అందరికీ ఆనందం - యు.విజయశేఖర రెడ్డి

Andarikee anandam

శారద తల్లి పార్వతితో ఉంటోంది. తండ్రి మిగిల్చిపోయిన ఆస్తి కింద మూడు గదులలో వీళ్లుంటే మేడపైన రెండు గదులు అద్దెకు ఇచ్చారు. శారద ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. జరుగుబాటుకు లోటు లేదు. ప్రస్తుతం మేడపైన గదులు ఖాళీగా ఉన్నాయి.

పార్వతి తమ్ముడి కొడుకు అంటే శారద బావ రవి కూడా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవికి తెలిసిన నలుగురు మిత్రులు అద్దె ఇంటికోసం వెతుకుతున్నారు అని తెలిసి శారద ఇంటి అడ్రస్ ఇచ్చి పంపాడు. గిరి,శేఖర్,ప్రసాద్,మురళి అద్దెకు చేరారు. శారద అందం చూసి ఆ నలుగురూ ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి అని మనసులో ప్రేమ అనే విత్తనాలు నాటుకున్నారు. శారద ఇంట్లో చేసిన వంటకాలు అప్పుడప్పుడు వారికి ఇచ్చేది. చాలా కలివిడిగా ఉంటూ గలగలా మాట్లాడుతూ.. కిలకిలమని నవ్వేది. తల్లి అలా కూడదు అన్నా ఏమీ కాదులే అమ్మా అని అనేది.

ఆ నలుగురూ మేడపైన చేరి నెల పైన అయ్యింది. తమ ప్రేమను వ్యక్తం చేయాలని కొత్త పథకం వేశారు. నలుగురూ రంగు కాగితాలపై “ప్రియమైన...” అని మాత్రమే వ్రాసి విడివిడిగా కవర్లలో పెట్టి, పైన మాత్రం వారి పేర్లు వ్రాశారు, వాటిని శారద ఆరిపోయిన బట్టలు తీసుకెళ్లే సమయానికి తీగకు కవర్లు వేళాడేలా క్లిప్పులు పెట్టారు. ప్రేమించే అమ్మాయి అయితే వాటిని తప్పక తీసుకుంటుంది అని వారి ఆలోచన. శారద వాటిని ఇష్టంగానే తీసుకుంది. మరుసటి రోజు ఆ కవర్లను తనూ తీగకు పెట్టింది. అవి వారు వ్రాసిన కావర్లే వాటిని తీసుకుని లోపల పేపర్లు తీశారు అవి కూడా వారు వ్రాసినవే. అందులో “ప్రియమైన అన్న ఒక్క పదం తప్ప ఇంకేమీ వ్రాయలేదు... కనీసం ఒక్క వాక్యమైనా నా గురించి వ్రాయాలని పించలేదా?” అని ఉంది.

నలుగురూ ఎగిరిగంతేశారు..”మీరు నవ్వినప్పుడు మీ బుగ్గన పడ్డ సొట్ట నా కెంతో ఇష్ఠం” అని గిరి, “మీరు పంపిన టిఫిన్..ఆహా ఏమి రుచి” అని శేఖర్, “మీరు నడచి వస్తుంటే మీ కాలి మువ్వలు చేసే శబ్ధం నాకు భలే ఇష్ఠం” అని ప్రసాద్, “మీ కట్టు బొట్టు చూస్తుంటే అచ్చం బాపు గీసిన బొమ్మలానే ఉంటారు” అని మురళి. ఆ కాగితాలలో వ్రాసి మళ్ళీ ఆ తీగకే పెట్టారు.

శారద అవి తీసుకుని “మీ అందరికీ త్వరలోనే శుభవార్త చెబుతాను” అని అందరికీ తిరుగు జవాబు వ్రాసింది. ఆ రోజు రాత్రి ఊహాలోకంలో తేలుతూ ఆ నాలుగురుకీ నిద్ర కరవయ్యింది. రెండు రోజుల తరువాత శారద స్వయంగా మేడ పైకి వచ్చి “మీరంతా ఒక అరగంట తరువాత కిందికి రండి” అని నవ్వుతూ చెప్పి, తుర్రుమని కిందికి వచ్చింది. వారు గబగబా టిప్‌‌టాప్‌గా తయారయ్యి కిందికి వచ్చారు.

కింద గది బాగా అలంకరించి ఉంది “హలో మిత్రులారా” అన్నాడు రవి. “నువ్వేంటి ఇక్కడ?” అన్నారు ఆ నలుగురూ. “మీరు ముందుగా కుర్చీల్లో కూర్చోండి” అంది శారద. వాళ్లు కూర్చున్న తరువాత శారద ఒక గుడ్డ కప్పిన ప్లేట్‌తో వచ్చింది. ఆ నాలుగురులో ఉంత్కంట మరీ ఎక్కువయ్యింది. శారద వరుసగా రాఖీలు తీసి ఒక్కొక్కరి చేతికి కట్టి మిఠాయీలు తినిపించి “ప్రియమైన అన్నయ్యలూ... ఈ చెల్లికి మీ ఆశీర్వాదం కావాలి..ఈయన మా బావ ఇప్పుడు మా ఇద్దరికీ నిశ్చితార్దం జరగబోతోంది” అని అంది శారద. వాళ్లు అవాక్కయ్యారు, వెంటనే తెరుకుని “తప్పకుండా చెల్లెమ్మా..” అన్నారు లేని నవ్వును ముఖాన తెచ్చుకుని. “మీరు మంచివారని మా అత్త, మరదలుకు తోడుగా ఉంటారని ఈ ఇంటి అడ్రస్ ఇచ్చాను” అన్నాడు రవి. నలుగురు మిత్రులూ వారిని ఆశీర్వదించారు ***

మరిన్ని కథలు

Kaakula Ikyatha
కాకుల ఐక్యత
- Dr.kandepi Raniprasad
Elugu pandam
ఎలుగు పందెం
- డి.కె.చదువులబాబు
Lakshyam
లక్ష్యం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalaateeta vyakthulu
కాలాతీత వ్యక్తులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Tagina Saasthi
తగినశాస్తి
- డి.కె.చదువులబాబు
Chivari paatham
చివరి పాఠం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Chandruniko noolu pogu
చంద్రునికో నూలుపోగు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tappudu salahaa
తప్పుడు సలహ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు