ఉమాదేవి (పురాణ గాథలు-2) - కందుల నాగేశ్వరరావు

Umadevi

ఉమాదేవి

(పురాణ గాథలు-2)

మేన హిమవంతులు:

దక్షప్రజాపతి తమ కుమార్తె ‘స్వథ’ను పిత్రుదేవతకు ఇచ్చి వివాహం చేసాడు. స్వథాదేవి పిత్రుదేవత దంపతులకు మేన, ధన్య, కళావతి అనే ముగ్గురు కుమార్తెలు. ఆ సుందరీమణులు ముగ్గురు ఒకనాడు వైకుంఠం వెళ్ళి విష్ణుదేవుని దర్శించి వారి అనుజ్ఞతో సభలో ఆసీనులయ్యారు. ఆ సమయంలో బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందాదులు అక్కడకు వచ్చారు. వారిని చూసి సభలో అందరూ లేచి నిల్చున్నారు. కాని శివమాయ వల్ల ఆ ముగ్గురూ లేచి నిలబడ లేదు. అప్పుడు “పెద్దల విషయంలో అమర్యాదగా ప్రవర్తించి నందు వలన మీరు స్వర్గానికి దూరమై భూలోకంలో తిరుగుదురు గాక!” అని మునులు వారిని శపించారు.

అప్పుడు శివమాయ నుండి తేరుకున్న ఆ ముగ్గురు భయంతో మునులను క్షమించమని కోరారు. అప్పుడు సనత్కుమారుడు “మీరు భయపడకండి. ఈ శాపం మీకు సర్వదా సుఖాలను ఇస్తుంది” అని చెప్పాడు. ఆ శాప కారణంగా ‘మేన’ హిమవంతునకు భార్యయై పార్వతీదేవికి జన్మ నిస్తుంది. ‘ధన్య’ జనకునకు భార్యయై సీతాదేవికి తల్లి అవుతుంది. ‘కళావతి’ ద్వాపర యుగంలో వృషభానునికి భార్యయై రాధాదేవికి తల్లి అవుతుంది.

హిమవంతుడు తన వంశాన్ని ఉద్ధరించడానికి వివాహమాడాలని అనుకున్నాడు. అప్పుడు దేవతలు పిత్రుదేవుని వద్దకు వెళ్ళి హిమవంతునికి మేనాదేవిని ఇచ్చి వివాహం చేయమని కోరారు. దేవతల మాటలు విన్న పిత్రుదేవుడు పూర్వం కుమార్తెల శాపాన్ని గుర్తుకు తెచ్చుకొని తమ జ్యేష్ఠపుత్రిక మేనను హిమవంతునికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించారు. శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. ఈ విధంగా మేన హిమవంతునికి ఇల్లాలైంది. మేనాదేవి హిమవంతులు హిమవత్పర్వత ప్రాంతంలోని సుందర ప్రదేశాలలో హాయిగా విహారం చేస్తూ కాలం గడుపుతున్నారు.

ఒకనాడు విష్ణుమూర్తితో సహా ఇంద్రుడు మొదలైన దేవతలు హిమవంతుని నివాసానికి వెళ్లారు. వారిని చూసిన హిమవంతుడు తన అదృష్టానికి సంతోషించి వారికి అతిథి మర్యాదలు చేశాడు. అప్పుడు వారు “ఓ హిమవంతా దక్ష పుత్రియైన సతీదేవి గాథ నీకు తెలుసు. జగన్మాత తన దేహాన్ని త్యజించి తన ధామానికి వెళ్ళిపోయింది. ఇప్పుడా లోకమాత నీకు పుత్రికగా జన్మించి పరమేశ్వరుడికి పత్ని కావలసి ఉంది. దాని వలన లోకాలకు గొప్ప మేలు జరుగుతుంది” అని చెప్పారు.

తరువాత దేవతలు దుర్గాదేవిని పలువిధాల స్తుతించారు. అప్పుడు ఆమె రత్నాలు పొదగబడిన బంగారు రథంపై ఆసీనురాలై తేజోరూపంలో సాక్షాత్కరించింది. దేవతలు ఆమెను “నీవు తిరిగి భూమిపై జన్మించి శంకరపత్నివై లోకాలకు సుఖాలను ఇయ్యి తల్లీ” అని ప్రార్థించారు.

ఆ ప్రార్థనలకు సంతృప్తి చెందిన దుర్గాదేవి దేవతలతో ఇలా చెప్పింది. “పూర్వ జన్మలో “మేన” నన్ను భక్తితో ఆరాధించింది. మీరు కోరినట్లుగా నేను నా పూర్ణాంశతో ఆమె గర్భం నుండి ఆవిర్భవిస్తాను. మేనను తపస్సు చేయమని ఆదేశించండి. నా స్వామి విరహంతో అన్ని సుఖాలను పరిత్యజించాడు. దిగంబరుడై నా అస్థికల మాలను ధరించి తిరుగుతున్నాడు. నా గురించి యోగనిష్ఠలో ఉన్నాడు. నేను మేన గర్భాన జన్మించి తపస్సు చేసి తిరిగి శివుని అర్ధాంగిని అవుతాను” అని చెప్పి జగన్మాత అంతర్ధానమైంది.

బ్రహ్మవిష్ణువులు మేనాదేవికి తపస్సు చేసే విధానాన్ని బోధించారు. ఆమె సంతాన కాంక్షతో ఇరువది ఏడు సంవత్సరాలు శ్రద్ధగా జగన్మాతను ఆరాధించింది. ఆమె దీక్షకు ప్రీతురాలై పరమేశ్వరి ప్రత్యక్షమైంది. “మేనా! నీకోరిక సఫలమవుతుంది. నీకు ప్రధమంగా ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడు గొప్ప బలవంతుడు, ధైర్యవంతుడు అవుతాడు. ఆతరువాత నేను నీకు పుత్రికగా అవతరిస్తాను” అని వరమిచ్చి అంతర్ధానమైంది. ఆ వరానికి ఫలితంగా కొంత కాలానికి ఆమె గర్భవతియైంది. ఆమెకు “మైనాకుడు” అనే కుమారుడు జన్మించాడు.

గిరిజాకుమారి జననం:

పరమేశ్వరి అనుగ్రహం వల్ల మేనాదేవి మరల గర్భం దాల్చింది. ఈసారి జగన్మాత స్వయంగా ఆమె గర్భంలో ఉన్న కారణంగా ఆమెలో తేజస్సు అధికమైంది. ఆ సమయంలో దేవతలు, మునులు అచటకు వచ్చి మేనాదేవి గర్భంలో ఉన్న జగన్మాతను పలు విధాల స్తుతించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరలు నాట్యం చేశారు. వసంత ఋతువులో, మృగశిరా నక్షత్రయుక్త చైత్ర శుక్ల నవమి నాడు అర్ధరాత్రి సమయంలో ఆ దేవి జన్మించింది. ఆ బాలిక తన దివ్యరూపంతో మేనకుదర్శనమిచ్చి “గతంలో నీకు వరమిచ్చిన ప్రకారం నీకు పుత్రికగా జన్మించాను” అని చెప్పింది. తరువాత శిశురూపం పొంది లోకరీతిగా రోదించింది.

ఆ శుభవార్తను అంతఃపుర పరిచారికలు హిమవంత మహారాజుకు చెప్పారు. హిమవంతుడు దివ్యకాంతితో వెలిగిపోతున్న కుమార్తెను చూసి పరమానందబరితుడై నగరమంతా మహోత్సవాన్ని జరిపించాడు. నామకరణ మహోత్సవవేళ “కాళి” మొదలైన శుభకరమైన పేర్లు ఉంచాడు. ఆ బాలిక పెరుగుతూ అందరికీ ఆనందాన్ని పంచుతూ హిమవంతుని రాజగృహంలో పెరగ సాగింది. బంధువు లందరూ ఆమెను పర్వతరాజు పుత్రిక కాబట్టి “పార్వతి” అని “గిరిజ” అని పిలువ సాగారు. తండ్రి హిమవంతునికి కుమార్తెను ఎంతసేపు చూసినా తనివితీరా తీరేదికాదు. ఆమె మనస్సు లగ్నంచేసి గురువుల వద్ద అన్ని విద్యలు నేర్చుకుంది.

ఒకనాడు నారదమహర్షి హిమవంతుని గృహానికి వచ్చాడు. హిమవంతుడు తన కుమార్తెచేత పాదపూజ చేయించి ఆమె భవిష్యత్తు చెప్పమని కాడు. ఆమె హస్తరేఖలు చూసిన నారదమహర్షి హిమవంతునితో “నీ కుమార్తె సర్వ శభలక్షణాలుగల కన్య. ఈమె సమస్త స్త్రీలోకానికి ఆదర్శప్రాయురాలు అవుతుంది. పుట్టినింటికి మెట్టినింటికి పేరుతెస్తుంది. కాని ఈమె చేతిలో ఒక ప్రత్యేకమైన రేఖ ఉంది. దాని ఫలితంగా ఒక యోగి, నిర్గుణుడు, తల్లితండ్రులు లేనివాడు, అమంగళ వేషధారి అగువాడు ఈమెకు భర్త అవుతాడు” అని చెప్పాడు.

నారదుని మాటలు విన్న మేన హిమవంతులు ఎంతో విచారించారు. నారదుణ్ణి ఏదైనా ఉపాయం చెప్పమని కోరారు. అప్పుడు నారదుడు వారితో “బ్రహ్మరాతను ఎవరూ తప్పించుకోలేరు. కాని ఆ లక్షణాలన్నీ ఉన్నవాడూ, గిరిజాదేవికి సరియైనవాడూ శంకరుడు ఒక్కడే. ఆయన పరమేశ్వరుడు. ఆ అమంగళవేషం ఆయన లీల మాత్రమే. అందువలన నీకుమార్తెను శంకరునకు ఇచ్చి చేయడానికి సిద్ధంగా ఉండు. ఆయన తపస్సుకు ప్రసన్నుడవుతాడు. నీకుమార్తె చేత తపస్సు చేయించు. ఈమె గౌరీ నామంతో మూడు లోకాల్లో పూజలందుకుంటుంది. నీకు శుభం జరుగుతుంది” అని చెప్పి నిష్క్రమించాడు. నారదుని మాటలకు మేన హిమవంతులు ఎంతో సంతోషించారు. శక్తిస్వరూపిణి అయిన కాళి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తూ క్రమంగా పెరిగి యుక్తవయస్కురాలైంది.

శంకరుని తపస్సు:

అదే సమయంలో శంకరుడు కఠిన తపస్సు చేయగోరి హిమవత్పర్వత శిఖరం పైనున్న గంగావతార క్షేత్రానికి చేరుకున్నాడు. శివుడు ఏకాగ్రతతో ఆత్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ తపస్సు మొదలుపెట్టాడు. శివుని ఆగమన వార్త తెలుసుకున్న హిమవంతుడు తన పరివారంతో వెళ్ళి స్తుతించి ఇలా ప్రార్థించాడు. “ఓ శంకరా! నువ్వు నా రాజ్యానికి రావడం నా మహాభాగ్యం. నేను నీ భక్తుడను. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు”

అతని పలుకులకు సంతోషించిన శంకరుడు “ఓ పర్వతరాజా! నువ్వు మహాత్ముడవు. ఎంతోమంది మునులకు, తపోధనులకు ఆశ్రయమిస్తావు. నిత్యం పారే గంగాజలంతో ఈ ప్రాంతమంతా పరిశుద్ధమైంది. నేను ఈ పవిత్ర క్షేత్రంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాను. నా ఏకాంతానికి భంగం కలుగకుండా ఏర్పాట్లు చెయ్యి” అన్నాడు. హిమవంతుడు తగిన ఏర్పాట్లు చేసి తన గృహానికి తిరిగి వెళ్లాడు.

మరునాడు తన కుమార్తెతో కలిసి శివుని వద్దకు వచ్చిన హిమవంతుడు “మా అమ్మాయి మిమ్ములను సేవించాలని కోరుకుంటోంది. మీరు అనుమతించండి” అనిఅడిగాడు. అప్పుడు సౌందర్యవతి, నవయవ్వనవతి అయిన పార్వతిని చూసిన శివుడు తన ఏకాగ్రతకు భంగం కలుగుతుందని తలచి ఇలా అన్నాడు. “పర్వతరాజా! ఈ పైన నాదగ్గరకు వచ్చేటప్పుడు నువ్వొక్కడివే రా. మీ అమ్మాయిని తీసుకు రావద్దు”. శంకరుని మాటలకు హిమవంతుడు నిరుత్సాహంతో మాట్లాడకుండా నిలుచున్నాడు.

అప్పుడు పార్వతి తండ్రి అనుమతితో శివుని ఉద్దేశించి ఇలా అంది. “నీవు జ్ఞానవిశారదుడవు. ప్రకృతి లేకుండా మహేశ్వరుడు సగుణరూపధారి ఎలా కాగలడు. నీవు ప్రకృతిని జయించినవాడిని అన్నావు కదా! అటువంటప్పుడు ప్రకృతి స్వరూపమైన స్త్రీ నీ దగ్గర ఎందుకు ఉండరాదు?

సర్వజ్ఞుడైన శంకరుడు పార్వతి మాటలకు చిరునవ్వు నవ్వి “నేను పరమేశ్వరుడను. మాయను జయించినవాడను. ఆ విషయాన్ని నీవు త్వరలోనే తెలుసుకోగలవు. నేను ప్రతిదినమూ నీ సేవకు అంగీకరిస్తున్నాను” అన్నాడు. హిమవంతుడు ఆనందిస్తూ పార్వతితో కలిసి ఇంటికి వెళ్లాడు.

మరుసటిరోజు నుండి కాళి తన చెలికత్తెలతో కలిసి వచ్చి శంకరునికి సేవలు చేసి వెళ్లేది. ప్రతిరోజూ తగిన పూజాద్రవ్యాలను సమకూర్చేది. ఆశ్రమప్రాంతాన్ని అలంకరించేది. శంకరుడు ధ్యాననిమగ్నుడై యున్నప్పుడు ఆయనను తదేక దీక్షతో చూస్తూ ఉండేది. శంభునికి గత జన్మలోని సతీదేవియే ఈ ఉమ అని తెలిసినా వెంటనే భార్యగా స్వీకరించలేదు. ఈ కాళి ఎప్పుడైతే తీవ్రమైన తపస్సు చేస్తుందో, అప్పుడే ఆమెలోని అహంకార బీజాలు నశిస్తాయి. అందుకని ఆమెను తపస్సువైపు నడిపించాలనుకున్నాడు.

రతీ మన్మథులు:

దేవేంద్రుడి పిలుపు మేరకు మన్మథుడు రతీదేవితో కలిసి ఇంద్రసభకు వచ్చి నమస్కరించి “దేవేంద్రా! నాకు వర్తమానం పంపిన కారణమేమిటి. నా సచివుడు వసంతునితో కలిసి నేను త్రిమూర్తులను సైతం కామపీడితులను చేయగలను. నాకు మీరు సరియైన పని చెప్పండి. నేను తప్పక చేస్తాను” అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు “మిత్రమా!నువ్వు తప్ప నాకు ఎవరూ ఈ సాయం చేయలేరు. నీ ద్వారా ఒక గొప్పకార్యం నెరవేరవలసి ఉంది. తారకాసురుడు బ్రహ్మదేవుడి వలన వరాలు పొంది దేవతలను హింసిస్తున్న సంగతి నీకు తెలుసు. శంకరునికి జన్మించిన కుమారుడు మాత్రమే ఆ దానవుని సంహరించగలడు. ఎలాగైనా సరే శంకరుడికి పార్వతి యందు ప్రేమ పుట్టేటట్లు చేయాలి. వారి వివాహం జరిగితేనే లోక కల్యాణం జరుగుతుంది” అని చెప్పాడు.

కాముని ప్రభావంతో శివుడు తపస్సు చేసే ఆశ్రమం చుట్టూ వసంతం ప్రవేశించింది. ఆ తపోవనం అంతా కోకిల కూతలు, పుష్పపరిమళాలు, తుమ్మెద ఝుంకారాలతో నిండిపోయింది. మన్మథుడు అరవిందము, అశోకము అనే రెండు పుష్పబాణాలను ప్రయోగించాడు, కాని శివునిపై వాటి ప్రభావం లేదు. అప్పుడు రతీదేవితో కలిసి శంకరునిపై ‘సమ్మోహనాస్త్రాన్ని’ సంధించి వదిలిపెట్టాడు. అయినా శంకరునిలో ఎట్టి వికారం కలుగలేదు.

అదే సమయంలో గిరిజాదేవి తన చెలికత్తెలతో కలిసి పూజాద్రవ్యాలను పట్టుకొని శంకరుని సమీపించింది. అప్పటి వరకు ధ్యానంలో ములిగి ఉన్న చంద్రశేఖరుడు కన్నులు తెరిచి ఆమె వైపు చూసాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మన్మథుడు మరల అరవిందపుష్ప బాణాన్ని ప్రయోగించాడు. పార్వతి కన్నులు తెరచిన శంకరుని చూచి ఎంతో భయ భక్తులతో పుష్పాలను సమర్పించి పాదపూజ చేసింది. శివుడు ఆమె ఆదరంగా అందించిన పూలమాలను సాదరంగా అందుకున్నాడు. అదే అదనుగా మన్మథుడు మరల సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. చంద్రముఖి, ఆకర్ణాంత విశాల నేత్రాలుగల పార్వతి ముఖాన్ని చూసిన చంద్రమౌళి హృదయంలో అనురాగం వెల్లివిరిసింది. ఆమె ముఖ సౌందర్యాన్ని మరల మరల చూడాలని కోరికతో క్షణకాలం వికారాన్నిపొందాడు శంకరుడు. వెంటనే తన చిత్త చాంచల్యానికి కారణం తెలుసుకున్నాడు. దిక్కులు పరికింపగా తనపై ఇంకొక పుష్పబాణాన్ని వేయడానికి సిద్ధమవుతున్న మన్మథుడు కనుపించాడు. వెంటనే తన మూడవనేత్రం తెరిచి బాణాలతో సహా మన్మథుణ్ణి దహించివేశాడు. ఇది చూసిన పార్వతి ఎంతో భయపడింది. భయపడుతూ చెలులతో కలిసి తన నివాసానికి వెళ్ళిపోయింది.

భర్త మరణానికి రతీదేవి నేలకూలి శంకించింది. దేవతలందరూ దుఃఖితులయ్యారు. అప్పుడు దేవేంద్రుడు వచ్చి “ఈ పని చేయడంలో మన్మథుని స్వార్థం లేదు. లోకకల్యాణం కోసం దేవతల కోరిక మేరకు ఈ పని చేశాడు. కాముడు లేనిచో సృష్టి కార్యం ఎలా కొనసాగుతుంది. మీరు అతనిని క్షమించి రతీదేవికి పతిబిక్ష పెట్టండి” అని శంకరుని ప్రార్థించాడు.

“రాబోయే ద్వాపరయుగంలో ఈ మన్మథుడు రుక్మిణీశ్రీకృష్ణులకు ప్రద్యుమ్నుడుగా పుట్టి శంబాసురుడనే రాక్షసుణ్ణి వధిస్తాడు. రతీదేవిని వివాహం చేసుకుంటాడు. అంతవరకు కాముడు శరీరంలేనివాడై ఉంటాడు. నేను ఇప్పుడే మన్మథుణ్ణి జీవింప చేస్తున్నాను. అంతవరకు మన్మథుడు నా భక్తగణాలలో ఒకడిగా ఉంటాడు” అని శంకరుడు దేవేంద్రుడికి చెప్పి పంపాడు.

పార్వతీదేవి తపస్సు:

త్రిలోక సంచారం చేస్తున్న నారదమహర్షి ఒకనాడు పార్వతికి ఇలా ఉపదేశించాడు. “ఓ గిరిజా కుమారీ! నీ మనస్సులో విషయం నాకు తెలుసు. నీవు శంకరునికి సేవలు చేసావేగాని తపస్సు చేయ లేదు. తపస్సువల్ల మాత్రమే నీ కోరిక సిద్ధిస్తుంది. నిన్ను తప్ప ఇంకెవరినీ శంకరుడు వివాహమాడడు” అని చెప్పి పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడు. పార్వతి తపస్సు చేయుటకు తల్లితండ్రుల అనుమతి కోరింది. మేనాదేవి “ఉమ” అని పలుమార్లు ఉచ్ఛరించింది. ఉమ అనగా వద్దు అని అర్థం. తపస్సు వద్దు అని చెప్పడానికి మేనా దేవి అలా అంది. అప్పటి నుండి పార్వతికి “ఉమ” అనే నామం ప్రసిద్ధి చెందింది. కుమార్తె దుఃఖాన్ని చూడలేక చివరకు అంగీకరించింది. ఉమాదేవి నిర్వికారిణియై ఎక్కడైతే పూర్వం శంకరుడు తపస్సు చేసాడో ఆ ప్రదేశంలో ఉగ్రతపస్సు మొదలు పెట్టింది. చివరకు ఆకులు కూడా తినడం మానివేసింది. అందువలన ఆమెను ‘అపర్ణ’ అనే పేరు వచ్చింది.

శంకరుడు పార్వతి మనస్సులోకి దృఢత్వాన్ని పరిశీలించమని సప్తర్షులను నియోగించాడు. వారు కపట బ్రహ్మచారుల వేషంలో వచ్చి శంకరునితో వివాహం వద్దని, వైభవంలో సాటిలేని విష్ణుమూర్తిని వివాహమాడమని చెప్పారు. అప్పుడు పార్వతి నవ్వి “శివుడు అవధూత స్వరూపుడు. నేను శంకరుని తప్ప వేరెవ్వరినీ వివాహం చేసుకోను. నా వ్రతాన్ని వదలను” అని చెప్పి మౌనం వహించింది. మహర్షులు ఆమెను ఆశీర్వదించి శివలోకానికి వెళ్ళి ఈ విషయం నివేదించి తమ లోకాలకు వెళ్ళిపోయారు.

శివుడు స్వయంగా తానే పరీక్షించాలని వృద్ధ బ్రహ్మచారి వేషంలో అక్కడకు వచ్చాడు. చెలికత్తెలతో ఈ సుందరి ఎవరు, ఎందుకు తపస్సు చేస్తున్నది అని ప్రశ్నించాడు. చెలికత్తెలు ఆ వృద్ధబ్రహ్మచారికి పార్వతి వృత్తాంతం తెలిపారు. అప్పుడు ఆ బ్రహ్మచారి నవ్వి “శ్మశానవాసి, కపాలధారి అయిన శివు డెక్కడ? ఇంతటి కుసుమ కోమలి, సుందరాంగి అయిన పార్వతి అతని వరించడ మేమిటి?” అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ శివుణ్ణి నిందించాడు. ఆ మాటలకు పార్వతి కళ్ళు తెరచి “విప్రోత్తమా! శివుని పరిణయమాడాలనే సంకల్పం నా మనస్సంతా నిండి ఉంది. అది నెరవేరని పక్షంలో నా దేహాన్ని అగ్నికి అర్పించి ఆత్మత్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. శివ నింద చేసినవానిని వధించాలి కాని బ్రాహ్మణుడవు కావున బ్రతికిపోయావు” అని చెప్పింది.

అప్పుడు విశ్వనాథుడు సాక్షాత్కరించి “దేవీ! నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. నువ్వు నా సనాతన ధర్మపత్నివి. నాతో కైలాసానికి రా” అన్నాడు. అంతట మహాసాద్వియైన ఉమ సంతోషంతో “నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను. మీరు లోకతీరును అనుసరించి నా తండ్రి అనుమతితో యదావిధిగా వివాహం చేసుకొనవలసింది. నా తండ్రికి కన్యాదాన ఫలాన్ని కలిగించండి. గతజన్మలో నా తండ్రియైన దక్షుడు గర్వంతో గ్రహపూజ నిర్వర్తించకుండా వివాహంచేసాడు. అందువలన ఆ వివాహం ఫలించలేదు” అని చెప్పింది.

దేవతల పరీక్షలు:

ఒకనాడు నటరాజైన శివుడు మేనాదేవి, గిరిజల వద్దకు బుడబుక్కలవాని వేషంలో వచ్చాడు. నాట్యం చేస్తూ అక్కడ ఉన్న వారందరినీ ఆనందింపజేసాడు. మేనాదేవి బంగారు పాత్రలో రత్నాలను పోసి బిక్షుకున కీయగా అతడు పార్వతిని బిక్షగా కోరాడు. మేనక కోపంతో ఈ ముష్టివాణ్ణి నగరం వెలుపలికి వెళ్ళగొట్టండి అని బటులకు ఆజ్ఞాపించింది. ఆ సమయంలో హిమవంతుడు అక్కడకు వచ్చాడు. శివుడు రుద్రరూపంలో కనిపించి మరల పార్వతిని బిక్షగా యాచించాడు. కాని శివమాయామోహితులైన మేనకాహిమవంతులు ఆయన కోర్కెను మన్నించ లేదు. వెంటనే శివుడు అంతర్ధానమయ్యాడు.

హిమవంతుడు ఇష్టపూర్వకంగా పార్వతిని శివుడికి కన్యాదానం చేస్తే దాని పుణ్యఫలితంగా అతడు శివసారూప్యాన్ని తరువాత ముక్తిని పొందుతాడు. అతడు భూలోకాన్ని విడిచి వెళ్లితే భరతఖండం తన పవిత్రతను కోల్పోతుంది. అలా కాకుండా అతడు అయిష్టంగా కన్యాదానం చేస్తే ఈ భూమిపై చిరకాలం ఉంటాడు. అందుకని దేవతలు రకరకాల పన్నాగాలు పన్నేరు.

దేవతల ప్రణాళిక ప్రకారం బృహస్పతి హిమవంతుని వద్దకు వెళ్ళి శివునిందను చేసి శివద్వేషం పుట్టేటట్లుగా చేసాడు. తరువాత శంకరుడు దివ్యమైన వస్త్రాలను, నుదుట తిలకాన్ని ధరించి హరినామాన్ని భక్తితో స్మరిస్తూ హిమవంతుని సందర్శించాడు. “మంచి లక్షణాలుగల లక్ష్మీదేవి వంటి అందమైన నీ కుమార్తెను ఆ విరూపాక్షునికి ఇచ్చి వివాహంచేయ సంకల్పించావని తెలిసింది. నువ్వు నారాయణుడి కులంలో పుట్టినవాడివి. ఈ వివాహం శ్రేయోదాయకం కాదు సుమా!” అని చెప్పి నిష్క్రమించాడు. ఆమాటలు విన్నది మొదలు మేనకాదేవికి హృదయం దుఃఖంతో నిండిపోయింది.పార్వతిని ఆ రుద్రునకిచ్చి వివాహం చేయడానికి అంగీకరించనని తన భర్తకు చెప్పింది.

శంకరుడు సప్తర్షులను పిలిచి “నేను దేవతల కోరికపై వైష్ణవ వేషంలో వెళ్ళి శివనింద చేసి నా వివాహం నేనే చెడగొట్టుకున్నాను. మీరు వెళ్ళి పార్వతిని నాకిచ్చి వివాహం జరిపేటట్లుగా వారికి నచ్చ చెప్పండి” అని చెప్పాడు. శివుని ఆజ్ఞ ప్రకారం సప్తర్షులు అరుంధతో కలిసి వెళ్ళి మేనకాహిమవంతులకు దేవ రహస్యాన్ని వివరించారు. “దక్షునికి పట్టిన దుర్గతి నీకు పట్టకూడదు. కనుక నీకుమార్తెను పరమేశ్వరునకిచ్చి వివాహం జరిపించు. శాశ్వతంగా భోగభాగ్యాలను అనుభవించు. నేటికి ఏడవ రోజున మార్గశిర మాసం, సోమవారం, చంద్రుడు తన కుమారుడు బుధునితో కూడి లగ్నంలో రోహిణితో కలిసి ఉన్న శుభ ముహూర్తంలో కన్యాదానం చెయ్యి” అని చెప్పారు.

పార్వతీ పరిణయం:

హిమవంతుడు తన సోదరుడైన మేరువు, కుమారులైన సహ్య, గంధమాదన, మందర, క్రౌంచ, మలయ, మహేంద్ర, మైనాక మరియు ఇతర పర్వతాలను సమావేశపరచి వారితో చర్చించి శివపార్వతుల వివాహం చేయడానికి నిర్ణయించాడు. అరుంధతి మేనకను ఒప్పించింది. సప్తర్షులు శంకరునికి హిమవంతుని అంగీకారాన్ని తెలియజేసారు. హిమవంతుడు సంతోషంతో పెళ్ళి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. హిమవంతుని బంధువర్గమంతా అట్టహాసంగా వచ్చారు. సమస్త ప్రాణికోటికి మధుర జలాలను అందించే గంగ, యమున, సరస్వతి, గోదావరి, సింధు, కావేరి, నర్మద మొదలైన నదీదేవతలందరూ తమ పుట్టింటిలో జరిగే పెళ్లికి తరలి వచ్చారు.

విశ్వకర్మ అనేక అద్భుతాలతో కూడిన కల్యాణ మండపాన్ని నిర్మించాడు. హిమవంతుడు పంపిన లగ్నపత్రికను అందుకున్న శివుడు నారదుని పిలిచి బ్రహ్మ, హరి, ఇంద్రుడు మొదలైన సమస్త దేవతలను, ఋషులను తన మాటగా ఆహ్వానించమని నియోగించాడు. శివగణాలన్నీ ఆనందంగా నాట్యం చేసాయి. సప్తమాతృకలు శంకరుని పెండ్లి కుమారుడిగా అలంకరించారు. కైలాసం నుండి వీరభద్రుని పర్యవేక్షణలో అసంఖ్యాక రుద్రగణాలు, కశ్యపుడు, అత్రి, వసిష్ఠుడు మొదలైన ఋషిగణాలు, దేవతలు పెండ్లి కుమారుని వెంట బయలుదేరారు. రుద్రుని సోదరియైన చండిక మహోత్సాహంతో వచ్చింది. హిమవంతుడు నగర శివార్లలో ఎదురేగి పెండ్లికొడుకైన శంకరుని తన పరివారంతో స్వాగత సత్కారాలు చేసాడు. సగౌరవంగా నగరంలోనికి తీసుకు వెళ్లాడు. సింహద్వారం దగ్గర మేనకాదేవి మంగళహారతి పళ్ళెంతో సిద్ధంగా ఉంది. అందమైన యువతులు దీప పాత్రలతో కర్పూర నీరాజనాలిచ్చి దిష్టి తీసారు. ఆచారం ప్రకారం శంకరుడు విడిదికి వెళ్లాడు.

దుర్గాదేవి అంతఃపుర పరిచారికలతో కలిసి కులదైవమైన అంబికను పూజించి వచ్చింది. వరుడు ఇచ్చిన అలంకారాలతో పార్వతిని అలంకరించారు. వేదవేత్తలైన బ్రాహ్మణులు మంగళద్రవ్యాలను చేత పట్టుకొని వేదమంత్రాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వర్తించారు. దేవతలందరూ సదాశివుణ్ణి స్తుతించారు. బ్రహ్మగారు శివపార్వతుల శిరస్సులపై అభిషేకింపజేసి ఒకే ఆసనంపై కూర్చుండబెట్టారు. పిమ్మట హోమ శేష ద్రవ్యాన్ని వదూవరులు భుజించారు. శంకరుడు నవరత్నాలతో నింపిన పూర్ణపాత్రను బ్రహ్మదేవునికిచ్చి సంతోషపెట్టాడు.

హిమవంతుడు అతిథులకు వివిదరకాలైన భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పానీయాలతో విందు చేసాడు. అందరూ తృప్తిగా ఆరగించారు. ఆ రాత్రి చంద్రశేఖరుడు ప్రత్యేక విడిది గృహంలో, రమణీయమైన రత్న పర్యంకంపై శయనించాడు. నాల్గవ రోజున చతుర్థీకర్మ యథావిధిగా ఆచరింపబడింది. దీనిని ఆచరించకపోతే వివాహ యజ్ఞం భగ్నమౌతుంది. ఉభయ పక్షాలవారూ వేదశాస్త్రపారంగతులైన విప్రులకు సంభావనలిచ్చి సత్కరించారు. సంగీత నాట్య ఉత్సవాలు జరిపారు. అరుంథతి పార్వతికి పతివ్రతగా ధర్మాలు బోధించింది.

పర్వతరాజు హిమవంతుని రాజధాని నగరమైన ఓషధీప్రస్థపురంలో ఈ విధంగా శివపార్వతుల ఐదు రోజుల పాణిగ్రహణ యజ్ఞోత్సవం అట్టహాసంగా జరిగింది. విష్ణాది దేవతలు నూతనవధూవరులతో కలిసి కైలాసానికి తరలి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మేనాదేవి రాచమర్యాద ననుసరించి పన్నెండు రకాల ఆభరణాలతో కుమార్తెను అలంకరించింది. ఉమాదేవిని సాగనంపుతూ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చింది. హిమవంతుడు కూడా కుమార్తెను గుండెలకు హత్తుకొని దుఃఖించాడు.

శివ పార్వతుల కైలాస యాత్ర:

ఆ శుభసమయంలో మన్మథుని కోల్పోయిన రతీదేవి సదాశివుని తన భర్తకు ప్రాణదానం చేయమని మరల ప్రార్థించింది. ఉమాదేవితో పరిణయం వలన ఎంతో సంతోషంగా ఉన్న ఆదిదేవుడు వెంటనే మన్మథుని జీవింప జేసాడు. ద్వాపరయుగం వరకు రతీమన్మథులను కైలాసంలో నివసించమన్నాడు. మన్మథుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి కుమారుడిగా జన్మించి మరల రతీదేవిని వివాహంచేసుకొని తన లోకానికి వెళ్తాడు అని చెప్పాడు. ఈశ్వరుడు వృషభవాహనారూఢుడై కైలాసానికి కదిలాడు. వీరభద్రుడు ముందు నడువగా రుద్రగణాలు నాట్యం చేస్తూ ఊరేగింపుగా బయలుదేరారు. వారి వెనుక ఋషులు, రతీమన్మథులు, దేవతలందరూ అనుసరించారు. శివపార్వతుల కైలాసయాత్ర చూడడానికి రెండు కన్నులు చాలనంత వైభవంగా సాగింది. దేవతలు దారి పొడుగునా పూలవర్షం కురిపించారు.

ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణగాథ మంగళకరము, సర్వశుభకరము, శోకహరము, అకాలమృత్యుహరము, ధనవర్ధనము, ఆనందదాయకము.

శుభం

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao