పాత కాలపు మనిషి - ఇందు చంద్రన్

Paata kalaapu manishi

“ఏంటి రమేష్ నాన్నగారు ఈ మధ్య బయటెక్కడ కనపడటం లేదు. ఒంట్లో బాలేదా? అంటున్న రాఘవయ్య మాటలకి ఆగి పక్కకి చూసాడు రమేష్.

ఓ నూలు సంచిలో కూరగాయలు, మరో చేతిలో గొడుగు పట్టుకుని నడిచి వస్తున్నాడు రాఘవయ్య.

రాఘవయ్య రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి.అదే కాలనీలో పక్క అపార్ట్ మెంట్ లో ఉంటారు. రోజు సాయంత్రం పార్క్ లో తిరిగే సమయంలో రమేష్ వాళ్ళ నాన్న గారితో పరిచయం ఏర్పడడంతో ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. గత కొన్ని రోజులు ఆయన కనపడకపోవడంతో తెలుసుకోవాలన్న ఆరాటంతో ఆయన కొడుకు రమేష్ ని అడిగేసాడు.

రమేష్ కాసేపు ఆలోచించి “ నాన్న గారు ఊరెళ్ళారు అంకుల్ ఇక్కడి వాతావరణానికి ఆయన అలవాటు పడలేకపోతున్నారు అన్నాడు సూటిగా చెప్పి వెళ్ళిపోతూ.

ఆ సమాధనం రాఘవయ్య కి కాస్త వింతగా అనిపించింది.

“అదేంటి రమేష్! ఆయన ఇక్కడే మనవడితో కాలక్షేపం చేస్తూ గడిపేయాలి అని పదే పదే అంటూ ఉంటారు. ఉన్నట్టుండి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు అన్నాడు రాఘవయ్య మరోసారి రమేష్ మొహంలోకి చూస్తూ

అప్పటి వరకు వేగంగా నడిచిన రమేష్ నడకలో వేగం తగ్గించి రాఘవయ్యతో పాటు నడుస్తూ

“పెద్ద వారు అందులోను నాన్న గారికి ఇక్కడ బాగా పరిచయస్తులు. మీరే చెప్పండి అంకుల్! ప్రతి చిన్న విషయాన్ని చాదస్తంతో అడ్డు చెప్తూ అందరిని విసిగిస్తూ ఉంటే ఎలా? విసిగిపోతున్నాం. ఏదో కోపంలో మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పాను ఆ మాత్రం దానికి వైరాగ్యంతో ఊరెళ్లిపోయారు. మా అవసరం వచ్చాక ఆయనే మళ్ళీ వస్తారు అన్నాడు రమేష్ ధీమాగా.

“నువ్వన్నది నిజమే రమేష్! మీ నాన్న గారికి ఈ కాలానికి తగ్గట్టు నడుచుకోవడం తెలీదనుకుంటాను. మొదట్లో నేను అంతే మా వాడు పదే పదే నన్ను విసుక్కుంటూ ఉండేవాడు అన్నాడు రాఘవయ్య నిస్సత్తువగా నవ్వుతూ.

“అయినా ఈ వయస్సులో ఏదో ఇంత తిని భక్తి టివిలో ప్రవచనాలు చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ గడిపేయకుండా మా ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడే కాదు ఆయన మొదట్నించి అంతే.పిల్లాడి మొదటి పుట్టిన రోజని గ్రాండ్ గా చేస్తే పెద్ద పేచి పెట్టారు. అంత హంగామా అవసరమా? అన్నట్టు. పిల్లవాడికని టాయ్ కార్ కొన్నప్పుడు అలానే అన్నారు. నాకు మా నాన్న కనీసం సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొని పెట్టలేకపోయారు కాని నేను నా కొడుక్కీ అన్నీ ఇవ్వాలని ప్రయత్నించడం తప్పా? ఇప్పుడు పిల్ల వాడు స్కూల్ చదువుతున్నాడు కరోనా తర్వాత అన్నీ ఆన్లైన్ క్లాసులు అవడంతో ట్యాబ్ కొనిచ్చాడు ఆ మాత్రం దానికి పెద్ద రాద్దాంతం చేసారు. ఒక్క పిల్లాడి విషయమే కాదు, మా ఆవిడతోను అంతే అనవసర ఖర్చులు తగ్గించమని ఇంట్లో వండే వంటకాలను ఆయన పాత కాలపు వంటలని అనుసరించి చేయమంటారు. ఇప్పట్లో అవన్నీ ఎవరు తింటున్నారు? అరటి పువ్వుని, బెండుని తీసుకొచ్చి వండమని చెప్తారట. అవన్నీ అబ్బాయికి లంచ్ బాక్స్ లో ఎలా పెట్టి పంపాలి? వాడు చదివేది ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడ పిల్లలంతా చాలా ట్రెండీ గా డైట్ ఫుడ్ తీసుకెళ్తారు. ఇక మిగిలిన విషయాలకొస్తే రాత్రి అందరూ ఆయన తో కలిసే భోజనం చేయాలి అంటారు. కాసేపు ఆయనతో మాట్లాడాలి అంటారు. మాకసలు ఆఫీసు నుండి వచ్చాక అంత ఖాళీ ఉండదు. అబ్బాయిని ప్రతి చిన్న విషయానికి హెచ్చరిస్తూ మందలిస్తూ ఉంటే మా ఆవిడకి అసలు నచ్చట్లేదు. మరీ చాదస్తం ఎక్కువైపోయింది. ఆయన పాతకాలం అలవాట్లు మా మీద రుద్దుతుంటే సర్దుకునిపోలేక ఓ రోజు తిరిగి మాట్లాడేసాను అంతే ఊరికి వెళ్లిపోయారు అన్నాడు రమేష కాస్త బాధగా.

“ఇది అందరి ఇళ్లలోనూ ఉండేదే రమేష్. వయసైపోతుంది కదా, చాదస్తం ఎక్కువే మరి. ఇంకేంటి ఇప్పుడు అంతా బావుందా? ఇంట్లో అడ్డు తగిలే మనిషి లేరు అన్నాడు రాఘవయ్య నవ్వుతూ.

“బాగా అంటే...ప్రశాంతంగా అయితే ఉన్నాం. ఒక వయసొచ్చాక హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంకుల్. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఇలా మనస్పర్థలు అవసరమా? చిన్నప్పటి నుండి నన్ను మా నాన్న దగ్గరకి తీసుకుని చనువుగా ఉన్నట్టు గుర్తు కూడా లేదు కాని నేనలా కాదు మా వాడికి బెస్ట్ ఫ్రెండ్ లా ఉండాలి అనుకుంటున్నాను అలానే ఉంటాను అన్నాడు రమేష్ గర్వంగా ఫీలవుతూ.

“మంచిదే కదా... అయితే మీ అబ్బాయికి నువ్వే హీరో అన్నమాట అంటూ చిరునవ్వు నవ్వాడు రాఘవయ్య.

రమేష్ కూడా చిరునవ్వుతో “మా నాన్న కూడా మీలాగే ఆలోచిస్తే బావుండేదేమో అంకుల్. మిమ్మల్ని ఎప్పటి నుండో చూస్తున్నా, మీరు మితభాషి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడుతారు. కాని ఆయన అలా కాదు మా అపార్ట్ మెంట్ వాచ్ మెన్ నుండి పాల వాడు,పేపర్ వాడు ఇంకా అన్నీ ఫ్లోర్స్ లో ఉండే వాళ్ళని బలవంతంగా పలకరిస్తూ సలహాలు ఇస్తూ ఉంటారు అన్నాడు అసహనంగా మొహం పెట్టి.

“పోనిలే...ఇక మీదట మీకు ఆయన వల్ల ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు నీరసంగా నవ్వి

ఇక మీదట మీకు ఆయన వల్ల ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు నీరసంగా నవ్వి వాళ్ళ అపార్ట్ మెంట్ వైపుకు అడుగులు వేసాడు రాఘవయ్య.

***

రాఘవయ్య మనసంతా ఏదో కలియబెట్టినట్టు అనిపించింది. రమేష్ ని చూస్తుంటే కొన్నేళ్ల క్రితం తన కొడుకుని చూసినట్టే ఉంది. కాలానికి తగ్గట్టు తల్లిదండ్రుల ఆలోచనలు మారలేదన్న వాళ్ళ వాదన మరో సారి గతాన్ని పరిచయం చేసాయి.

రాఘవయ్య మితబాషి కాదు తనకి తెలిసిన విషయాన్ని పది మందితో పంచుకుంటూ అందరితో కలిసిపోయే కలుపుగోలు మనిషి. గ్రామం నుండి సిటీకి వచ్చాక కొడుకు గ్రామంలో లాగా కాకుండా అలా ఉండాలని ఇలా ఉండాలని ఆంక్షలు పెట్టడంతో వాళ్ళని నొప్పించలేక సర్దుకుని పోవడం అలవాటు చేసుకున్నాడు. చుట్టూ నలుగురు ఉన్నా నవ్వుతూ మాట్లాడే స్వేచ్చ దూరమైపోయింది. ఒంటరితనం అల్లుకుపోయింది.

రమేష్ వాళ్ళ నాన్నలాగే పిల్లల విషయంలో బాధ్యతగా ఉండాలని, దుబార ఖర్చులు తగ్గించి , పిల్లలు పెరిగే కొద్ది కష్టార్జితంలో కాస్త పొదుపు ఉండాలని హెచ్చరించడం వాళ్ళకి ఇబ్బందిగా అనిపించి దూరంగా వెళ్ళిపోయారు. కొన్నాళ్లకి కరోనా రావడంతో కొడుకు ఉద్యోగం పోయి కనీస అవసరాలకి , లోన్స్ కట్టుకోలేక సతమతమవుతూ తిరిగి తన వద్దకే వచ్చిన కొడుకుని గుర్తు చేసుకున్నాడు. ఏదో రోజు రమేష్ కూడా వాళ్ళ నాన్న ని అర్థం చేసుకుంటాడు అని మనస్సుకి సర్ది చెప్పుకుని నడుం వాల్చాడు రాఘవయ్య.

***

వారం రోజుల తర్వాత సాయంత్రం పూట కాలనీలోకి అంబులెన్స్ రావడంతో హ్యాంగర్ కి ఉన్న చొక్కాని తొడుక్కుని నెమ్మదిగా మెట్లు దిగి కిందికొచ్చాడు. ఏ ముసలి ప్రాణానికి ఏమైందో అని కంగారుగా కళ్ళ జోడు పెట్టుకుని దగ్గరగా గమనిస్తే ఏడుస్తూ అంబులెన్స్ లోకి ఎక్కుతున్న రమేష్ భార్యని చూసి కాస్త కంగారుగా అనిపించి దగ్గరికి వెళ్ళాడు.

మరో వైపు కంగారుగా బండెక్కుతున్న రమేష్ ని అనుసరించి వెళ్ళేలోపు అంబులెన్స్ వెళ్ళిపోయింది. ఎవరికి ఏమై ఉంటుంది. పోని వాళ్ళ నాన్న ఊరి నుండి వచ్చాడా? అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న అతన్ని ఆరా తీసాడు.

“ఏం లేద్ సార్...రమేష్ వాళ్ళ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసాడు ఏదో దేవుడి దయ వీళ్ళు చూసారు కాబట్టి సరిపోయింది.లేకుంటే పిల్లవాడు దక్కేవాడు కాదు. ఏంటో ఈ కాలం పిల్లలకి బొత్తిగా భయం లేకుండాపోతుంది అన్నాడు అతను వెళ్ళిపోతూ

ఆ మాట వినగానే రాఘవయ్య గుండెజల్లుమంది. పదకొండేళ్లు కూడా ఉండవు అంతటి పసి మనస్సులో అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అసలు అంతటి కష్టం ఏమొచ్చింది. రమేష్ అంతటి కఠినాత్ముడు కూడా కాదు, ఎందుకు అలా చేసుంటాడు అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు రాఘవయ్య.

రాత్రి పది దాటిన తర్వాత అబ్బాయిని తీసుకుని రమేష్ వాళ్ళ భార్య లోపలికి వెళ్ళడం చూసాక కాస్త మనస్సు కుదుట పడింది.

భోజనం ముగించుకుని కింద అపార్ట్ మెంట్ ముందు తచ్చాడుతూ ఉండగా అటు వైపు గా రమేష్ రావడం గమనించి దగ్గరికి వెళ్ళాడు రాఘవయ్య.

“అబ్బాయికి ఎలా ఉంది అన్నాడు నెమ్మదిగా

“పర్లేదంకుల్...ప్రమాదమేమి లేదన్నారు.కాని రక్తం ఎక్కువ పోయిందన్నారు. రక్తపు చారలతో వాడిని చూడగానే నా మనస్సు విరిగిపోయిందంకుల్ అంటూ పసి పిల్లాడిలా బావురుమన్నాడు రమేష్.

రాఘవయ్య భుజం పై చేయి వేసి ఓదారుస్తూ “ ఎందుకలా చేసాడు ? అన్నాడు నెమ్మదిగా

“వాడెప్పటి నుండో ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతున్నట్టు ఉన్నాడు. ఒకటి రెండు సార్లు నాన్న గారు కూడా ఈ విషయాన్ని నా దగ్గర చెప్పారు కాని పిల్లలు సరదాగా ఆడుకుంటారు అలా అనుకున్నాను. కాని డబ్బులు పెట్టి ఆడుతున్నాడని తెలీదు. ఈ మధ్య నా అకౌంట్ లో ఐదారు వేలు కట్ అయినప్పుడు మా ఆవిడ వాడిందనుకున్నాను.కాని మొన్న ముప్పైవేలకి పైగా డెబిట్ కావడంతో బ్యాంక్ కి వెళ్తే అక్కడ అసలు నిజం బయటపడింది. ఇంటికి వచ్చాక వాడిని మాములుగా అడిగి మందలించాను అంతే గదిలోకి వెళ్ళి తలుపేసాడు. ఎంతకీ రాకపోవడంతో తలుపు తెరిచి చూస్తే చేయి కోసుకొని ఉన్నాడు అన్నాడు కళ్ళ నిండా ఉబికి వస్తున్న కన్నీళ్ళతో.

రాఘవయ్య రమేష్ భుజం పై చేయి వేసి “ పిల్లలకి కావల్సినవి కొనిపెట్టడం తప్పు కాదు, కాని మితిమీరి ఇవ్వడం వలన వాళ్లకి విలువ తెలియదు.ఏదైనా సరే ఈజీగావస్తుందనే అనుకుంటారు. లేకుంటే కాస్త మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదిగే పిల్లలకి కష్టం విలువలని వాళ్లకి అప్పుడప్పుడూ అర్థమయ్యేలా చెప్తూ ఉండాలి. మీ నాన్న గారు నీకు కనీసం సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనివ్వలేకపోయారని అన్నావు కాని ఆయన నిన్ను ఆయన పడ్డ కష్టం నిన్ను పడనివ్వలేదు. నిన్ను చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీ జనరేషన్ వాళ్ళకి ఇది ప్యాషన్ అయిపోయింది. అప్పట్లో మాకిది ఇవ్వలేకపోయారు , మా పిల్లలకి ఇవ్వాలి అంటున్నారు. మా కాలంలో మూడు పూటలు తిండి దొరకటమే గొప్ప.అలాంటిది మిమ్మల్ని మాలా కాకుండా నీడ పట్టున బ్రతకాలని మా కష్టాలన్నిటిని పక్కన పెట్టి మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెట్టాలని తాపత్రయపడ్డాం. వయస్సు పెరిగే కొద్ది పిల్లలు కాస్త మొండిగా తయారవుతూ ఉంటారు. అందులోను మీసాలు గడ్డాలొచ్చాక మగపిల్లలు అసలు మాట వినరు.వాళ్ళ ఆలోచనా ధోరణి వేరుగా ఉంటుంది. నాన్నే పెద్ద శత్రువు అన్నట్టు చూస్తారు.అయినా నాన్నలం కదా కొడుకు తప్పుదోవ పట్టకుండా మందలిస్తూ ఉంటాం.డబ్బులున్నా అడిగిన దానికన్నా కాస్త తక్కువే ఇస్తూ సర్దుకుని పోవడం , బాధ్యత తెలిసేలా చేస్తాం.

నువ్వన్నది నిజమే వయస్సు పైబడ్డాక చాదస్తం ఎక్కువైపోతుంది. అన్నీ దాటుకొచ్చిన వాళ్ళం మీరు ఇబ్బంది పడకూడదనే నెపంతోనే చెప్తాం. ఇప్పుడు గొప్పలకోసం చేసే ఆ వృధా ఖర్చులు ఉపయోగపడే వాటి కోసం వాడమని చెబుతాము. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు ఉన్నట్టు రేపన్న రోజు ఉండదని అందరికి తెలుసు కాని ముందు చూపు ఉండటంలో తప్పు లేదు కదా? కరోనా వస్తుందని ఊహించామా? ఎంత మంది జీవితాలు దుర్భరంగా మారిపోయింది. ఉద్యోగాలు పొగొట్టుకుని, వ్యాపారాల్లో నష్టాలు. కనీసం పూట తిండి దొరక్కుండా అలమటించి, కుటుంబాల్లో పెద్ద దిక్కుని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఈ రోజు మనకు ఆ పరిస్థితి రాలేదు తర్వాత రాదన్న గ్యారంటీ లేదు కదా? ఒక్క డబ్బు విషయమే కాదు అన్నిటిని కలిపే చెప్తున్నాను. నాన్న బెస్ట్ ఫ్రెండ్ గా ఉండటం తప్పు కాదు రమేష్ , అలా అని బొత్తిగా భయం లేకుండా ఉండటం కూడా సరికాదు. పిల్లల మనస్సులు పారదర్శకమైనవి మనం చెప్పేవి , చేసేవే వాళ్ళు పాటిస్తారు. మీ నాన్న గారు అప్పుడప్పుడూ అంటూ ఉంటారు. ఈ సెల్ ఫోన్స్ వచ్చాక మనుషులు మాట్లాడుకోవడం మానేసారు అని అందుకే ఆయన మీతో ఫోన్ పక్కన పెట్టించడానికి అలా చేస్తూ ఉండేవారు. పెరిగే పిల్లలకి క్రమశిక్షన అవసరం. మొక్కై వంగనిది మ్రానై వంగునా? అందుకే మీ అబ్బాయిని కాస్త గట్టిగా మందలిస్తూ ఉండేవారు. ఆహారపు అలవాట్లు అంటావా అప్పుడు మేము తిన్న కొర్రలు అరికెలు సామెలు ఇప్పుడు మళ్ళీ వాడుకలోకి వచ్చాయి. మీరు రుచులు మాత్రమే చూస్తారు, ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి చెప్తూ ఉంటారు. పెద్ద వాళ్ళన్నాక చెప్పిందే పదే పదే చెప్తారు ఎక్కడ చెప్పాల్సింది మర్చిపోతారేమో అని. ఒక వయసొచ్చాక మేం గడిపిన క్షణాలు , ఙాపకాలు ఆవిరైపోతూ ఉంటే మీతో మిగిలిన సమయాన్ని గడపాలని చూస్తూ ఉంటాం. నువ్వన్నావు కదా మీ నాన్న గారెప్పుడు చనువుగా లేరని ఎక్కడ గారాబం చేస్తే మాట వినవేమోనని భయం. నువ్వు బాగా గమనిస్తే మీ అబ్బాయితో ఉన్నప్పుడు మీ నాన్నగారిని చూసావా? నీ మీద దాచుకున్న ప్రేమని కలిపి ఒలకబోస్తుంటారు.కల్మషం లేని మనిషి నాలాగా నటించడం చేతకాని మనిషి అందుకేనేమో నీకు పాత కాలపు మనిషిలా కనిపించాడు అన్నాడు రాఘవయ్య వెళ్ళిపోతూ.

రమేష్ రాఘవయ్య మాటలని గుర్తు చేసుకుంటూ వాళ్ళ నాన్న కష్టపడి పెంచిన తీరుని గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం కాలింగ్ బెల్ మోగగానే వెళ్ళి తలుపు తీసాడు.

ఎదురుగా నెరిసిన జుట్టుతో, ముడతలు పడి కమిలిన చర్మం వణుకుతున్న చేత్తో రమేష్ చేయి పట్టుకుని “నేను వచ్చేసాను కదా, నువ్వు పిల్లాడి గురించి మరేం దిగులు పడకు అన్నాడు చిరునవ్వుతో.

రమేష్ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉండగా వాళ్ళ నాన్న వైపు చూసి " సరేనన్నట్టు తలూపాడు.



మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao