బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా! - కొత్తపల్లి ఉదయబాబు

Bulapatam teerchukunte tappu leduraa

"అమ్మా. టిఫిన్ చేసి బల్లమీద పెట్టేసాను.పెట్టేయమంటే మీకు వడ్డించే వెళ్తాను.చీకటి పడితే నేను ఒక్కత్తినే మళ్లీ ఇంటికి వెళ్లలేను.మీరు వెళ్లమంటే నా మనవడికి ఫోన్ చేస్తాను.వాడొచ్చి బైక్ మీద తీసుకెళ్లిపోతాడు.లేకపోతే నాకు ఆటోకి వంద రూపాయలు హోలు."అంది వంట మనిషి నాంచారమ్మ ఈ మధ్యే తాను నేర్చుకుంటున్న ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ. "మీరు వెళ్ళండి నాంచారమ్మ గారు.బావకి నేను పెడతాను లెండి టిఫిన్."అంది మధురవాణి. ఆవిడ మనవడికి ఫోన్ చేయడం...అయిదు నిముషాల్లో ఆ కుర్రాడు రావడం, "పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తానమ్మా"అని ఆవిడ బైక్ ఎక్కి వెళ్లిపోవడం జరిగింది. ''ఇంకేమిటి కబుర్లు? బావా?'' అడిగింది మధురవాణి ఆవిడ వెళ్లిపోయాకా వెసులుబాటుగా బావ పక్కన కూర్చుని ముచ్చటగా అతన్ని చూస్తూ. ''ఏముంటాయి? వూరు పొమ్మంటుంది. కాడు రమ్మంటుంది.'' ''అందరి సంగతీ ఏమో గానీ..నీ విషయంలో అది మాత్రం అబద్ధం బావా.. నువ్వెప్పుడూ మా ఎవర్ గ్రీన్ హీరోవే ''అంది మధురవాణి అందమైన పలువరుస మరింతగా మెరుస్తుండగా. ''అంతా ఆ దేవుడి దయ అనుకో. కోడళ్ళు ఇద్దరూ నన్ను బాగాచూస్తారు మధురా. అయితే ఈ కోడలిని మెచ్చుకుంటే ఆకోడలికి గుచ్చుకుంటుంది. ఆకోడలిని మెచ్చుకుంటే ఈ కోడలికి కాలుతుంది. పెద్ద కోడలు చాలా బాగా చూస్తుంది. ఇంట్లో అంతా ఆమెదే పెత్తనం. ఆమె కంటి చూపే శాసనం. నోటిమాటే చట్టం. అంత క్రమ శిక్షణ. ఆ ఇంట్లో చీమ చిటుక్కుమన్నా ఆమె కనుసన్నల్లో జరగాల్సిందే. మీ అక్క నన్ను అడుగులకు మడుగులొత్తి ఎలా చూసిందో అదే పద్దతిలో సమయం ప్రకారం నోటి ముందు ఉంచుతుంది. ఉదయం ఆరింటికి కాఫీ, ఏడూ గంటలకి రాగి జావా, అది లేదనుకో దాని స్థానంలో బ్రేడ్ - జామ్...ఎనిమిదిన్నరకి టిఫిను, సరిగ్గా తొమ్మిదిన్నరకి పళ్ళ ముక్కలు. ఆ తరువాత టీవీ చూస్తాను. పదకొండింటికి స్నానం చేసి కాసేపు దేవుడివి చదువుకుంటాను. పన్నెండు దాటాకా భోజనం. భోజనం చేసాకా ఏదో ఒక స్వీటు తింటాను. కాసేపు 'చాగంటి' వారి రామాయణం విని రెండింటికి పడుకుని మూడున్నరకి లేస్తాను. సరిగ్గా నాలుగింటికి టీ . అది తాగి టీవీ ఆన్ చేస్తాను. ఆరుకి ఏడుకి మధ్య టిఫిన్ పెట్టేస్తారు. రాత్రి తొమ్మిదిగంటలకు రెండు తెలుగు రాష్ట్రాల వార్తలు విని అపుడు పడుకుంటాను. ఎక్కడున్నా ఇదీ నా దినచర్య.'' చెప్పాడుగిరీశం. ''ఏదో సాగితే పెళ్ళెందుకు...పెదబావా...అన్నట్టు అంతా నీ అదృష్టం బావా. కూర్చున్న చోటనుంచి కదలకుండా అన్ని నోటికి అందించిన మహా ఇల్లాలు అక్కయ్య. నిన్ను అలా తయారు చేసింది మా అక్క. మరి ఇపుడు పళ్ళు ఊడిపోయాయిగా... సపోటాలు, ముంజులూ, యాపిల్ ఇవన్నీ ఎలా తింటున్నావ్? తొక్కలు ఒలిస్తేనే గానీ తినవుగా.''అనుమానంగా అడిగింది మధురవాణి తోలుసంచీలా వేలాడుతున్న బుగ్గకింద చేయి బోటుగా పెట్టుకుని. ''చెప్పానుగా. నా అలవాట్లని పెద్దకోడలు చిన్న కొడుకు గౌరవిస్తారు. మీ అక్క బాటలోనే వాళ్లిద్దరూ పాటిస్తారు కూడా.చిన్నకోడలు చదువుకుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ పనులన్నీ చిన్నకొడుకు శ్రద్దగా చేస్తాడు. సపోటాలు ఒలిచి గింజలు తీసేసి స్పూన్ వేసి ఇస్తారు. లేత ముంజులూ తొక్క తీసి పంచదార గానీ గ్లూకోజ్ గానీ చల్లి ఇస్తారు. యాపిల్ కొబ్బరి లా కోరి ఇస్తారు. బొప్పాయి, పుచ్చకాయ, అనాసకాయ, ఇలాంటి పళ్ళన్నీ ఇంకా జ్యూస్ చేసి ఇస్తారు. ఇవన్నీ టీతాగిన గంటకి. రోజూ ఒక్కొక్క ఐటెం. అందుకే ఈ వయసులో కూడా ఈమాత్రం ఆరోగ్యంగా ఉన్నాననుకో.'' అన్నాడు గిరీశం మధుర బుగ్గ చిదుముతూ. '' పో బావా... అక్కలా నేను మాత్రం అవేమీ చేసిపెట్టలేను.ఎన్నాళ్ళనుంచో అడుగుతుంటే ఇన్నాళ్లకు నా ఇంటికి వచ్చావ్. ఉన్నంతలో నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను.'' అంది అతను చిదిమిన చోట బుగ్గను సున్నితంగా రాసుకుంటూ. ''నీ సొట్టగిన్నె బుగ్గల్లో మొదటి ముద్దు పెట్టింది ఎవరు? నిజం చెప్పు?'' ''పో బావా..అన్నీ నా చేత చెప్పిస్తావ్. అప్పుడు నాకు ఏడవ సంవత్సరం. అమ్మతో మొట్ట మొదటిసారి నేను వచ్చాను మీ ఇంటికి. ఆరోజు నువ్వు మీ ఇంటి పెరట్లో చెట్టెక్కి జామకాయలు కోస్తున్నావ్. ఆ రోజు నా పుట్టిన రోజు కూడా. '' ''అవును. నాకు బాగా గుర్తుంది. నువ్వు ఎర్రని పెదాలల్తో బెత్తెడు అంచు ఉన్న ఆకుపచ్చని పట్టులంగా, బుట్టచేతుల జాకెట్టుతో రెండు జడ కుచ్చులతో అచ్చు చిలకమ్మలా చెట్టుకిందకు వచ్చి 'బావా..నాకూ ఒక దోర జామ కాయ కోసి ఇవ్వవా?' అని అడిగావు. 'నేను అడిగింది ఇస్తేనే ఇస్తాను.' అన్నాను. 'ఏంకావాలి?' అని అడిగావు. 'కిందికి వచ్చాకా నేను ఏదడిగినా ఇవ్వాలి నువ్వు ఇవ్వకపోతే నాకు ఎలా తీసుకోవాలో తెలుసులే...' అని నేను మంచి దోరకాయలు లాగు జేబుల్లో పెట్టుకుని వచ్చి నీ రెండు చేతుల్లో చెరొకటి పెట్టాను. 'నాకిస్తానన్నది నాకివ్వు 'అన్నాను.'రెండు చేతుల్లోనూ కాయలున్నాయి నువ్వే తీసుకో...' అన్నావు నువ్వు. అప్పుడు మొదటిసారి నీ కుడి బుగ్గ మీదనా బలమంతా ఉపయోగించి ముద్దు పెట్టి పారిపోయాను. నువ్వు బిత్తరపోయి అలాగే చూస్తూ ఉండిపోయావు. నేను ఆడుకుని ఇంటికి వచ్చేసరికి మా అమ్మ నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని అంటోంది. 'ఆ జామ, సపోటా చెట్లకిందకి వెళ్ళద్దే...కరెంట్ చీమలు, కండ చీమలు ఉంటాయి.' అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. చూడు బుగ్గ అంతా ఎలా ఎర్రగా కందిపోయిందో?ఇంకా ఆ జామకాయలు చేతుల్లోనే ఉంచుకున్నావ్...తినవా?' అని అడిగింది మా అమ్మ. 'దానికి జామకాయ కన్నా...చీమ కుట్టిందే బాగుందేమో' అని ఫక్కున నవ్వింది మీ అమ్మ.ఆ తరువాత మీ అమ్మ నన్ను పక్కకు తీసుకెళ్లి చెవి మెలిపెట్టి...'ఏరా కుఱ్ఱ నాగన్నా ..గుర్తొచ్చిందా? ఇంత గట్టిగా ఆడపిల్లల్ని ముద్దు పెట్టుకుంటే అవి కాస్తా మొదటి ముద్దుకే చిల్లులాడిపోతాయి, తరువాత నువ్వు పెట్టుకుందామన్నా ఎవత్తీ దాని బుగ్గలు ఇవ్వదు. తరువాత నీ ఇష్టం.'' అని చిన్నగా మొట్టికాయ వేసి 'రసికుడివే...నా కూతుర్ని చేసుకుంటావేంటి?' అని అడిగింది. 'పో..అత్తా...' అని నేను మా నాన్న దగ్గరికి పారిపోయాను. "అప్పటినుంచి అద్దం చూసుకున్నప్పుడల్లా ముందు కుడి బుగ్గనే చూసుకునేదాన్ని.అబ్బా! నువ్వు అక్కడ ముద్దు పెడుతున్నట్టే ఉండేది.'అంది మధురవాణి. "నిజం మధురా! నాక్కూడా!. నేను ధైర్యం చేసి మొట్టమొదటిసారి ముద్దు పెట్టింది నీకే.చెట్టు దిగడం దగ్గరనుంచి నిన్ను ముద్దు పెట్టుకున్నంతవరకు నా గుండె కొట్టుకున్న శబ్దం నేను స్పష్టంగా విన్నాను తెలుసా!అందుకే నాకు అంత బాగా జ్ఞాపకం ఉంది." మధురవాణి చాలా దీర్ఘ శ్వాస తీసుకుంది. "ఏమిటో బావ. ఎన్నో ఊహించుకుంటూ ఆశ పడతాం. ఇద్దరమూ చెరోవైపు చెదిరిపోయాం.ఇపుడు ఏమి అనుకునీ ప్రయోజనం లేదు." " కానీ ఒకటి మాత్రం నిజం మధుర!" "ఏమిటి బావ అది?" " ఈ ప్రపంచంలో "తొలి" అన్నది. మొదటి సారి తొలి అనుభవం ఎవరితో ఎప్పుడు ఎలా జరుగుతుందో దాని నిండా పవిత్రమైన ప్రేమ నిండి ఉంటుంది. ఎందుకంటే అది వయసు కోరిక తోనో,బులబాటం తీర్చుకోవాలన్న ఆశతో చేసే పని కాదు. ఈ కలయిక లోతులేమిటో తెలుసుకోవాలి. ఒకరికొకరు ఆ అనుభూతుల్ని నెమరువేసుకుంటూ భాగస్వామితో పంచుకోవాలి." "నువ్వు నీ స్నేహితుడెవరో అన్నట్టు మహర్జాతకుడివి బావా. ఇప్పటికే బాగా లేటైంది. అన్నం వడ్డిస్తా రా " "సరే. పద." ********** ఉద్యోగ విరమణ చేసిన గిరీశంను నిజానికి కోడళ్ళు పెట్టుకుని చూసుకుంటున్నారు. కొడుకులు సరే సరి. రేపు పొరపాటున కూడా వృద్ధాప్యంలో తమ పిల్లలు తమను సాకే విషయంలో ఏ రకంగానూ ఏ విధమైన వ్యతిరేకభావం కలుగకూడదు..ఇపుడు ఈ పెద్దాయనకు లోటు చేస్తే ఆ ఉసురు మాకు తప్పక తగులుతుంది అనే భావంలో అనుక్షణం అప్రమత్తతగా ఉండి సేవచేస్తున్నారు. అయితే చిన్నతనం నుంచి ఇసుమంత ఏ విషయం లో తేడా వచ్చినా తట్టుకోలేని తండ్రి ''నన్ను వృద్ధాశ్రమంలో చేర్చేయండి.మీరు నాకు సేవ చేయలేకపోతున్నారు.''అని అయిదారు సార్లు బెదిరించాడు.తన కొంచెం పెన్షన్ లో ప్రతీ నెల పదివేలు ఇస్తున్నా వాళ్ళు తనకు సేవచేసే విషయంలో ఎందుకు అప్రమత్తంగా ఉండరు అని ఆయన బాధ. ఆయన పదివేలు మొహాన పడేస్తే మాత్రం అంత సమయాభావం పాటిస్తూ ఎవరు సేవ చేయగలరు? కాఫీ అయిదు నిముషాలు ఆలస్యం కాకూడదు. పదార్ధాల్లో ఉప్పు తక్కువ కాకూడదు. రాగి జావా గ్లాసు నిండా ఇవ్వకూడదు...పళ్ళు మొత్తం ఊడిపోయిన ఆయన తినే విధంగా పళ్ళన్నీ గుజ్జుగా చేసిగానీ, కోరుగా చేసిగాని తీసి గ్లూకోజ్ వేసి ఇవ్వాలి. ఏదడితక్కువైనా ''మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అమ్మా' అంటాడాయన. అంటే ''నువ్వు ఇలా ఇష్టం లేకుండా చేసి నా మొహాన పోసి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావ్?'' అని దానర్ధం. ఈ విషయాలు ఒకరికొకరు ఫోనుల్లో కూడబలుక్కుని ఈసారి ఇంట్లోంచి వెళ్లి వృద్ధాశ్రమం లో ఉంటాను అంటే సరే అందాం...అపుడు తెలుస్తుంది కోడళ్ళు, కొడుకుల విలువ అని అనుకున్నారు. ఏ చిన్నదానికి సరిపెట్టుకోలేని ఆయన 'నా మరదలు రాజమండ్రిలో ఉంటోంది. ఆవిడను కోడలు సరిగా చూడదు. మేమిద్దరం వంట మనిషిని పెట్టుకుని మొత్తం ఖర్చు అయిన డబ్బు చెరిసగం వేసుకుని కాలక్షేపం చేసేస్తాం. మీరు మాగురించి ఇబ్బంది పడకండి.'' అన్నాడు గిరీశం. ''ఇదంతా మనం ఇబ్బంది పడుతున్నామని కాదు...నాలుగు తరాలు చూసినా ఇంకా జీవితం మీద ఆశ చావక. ఆయన ఇష్టం.మనమేం చేయగలం?'' అనుకున్నారు కొడుకులు, కోడళ్ళు. ''సరే మావయ్య...అస్తామను రండి అంటే మాత్రం మీ అబ్బాయిలకి సెలవులు దొరకవు. '' అయ్యారు కోడళ్ళు. ''ఈవయసులో ఇద్దరు కొడుకులు ఉండి కూడా తండ్రిని చూడకుండా వదిలేశారు అని చుట్టాలు అందరూ అనుకుంటే మాకు అని అప్రతిష్ట నాన్న..'' కొడుకులు వాపోయారు. ''అలా అన్నవాళ్ళకి నిండా మీ మీద పడకుండా నేను చెబుతానురా సమాధానం. నన్ను రాజమండ్రిలో దించేసిరండి.'' అన్నాడు గిరీశం. ''సరేనాన్న.మీ ఇష్టం. మీరు మంచి ముహూర్తం చూసుకోండి.'' అన్నాడు కొడుకులు, కోడళ్ళు. పుట్టిన క్షణం నుంచి తల్లి కళ్ళల్లో వత్తులు వేసుకుని పెంచినా, తానూ బతికి ఉన్నంత కాలం భార్య చేతిలో కీలుబొమ్మలా బతికి, ఆ పెళ్ళాం ఆడమన్నట్టల్లా ఆది తల్లి కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు ఆవిడ బతికిఉండగానే తన పేరున రాయించేసుకున్న కొడుకు హఠాట్టుగా గుండెపోటుతో మరణించడం వల్ల, తన ఇంట్లో తానె ఒక గదిలో ఉంటూ అయిదువేల రూపాయల అద్దె కోడలికి ఇచ్చుకుంటూ మనవరాలిని చూసుకుని బతుకీడుస్తున్న మధురవాణి బావ తెచ్చిన ప్రపోజల్ కి ఒప్పుకుని ఇంట్లోంచి వచ్చేసి వేరే ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించి ప్రారంభించారు. అలా వారి కధ ప్రారంభమైన నేటికీ వారం రోజులు. ఈవారం రోజుల్లో ఒకరి గురించి ఒకరికి పల్లంలోకి ప్రవహించే నీళ్లలా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ ప్రవాహంలో గిరీశం జోకులకి మధురవాణి సిగ్గుపడటం, కాఫీ టీలు అందించేటపుడు, ఆవిడ చనువుగా ఆయన నెత్తిమీద చిన్నగా మొట్టడం, ఆయన ఆవిడ నడుము ముడతల్లో చిన్నగా పొడవడం...''ఊ .ఊచాల్లే బావా సరసం...'' అని ఆవిడ తిప్పుకోవడాలు, ''ఈవయసులో నువ్వు సిగ్గుపడితే విరిసిన కమలం ముడుచుకున్నట్టుగా భలేగా ఉన్నావు మధురా..'' అని ఆయన ఆమె బుగ్గలు సాగదీయడం, ''సరిగ్గా వినపడటం లేదు నువ్వు చెప్పేది'' అని సింగిల్ కాట్ లు మధ్య దూరం తరిగి రెండూ ఒకటిగా సిక్స్ బై సిక్స్ మంచంలా మారిపోవడం...జరిగాయి. అకాల హోరున అకాల వర్షం. ''భయమేస్తోంది బావా...'' అప్రయత్నంగా ఆమె అతని గుండెల్లో గువ్వలా వొదిగిపోవడం, ''నేనున్నానుగా..భయమెందుకు?'' అని ఆమెను మరింత దగ్గరగా పొదువుకోవడం, అంతటి వర్షంలోనూ చల్లని తనువులు మరింత చల్లగా అనిపిస్తున్నా లేని వేడి తెచ్చుకోవాలని నరహరి తాపత్రయం, ఉన్నంతలో సహకరిద్దామనుకున్నా బలవంతంగా రేపుకు విప్పే ప్రయత్నం రేకలు ఊడటానికి సిద్ధంగా ఉన్న బిగుసుకుపోయిన మొగ్గలా మధురవాణి ... కాలం తో పాటు వారి చర్యలూ స్తబ్ధమైపోయి చెట్టుకు ఎండిపోయినా నిగనిగ లాడుతూ రేపో మాపో రాలిపోబోతున్న ఆకుల్లా ఒకరికొకరు అటు తిరిగిపోయిన ఇద్దరిలోను కదలిక లేకుండా ...చేసి వెళ్ళిపోయింది అర్ధాంతర వర్షం. ************** దుప్పట్లు మార్చాలనే వంకతో పక్కలు మళ్ళీ మొదటి యధానస్థానాల్లోకి పరకాయ ప్రదేశం చేసేసాయి. ఏదో తప్పు జరిగినట్టు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు.. ''ఏమిటో బావా.. అస్తమాను వద్దన్నా మనవరాలే కళ్ళల్లో మెదులుతోంది. '' ''నిజమే మధురా...శని ఆదివారాలు సెలవొస్తే చాలు ''ముత్తాతగారు''. అంటూ ఇంట్లో వాలిపోయే ఆ మునిమనవలే గుర్తొస్తున్నారు అనుకో'' ''ఎదో ఒక్కొక్కప్పుడు మన పెద్దరికాన్ని తీసిపడేసి వాళ్ళు ఏదో మాట అంటుంటారు.అన్నవాళ్ళు ఎవరో కాదు కదా బావ? '' ''అవును మధురా..ఈవయసులో వాళ్ళు మనని చూడటమే ఎంతో గొప్ప. ఏదో సాధిద్దామనునుని వచ్చిన మనం ఏమీ సాధించలేం అని తేలిసిపోయింది.'' ''అవును బావా...రేపు మనమేమైనా అయితే కడ తీర్చాల్సింది వాళ్ళే బావ..'' దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు గిరీశం. ''నువ్వు చెప్పింది నిజమే మధురా..ఈ వయసులో మన అనుకుని మనని చూస్తున్నవాళ్ళని వదిలేసి రావడం తప్పు చేసామేమో అనిపిస్తోంది.'' ''అనిపించడం కాదు బావా..తప్పు చేసాం.'' ''ఇపుడు తిరిగి ఇళ్లకు వెళ్తే హీనంగా చూస్తారేమో.'' ''చూస్తారు బావా..ఇంట పెద్దవాళ్లమై ఉండి కూడా తప్పు చేస్తే చూస్తారు బావా...హీనంగానే చూస్తారు. వాళ్ళు చూడకపోయినా అహంకారంతో తప్పు చేసాము అని మన తప్పు మానని అస్తమాను నిలదీస్తూనే ఉంటుంది.'' ''అయితే ఏం చేద్దాం అంటావ్?'' ''మానవులపై బెంగతో ఉండలేకపోతున్నాం అనే సెంటిమెంటుతో తిరిగి మన గూళ్లకు మనం చేరడమే.'' ''నిజమే మధురా..ఇదే సరియైన నిర్ణయం.'' ''అయితే పిల్లలకి కాల్ చేసి చెబుదామా?'' ''చెబుదాం.'' ****************** ''వెళ్ళొస్తాను బావా...నీ ఆరోగ్యం జాగ్రత్త.'' ''అలాగే బావా. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఫోన్ చేస్తూ ఉండు.'' ''చేస్తూనే ఉంటాను.ఆఖరి క్షణం వరకు.'' అంతర్గతంగా 'బుల్బాటం తీర్చుకోవాలకనున్నవారిద్దరూ...నెల కాకుండానే ఎవరి గూళ్లకు వాళ్ళు మౌన శిఖరాల్లా తమ వాళ్లతో పయనమైపోయారు. సమాప్తం

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి