శుక్రవారం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Sukravaram

ఎండవేడినుండి అప్పటివరకు రక్షణ ఇచ్చిన గొడుగును మూసివేస్తూ

ఆఫీస్ లో అడుగుపెట్టి "నమస్కారం బాబు "అన్నాడు శంకరం మాస్టారు.

" నమస్కారం మాస్టారు కూర్చొండి ,నేచెప్పినవిషయం ఏంచేసారు, డబ్బుతెచ్చారా? "అన్నాడు గుమ్మస్తా.

"ఎక్కడనుండి అంతమొత్తం తీసుకురాగలను. ఇక్కడకు రావడానికి బస్ టిక్కెట్టుకు డబ్బులేక ఆరు కిలోమీటర్లు మోకాళ్ళనొప్పులతోనే నడుచుకుంటూవచ్చాను. మరలా ఇంటికి నడచేవెళ్ళాలి,మూడునెలల ఇంటి అద్దె,కిరాణాదుకాణం,పాలవాడు తమబాకీలగురించి అడగని రోజులేదు. చేతిలోఉన్నది ఇద్దరు ఆడ పిల్లల పెళ్ళిళ్ళకు,పురుళ్ళకు సరిపోయింది.తమరు పెద్దమనసు చెసుకుని నాఫెంక్షన్ ఇప్పిస్తే...." అన్నాడు శంకరంమాస్టారు.

" అయ్య మీకష్టం నాకు చెప్పుకున్నారు నాకష్టం ఎవరికి చెప్పుకోవాలి? చేతిలోఉన్నది చాలక అప్పుచేసి మరీ కుమార్తె పెళ్ళిచేసిపంపాను,పెళ్ళికి చేసిన అప్పుతీరకముందే ,ఏడాది తిరగకుండా తొలికాన్పుకు ఇంటికి వచ్చింది. ఎక్కడిడబ్బు వైద్యానికి చాలడంలేదు.అయినా మీరు నాకు ఇచ్చే పదివేలలో అందరం పంచుకోగా నావంతుకు పదిహేనువందలు వస్తాయి. మరో మారు ఇలాంటికష్టాలు మూటకట్టుకుని నావద్దకు రాకండి డబ్బుతోవస్తేనే పనిజరుగుతుంది"అన్నాడు గుమ్మస్తా.

దీర్ఘంగా నిట్టూర్చిన శంకరయ్య "సరే రేపు శుక్రవారంకదా,శనివారం ఇదేసమయానికి మీరడిగిన పదివేలతోవస్తా" అన్నాడు.

" ఓహొ తమరికి శుక్రవారం,మంగళవారం పట్టింపులు ఉన్నాయా? అన్నాడు గుమ్మస్తా .

" నాకు లేవు బాబు నాభార్యకు ఉంటుంది.నాభార్యకేకాదు భారతీయ స్త్రీమూర్తులు ఎవరు శుక్రవారం తమ తాళిని తీసిఇవ్వరు. పైగా మార్వాడి తాకట్టు దుకాణం అందునా సెలవు. నాఇంటమిగిలిన విలువైన వస్తువు అదే .నలభై ఏళ్ళక్రితం నేను కట్టిన ఆతాళి అమ్మితే పదివేలు రావచ్చు "అన్నాడు జీరబోయిన గొంతుకతో శంకరం మాస్టారు.

చొక్కజేబులోనుండి ఐదువందలనోటు తీసి, శంకరం మాస్టారు చేతిలోఉంచి " మన్నించండి మాస్టారు,ఆటోలో ఇంటికివెళ్ళండి.సొమవారం మీబ్యాంక్ కు వెళ్ళండి మీడబ్బు అందుతుంది " అనిచేతులు జోడించాడు గుమ్మస్తా.

భీజంపైన కండువాతో కళ్ళు తుడుచుకుంటూ గుమ్మస్తాకు నమస్కరించి తడబడే అడుగులతో గొడుగు ఆసరాగా ఆఫీస్ వెలుపలకు వచ్చాడు శంకరం మాస్టారు.

మరిన్ని కథలు

Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ
Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు
Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్
Nachiketuni katha
నచికేతుని కథ
- హేమావతి బొబ్బు