మాఇంటి గోమాత - కందర్ప మూర్తి

Maa inti gomaata

అగ్రహారం గ్రామం బ్రాహ్మణ వీధిలో అదొక పెద్ద డాబా ఇల్లు. అందులో నివాశముండే శ్రీనివాస్ - గౌరీ ఆదర్స దంపతులు. వారికి పరోపకారంతో పాటు పర్యావరణం పక్షి జంతువులంటే ఎంతో ప్రేమ. ఇంటి పైభాగంలో డాబా, కింది భాగంలో రెండు పడక గదులు హాలు దేవుడి మండపం వంటగదితో పాటు బయట విశాలంగా అరుగులుఉన్నాయి. ఇంటి చుట్టూ భారీ ప్రహరీ గోడ , రోడ్డుకు ఆనుకుని పెద్ద ఇనప గేటు, లోపలి ప్రాంగణంలో వివిధ రకాల ఫలవృక్షాలు పూల మొక్కలు రకరకాల పక్షుల అరుపులు ఆధ్యాత్మిక వాతావరణంతో కనబడుతుంది ఆ ఇల్లు.

శ్రీనివాస్ పెద్దలు మిగిల్చిన సాగుభూమిలోవ్యవసాయం చేస్తుంటాడు. గౌరి గృహిణి. ఉన్న ఒక్క కూతురు ఉన్నత చదువులు చదివించి పెళ్లి చేస్తే అత్తవారింట్లో ఉంది. వీరిద్దరూ కాకుండా ఒక వృద్ధ మహిళ కళావతి గౌరి తల్లి కూడా వారితో కలిసి ఉంటుంది. మూడు పెంపుడు కుక్కలు సాయంగా ఉంటాయి.కళావతి ఇంట్లో చేతోడుగా ఉంటు ఉదయాన్నే స్నానం చేసి మడిగా ఇంటి ఆవరణలో ఉన్న రకరకాల మందార పువ్వులు పెద్ద పళ్లెంలో కోసిదేవుడి మండపంలోని ప్రతి పటానికి దేవతలకు అలంకరిస్తుంటుంది.వాకిట్లోని పెద్ద సిమ్మెంటు తులసి కోటలో విశాలంగా పెరిగిన తులసి మొక్కను బొన్సాయి మాదిరి చిగుళ్లు వెన్నులను చిదిమేస్తు గుండ్రంగా గొడుగులా చేసి సమయానుకూలంగా నీరు పెడుతున్నందున పచ్చగా అందంగా కనబడతుంది. కూతురు గౌరి ఉతికి నీరు పిండిన తడి బట్టలను బయట ఉన్న వైరు మీద ఆరేస్తుంది. పెంపుడు కుక్కలకు టైము ప్రకారం వాటి పళ్లేల్లో అన్నం తాగడానికి నీళ్ళు పెడుతుంటుంది కనక ఆవిడ వెనకే తిరుగుతుంటాయి. మధ్యాహ్నం అప్పుడు మంచంమీద పడుకుంటే కాళ్ల దగ్గర నడుం దగ్గర అవి పడుకుంటాయి.

ఆవిడ ఒక్క గంట కూడా కాళీగా కూర్చోదు. ఏదో పని పెట్టుకుంటుంది. ఇంటి ఆవణలో ఉన్న మల్లి తుప్పలకు కనకాంబరం మొక్కలకు గొప్పులు తవ్వడం, చామంతి మరువం ధవనం గోలాల్లో నీళ్లు పొయ్యడం అరటి జామ సపోటా దానిమ్మ సీతాఫలం రామా ఫలం నిమ్మ దబ్బ ఉసిరి మామిడి మొక్కల చుట్టూ తిరిగి ఏఏ చెట్టు పూతకొచ్చింది ఏ చెట్టుకు పళ్లు పండాయో చూసి కోసుకొస్తుంది. ఎత్తుగా పెరిగిన చెట్ల కొబ్బరికాయలు కింద పడితే ఏరి పోగు పెడుతుంది. వేసంగిలో విరబూసిన మల్లె మొగ్గలు కనకాంబరాలు మరువంతో కలిపి మాలలు కట్టి కొన్ని దేవుడి పటాలకు అలంకరిస్తుంది. గోడ కోరడిలో ఉన్న నీలం పసుపు శంఖం పువ్వుల మొక్కలకు గొబ్బి సంపెంగ ఉసిరి గోరింట పొదలను తనిఖీ చేస్తుంది.

ఆవిడకు సెక్యూరిటీగా పెంపుడు కుక్కలు వెంట తిరుగుతుంటాయి. అరటి చెట్టున అరటిపువ్వులు ఉంటే కోసి ఓపికగా రెబ్బలు తీసి కూరకు తయారు చేస్తుంది. టైము ప్రకారం ఆవణలో ఉన్న నీటి బోరు స్విచ్ ఆన్ చేసి మేడమీదున్న సిమ్మెంటు వాటర్ టేంక్ నింపి ప్లాస్టిక్ గొట్టంతో మొక్కలకు నీళ్ళు పెడుతుంది. ఆవిడ చేసే సేవలకు ఇంటి ప్రాంగణంలోని అనేక పళ్ల చెట్లు రంగురంగుల పూల మొక్కలు పచ్చగా కనువిందు చేస్తుంటాయి. కాకులు గోరింకలు రామచిలుకలు కొంగలు లాంటి ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకుని అరుపులతో సందడి చేస్తాయి. ఎవరికైనా తమలపాకులు అవుసరమైతే కళావతి మామ్మని అడిగితే రెడీగా ఉంటాయి.దొడ్లో పండిన జామి, బొబ్బాస, సీతాఫలం, దానిమ్మ, నారింజ పళ్లను పిల్లలకు పంచి ఇచ్చేది. గుమ్మంలోకి ఎవరు వచ్చినా కరివేపాకు కొమ్మలతో సాగనంపేది.శ్రావణ ఆషాడ మాసాల్లోఆడపిల్లలు గోరింటాకు కోసం వస్తే గోరింట పొదలు చూపేది. ఓపికగా డాబా ఎక్కి ఏపుగా ఎదిగిన ములంచెట్టు కాడలు కోసుకు వచ్చేది. పెద్ద బాదంచెట్టుకు పండిన ఆకులు చిందర వందరగా పడితే చీపురుతో ఒక పోగులా చేసి మంట పెట్టేది. చెట్టును పండిన నిమ్మ దబ్బ కాయలు కోసి పంచడమే కాకుండా ఉప్పు పసుపు కలిపి ఊరగాయగా చేసేది.

అల్లుడు శ్రీనివాస్ కి చేతోడుగా ఇంటి ఆవరణలో ప్రతి చెట్టు మొక్కకి గొప్పులు తవ్వి నీళ్లు పెట్టి పచ్చగా ఉండేలా చేసి మనుషులతో పాటు పక్షులు ఉడతలు తొండలువంటి చిన్న జంతువులకు ఆహారం సమకూర్చేది. అప్పుడప్పుడు కోతులు కూడా దొడ్లో పండిన పళ్లు రుచి చూసేవి.చెట్టును వేలాడే పనస పళ్లు రోడ్డున పోయేవారు దిష్టికళ్లతో చూసేవారు.రోడ్డున పోయే స్కూల్ పిల్లలు కాపుతోఉన్న మామిడి చెట్ల మీదకు రాళ్లు విసిరితే చేతి కర్ర సాయంతో కేకలు వేస్తు పరుగులు పెట్టించేది.

ఇలా ఇంట్లో వారికి ఇరుగుపొరుగు వారికి ఎంతో చేతోడుగా ఆదరాభిమానాలతో ఉండే కళావతి మామ్మ వృద్దాప్యం వల్ల జబ్బుతో చనిపోయింది. ఆ విషయం తెల్సి ఊరంతా జనం ఇంటికి వచ్చి తమ బంధువు చనిపోయినంతలా బాధ పడ్డారు. ఆవిడ దహన క్రియలు అట్టహాసం జరిగాయి. దశదిన కార్యక్రమాలు తర్వాత సంవత్సరీకం మూడురోజులు కూడా బాగానే సాగేయి. ఆవిడ పేరున బ్రాహ్మణులకు దాన ధర్మకార్యక్రమంలో ఒక తెల్లని ఆవును కొని తెచ్చారు. దానం సమయంలో బ్రాహ్మణుడు ఆవును తను సాకలేనని దానికి బదులుగా డబ్బును దానం చెయ్యమనగా గత్యంతరం లేక ధనరూపంలో దానం చేసారు.

ఈలోపున నీడగా ఉంటుందని గేటు పక్క బాదం చెట్టుకు తాడుతో కట్టబోగా తాడుతో పాటు దొడ్లోకి పోయి కళావతి మామ్మ మాదిరి ప్రతి చెట్టు మొక్కల చుట్టూ తిరగసాగింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. సంవత్సరీకం కార్యక్రమాలు అయిపోగానే ఆవును శ్రీనివాస్ తమ ఇంటి ప్రాంగణంలో చిన్న షెడ్డు వేసి రోజు గడ్డి కుడితి అన్నం జావ పెట్టి పెంచ సాగేరు. కళావతి మామ్మే ఆవు రూపంలో ఇంటికి తిరిగి వచ్చిందని తలిచి ఆవుకు కళ అని పెయ్యకు గౌరి పేరు పెట్టి ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఎవరైన ఆవును కళ అంటే తల పైకెత్తి చూస్తుంది . ఇదివరకే పరిచయం ఉన్నట్టు ప్రహరీ నాలుగు గోడల మద్యనున్న మొక్కామోడు కలియ తిరుగుతుండేది. షెడ్డులో కట్టి ఉంచినప్పుడు మొదట్లో పెంపుడు శునకాలు దగ్గరకు వస్తే పెయ్యను కరుస్తాయేమోనని భయంతో కొమ్ములు విసిరేది. తర్వాత ఏమనేది కాదు. శునకాలు పెయ్యతో ఆడుకునేవి . ఆవు చేస్టలను చూసి ఇంట్లో వారు బంధు‌వు‌లు‌ మళ్లా కళావతిమామ్మే గోమాత రూపంలో తిరిగి వచ్చిందనుకున్నారు.రోజు పితికే పాలలో కొంత గౌరి పెయ్యకు మిగతావి ఇంట్లోకి వాడుకునేవారు.
కొంతమంది చనిపోయినా వారి ఆత్మలు ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తుంటాయని చెబుతుంటారు.
***
సమాప్తం

మరిన్ని కథలు

Varsham kosam
వర్షం కోసం
- తాత మోహనకృష్ణ
Konaseema kurradu
కోనసీమ కుర్రాడు
- సిహెచ్. వి. యస్. యస్. పుల్లంరాజు
Marchery lo muchhatlu
మార్చురీలో ముచ్చట్లు
- మద్దూరి నరసింహమూర్తి
Chaitanya sravanthi
చైతవ్య స్రవంతి
- బి.రాజ్యలక్ష్మి
Kurukshetra sangramam.3
కురుక్షేత్ర సంగ్రామం.3.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.2
కురుక్షేత్ర సంగ్రామం.2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.1
కురుక్షేత్ర ససంగ్రామం.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు