అంతర్మధనం - పద్మావతి దివాకర్ల

Antarmadhanam

"ఏమండీ, నేను చెప్పిన విషయం ఏం చేసారు?" మెల్లగా అడిగింది కిరణ్మయి ఆఫీసుకు బయలుదేరబోతున్న భర్త మనోహర్ని.

"చూస్తున్నా! ఆ పనిమీదే ఉన్నాను." అన్నాడు మనోహర్ చెప్పులు వేసుకుంటూ.

ఒకసారి నాలుగువైపులా చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత మనోహర్‌వైపు తిరిగింది కిరణ్మయి.

"కొంచెం వేగం చూద్దురూ, ఈ ఇంట్లో ఇమడలేకపోతున్నాను. మన అశోక్ ఇక్కడుంటే మిగతా పిల్లలతో కలిసి ఆటపాటలతో సమయం వృధా చేస్తున్నాడు. నా మాట అసలు వినడంలేదు. వాడి చదువెలా సాగుతుందోనని నాకు బెంగగా ఉంది. ఇప్పటికే స్కూల్లో వాడు వెనకబడి ఉన్నాడు. నాకు కూడా ఇక్కడ పనితో ఊపిరి సలపటం లేదు." అంది కిరణ్మయి మెల్లిగా ఇంట్లో ఇంకెవరికీ వినపడకుండా జాగ్రత్త పడుతూ.

"అలాగే, చూస్తున్నా! మన బడ్జెట్‌కి సరిపడే అద్దె ఇంటికోసం చూస్తున్నాను. నిన్న మా కోలీగ్ శేషగిరి ఒక మంచి ఇల్లు తక్కువ అద్దెకి ఉందని చెప్పాడు. మా ఆఫీసుకు దగ్గరగా ఉందట. ఇవాళ ఆఫీసు అయిన తర్వాత చూపిస్తానన్నాడు." అన్నాడు మనోహర్ ఆఫీసుకు బయలుదేరుతూ.

భర్తని ఆఫీసుకి సాగనంపి ఇంట్లోపలికి వెళ్ళింది కిరణ్మయి. వంటిట్లో ఆమె తన కోసం ఎదురు చూస్తున్న పనులు చూసి గాఢంగా ఒక నిట్టూర్పు విడిచింది కిరణ్మయి.

"అమ్మాయీ కిరణ్మయీ, మీ మామయ్యగారికి కాఫీ ఇవ్వమ్మా!" అని పురమాయించింది అత్తగారు హాల్లోంచే టివిలోంచి తలతిప్పకుండా.

"అలాగే అత్తయ్యగారూ." అంటూ ఆ పనిలో పడింది ఆమె మనసులో విసుక్కుంటూ.

ఇలా అతనికోసం ఆమె కాఫీ చెయ్యడం ఇది మూడోసారి. కిరణ్మయికి వంటపని మధ్యలో ఇలా మాటిమాటికి కాఫీ అందించాలంటే చాలా విసుగ్గా ఉంది, అయినా తప్పదు. ఏమైనా అన్నా దానిమీద ఇంట్లో పెద్ద చర్చా కార్యక్రమం జరిగే అవకాశం లేకపోలేదు. పెద్ద తోటికోడలు వసుంధర వంటపనిలో సహాయం చెయ్యడానికి వచ్చినా ఆమె పనంతా తనపై ఆజమాయిషీ చెయ్యడంతోనే సరిపోతుంది. చిన్న తోటికోడలు సరితకి అయితే వంటపని రాదు. పైగా ఆమె ఉద్యోగస్తురాలు. పదిగంటల లోపే ఆఫీసుకి బయలుదేరుతుంది. అత్తగారు పై పనులు చూసినా, మళ్ళీ పూర్తి బాధ్యతంతా తనదే. ఇంట్లో అంతా కలిసి పది మంది దాకా ఉంటారు. ఇంటిపని, వంటపని తోనే రోజంతా గడిచిపోతుంది. పెళ్ళికాకముందు తను కవితలు, కథలు రాసి పత్రికలకి పంపేది. ఇప్పుడు అసలు ఖాళీ సమయమే దొరకక తన రచనా వ్యాసంగం పూర్తిగా మూలపడింది. ఎప్పటికైనా ఓ ప్రముఖ రచయిత్రి కావాలనే ఆమె కోరిక తీరడం గగనమైపోయింది. ఆ ఉమ్మడి కుటుంబంలో ఇమడలేక నానా హైరానా పడుతోంది. తన తల్లికి మొరపెట్టుకున్నా, ఆమె సర్దుకుపోవాలని తనకే సలహా ఇచ్చింది. మరో దారిలేక భర్తకి చెప్పుకుంది. పోరగా పోరగా, ఏ కళనున్నాడో నెలరోజుల కిందట ఎక్కడైనా అద్దెకి తీసుకొని వేరే వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అయితే ఇంతవరకు అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె ఇల్లు దొరకలేదు. మంచి ఇల్లు సకల సౌకర్యాలతో దొరికితే అద్దె ఆకాశాన్ని అంటుతోంది. ఏ చెయ్యాలో తోచడంలేదు. అలా రోజూ ఎవరు ఎక్కడ ఇల్లు అద్దెకు ఉందంటే అక్కడికే చూడ్డానికి వెళ్తున్నాడు ఆమె భర్త మనోహర్. ఇవాళ ఆ కోలిగ్ చెప్పిన ఇల్లు తమ అందుబాటులో ఉండాలని మనసారా దేవుడ్ని వేడుకుంది కిరణ్మయి.

ఈ లోపు వంట పనిలో ఆమెకి సాయం చెయ్యడానికి వచ్చింది ఆమె తోటికోడలు వసుంధర. వంటపనిలో ఆమె నిమగ్నమై ఉన్నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలతో సతమతమౌతోంది. భర్త ఆఫీసుకూడా ఇక్కడికి దూరమే. అతని ఆఫీసుకి దగ్గరగా అద్దె ఇల్లు దొరికితే, అప్పుడు అక్కడికి దగ్గరలోనే అశోక్ కోసం మంచి స్కూలు ఏమైనా ఉందేమో చూడాలి. తీరుబాటు సమయంలో తను తన రచనా వ్యాసంగం కొనసాగించవచ్చు.

వంటపని పూర్తి చేసుకొని అందరికీ వడ్డించి, తమ భోజనం కూడా చేసి వంటిల్లు సర్దేసరికి మూడు గంటలు దాటింది. మూడు నుంచి నాలుగు గంటల లోపు ఆ కొద్ది సమయం మాత్రం విశ్రాంతి దొరుకుతుంది. నాలుగు గంటలు కొట్టగానే మళ్ళీ పనుల్లో తను బిజీ అయిపోతుంది. స్కూలు నుండి తన కొడుకు చిన్నియే కాక, మనోహర్ అన్నయ్య కొడుకు అక్షర్, కూతురు అక్షిత కూడా స్కూల్ నుండి వస్తారు. వాళ్ళకి బట్టలు మార్చడం, తినడానికి చిరుతిళ్ళు, బోర్న్‌విటా ఇవ్వడం కూడా వసుంధర బాధ్యతే. ఆ తర్వాత అందరికీ కాఫీలు, స్నాక్స్. ఏడయ్యేసరికి మళ్ళీ రాత్రి వంటకోసం ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ లోపున బజారుకి వెళ్ళి కావలసిన కూరలు, ఇతర సామాన్లు తెచ్చుకోవాలి. ఇలా రోజంతా తనకి ఊపిరి సలపని పని. మధ్యమధ్యలో మామగారి అవసరాలు చూడాలి. అత్తగారు చెప్పినది చెయ్యాలి. ఈ గానుగెద్దు జీవితంతో ఆమెకి విరక్తి పుట్టి, ఎప్పుడు ఇక్కణ్ణుంచి విముక్తి దొరుకుతుందా అని ఎదురు చూస్తోంది. ఇలా ఆలోచనలతోనే మేను వాల్చింది కిరణ్మయి.

X X X X X

పనులన్నీ పూర్తి చేసుకొని భర్త కోసం ఎదురు చూస్తోంది కిరణ్మయి. ఆమెకి చాలా ఆత్రంగా ఉంది. ఇల్లు నచ్చిందని భర్త చెప్పబోయే కబురు కోసం ఎదురు చూస్తోందామె. రాత్రి ఎనిమిది గంటలకి అలసిపోయి ఇంటికి వచ్చాడు మనోహర్. మొహం కడుక్కున తర్వాత కాఫీ అందించి ఏమి కబురు చెప్తాడోనని అతనివైపు చూసింది. ఆమె ఆత్రం గమనించాడు మనోహర్.

"తర్వాత అంతా వివరంగా చెప్తాను." అన్నాడు. అలాగేనని తలూపి వంటింట్లోకి వెళ్ళిందామె.

'ఇల్లు అనుకున్నంత సౌకర్యవంతంగా లేదేమో? నీళ్ళు సదుపాయం సరిగ్గా లేదేమో! అద్దెగానీ ఎక్కవ అడుగుతున్నారేమో! అన్నీ బాగుంటే తర్వాత అంతా వివరంగా చెప్తానని ఎందుకంటారు?' ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూనే రాత్రయ్యేంతవరకూ గడిపింది కిరణ్మయి.

ఎప్పుడెప్పుడు ఇంటి విషయం చెప్తాడా అని ఎదురు చూస్తున్న కిరణ్మయి ఆత్రం గమనించి, "నేను చూసిన ఆ ఇల్లు చాలా బాగుంది. మనకి రెండు బెడ్రూంలు చాలనుకుంటే అది మూడు బెడ్రూముల ఇల్లు. ఇంటి ఓనరు అన్నపూర్ణమ్మ క్రింది వాటాలో ఉంటుంది. మేడ మీద ఇల్లు అద్దెకి ఇస్తారు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. కానీ..." అంటూ నీళ్ళు నమిలాడు మనోహర్.

"ఇంకేమైనా సమస్యలున్నాయా? నీళ్ళకు సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందా?" అని అడిగింది కిరణ్మయి.

"లేదు అలాంటిదేమీ లేదు. ఇరవై నాలుగు గంటలూ మున్సిపాలిటీవారి కుళాయి వస్తుంది. అంతేకాక ఇంట్లో బోరింగ్ కూడా ఉంది. కానీ..." అని ఆగాడు.

"అద్దె ఎక్కువ చెప్పారా? పోన్లెండి, మనకు అందుబాటులో ఉండే ఇల్లే చూసుకుందాం. ఆ ఇంటి విషయం ఇక మర్చిపొండి." అందామె తను కూడా నిద్రపోవడానికి మంచం ఎక్కుతూ.

"అది కాదు. అద్దె చాలా తక్కువ చెప్పింది ఆ ఇంటి ఓనర్ అన్నపూర్ణమ్మ. అంత తక్కువలో మనకి సాధారణంగా రెండు గదులున్న ఇల్లు కూడా దొరకదు. ఇదేమో నాలుగు గదులన్న ఇల్లు. చాలా బాగుంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాని ఆమె కొన్ని షరతులు పెట్టింది అద్దెకి ఇవ్వడానికి." అంటూ ఆగాడు మనోహర్.

"ఏమిటా షరతులు?" ఆసక్తిగా అడిగింది కిరణ్మయి.

"ఇంట్లో పిల్లలు ఉండి సందడిగా ఉన్న కుటుంబానికే ఆమె అద్దెకి ఇస్తానంది. ఇది తన మొదటి షరతు. ఇంక రెండో షరతేమిటంటే, ఉమ్మడి కుటుంబానికి మాత్రమే ఆమె తన ఇల్లు అద్దెకి ఇస్తానంది." అన్నాడు.

"అదేమిటి మళ్ళీ?" అడిగింది కిరణ్మయి ఆశ్చర్యపోతూ. “ఎవరైనా తమ ఇంట్లో అద్దెకి దిగే వాళ్ళు తక్కువ మంది ఉండాలి అని అనుకుంటారు గాని, పది మంది ఉండాలి అని ఎవరూ అనుకోరు కదా.” అంది.

"రిటైరైన తర్వాత ఆమె, ఆమె భర్త చాలా కష్టపడి తమ అభిరుచి మేరకు దగ్గరుండి కట్టుకున్నారా ఇంటిని. కాకపోతే ఆ ఇంట్లో దిగిన తర్వాత ఒక సంవత్సరం కూడా పూర్తి కాకుండా దురదృష్టవసాత్తూ పాపం అన్నపూర్ణమ్మగారి భర్త పోయాడు. తనేమో ముందు నుంచి ఉమ్మడి కుటుంబంలో ఉండి వచ్చిందిట. ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం ఆమె మిస్ అవుతోందిట ఇప్పుడు. వాళ్ళ కొడుకిలిద్దరిలో ఒకడు అమెరికాలో, ఇంకొకడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇంట్లో నిండుగా అందరూ ఉండే ఉమ్మడి కుటుంబంకి మాత్రమే ఆమె ఆ ఇల్లు అద్దెకి ఇస్తుందిట. కాకపోతే మరో షరతు కూడా పెట్టిందామె. వయసు మీద పడిన తనకు ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు కనుక, తనకేం జరిగినా కొడుకులిద్దరికీ తెలియపర్చాలిట. ఇవీ ఆవిడ షరతులు. మనమేమో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం వద్దని వేరుగా వెళ్ళిపోతున్నాం. ఆమె ఏమో ఉమ్మడి కుటుంబానికి మాత్రమే ఇల్లు అద్దెకి ఇస్తానని అంటోంది. తనకి నచ్చిన కుటుంబం దొరికిందంటే అవసరమైతే అద్దె ఇంకా తగ్గిస్తుందిట ఆవిడ." అని చెప్పిన భర్త వైపు వింతగా చూసింది కిరణ్మయి.

ఆమె నుంచి ఏమీ బదులు రాకపోవడంతో కిరణ్మయివైపు చూసాడు మనోహర్.

"అంత చవకలో ఇంత మంచి ఇల్లు మాత్రం మనకి దొరకదు. పోనీలే! ఆ ఇల్లు ఎలాగూ ఆవిడ మనకి అద్దెకి ఇవ్వదు. ఇంకో ఇల్లు చూసుకుందాంలే! వెతికితే మరో మంచి ఇల్లు దొరకకపోదు. ఇక పడుక్కో!" అన్నాడు మనోహర్ భార్యతో.

ఆ రాత్రంతా కిరణ్మయికి నిద్రపట్టలేదు. ఆలోచిస్తూనే ఉంది. ఎలాగో భర్తని ఒప్పించి వేరే వెళ్దామని అనుకుంది గాని, ఇప్పుడు భర్త చెప్పిన మాటలు ఆమెని ఆలోచింప చేసాయి. రెండు నెలల క్రితం మనోహర్ ఆఫీసు పని మీద ఊళ్ళో లేనప్పుడు అశోక్‌కి చాలా ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచక కళ్ళనీళ్ళు పెట్టుకుందామె. అప్పుడు తన అత్తగారూ, మామగారే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. తోటికోడలు వసుంధర కూడా రాత్రంతా హాస్పిటల్లో తనకు తోడుగా ఉంది. ఆ విషయం తనెలా మరిచిపోయింది? తీరిక వేళలో తన పిల్లలతో పాటు అశోక్‌కి కూడా వసుంధర చదువు చెప్పటం కూడా గుర్తుకు వచ్చిందామెకి. అలాగే మనోహర్‌కి తన ఆఫీసులో ఒకసారి ఇబ్బంది ఎదురై హఠాత్తుగా రెండు లక్షలు డబ్బులు కట్టవలసి వస్తే తన బావగారు అప్పటికప్పుడు తన భార్య నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు సర్దుబాటు చెయ్యడం ఎలా మర్చిపోగలిగింది? తను ఉమ్మడి కుటుంబంలో ఉండటంవల్లే తనకే ఇబ్బంది వచ్చినా బసటగా నిలిచేవారున్నారు. అదే తను వేరుగా ఉంటే, తన కష్టాలు ఎవరితోనైనా చెప్పుకోగలదా? తన కష్టసుఖాలు పంచుకునేందుకు ఇక్కడైతే అందరూ ఉన్నారు. ఎక్కడ ఎవరు దొరుకుతారు? ఇలా ఆలోచిస్తూనే ఉంది కిరణ్మయి రాత్రంతా.

ఆ మరుసటిరోజు ఉదయం కిరణ్మయి కళ్ళు రెండూ నిద్రలేమితో ఎర్రగా ఉండటం గమనించాడు మనోహర్. అందుకే ఆమె, "ఏమండీ మనం ఇక్కడే ఉందామండీ! ఎక్కడికీ వెళ్ళొద్దు! మరి మీరు అద్దె ఇల్లు కోసం వెతక్కండి." అని అంటే అతను పెద్దగా ఆశ్చర్యపోలేదు. అమె రాత్రంతా అంతర్మధనం చేసుకొని ఆ నిర్ణయం తీసుకుందని సులభంగా గ్రహించాడు మనోహర్.

"అలాగే!" అన్నాడు. అతనికీ ఆమె నిర్ణయం సంతోషం కలిగించింది.

……………………….

మరిన్ని కథలు

Kaakula Ikyatha
కాకుల ఐక్యత
- Dr.kandepi Raniprasad
Elugu pandam
ఎలుగు పందెం
- డి.కె.చదువులబాబు
Lakshyam
లక్ష్యం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalaateeta vyakthulu
కాలాతీత వ్యక్తులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Tagina Saasthi
తగినశాస్తి
- డి.కె.చదువులబాబు
Chivari paatham
చివరి పాఠం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Chandruniko noolu pogu
చంద్రునికో నూలుపోగు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tappudu salahaa
తప్పుడు సలహ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు