వీకెండ్ పార్టీ - ఇందు చంద్రన్

Weekend party

అదొక వింత ప్రపంచం అక్కడికి వారంతరాల్లో అందరం కలుసుకుంటాము.అందరం అంటే ఐదారుగురు వరకు ఉంటాము. క్లాస్ మేట్స్ , కొలీగ్స్, ఫ్రెండ్స్ ని దాటుకుని బార్ లో పరిచయమైన వాళ్లు ఉన్నారు. సింపుల్ గా గ్లాస్ మేట్స్ అని చెప్పుకోవచ్చు.

అది మా ఫ్రెండ్ పెంట్ హౌస్ , పైన టెర్రస్ పై ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చెసి మాక్కావల్సినవన్నీ తీసుకొచ్చి సమకూర్చుకోవడం మాకలవాటే.రాత్రి తొమ్మిది దాటితే అన్నీ తల కిందులై మెదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ అంతా గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా మనస్సుకి ప్రశాంతత దొరుకుతుందని ఆ ప్రపంచంలోకి వారాంతరాల్లో వెళ్ళిపోతూ ఉంటాము. వారం మొత్తం ఉరుకులు పరుగులతో ముడిపడిన మా జీవితాలు కాస్త సేద దీరే సమయం అంటే అది వారాంతరాల్లో మాత్రమే. సేద దీరడం అంటే నిద్రపోవడమో లేక కుటుంబంతో కాలక్షేపమో కాదు. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాన్ని మర్చిపోవడం అదెలా సాధ్యం ? మమ్మల్ని ఆ రంగుల ప్రపంచానికి పరిచయం చేస్తూ వాస్తవికంగా ఉండే ప్రపంచానికి దూరం చేస్తూ మా అందరి గొంతుల్లోకి సర్రున జారిపోతుంది ఆ ద్రవం. తాగడానికి మరీ అంత రుచిగా అనిపించదు కాస్త చేదు వగరుగా గొంతులో మండుతున్నట్టు గా అనిపించినా కాని మాకు ఆ ద్రవం అంటేనే ఇష్టం. రకరకాల పేర్లతో ఉన్నవాటి రుచిని కొత్త బ్రాండ్ల తో వారంతరాన్ని సంతృప్తిగా ముగించామని భ్రమ పడిపోతూ ఉంటాము.దాదాపుగా మా అందరికి నచ్చిన అమ్మాయి పేరంటే అది 'నిశా 'మాత్రమే. నిశా అంటే రాత్రి , రాత్రంటే చీకటి. ఆ చీకటి ప్రపంచంలో బుర్రలో ఉన్న ఆలోచనలకి లోపలికెళ్ళిన ద్రవం తోడై మా అందరిలో ఉన్న ఆక్రోషాన్ని, అసహనాన్ని, బాధని ఇంకా ఙాపకాల్ని కాసేపు బయటకి వచ్చేలా చేస్తుంది.

మొదటి రౌండ్ మొదలు పెట్టేటప్పటికే టివి ఆన్ చేసి ఆ వీకెండ్ రిలీజ్ అయిన ఓ కొత్త సినిమాని పెట్టుకుని మొదలు పెడతాం.

కాని టైటిల్స్ కూడా పూర్తవక ముందే ఒకడు గ్లాస్ కింద పెట్టి, “ అసలు నా లైఫ్ ఎట్లా పోతుందో నాకే అర్థం కావట్లేదు అని చిరాగ్గా మొహం పెట్టి అసహననాన్ని వెళ్ళగక్కుతాడు.

ఆ మాట పూర్తవక ముందే ఇంకొకడు రెడీగా ఉంటాడు. “ఏవైంది అని అడగడానికి.

ఆ మాటలు మాకు కొత్తవేమి కాదు. కాస్త ఆ ద్రవం లోపలికెళ్తే చాలు మనస్సులో అందులోను అట్టడుగున ఉన్నవైన సరే సముద్రాలని ఈదుకుంటూ బయటకొచ్చినట్టు వచ్చేస్తాయి.

అలా మొదలు పెట్టిన మాటలు అల్లుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. మేనేజర్ ని తిట్టడం మొదులుకుని చివరగా నెలాఖరున సర్దుబాటు కాని డబ్బులు దగ్గర ఆగిపోతూ ,అప్పుడు జీవితంలో మార్పు కోసం మాట్లాడుతాం. ఉద్యోగం మారాలని ఒకరంటే, ఇల్లు మారాలని ఒకరు, డబ్బులు సర్దుబాటు చేసుకోవాలని ఒకరు ఇలా కొనసాగుతూ ఉంటుంది. టివిలో ఉన్న సినిమా అలా ఫాజ్ అయి అక్కడే ఉంటుంది.

అప్పుడు మాలో ఒకడు సంగీత ప్రియుడు ఉంటాడు“ఏం సినిమాలేరా బాబు, ఇళయరాజాగారి పాటలైనా పెడుతా అని మారుస్తాడు.

ఒక మెలోడి పాటతో రెండో రౌండ్ మొదలవుతుంది, ఈ రౌండ్ లో కోపాలు, అసహనాలు ఉండవు. కేవలం ప్రేమ మాత్రమే. ఇళయ రాజా గారి పాటలు విండో సీట్ జర్నీ ఎలాగో, అలాగే ఓ పెగ్ మందు ఆయన పాటలు మా లోపల ఎప్పుడో మూట గట్టేసిన ప్రేమ కథల ముడులు విప్పుతుంది. పొందలేదన్న ఆవేదన ఓ వైపు ఉంటే మిగిలిన ఙాపకాల్ని తల్చుకుని అప్పట్లోఇంతటి వెర్రివాడినా? అని నిట్టూరుస్తూ నవ్వుకుంటాం.

మధ్యలో ఒకడు “ఎంతైనా నువ్వు ఆ అమ్మాయిని చేసుకుని ఉంటే కాదు చేసుకొని ఉండాల్సింది అంటాడు.

ఆ మాటని కూడా పూర్తవనివ్వకుండా ఇంకొకడు అందుకుని “అప్పుడు మనం ఉంటే ఇంత దాక రానిచ్చే వాళ్ళం కాదులేరా అని అంటాడు.

అసంభవాలన్నీ జరిగేలా మాట్లాడం ఆ వింత ప్రపంచంలో ప్రత్యేకత. అక్కడ ప్రమాణాలన్నీ కాలంతో పాటు కలిసిపోతూ ఉంటుంది. దుమ్ముతో పేరుకుపోయిన కాగితాన్ని విదిలించి పైకి తీసినట్టు ఒకడు ప్రేమ కథని మొదలు పెడతాడు. ఆమె నవ్వు నిండు జాబిలి , ఆమె మాటలు చిలక పలుకులు అని ఎంతో గొప్పగా ఆ రాత్రి చల్లదనాన్ని ఆశ్వాదిస్తూ మురిపెంగా చెప్పుకుంటూ పోతాడు.

అదేదో కొత్త కథ లాగే అందరం చెవులు రిక్కించి మరి వినడం మాకు అలవాటే. ఒకరిద్దరూ సంతోషంగా ఉన్న క్షణాల్ని గుర్తు చేసుకుని జీవితం ముందులా లేదురా అని చెప్పుకునిపోతుంటారు. కొందరైతే ఏకంగా ఈ ప్రపంచంలోకి కూడా భార్యని గుర్తుకు చేస్తారు. భార్యలు గుర్తుకు రావడంతోనే మా అందరి మొహాల్లో అప్పటి వరకు ఉన్న ప్రేమ ఙాపకాలు చెదిరిపోతాయి. ఏదో నిస్సత్తువ మా మొహాల్లో నిండుకుంటుంది.

“ఇక్కడ కూడా పెళ్లాం టాపిక్ ఎందుకురా స్వామి అని ఎవడో ఒకడు పుల్ స్టాప్ పెడతాడు. ఆ పుల్ స్టాప్ తో పాటు రెండో రౌండ్ ముగుస్తుంది.

ఇక మూడో రౌండ్ అదే అసలుసిసలైన రౌండ్ ఈ రౌండ్లో అసలు ఆవేదనలు, ఆరాధనలు ఉండవు. కేవలం రసవత్తరంగా రమ్యంగా సాగిపోతూ ఉంటుంది. అప్పటి వరకు ప్రేమ కథల్లో ప్రియురాలిని చందమామ , జాబిలి అన్నవాడే కాస్త కత్తిలా ఉండేది అంటూ అసలైన వర్ణనని బయటకి తీస్తాడు. ఒకరిద్దరూ టీనేజీలో ముద్దులు హగ్గులు కలిసి గడిపిన విషయాల్ని ఏదో సాధించేసారన్నంత గర్వంగా వివరిస్తూ ఉంటే , మధ్యలో ఒకరిద్దరూ , వహ్వా..వహ్వా....”అబ్బా ఏమన్నా లవ్ స్టోరీనా?” “మొత్తానికి హీరో అన్నమాట” అని రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్లు అది నిజమనుకుని రెచ్చిపోతూ ఆకాశానికే నిచ్చేనేస్తూ ఉంటారు. కొందరైతే మరీ ధైర్యం చేసి ఫోన్లు మెసేజీలు కూడా చెస్తారు.

జరిగిన కథలకి కాస్త రంగులు హంగులు చేర్చి రసవత్తరంగా మార్చేస్తారు. అక్కడ చెప్పేవన్నీ నిజాలా? లేక నిజాల్లాంటి అబద్దాలా? అని తెల్లవారితే తప్ప తెలీదు. కాని తెల్లవారితే రాత్రేం జరిగిందో మాలో ఎవరికీ సరిగ్గా గుర్తుండదు. అదే ఈ వింత ప్రపంచంలో ఉన్న మరో వింత.

మూడో రౌండ్ లో ఇళయరాజా గారి పాటలు మాయమైపోతాయి. అన్నీ సినిమాల్లో ఉన్న ఐటం సాంగ్స్ తెరపైకి వస్తాయి. ఈ అమ్మాయి ఆర్ జీవి ఇంటర్వూలో చెప్పిన అమ్మాయి అని ఒకడు అంటే, ఎంత అయినా అలా బతకడం కూడా అదృష్టమేరా అని ఒకడు నిట్టూరుస్తాడు. మొత్తానికి ఆర్ జి విని అప్పుడప్పుడు తిట్టుకునే మేమే సమర్దిస్తాం. అది కూడా ఒక రకమైన ఏడుపే. ఒకరితో పోల్చుకుని ఏడవడం కూడా ఈ వింత ప్రపంచంలో భాగమే.

ఆ మూడో రౌండులోనే అప్పుడప్పుడు చిన్న చిన్న వాగ్వాదాలు మొదలువుతాయి. ఆ రౌండ్ లో దాపరికాలుండవు. మొహమాటాలు అంతకన్నా ఉండవు. ఏదైనా సూటిగా మాట్లాడుకుంటాం.అప్పుడప్పుడు మూడో రౌండ్ రవసవత్తరంగా కాకుండా కాస్త భయంకరంగా ముగుస్తుంది.

చివరగా మాలో ఉన్న రొమాన్స్ ఘట్టం కాస్త మసగ మసగ్గా చిన్న చిన్న పొరపొచ్చాలతోముగుస్తుంది. అయినా మా గ్లాసులు అంతటితో ఆగవు. ఆగనివ్వం కూడా. నాలుగో పెగ్గుతో ట్రింగ్ మని శబ్దం చేస్తూ మొదలు పెడుతాం. ఈ రౌండ్ లో రొమాన్స్ ఇంకా వాగ్వాదాలు తర్వాత రియలైజేషన్ అన్నమాట. అంటే రెండు మూడు బిట్లు చూసాక భక్తితో దేవుడి పాటలు వినడం లాగన్నమాట. చేసేదంతా చేసి నువ్వే దిక్కు అన్నట్టు దేవుడి పై భారం వేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటాం.

మాలో ఉన్న బాధలు బయటికి వస్తాయి. బాల్యం నుండి ఈ స్థాయికి ఎదగడానికి భుజాలు అందించిన తల్లిదండ్రులు. పెళ్లయిన దగ్గర్నుండి కష్టనష్టాల్లో పక్కనే నడిచిన భార్య గుర్తుకొస్తుంది. పెళ్ళి పేరుతో ముడి పడిన జీవితాల్లోకి వచ్చిన ప్రతిరూపాలు ( పిల్లలు) గుర్తుకొస్తారు. పిల్లలు గుర్తుకు వస్తే మా అందరి మొహాల్లో ఏదో తెలియని ఆనందం తొంగి చూస్తుంది.

“మా వాడు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడని ఒకడంటే.”

“నేను లేకపోతే మా పాప అసలు నిద్ర కూడా పోదని మరొకడు చెప్తాడు.

“పర్లేదు నాలా కాదు బాగా చదువుతున్నాడట అని ఇంకొకడు అంటాడు.

నాలుగో రౌండ్లో జీవితంలో పొందాలనుకుని కోల్పోయిన వాటిని తల్చుకుంటూ చివరగా పొందిన వాటిని గుర్తు చేసుకుని జీవితాన్ని కంట్రోల్ చేయలేమని మనకి నచ్చినట్టు మాత్రమే మనం మార్చుకోగలమని మరోసారి గుర్తు చేసుకుంటాం.

మూడో రౌండ్ లో వద్దనుకున్న భార్యలే నాలుగో రౌండ్లో త్యాగ మూర్తుల్లాగో , అర్థం చేసుకున్న స్నేహితురాలి లాగానో అనిపిస్తారు. ఎందుకో ? ఈ రియలైజేషన్ , బహుషా తాగి ఇంటికెళ్తే తన్ని బయటకి తరిమేయకుండా తిండి పెట్టి చూసుకుంటారనేమో?

“నా మీద మా ఆవిడకి చాలా నమ్మకం అని ఒకడంటే.

“నేనంటే తనకిచాలా ఇష్టం అని మరొకడు అంటాడు మురిసిపోతూ.

చివరగా “నన్ను నమ్ముకొచ్చిందిరా అని అంటాడు ఇంకొకడు బాధగా.

కాసేపు మా హృదయాలు ద్రవించి కన్నీళ్లు వర్షిస్తాయి. పురుషాహంకారన్ని కూడా మర్చిపోయి సాదారణ మానవుడిలా కళ్లలో ఉబికి వచ్చే కన్నీళ్లని తుడుచుకుని ఒకరిని ఒకరం ఓదార్చుకుని

అక్కడితో మా ప్రపంచంలోంచి బయటకి వచ్చేస్తాం. కొందరైతే ఐదో రౌండ్ మొదలు పెడతారు కాని ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా? అక్కడే తాగగా మిగిలిన ఆ స్టఫ్ ని ఇంకా స్నాక్స్ ని తింటూ అక్కడెక్కడో పాజ్ చేసిన సినిమాని మళ్లీ పెట్టి చూస్తూ , స్డడీగా డ్రైవ్ చేసుకుని వెళ్లగలం అనిపించాక నెమ్మదిగా ఆ లోకం నుండి ఒక్కొకరుగా బయటికొస్తూ ఉంటాం.

తెల్లవారితే మా చుట్టూ ఉన్నవి ఎప్పటిలాగానే ఉంటాయని తెలిసినా సరే అప్పుడప్పుడూ ఆ లోకంలోకి వెళ్ళడం మాకు అలవాటుగా మారిపోయింది. అలవాటు మార్చుకోవాలని ప్రతి ఏడాది చివరగా రెసల్యూషన్ లో మొదటగా చెప్తూ ఉంటాం. కాని తెల్లావారే దాక తెలియదు మత్తులోనిన్న రాత్రి ఏం చెప్పామో అని…..







మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి