పడుతూ లేస్తూ - ఆమ్లజని

Padutoo lestoo

తిలారు రోడ్డుకూడలిలో సాయంత్రం సుమారు ఐదుగంటల సమయంలో పల్లెవెలుగు బస్సుదిగిన చందన్ తన ఊరు తిలారువైపు వడిగా నడవడం మొదలుపెట్టాడు. చిన్నప్పటినుంచీ అలవాటయిన మట్టివాసన పీల్చుకుంటూ, మట్టిరోడ్డుకు ఇరువైపులా గుబురుగా పెరిగిన పొదలనుంచి కీటకాల చప్పుళ్లు వింటూ, మధ్యలో పశువులు ఏవైనా ఎదురైనప్పుడు వాటివెనుక లేచే దుమ్మును సాయంకాలపు సూర్యుని లేతకిరణాల వెలుగులో ఆస్వాదిస్తూ నడవడం చందన్ కు అలవాటే. కానీ ఆరోజు పొద్దుటనుంచీ తన మనసు గందరగోళంగా ఉంది. మరోసారి చేతులు వెనక్కిపెట్టి తన వీపుకు తగిలించుకున్న సంచిని తడమగానే స్వీటుబాక్సు తగిలింది. ఆరోజు తన భార్య అమూల్యతో జరిగిన గొడవ బుర్రలో గిర్రున తిరగటం మొదలుపెట్టింది. చందన్ కు పొద్దున్నే కాలకత్యాలు తీర్చుకున్నాక టీ తాగుతూ దినపత్రిక చదవటం అలవాటు. బహుశా సమాజంలో అనేక సమస్యలతో సతమతమౌతున్నవారి వార్తలు తెలుసుకుంటున్నప్పుడు తన జీవితం మెరుగ్గానే ఉందన్న ఒక భావన కలుగుతుందేమో, టీ మరియు దినపత్రికలు ఉమ్మడిగా ఒక రోజుకు సరిపడా ఉత్తేజాన్ని కలిగిస్తాయని అంతఃచేతనంలో చందన్ నమ్ముతాడు. ఆరోజు ఎంతసేపైనా టీ అందకపోవడంతో అమూల్యా అంటూ పిలిచాడు. ఆఁ ఏమండీ వంటగదినుంచి అమూల్య పలికింది. టీ ఏంటీ టీ.. ఇస్తున్నావా లేదా టీపొడి అయిపోయిందండీ అయిపోయిందా... అయిపోతే ఇప్పుడా చెప్పడం చందన్ స్వరంలో కొద్దిగా తీవ్రత పెరిగింది. నిన్న సాయంత్రం మీకు ఫోన్లో చెప్పాను కదండీ అమూల్య వంటగదినుండి బయటకు వస్తూ అంది. చందన్ కాస్త అయోమయానికి గురయ్యాడు. ఔను.. తను ఆఫీసుపనిలో తలమునకలై ఉన్నప్పుడు అమూల్యనుండి కాల్ వచ్చింది. ఏవో రెండుమూడు వస్తువులు తీసుకురమ్మని చెప్పింది. అలాగే అని హడావిడిగా చెప్పి ఫోను పెట్టేసాక ఆ సంగతి పూర్తిగా మరచిపోయాడు. ఇదిగో.. మళ్ళీ ఇప్పుడే గుర్తువస్తోంది. వెంటనే తేరుకున్నాడు. అయినా చివరివరకూ చెప్పకుండా ఎందుకు ఉండడం మీకు వారంక్రితమే చెప్పాను కదండీ.. సరుకులు అయిపోతున్నాయి, మీకు వీలు అయినప్పుడు సూపర్ బజార్ కు వెళ్దామని... అయినా ఒక్కపూట టీ లేకపోతే బతకలేరా.. అంటూ అమూల్య రాగాలు తియ్యడం మొదలుపెట్టింది. చందన్ కు చిర్రెత్తుకొచ్చి దినపత్రికను దూరంగా విసిరికొట్టి స్నానానికి వెళ్ళిపోయాడు. ఆఫీసుకు వెళ్తున్నప్పుడు కూడా అమూల్యకు వస్తానని చెప్పకుండా వెళ్ళిపోయాడు. తను వెళ్ళినవైపు చూస్తూ ఉండిపోయింది అమూల్య. *** చందన్ శ్రీకాకుళంలోని తన కార్యాలయానికి వెళ్ళగానే కేరేజి సంచిని తన బల్లపైన గోడకు ఆనించి పెట్టి తన కుర్చీలో కూర్చొని కంప్యూటర్ను ఆన్ చేస్తుండగానే నీళ్లసీసాతో అటెండర్ రమణ వచ్చాడు. నీళ్లసీసాను బల్లపైన పెడుతూ సార్ పార్టీ అన్నాడు నవ్వుతూ. ఏమన్నావ్ అన్నట్లు రమణవైపు చూస్తుండగానే సహోద్యోగులైన అప్పారావు, శ్రీవాణి తనవైపే నవ్వుతూ వస్తుండడం గమనించాడు. పెళ్ళిరోజు శుభాకాంక్షలు చందన్ గారు అని ఇద్దరూ ఒకేసారి అనగానే చందన్ అయోమయానికి గురయ్యాడు. వెంటనే కేలండర్ వైపు చూస్తూ తేదీని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆరోజు మార్చినెల పదకొండో తేదీ.. మూడేళ్ళక్రితం తనకు అమూల్యతో వివాహం జరిగిన రోజు. చందన్ పనిచేసేది ఒక ప్రైవేటు బ్యాంకులో. బ్యాంకు మేనేజరుతో పాటు మొత్తం ఏడుగురు సిబ్బంది ఉంటారు. మార్చినెలలో సహజంగా ఉండే పని ఒత్తిడిలో పెళ్ళిరోజును మరచిపోయాడు చందన్. ఏంటి సార్ బిగుసుకుపోతున్నారు అని రమణ అడుగుతుండగానే కొంపదీసి మరచిపోయారా అని శ్రీవాణి అంది. వెంటనే తేరుకున్న చందన్ ముగ్గురికీ ధన్యవాదాలు చెప్పి రమణకి కొంత పైకం ఇచ్చి స్వీట్లుకోసం పంపించాడు. తన చరవాణి తెరచి చూసుకొని ఈరకంగా తన పెళ్ళిరోజును గుర్తుచేసినందుకు ఫేస్ బుక్ వారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. కానీ అమూల్య గురించి తలచుకోగానే మనసులో గందరగోళం పెరిగిపోతోంది. పెళ్ళిరోజును మరచిపోవడమే మహా నేరమనుకుంటే చెప్పిన సరుకులు కొనడమూ మరచిపోయి, అదీ చాలదన్నట్టు పొద్దున్న జరిగిన వాదనలో అహం చూపించి చెప్పకుండా వచ్చేసినందుకు తనను తానే నిందించుకుంటూ అసలు తప్పు ఎక్కడ జరిగిందీ అని గొణుక్కుంటుండగా తనకు టీపొడితో పాటు మైదాపిండి, గుడ్లు కూడా తెమ్మని చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు కేకేమైనా తయారుచేస్తుందా అని అనుకున్నానుగానీ పెళ్ళిరోజు దగ్గరలో ఉందని క్లూ ఇస్తున్నట్లు గ్రహించలేకపోయానే అని మధనపడుతూ అమూల్యకు ఫోన్ చేసాడు. చాలా రింగుల తరువాత ఫోను రిసీవ్ చేసుకొన్న అమూల్య ఏంటో చెప్పండి అని ముక్తసరిగా అంది. హ్యాపీ యానివర్సరీ అమూల్య అని అనగానే ఫోను కట్టయింది. మరోసారి ఫోన్ చేస్తే రెండు రింగుల తరువాత కట్టయింది. ఒక గంట తరువాత మళ్ళీ చేస్తే ఈసారి ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తోంది. ఇక ఏదయినా ముఖాముఖీ మాట్లాడుకోవడమే తప్ప వేరేమార్గం లేదు అని అనుకున్నాడు. మరోవైపు ఆఫీసులో ఆరోజే చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి ఆరోజు శలవు దొరికే అవకాశం లేదు. ఆ పనులన్నీ తొందరగా కానిచ్చేస్తే మేనేజరుగారికి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు అనుకొని వెంటనే అన్యమనస్కంగానే పనిలో నిమగ్నమైపోయాడు. పనులన్నీ పూర్తి అయ్యేటప్పటికి సాయంత్రం నాలుగయ్యింది. వెంటనే మేనేజరుగారి అనుమతితో ఇంటికి బయలుదేరాడు. శ్రీకాకుళంలో బస్సెక్కి తిలారు రోడ్డుకూడలిలో దిగేసరికి సమయం సుమారు ఐదుగంటలు అయింది. *** త్వరగా ఇంటికి చేరుకోవాలని వడివడిగా అడుగులేస్తున్నాడు చందన్. ఇంతలో ఏదో అలికిడి అయినట్లు అనిపించి వెనుకకు తిరిగిచూడగానే గుండె ఝల్లుమంది. అక్కడ ఒక నాగుపాము పడగవిప్పి బుసలుకొడుతోంది. దానితోకని మట్టేనేమో అన్న సంశయంతోపాటు భయంతో ఒళ్ళుగగుర్పొడిచి స్థానువులా ఉండిపోయాడు. అంతలోనే పాము కాస్త ముందుకు వచ్చి కాలిపై కరవబోతుండగా అప్రయత్నంగా తన చేతిని అడ్డుపెట్టాడు. అంతే.. వంటిలోని నరాలన్నీ జివ్వుమన్నట్లుగా మణికట్టు దగ్గరలో కాటేసి పొదల్లోకి పాక్కుంటూ వెళ్ళిపోయింది. చందన్ కు చెమటలు పడుతున్నాయి. నడుస్తూనే జేబులోంచి రుమాలు తీసి పాము కాటేసిన ప్రదేశానికి పైభాగంలో కట్టుకట్టాడు. మరోసారి అమూల్యకు ఫోన్ చేస్తే ఇంకా స్విచ్చాఫ్ అనే వస్తోంది. ఊరిలో ఇంకెవరికైనా ఫోన్ చేద్దామని కాంటాక్ట్స్ తెరవగానే అమ్మ అని కనిపించింది. ఇంకా పేర్లు వెతుకుతూ ఉంటే అంత గందరగోళంలోనూ ఏడాదిక్రితం తను అమ్మకి బంగారుగాజులు కొంటానని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆతరువాత ఒక లక్షరూపాయలు కూడబెడదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతీసారి ఏవో ఖర్చులు వస్తూనే ఉండడంతో అలా వాయిదావేస్తూ వచ్చాడు. ఏడాది గడిచిపోయింది. ఈరోజు.. ఇప్పుడు తను ఈ పరిస్థితిలో ఉన్నాడు. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. మరిక గాజులు కొనకుండానే చనిపోతానేమో అని ఆలోచన రాగానే నీరసం మరింత ఎక్కువ అయింది. స్పృహతప్పి పడిపోతాననే భయంతో ఒక చెట్టుకింద కూర్చుండిపోయాడు. ఊరిలో ప్రక్కింట్లో ఉండే సుధీర్ కి ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పాడు. తరువాత హైదరాబాదులో ఉంటున్న తన బాల్యస్నేహితుడు బలరాంకు ఫోన్ చేసి ఒక లక్ష రూపాయలు వెంటనే ఫోన్ పే ద్వారా పంపగలవా అని వేడుకొన్నాడు. అంత అత్యవసరం ఏమొచ్చిందిరా అని బలరాం అడిగాడు. చాలా ముఖ్యమైన కొన్ని పనులు సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం లేకపోవడంవలన మనం వాయిదావేస్తూ ఉంటాం. దానితో ఒక్కోసారి ఆ పనులు ఎప్పటికీ పూర్తిచేయలేని పరిస్థితి రావచ్చు.. నువ్వు నాకు వెంటనే దయచేసి డబ్బు పంపరా.. నీకు ఒక నెలరోజుల్లో నేనయినా లేదా నేను లేకపోతే అమూల్య అయినా తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పాడు. కొంతసేపటి తరువాత దూరంనుంచి ఏదో మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఇంతలోనే తనకు ఫోన్ పే ద్వారా లక్షరూపాయలు జమ అయినట్లు సందేశం వచ్చింది. తక్షణం చందన్ తన నాన్నకు ఫోన్ చేసి నాన్నా మీ ఖాతాకు లక్షరూపాయలు బదిలీ చేస్తున్నాను, ఈరోజే అమ్మకు గాజులు కొనెయ్యండి అని చెప్పాడు. *** రాత్రి ఎనిమిది అవుతోంది. చందన్ కళ్ళు తెరిచేసరికి తను శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రక్కనే అమూల్య ఒకవైపు, అమ్మ మరోవైపు దుఃఖం దిగమింగుకుంటూ తన చేతులు పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎదురుగా నాన్న ఆతృతగా తనవైపే చూస్తున్నారు. గది బయట సుధీర్ తో పాటు స్నేహితులు నలుగురైదుగురు ఉన్నట్లున్నారు. చందన్ కళ్ళు తెరవటంతో అందరూ కాస్త స్థిమితపడ్డారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసేసాను నన్ను క్షమించండి అంటూ అమూల్య భోరున ఏడ్చింది. ఏడుస్తూనే థాంక్యూ సేమ్ టూ యూ అంది. అమ్మ ఏడుస్తూ ఇంటినుంచి బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళాలి నాన్నా అంది. నాన్నా గాజులు కొనేసారా అని అడిగాడు చందన్. కొనేసాం నాన్నా అని చెప్పి గది బయటకు వచ్చి ఆసుపత్రిలో కట్టిన లక్షాపదివేల రూపాయల రశీదును చింపి చెత్తకుండీలో వేసాడు చందన్ నాన్న. ‌‌*** సమాప్తం***

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి