట్టేవాళ్లు ఉంటే వాటిమీద వేలకు వేలు సంపాదించుకోవడానికి అడ్డమైన చెత్త గురించి పెట్టేస్తూంటారు. నేను చూస్తూ ఉంటాను అవన్నీ. అందులో ఉన్నవన్నీ అబద్దాలే. మనలాంటివాళ్లను ప్రేరేపించి డబ్బు చేసుకుంటూ ఉంటారు. అసలు ఏ ఇంట్లో చూసినా నెలేసి రోజులు కూరలు,కనీసం వారం రోజులు పిండ్లు పెట్టుకుని పనిమనిషి కి కూడా పెట్టకుండా తింటూ వుంటే లేని భయం ఇప్పుడు కొత్తగా మీకెందుకు?మీరిలాగే రోజూ ఏదో రకంగా బెదిరిస్తూ ఉంటే మీ కొడుకుతో చెప్పి మీ ఫోనులో యూ ట్యూబ్ కాస్తా తీయించేస్తాను. అప్పుడు ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వకుండా వండినదేదో నోరుమూసుకుని తింటారు "అంటూ శ్రీకాంత్ మీద మండిపడింది రాజేశ్వరి.

ఆ రోజు కొరియర్ శ్రీకాంత్ బంధువు చెప్పిన ఊరగాయలు, తినే పదార్ధాలు బట్వాడా చేసేశాడు.

"ఏమిటవీ మందులా ? " అడిగింది రాజేశ్వరి . శ్రీకాంత్ ముఖం వివర్ణం అయ్యింది .భార్య కళ్ళముందు ఆ ప్యాక్ విప్పదీయాలంటే అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. .

"మందులు అయితే ఇంత పెద్ద ప్యాక్ ఎందుకుంటుంది కానీ . నువ్వు రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉంటే చెపుతాను దీని గురించి. ఒక్కోసారి మొహమాటాలు తప్పవు. మా చిన్నాన్న గారి అబ్బాయి శేఖర్ లేడూ వాడు వద్దురా బాబూ మేమవన్నీ తినడం మానేశాంరా బాబూ అని మొరపెట్టుకున్నా కూడా వాడికి తెలిసిన వాళ్లెవరో కొత్తగా పచ్చళ్ళ వ్యాపారాం పెట్టారని తను కొంత బిజినెస్స్ ఇప్పిస్తానని మాటివ్వడంతో నన్ను బ్రతిమాలుకుని ఈ ఒక్కసారికి తిని చూడమంటూ పంపించాడు. వట్టి పచ్చళ్లు ఏం తింటామ్ అని దానితో పాటు కారప్పూస, అప్పడాలు, చల్ల మిరపకాయలు కూడా పనిలో పనిగా పంపించే ఏర్పాటు చేశాడు. . లకీగా అవి తయారు చేసిన వాళ్ళు కొరియర్ ఛార్జీలు కూడా భరించి పంపారులే . గతంలో శేఖర్ సహాయం కూడా మనం ఎన్నోసార్లు పొందాం. కాదనలేక నీకు చెప్పకుండానే తెప్పించానోయ్ . . అంతగా మనం తినలేకపోతే ఇంటికి వచ్చిన బంధువులకు భోజనంలోకి ఉపయోగిద్దాం ....." అంటూ విరుచుకుపడటానికి సిద్దంగా ఉన్న భార్యను కన్విన్స్ చెయ్యడానికి కొద్దిగా కలిపించి చెప్పాడు శ్రీకాంత్. .

"అవునులెండి . మీకిష్టమైతే ఏదైనా చేస్తారు. చూస్తూంటే మీకు ఇంట్లో పచ్చళ్లు పెట్టడం ఇష్టం లేదంతే. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ముందు ఆ ప్యాక్ విప్పదీసి చూడండి. తింటామో అవతల పారేస్తామో ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టి తెప్పించుకున్నాక తప్పుతుందా ? " అంటూ తను కూడా ప్యాక్ విప్పడంలో సహాయ పడింది రాజేశ్వరి స్త్రీ సహజమైన ఆసక్తిని చంపుకోలేక .

" సరే కానీ అసలు ఆ జంతికలు , కారప్పూసా ఎలా ఉన్నాయో ఒకసారి నోట్లో వేసుకుని చూడు . వాళ్ళు ఏ నూనె పడితే అది వాడరు. మంచి రిఫైన్ద్ ఆయిల్ వాడతారని చెప్పారు. " అంటూ మొగుడూ పెళ్ళాలు ఇద్దరూ ఒక జంతికను విరిచి చెరో ముక్క నోట్లో వేసుకున్నారు.

" ఆ కారప్పూస కూడా చూడు పనిలో పనిగా.ఇవి తిని రుచి గురించి శేఖర్ కి చెప్పాలి. రేపు పప్పులోకి చల్ల మిరపకాయలు కూడా వేయించు. పక్కన నాలుగైదు కారపు అప్పడాలు కూడా. అన్నిటికీ కలిపి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి . దాన్ని బట్టే అవి తయారు చేసే వాళ్ళు తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారుట. .." అంటూ మరో జంతికను విరిచి నోట్లో వేసుకున్నాడు లొట్టలేసుకుంటూ. మొగుడు ఆబగా తినడం చూసి రాజేశ్వరికి కూడా కొద్దిగా ధైర్యం వచ్చి తను కూడా వాటిపైన ఒక చెయ్యి వేసింది.

" ఈ రోజు వొంట్లో బాగుండక ఏదో ఒక కూర వండేసి పారేశాను. పప్పు ఇంకో రోజు వండుకుందాం. ఎలాగో ఈ రోజుకు తినెయ్యండి " అంది రాజేశ్వరి నడుం నొప్పితో ఇబ్బంది పడుతూ ఒక రోజు .

" సరే ... సరే .. ఇటువంటప్పుడే ఆ పచ్చళ్లు ఉపయోగపడతాయనే ముందు ఆలోచనతో నేను ఈ విషయంలో ఎంత విబేధించినా కూడా ధైర్యం చేసి ఊరగాయలు తెప్పించాను. కొద్దిగా లిమిటెడ్ గా తింటే అంత పెద్ద చేటు చెయ్యదులే. కొద్దిగా ధైర్యం చెయ్యాలి. ఇవి వాడేశాక . ఇక ముందు వాటి జోలికి పోకుండా ఇద్దరమూ జాగ్రత్త పడదాం. ముందు ఆ ఆవకాయ వేడివేడి అన్నంలో వేసి దాని మీద నెయ్యి , పక్కన కాస్త పెరుగుమీద మీగడ కూడా ఉంచు. ఇన్నాళ్ళు లేనిది ఈ పూటకు ఏం కొంప ములుగుతుంది కానీ ..." అంటూ కూర కూడా వేసుకోకుండా ఆవకాయ మీద లంకించుకున్నాడు శ్రీకాంత్ క్షణం ఆలస్యం చేయకుండా.

రాజేశ్వరి భర్తను ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది.

** ** **

కొన్నాళ్ళ తర్వాత సంగతి .

"ఏమోయ్. మా కజిన్ శేఖర్ మనం ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఆ గుడివాడలోని వాళ్ళ పచ్చళ్ళ వ్యాపారం రెండింతలు అయ్యింది అని సంతోషంగా చెప్తూ ఫోన్ చేశాడు. మళ్ళీ ఏమైనా పచ్చళ్లు కావాలా అని అడుగుతున్నాడు. ఒక వారం క్రితమే కొత్త ఆవకాయ, మాగాయ, కొరివి కారం పెట్టారుట. అవి కూడా తిని మన అభిప్రాయం చెపితే ఏవైనా మార్పులు చెయ్యాలంటే ఆ పచ్చళ్ళ కంపినీ వాళ్ళు భవిష్యత్తులో చేసి మార్కెట్లో ఉంచుతారుట. . నీ వుద్దేశ్యం చెపితే వాళ్ళకు ఆర్డర్ చేస్తాను "అన్నాడు శ్రీకాంత్ గతాన్ని మరిచిపోయి పూర్తి మైకంలో పడిపోయి.

" నన్ను అడుగుతారే ? ఆ పచ్చళ్లు తినకూడదంటూనే అవి లేకుండా మీకు ఏ రోజూ ముద్ద దిగలేదు. ఏం చేస్తాం ? మీతో పాటు నేనూనూ ..ఆ బీపీ మందులు వేళకు వేసుకుంటూ ఇతర ఆరోగ్య సూత్రాలు పాటించడమే . ఒక రెండు మూడు నెలలు వరకు వస్తాయి . పావు కేజీ ఏమి సరిపోతుంది ? ఈ సారి అర కేజీ పంపించమని చెప్పండి .పాపం పిల్లలు కూడా ఇష్టపడి తింటున్నారు ..." అంటూ ఇంకా అక్కడే ఉంటే మొగుడి మనసు ఎక్కడ మారిపోతుందేమో నన్న భయంతో వెంటనే వంటగదిలోకి పరిగెత్తింది రాజేశ్వరి *****

సమాప్తం

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి