ఔదార్యం - డి.కె.చదువులబాబు

Oudaaryam

నందవరంలో చలమయ్య అనే కుండలవ్యాపారి ఉండేవాడు. అతను కుండలు తయారుచేసి, ఒంటిఎద్దుబండిలో తీసుకెళ్ళి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకునేవాడు.ఆడబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు చలమయ్య రామాపురం వెళ్ళాడు. అక్కడ జనం బాగా తిరిగేచోట దారిపక్కనున్న ఖాళీస్థలంలో కుండలను బండిపైనుండి దింపాడు. వరుసగా పేర్చాడు. ఎద్దును దూరంగా ఒక చెట్టు నీడన కట్టేశాడు. బండిలో తెచ్చుకున్న మేత దాని ముందు వేశాడు. కుండలు కొనటానికి అవసరమున్న వారు వస్తున్నారు. కుండలను పరిశీలించి తీసుకెళ్తున్నారు. ఇంతలో రెండు కుక్కలు ఒకదానినొకటి తరుముకుంటూ, పోట్లాడుతూ వచ్చి పేర్చి ఉన్న కుండలపై పడ్డాయి. ఆ తాకిడికి చాలా కుండలు పగిలిపోయాయి. ఊహించని ఆసంఘటనకు చలమయ్య గుండె గుభేలుమంది. ఆ కుక్కల్లో ఒకదాని మెడలో పట్టీ వేసిఉంది. ఆపట్టీ చూసి అది ఎవరిదో పెంపుడుకుక్కని గ్రహించాడు..ఆ కుక్క ఎవరిదని అక్కడున్నవారిని అడిగాడు. ఆకుక్క జమీందారు రామచంద్రయ్యదని, అది ఎప్పుడూ గుమ్మందాటి బయటకురాదని, ఈరోజు పొరపాటున వీధిలోకి వచ్చిందని ఓవ్యక్తి చెప్పాడు. చలమయ్య వారితో "నాకుటుంబపోషణకు ఆధారం ఈకుండలే. ఇవి పగిలిపోవడంవల్ల చాలా నష్టం వచ్చింది. జమీందారుగారిని నష్టపరిహారం అడగాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇద్దరు నావెంటవచ్చి జమీందారుగారి పెంపుడుకుక్కవల్ల కుండలు పగిలిపోవడం చూశామని సాక్ష్యం చెప్పగలరా?"అని అడిగాడు. అందుకు ఏఒక్కరూ ముందుకు రాలేదు. ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. చేసేదేమీలేక చలమయ్య ఒక్కడే భయపడుతూ జమీందారు ఇంటికెళ్ళాడు. చలమయ్య వెళ్ళే సమయానికి రామచంద్రయ్య దూరపుబంధువుతో మాట్లాడుతున్నాడు.గుమ్మంలో చేతులు కట్టుకుని నిల్చున్న చలమయ్యను చూసి దగ్గరకు పిలిచాడు. "ఎవరునువ్వు?ఏపనిమీదవచ్చావు?"అనిఅడిగాడు. చలమయ్య భయపడుతూ తనను పరిచయం చేసుకున్నాడు. జరిగిన విషయం చెప్పాడు. "ఎంతనష్టమొచ్చింది?"అన్నాడురామచంద్రయ్య.చెప్పాడుచలమయ్య. రామచంద్రయ్య మారుమాట్లాడకుండా తన లెక్కలు చూసే మనిషిని పిలిచి డబ్బులిమ్మన్నాడు.ఇదంతా చూస్తున్న బంధువు"కుక్కమూగజీవి.దానికి మంచీచెడు తెలియదు. అది నష్టపరిచిందని చెబితే డబ్బులివ్వడమేంటి? కనీసం సాక్ష్యంకూడా అడగకుండా ఇవ్వడమేనా?"అన్నాడు. జమీందారు రామచంద్రయ్య నవ్వి" కుక్క కనిపించడంలేదని వెదకడానికి పనివాడు బయటకెళ్ళాడు.కుక్క బజారునపడ్డ విషయం నిజమే! అతని జీవనాధారం కుండలు.అతనిపై ఆధారపడి కుటుంబం ఉంది.ఎద్దుకూడా ఉందంటున్నాడు. అవసరంలో ఉన్నవాళ్ళు వచ్చి అడిగితే దానం చేస్తుంటాను. అలాంటిది నష్టపోయానని ఒక పేద కష్టజీవి అడిగితే లేదని ఎందుకంటాను? భగవంతుడిచ్చిన భూమి,పశుసంపదపై అవసరానికి మించి ఆదాయం వస్తోంది. నాసంపాదనలో కొంతభాగం దానధర్మాలకు ఉపయోగిస్తుంటాను. అవసరానికి ఆదుకోవడంలో ఆనందముంది. సాయం చేయగల్గే శక్తి కల్గిఉండటం, ఆ అవకాశం రావడం మన అదృష్టం. తరతరాలకు సరిపడే సంపద వెంటగట్టుకపోతామా?" అన్నాడు రామచంద్రయ్య. ఆయన మంచి మనసుకు,ఆలోచనాతీరుకు ఆబంధువు,చలమయ్య చేతులెత్తి నమస్కరించారు.

మరిన్ని కథలు

Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి