Nadi tosukupoyina naava-Story picture - కొత్తపల్లి ఉదయబాబు

నది తోసుకుపోయిన  నావ!

" సార్! మమ్మీ మిమ్మల్ని ఒకసారి వీలైతే ఇంటికి తీసుకురమ్మన్నారు. వస్తారా? " అడిగింది ప్రజ్ఞ ఇంటర్వెల్లో నా దగ్గరగా వచ్చి. ప్రజ్ఞ విషయంలో నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమోనని ఒక్క క్షణం కంగారు పడ్డాను. ఒక్కసారి గత రోజు నా కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నాను. ‘లేదు - నావల్ల పొరపాటు జరగలేదు’ అని నిర్ణయించుకున్నాను. ‘’సరేనమ్మా .. వస్తాను” అన్నాను. అన్నానే గాని నా మనసులో ఎందుకు? అనే ప్రశ్న అంకుశంలా పొడవబోయే అంతలో ప్రజ్ఞ తన రూమ్ లోకి వైపు వెళ్ళబోయేదల్లా ఆగి ‘’అన్నట్టు.. సార్ !మీరు మా ఇంటికి రావడానికి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని వస్తారేమో! ఆ అవసరం లేదని చెప్పమన్నారు మమ్మీ!’’ అంది. ‘’సరే మరి. నాకు మీ ఇల్లు తెలీదే!’’ అన్నాను. ‘’సాయంత్రం స్కూల్ అయ్యాక నేను, మీరు కలిసి వెళ్దాం సార్. నేను రిక్షాలో పుస్తకాల సంచీ పంపేసి మీతో వస్తాను. థాంక్యూ సార్’’ అనేసి ప్రజ్న వెళ్ళిపోయింది. పట్నంలో అత్యంత ఖరీదైన లొకాలిటీ లో ఏర్పాటుచేసిన ‘’అవర్ ఫ్యూచర్ ఇండియన్స్’’ కాన్వెంట్లో నేను గణిత ఉపాధ్యాయుడిగా చేరి నెల రోజులు కావస్తోంది. ఈ నెల రోజుల్లో విద్యార్థి స్థాయికి దిగి కష్టపడి అర్థమయ్యేలా పాఠం చెప్పే మాస్టర్ గా పేరు సంపాదించుకున్నాను. కొందరు తల్లిదండ్రులు ఆ కామెంట్ ను నేరుగా పిల్లల డైరీలో రాసి నాకు పంపించారు. ఉపాధ్యాయుడిగా సంతృప్తిగా జీవితం ప్రారంభించిన నాకు ‘’ఇదేమిటో ... ఈ కబురు?’’ అని అసంతృప్తి గా అనిపించింది. ప్రజ్న తొమ్మిదో తరగతి చదువుతోంది. చదువు చాలా మంది చదువుతారు. కానీ విద్య విజ్ఞానం కోసం అన్నట్టు చదివేవాళ్ళను వేళ్ళ మీద లెక్కించవచ్చు. ప్రజ్ఞ రెండో కోవకు చెందుతుంది. నేర్చుకునే ప్రతి విషయాన్ని మూలం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె. అందుకోసం నిత్యం పాఠశాల గ్రంథాలయంలో ఏదో పుస్తకంలో ఏదో ఒక అంశం మీద విషయసేకరణ చేస్తూనే ఉంటుంది. అర్ధం తెలియకపోతే నా దగ్గరికి వచ్చి చెప్పించుకుంటూ ఉంటుంది. ‘’ ఇంత చిన్న వయసులో ఎందుకమ్మా అంత తాపత్రయం?’’ అని అడిగాను కుతూహలం అణచుకోలేక. ‘’నాకు అవగాహన అయితేనే కదా సార్ మరొకరికి చెప్పగలిగే స్థానంలో నిలబడగలిగేది’’ అంది. ఆమె ఎవరికి చెప్పగలిగే స్థాయిలో ఉండాలని అనుకుందో ఆ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు అర్థమైంది. ******* ‘’మమ్మీ! మా సార్!’’ అంటూ ఎంతో వినయపూర్వకమైన ప్రవర్తనతో ఇంటికి ఆహ్వానించి, అతిధి మర్యాదలు అన్ని చేసాక నాతో మాట్లాడడానికి వచ్చిన తన అమ్మగారిని పరిచయం చేసింది ప్రజ్న. ‘’ నమస్తే మేడం!’’ అన్నాను చేతులు జోడించి. “ నమస్తే! మీకు అక్కలాంటిదాన్ని. నన్ను మేడం అని సంబోధించడం బాగాలేదు. మీరు మా పాప చదువుతున్న కాన్వెంట్లో ఉపాధ్యాయుడిగా చేరడం మా అదృష్టం. ఈ రోజుల్లో విషయ పరిజ్ఞానం గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా వయసు రీత్యా ఉద్యోగవిరమణ అయిపోతున్నారు. ఇక ప్రైవేట్ కామెంట్లలో బతకడం కోసం పనిచేసే ఉపాధ్యాయులు తప్ప తమ వృత్తికి న్యాయం చేసే ఉపాధ్యాయులని వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. బోధించడమే పరమార్థంగా పెట్టుకుంటున్నారు తప్ప అది విద్యార్థికి ఎంత స్థాయి వరకు చేరింది? అన్నది గమనించే స్థితిలో వారు లేరు. ఒకవేళ అటువంటి ఉపాధ్యాయులు ఉన్నా తమ పిల్లలకు రాంక్ ఎందుకు తగ్గింది? అంత డబ్బు కట్టించుకుని మీరేం చేస్తున్నారు? మీ ఉపాధ్యాయులను మీరు ఏం పర్యవేక్షిస్తున్నారు? లాంటి ప్రశ్నలు విద్యావంతులైన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎదురవుతూ ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు కావలసిన దానికంటే ఎక్కువ మార్కులు వేసి ఆ ‘బెడద’ నుంచి తప్పించుకుంటున్నారు. నేను మీరు దిద్దిన జవాబు పత్రాలను చాలా పరిశీలించాను. తర్కంతో లెక్కలు చేయడం నేర్పే విధానం వల్ల విద్యార్థులకు సబ్జెక్ట్ పట్ల భయం పోతుంది. మీరు రాని క్రితం లెక్కల్లో తనకు 60 శాతం మార్కులు దాటేది కాదు. ఈ వేళ ఎంతగా మార్పు వచ్చిందంటే దాన్ని ప్రతి ఆలోచనలో నువ్వు తర్కం ఉండేటంతగా దాన్ని మీరు మలచగలిగారు . దయచేసి అలాగే కొనసాగించండి. ఇక మిమ్మల్ని ఇంటికి పిలిపించిన విషయం. ఒకసారి లోపలికి రండి’’ అంటూ ఆమె నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి నడిచారు. నేను వినమ్రంగా అనుసరించాను. ఆమె ఒక బెడ్ రూం లోకి తీసుకు వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి నేను స్థాణువైపోయాను. సుమారు 18 సంవత్సరాలు నిండిన అబ్బాయి మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని కాళ్లు, చేతులు నిలువునా చీల్చేసిన వెదురుబద్దల్లా ఉన్నాయి. 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి కి ఉండే పెద్ద బాన పొట్ట ఉంది. శరీరం మీద షార్ట్ తప్ప ఏమీ లేదు. శరీరమంతా చేపల పొలుసుల్లా చర్మం పొరలు పొరలు గా ఉంది. వంకర్లు తిరిగిన చేతివేళ్ళ మధ్య రిమోట్ వుంచుకొని టీవీలో యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్ అటూ ఇటూ మారుస్తూ చూస్తున్నాడు. ఆమె అతన్ని నాకు పరిచయం చేశారు. ‘’వాడు మా అబ్బాయి. పుట్టుకతోనే పోలియో వచ్చి కాళ్లు చేతులు పనిచేయకుండా పోయాయి. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఆ ట్రీట్మెంట్ వల్ల అటుపక్కకి, ఇటుపక్కకీ వత్తిగిలగలడే గాని లేవలేడు. రెండు చేతులతో రాయడం, బొమ్మలు వేయడం లాంటివి చేయగలడు. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉంటే ఆయాస పడుతుంటాడు. వాడికి మీరు ప్రైవేట్ చెప్పాలి. వాడికి ఐదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు నేనే చెప్పాను. ఆరవ తరగతి లెక్కలు చెప్పలేకపోతున్నాను. నేను లెక్కల స్టూడెంట్ ని కాదు. ఎం,ఏ. ఫిలాసఫీ చేశాను. మీరు ప్రతిరోజు కాన్వెంట్ అయిపోయాక ఓ రెండు గంటలు వాడికి చదువు చెప్పండి. అంటే... వాడితో కాలక్షేపం చేయండి. మీరు కోరినంత జీతం ఇస్తాను’’ అన్నారామె. ఆ అబ్బాయి ‘’గుడీవెనింగ్ సార్’’ అన్నాడు చేతులు జోడించి. ఆ నమస్కారం పెట్టింనందుకే అతని నరాలు ఎంతగా బాధపెట్టాయో గానీ అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగి, వాడినట్టుగా ఉన్న బుగ్గలపై నుంచి జలజలా రాలిపోయాయి. నేను వెంటనే అతని పక్కనే మంచం మీద కూర్చున్నాను. ‘’ నమస్తే నాన్న. నీ పేరు?’’ అడిగాను లాలనగా చూస్తూ. నా హృదయము జాలితో నిండిపోయింది. హృదయం ఆర్ద్రతతో చమరించింది. దానికి కారణం అతడు దీర్ఘ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ‘’ఆదిత్య’’ అన్నాడతను. అనంతరం ఆమె అన్నారు. ‘’అవును సార్! మా వంశాంకురం వాడు. మాకు సూర్యోదయం ముఖ్యం కాదు. ప్రతిక్షణం వాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా కుటుంబ సభ్యుల తపన. అదే మా జీవితాలకు నిజమైన సూర్యోదయం. వాడికి చదరంగంలో ప్రవేశం ఉంది. ఎత్తుకు పై ఎత్తులు చాలా బాగా వేస్తాడు. ఇంట్లో కంప్యూటర్ కు ఇంటర్ నెట్ పట్టించాము. మొన్నీమధ్య విశ్వనాథన్ ఆనంద్ తో చాటింగ్ కూడా చేశాడు. కొన్ని సందేహాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే - తెలుసుకోవాలన్న ఆసక్తి, నేర్చుకోవాలన్న తపన మనిషికి ఉంటే ఎటువంటి స్థితిలో ఉన్నా తప్పనిసరిగా రాణించే అవకాశం ఉంటుంది. ‘టైం పాస్ కోసం మనిషి టీవీ, కంప్యూటర్ పెట్టుకుని రోజంతా గడపొచ్చు. అది ఏదైనా సాధించామన్న మానసిక ఆనందం ఇవ్వదు కదా మమ్మీ’ అంటాడు. వాడికి జీకే ప్రశ్నలు 5వేలకు పైగా వచ్చు . మా ఇంట్లో టెలిఫోన్ డైరెక్టరీ ఉండదు సార్. ఎందుకంటే వాడే మాకు టెలిఫోన్ డైరెక్టరీ. సుమారు 500 మంది సెల్ ఫోన్ నెంబర్లు అవలీలగా చెప్పగలడు. వాడిని అడిగే మేము కావలసినవాళ్ళ నెంబర్ కి ఫోన్ చేస్తాం. వాడికి ఊహ తెలిసిన నాటి నుంచి మంచం మీదే ఉన్నాడు. ‘నువ్వు అనవసరంగా శ్రమ పడొద్దు నాన్నా’ అంటే ‘శారీరక శ్రమ ఎలాగూ లేదు. మానసికంగా అయిన మెదడుకి వ్యాయామం లేకపోతే ఎలా మమ్మీ ? ఇంత చవటని కన్నానా అని నువ్వు ఎప్పుడు బాధపడకూడదు’ అంటాడు. కొన్ని విషయాల్లో వాడి సలహాలు మాకు చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి. వాడి చేతితో ఏది స్పృశించినా ఆ వ్యాపారం మాకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అందుకే వాళ్ళ నాన్న గారికి వాడంటే పంచప్రాణాలు. ఎక్కడికి వెళ్లాలన్నా వాడిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని తీసుకెళ్తారు ఆయన. వాడి వైద్యం కోసం వాడిని ఎత్తుకుని ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారు. తిరుమల కొండ ఎక్కారు. ఎందరో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. ఉత్తరాది యాత్రలన్నీ ఒకసారి, దక్షిణాది యాత్రలన్నీ ఒకసారి చేయించి అందరి దేవుళ్ళనీ చూపించారు. ‘ఎందుకు నాన్నా, ఈ పనికి మాలిన కొడుకు కోసం అంత శ్రమ పడతావు’అని అడిగాడు ఆయన్ని ఒకసారి. ‘ఈ పనికిమాలిన తండ్రి కడుపున పుట్టానేమిటా’ అని నువ్వు బాధపడకుండా నాన్నా. శారీరక శ్రమ మనసుకు, శరీరానికి కూడా శాంతిని ఇస్తుందని టీవీలో ఎవరో స్వామీజీ సందేశం విని నువ్వేగా చెప్పావు. నీకు ఇలా చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది నాన్న. నీకు బాధగా ఉందా?’ అని అడిగారు ఆయన. ‘ఎన్ని జన్మలైన మీరే నాకు తండ్రిగా పుట్టాలి నాన్నా అని కరుచుకుపోయాడు ఆయన్ని. ‘’నాకు మళ్ళీ జన్మలో నీ కొడుకుగా పుట్టాలని ఉంది నాన్నా అని ఆయన - ఇలా ఒకరికొకరు ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు. ఆయన ఇంట్లో ఉంటే వాడితోనే ప్రతిక్షణం గడిపే ప్రయత్నం చేస్తారు. వాడు కోరినదల్లా తెస్తారు, ఇస్తారు. ప్రజ్ఞకు లెక్కలు బాగా అర్థం కావడంతో ఇంటికి వచ్చాకా మీ గురించి రోజూ చెబుతూంది. అప్పటి నుంచి ప్రతి రోజు మీ గురించి అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ‘ఇవాళ సార్ ఏం చెప్పారు?’ అని ప్రతి రోజు అడుగుతాడు. ప్రజ్న వాడికి అన్నీ వివరంగా చెబుతుంది. విజ్ఞానం ఒకరి ద్వారా ఒకరి వ్యాప్తి చెందడానికి తోటి మనిషి కన్నా గొప్ప సాధనం మరొకరిటి లేదేమో. వాడికి చదువుకోవాలని ఉంది. ఈమధ్య టీవీలో చేతులు లేని వాళ్ళు అన్నీ పనులు రెండుకాళ్లతోనే చేసుకుని ఉద్యోగం కూడా చేయడం, ఒక కాలు లేకపోయినా ఉన్న ఒక కాలు ఆధారంగా చిరంజీవి లా స్టెప్పులు వేయడం, సుధా చంద్రన్ అలాంటి మహోన్నత వ్యక్తి తన లక్ష్యసాధన కోసం జైపూర్ పాదాన్ని కనుగొనేలా చేసి ఈ వేళ ఎన్నో కోట్ల మంది అంగవికలురకు ప్రపంచాన్ని చూడగలిగేలా చేయడం, తద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి దొరకడం... ఇవన్నీ గమనించాక ‘నేను సార్ దగ్గర చదువుకుంటానమ్మా. నాకు ట్యూషన్ ఏర్పాటు చేయవా?’ అని అడిగాడు. శారీరకంగా విశ్రాంతి ఉన్నా మానసికంగా అరక్షణం విశ్రాంతిగా ఉండని వాడు మళ్లీ ఈ చదువు పేరుతో ఇంకా ఇంకా శ్రమపడి పోతాడేమో అని వాళ్ళ నాన్న భయం. కానీ వాడికి మీ దగ్గర చదువుకోవాలని ఉంది. మీరు ట్యూషన్ ఇంటికి వచ్చి చెబుతున్నారని మీ ప్రిన్సిపాల్ కి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాడు మీరు పనిచేసే కాన్వెంట్ లో చదవడం లేదు కనుక. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి’’ అన్నారావిడ. ‘’మీరు చెప్పింది ఆదిత్య పరిస్థితి గురించి. పైగా ఒక విద్యార్థిగా అతనికి చదువు చెప్పాలంటే అతని గతం ఎంత తెలిస్తే అంత మంచిది. నేను రోజూ వచ్చి ఆదిత్యకు ట్యూషన్ చెబుతాను’’ అని నా అంగీకారం తెలియజేశాను. ఆ రోజే నేను ప్రజ్నతో పాటు ఆదిత్యకు ట్యూటర్ గా జాయిన్ అయ్యాను. ******** నాకు అరుదైన వస్తువులనీ సేకరించుకుని భద్రపరచుకునే హాబీ ఉంది. ముఖ్యంగా నాకంటూ చక్కని గ్రంథాలయం ఉంది. చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఎంతో కష్టపడి దాచుకున్న పాకెట్ మనీతో, ఆ వయసులోనే నేను ఇష్టపడిన కామిక్ బుక్స్, ముళ్ళపూడి వారి సాహిత్యం, మల్లిక్ ‘చిట్టి’ కార్టూన్స్, బాల భారతం, రామాయణం, భాగవతం,వివేకానంద స్వామి బోధనల దగ్గర నుంచి harry potter books ఒక్కొక్కటిగా అన్నిటిని ఆదిత్య పరిచయం చేయసాగాను. దానికి కారణం ఉంది. నేను ట్యూషన్ ప్రారంభం చేసిన రెండో రోజు- ఆదిత్య నాకు ఒక నోట్స్ అందించాడు. ‘’ఏమిటది?’’ అడిగాను తెరవకుండానే. ‘’నిన్న మీ నుంచి నేర్చుకున్న మంచి విషయాలు సార్.’’అన్నాడు. నోట్స్ పరిశీలించాను. నేను చెప్పిన మొదటి వాక్యమే మొదటి పేజీలో ముఖ్య విషయంగా రాశాడు. ‘’విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి ముందుగా ‘చదువు’ ప్రధానాంశం. తర్వాత ‘అభిరుచులకి’ ప్రాధాన్యత ఇవ్వాలి. అలా అని అభిరుచులకు ప్రాధాన్యత ఇచ్చి, చదువు చదవకపోతే అతను జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు తక్కువ. చదువులో మొదటి మూడు స్థానాలలో ఉంటూ, దానికి సమాంతరంగా తనకు ఇష్టమైన ‘హాబీ’ లో ప్రావీణ్యం పెంచుకుని కృషి చేస్తే అతను శారీరకంగా అలసిపోయినపుడు మానసికంగా ‘ఆ హాబీ’లో తన అలసటని పోగొట్టుకుని సేద తీరుతాడు. ఆ హాబీలో కూడా కృషి చేస్తే మరింత అద్భుతంగా రాణిస్తాడు. ప్రతీరోజు తాను కొత్తగా ఏ విషయాలు నేర్చుకున్నాడో ఆ అంశాలను ఒక పుస్తకంలో తేదీ ప్రకారం రాసుకుంటే మంచిది. వాటిలో అన్ని పాటించలేకపోవచ్చు. కానీ పాటించగలిగినన్ని అనుసరిస్తే అతను ఒక సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే ఉత్తమవ్యక్తి అవుతాడు. ‘’ నేను ఆశ్చర్యపోయాను. ఆదిత్య ఏకసంధాగ్రాహి. ఒకసారి చెబితే చాలు. అక్షరం పొల్లు పోకుండా తిరిగి చెప్పేస్తాడు. నేను చెప్పే మాటలు అతన్ని ఎంతగా ప్రభావితం చేశాయో ఆ పుస్తకం చూస్తే నాకు అర్థం అయిపోయింది. వారితో అలా మొదలైన నా పరిచయం వారికి నన్ను కుటుంబ ప్రియమిత్రుడుగాను, వారు నాకు ఆత్మీయకుటుంబంగాను మిగిలి పోయేలా చేసింది. ******* ప్రజ్ఞ పదవ తరగతి పూర్తయింది. 569 మార్కులతో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించింది. కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు ఆమెను. అయినా నేను ఆదిత్యకు ట్యూషన్ మానలేదు. అతనికి సెవెంత్ క్లాస్ సిలబస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఆదిత్య ఎన్నో కంప్యూటర్ మ్యాథ్స్ పజిల్స్ అవలీలగా సాధించే ‘జమ్’. ‘’రేపటి నుంచి వారం రోజులు సెలవు కావాలి సార్!’’అడిగాడు ఆదిత్య . ‘’ఏమి?’’అన్నాను. ‘’రేపు రాత్రికి తిరుమల వెళ్తున్నాం సార్.’’ ‘’అలాగా. స్వామి ప్రవేశద్వారం వద్ద ఉండే హుండీలో నా పేరు చెప్పి ఈ నూట పదహారు రూపాయలు దక్షిణ నీ చేతులతో వేసి పెట్టు’’ అన్నాను డబ్బు పొట్లం ఇస్తూ. ‘’మీరు ఇవ్వద్దు సార్. నేను వేస్తాను’’ అన్నాడు. ‘’నాపట్ల నీకున్న అభిమానం తెలుసు. కానీ ఫలితం నాకు దక్కాలంటే, స్వామికి నా కష్టార్జితం మాత్రమే సమర్పించుకోవాలి. ఇది నా సెంటిమెంట్.’’ అన్నాను. ఆదిత్య తీసుకున్నాడు - ఇంకా ఏమీ మాట్లాడకుండా. వాళ్లు వూరిలో లేని వారం రోజులు నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. అంతగా వారి కుటుంబానికి ఆత్మీయుడనైపోయాను. అయితే ప్రతీ రాత్రి తాము ఏ ఏ ప్రదేశాలు తిరిగిందీ స్పష్టంగా ఫోన్లో చెప్పేవాడు ఆదిత్య. వాళ్ళు యాత్రనుంచి తిరిగి వచ్చేశారు అని తెలియగానే ఆ సాయంత్రమే నా టైం షెడ్యూల్ ప్రకారం వెళ్లాను. స్వామి ప్రసాదం ఇచ్చారు. ఆస్వాదించాను. ‘’సార్ మీకు నా ఈ చిన్న బహుమతి’’ అంటూ ఒక ప్యాకెట్ అందించాడు ఆదిత్య. విప్పి చూశాను. ‘’ఆంజనేయస్వామిని కౌగిలించుకున్న శ్రీరాముని పాలరాతి విగ్రహం’’ అప్రతిభుడనైపోయాను. అంత సజీవంగా ఉంది ఆ శిల్పం. ఆదిత్య అన్నాడు ‘’నూరు యోజనాలు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతామాతను మొదటిసారి చూసి స్వామి సందేశం ఆమెకు అందించి, ఆమె సందేశాన్ని శ్రీరామునికి అందించడమే కాకుండా శ్రీరామ పట్టాభిషేకం వరకు తన సేవలను మరే భక్తుడు అందించనంతగా రాముని సేవించి, భక్తాగ్రేసరుడుగా, చిరంజీవిగా నిలిచిపోయిన హనుమంతునికి ‘ఇంతకన్నా నీకు ఏమి ఇవ్వగలను మిత్రమా?’ అంటూ శ్రీరాముడు ఆత్మీయతతో కూడిన కౌగిలిని బహుమతిగా ఇచ్చిన సన్నివేశం నాకు రామాయణంలో అత్యంత ఇష్టమైన దృశ్యం. భగవంతునికృపకు పాత్రుడైన భక్తునికి, భగవంతుడు స్వయంగా ప్రసాదించే వరం అంతకన్నా అపురూపమైనది మరొకటి ఉండబోదు’ అన్నారు మీరు. అది జ్ఞాపకం పెట్టుకుని మీకోసం నా పాకెట్ మనీతో తెచ్చాను సార్!’’ నాలోని గురువుకు అతను ఇచ్చిన విలువకు, గౌరవానికి అవ్యక్తానందానికి లోనయ్యాను. అతని నుదుట ముద్దు పెట్టుకుని ‘’ఇది నీకు నా బహుమతి’’ అన్నాను. ‘’నాకు జ్నానమ్ వచ్చిన తరువాత మా అమ్మ, నాన్నల తరువాత ఈ బహుమతి మీదగ్గరనుంచే పొందాను సర్.’’ వణుకుతున్న కంఠంతో అన్నాడు ఆదిత్య. ‘’నువు నాకు దేవుడిచ్చిన మేనల్లుడివి .’’ అన్నాను అతనితో కరచాలనం చేసి. దీపావళి పండుగకు నన్ను భోజనానికి పిలిచారు. వారి ఆహ్వానం మేరకు ఆ రాత్రి వారి కుటుంబంతో నేను దీపావళి జరుపుకున్నాను. ****** వారం రోజుల తర్వాత హఠాత్తుగా ఫోన్. కాన్వెంట్లో పాఠం చెప్తుండగా వచ్చింది. గబగబా సెలవుపెట్టి పరిగెత్తాను. అప్పటికే ఆదిత్య ఇంటినిండా బంధువులు. నాకు గుమ్మంలోనే ప్రజ్ఞ ఎదురైంది. ‘’సార్. అన్నయ్య...’’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ నా చేయి పట్టుకుని లోపలకు తీసుకువెళ్లింది. విగ్రహంలా నిలబడిపోయిన నేను ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా హాల్ లోకి నడిచాను. ‘’మాస్టారు మీ శిష్యుడు...’’ అంటూ ఆదిత్య అమ్మగారు వణుకుతున్న కంఠంతో మాటలు రాక ఆగిపోయారు. నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు. ‘’రాత్రి 10 గంటలకు విపరీతంగా ఆయాస పడ్డాడు సర్. ఆయాసం వచ్చినప్పుడు వెంటనే ఇంజక్షన్ చేస్తారు. 10 నిమిషాల్లో తేరుకుంటాడు. కానీ ఇంజక్షన్ ఇవ్వబోతుంటే ‘ మమ్మీ!సార్ ఇచ్చిన ఇంటిపని కొంచెం మిగిలి పోయింది. అది చేశాక చేయించుకుంటాను ‘’అన్నాడు. ‘’సార్ తో నేను చెబుతాలే నాన్న’’ అని మాట ఇచ్చాక ఇంజక్షన్ చేయించుకున్నాడు. అదే వాడి ఆఖరిమాట!’’ అన్నారు ఆదిత్య తండ్రి గాద్గదిక స్వరంతో. నేను ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాను. ఎంతసేపు అలా ఏడుస్తూ వుండిపోయానో నాకే తెలియలేదు. నా ప్రమేయం లేకుండానే అసంకల్పితంగా నా కళ్ళలో కన్నీటిజల వూరుతూ బుగ్గలమీదుగా జారిపోతూనే ఉంది. ఎదురుగా దృశ్యం మసక అయినప్పుడల్లా కళ్లు తుడుచుకుంటూనే ఉన్నాను. మళ్లీ మామూలే. క్షణాల్లో ఎందరెందరో వచ్చారు. ‘’ఎవరాయన? అంతగా బాధ పడుతున్నారేమిటి?’’ అని ఎందరో అడుగుతున్నారు. ‘’ఆయన వాడి ట్యూషన్ మాష్టారు. చదువు అంటే వాడు అంత ఇష్టపడేలా చేసింది ఆయనే .. చివరిగా ఆయనని తలుచుకుంటూనే......’’అన్నారు ఆదిత్య అమ్మగారు. ‘’ ఏనాటి ఋణమో!’’ అంది ఒకామే. ‘’దీపాలు పెట్టక ముందే తీసుకుపోవాలి.’’ అన్నారు ఎవరో. కార్యక్రమాలు మొదలయ్యాయి. అందరు దండలు వేశారు. నా చేతికి ఒక దండ ఇచ్చి వేయమన్నారు. దండ వేశానో లేదో నాకు గుర్తులేదు. నాకు కన్నీళ్లు మాత్రం ‘ఆదిత్య’ని అభిషేకించాయి. ‘’నాకీ అదృష్టం చాలు మాస్టారు!’’ అన్నట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఆదిత్య. అన్ని అయ్యాక ‘ఆదిత్య’ను తాటాకు చాపలో చుట్టేసి మూటగా కట్టేశారు. నేను చూస్తుండగానే, నా కన్నీరు ఇంకకుండానే ఆదిత్య వెళ్లి పోయాడు. కాదు...కాదు. తీసుకెళ్లిపోయారు. ఇంక ఆ ఇంటికి ఏమని రాగలను? ఎందుకు రాగలను? ‘’మాష్టారు. ఇది మాత్రం మీకు ఇమ్మని వాడి కోరిక. ఎందుకంటే - మీరు దీన్ని పది మంది విద్యార్థులకు చూపి ‘మార్గదర్శి’ అవ్వాలని, వారికి ‘తాను’ మార్గదర్శిగా మిగిలిపోవాలని.’’ అంటూ ఓ ‘పుస్తకం’ నా చేతిలో పెట్టి లోపలికి వెళ్లిపోయారు ఆదిత్య అమ్మగారు. ‘’ఈరోజు నేను నేర్చుకున్న విషయాలు’’ అన్నదే ఆ పుస్తకం. ‘’కాలమనే ‘నది’ - ఆయుష్షు తీరిన ‘నావ’లా అతన్ని తీసుకుపోవచ్చు. కానీ చుక్కాని నా చేతిలో ఉంది.’’ అన్న సంతృప్తితో ఆదిత్య అంజలి ఘటిస్తూ ఇంటిదారి పట్టాను. సమాప్తం

మరిన్ని కథలు

Swayam vupadhi
స్వయం ఉపాధి
- మద్దూరి నరసింహమూర్తి
Neelambari
నీలాంబరి
- రాము కోలా దెందుకూరు.
Indradyumnudu
ఇంద్రద్యుమ్నుడు
- కందుల నాగేశ్వరరావు
Vyapari telivi
వ్యాపారి తెలివి
- ౼డా.బెల్లంకొండ & ౼డా.దార్ల
Sundaramidi palle
సుందరామిడి పల్లె
- సి.లక్ష్మి కుమారి
Snehadharmam
స్నేహ ధర్మం
- భానుశ్రీ తిరుమల
Return gift
రిటర్న్ గిఫ్ట్
- కలం పేరు: బామాశ్రీ : రచయిత పేరు: బాలాజీ మామిదిశెట్టి
Blue horse
బ్లూ హార్స్
- ఎం వి రమణరావ్