వృత్తిధర్మం - - బోగా పురుషోత్తం

Vruthi dharmam
రమణయ్య పెద్ద డాక్టరు. తన చదువు పూర్తయిన వెంటనే పట్టణంలో ఓ వైద్యుని వద్ద కొద్ది రోజులు పనిచేసి తన వైద్య వృత్తిని ఓ పల్లెలో ప్రారంభించాడు.
రమణయ్య సాధారణ వ్యక్తిలా తిరుగుతూ లాభాపేక్ష లేకుండా సేవా గుణంతో వైద్యం అందించసాగాడు. ఇది చూసి అతడిని అందరూ ‘‘ నువ్వేం వైద్యుడివి.. లక్షలు ఖర్చుపెట్టి చదివావు..అధనంగా పైసా కూడా తీసుకోకుండా వైద్యం చేస్తావు.. ఇలాగైతే ఇల్లు, సంసారం గడిచేది ఎలా?’’ అని ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇతరులు కూడా విమర్శించేవారు.
రమణయ్య ఇదేమీ పట్టించుకోలేదు. ఓ మారుమూల పల్లెలో పూరి గుడిసెలో వైద్యం ప్రారంభించిన అతను చల్లయ్య అనే ఓ కాంపౌండరును నియమించుకున్నాడు.
ఆ పల్లెలో వున్న నిరుపేదలకు అనారోగ్యం వస్తే రమణయ్య వాళ్ల ఇంటికే వెళ్లి వైద్యం చేసేవాడు.
ఇది గమనిస్తున్న చెల్లయ్య ‘‘ సార్‌..! మీరు చాలా దయాగుణం కలవారు..వైద్యం చేసినప్పుడల్లా ఇలా ఉచితంగా చేస్తే మనం పైకి ఎలా వస్తాము..? మీ పద్ధతి మార్చుకోండి..లేకుంటే భవిష్యత్తులో మీరు వృద్ధి చెందలేదు..’’ అన్నాడు చెల్లయ్య.
రమణయ్య కాస్త నవ్వి ‘‘ అదేమీ కాదులే చల్లయ్యా..’’ అన్నాడు తన పద్ధతిని మార్చుకోను అన్నట్లు..
చెల్లయ్యకు ఇది నచ్చలేదు. తనపని తాను చేసుకుపోయేవాడు. ఓ రెండేళ్లపాటు అతని వద్దే వుండి ఏయేరోగానికి ఏయే మందులు వాడాలో బాగా నేర్చుకున్నాడు. తన పక్క పట్టణం వెళ్లి ఓ పెద్ద గదిలో వైద్యం ప్రారంభించాడు. అధిక ఫీజులు వసూలు చేస్తూ మందులు అధికంగా వాడుతూ వృత్తిని కొనసాగించాడు.
అతి కొద్ది కాలంలోనే బాగా ధనవంతుడయ్యాడు. అతని వద్ద నల్గురు డాక్టర్లను నియమించుకుని ఆస్పత్రికి విస్తరింపజేశాడు. ప్రతి రోజూ రోగులతో ఆస్పత్రి కిటకిటలాడేది.
ఓ రోజు రమణయ్య అదే ఆస్పత్రిదారిలో వెళ్లాడు. చల్లయ్య వైద్యం గురించి విన్నాడు. అసూయ చెందలేదు. తన వృత్తిని ధర్మమార్గంలోనే అనుసరిస్తూ పల్లెవాసులకు లాభాపేక్ష లేకుండా వైద్యం అందించసాగాడు.
ఓ రోజు చల్లయ్య ఆస్పత్రికి ‘‘ పాము కాటు వేసింది.. త్వరగా వైద్యం అందించండి..’’ అంటూ మంత్రి కొడుకును తీసుకొచ్చారు.
చల్లయ్య అధిక ఫీజులు వసూలు చేశాడు. అతని డాక్టర్లు ఏవేవో ఇంజక్షన్లు వేశారు. అయినా మంత్రి కొడుకు అపస్మారక స్థితి నుంచి లేవలేదు. దీంతో చల్లయ్యకు భయం వేసింది. వెంటనే రమణయ్య డాక్టరుకు ఫోను చేసి విషయం చెప్పాడు.
క్షణాల్లో రమణయ్య డాక్టరు అక్కడికి చేరుకుని మంచి ఇంజక్షన్‌ ఇచ్చాడు. కొద్ది సేపటికి మంత్రి కొడుకు మెల్లగా కళ్లు తెరచి చూసేసరికి మంత్రి ముఖంలో ఆనందం కనిపించింది.
అప్పటికే చల్లయ్య వైద్యంపై అనుమానం వచ్చిన మంత్రి దర్యాప్తు చేయించాడు. నకిలీ వైద్యులు అని తేలడంతో వెంటనే ఆస్పత్రిని సీజ్‌ చేశారు.
తన కొడుకును రక్షించిన రమణయ్య డాక్టరు వద్దకు మంత్రి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి ‘‘ ఇంత వైద్య నైపుణ్యం వున్న మీరు ఎందుకు డెవలప్‌ కాలేదు..?’’ ప్రశ్నించాడు.
‘‘ సార్‌.. నేను ఎంతో కష్టపడి వైద్య విద్యను చదివాను..ధర్మబద్ధంగా వృత్తిని చేపట్టాను..ధర్మాన్ని అనురిస్తే అదే మనల్ని కాపాడుతుంది..’’ అన్నాడు రమణయ్య.
అతని మాటలకు పరమానంద భరితుడయ్యాడు మంత్రి. కొద్ది రోజుల్లోనే అక్కడ పెద్ద భవనం వెలిసింది. అతనితో పాటు నల్గురు డాక్టర్లను ఏర్పాటు చేశాడు మంత్రి. ఏడాది తిరక్కముందే అన్ని వ్యాధులకు అక్కడ చికిత్స అందింది. రమణయ్య వైద్యం చుట్టుపక్కలకు పాకింది. క్రమక్రమంగా రోజుల సంఖ్య పెరిగి లాభాలు రాసాగాయి.ఈ విషయం తెలిసిన చల్లయ్య సైతం మళ్లీ అదే ఆస్పత్రిలో కాంపౌండరుగా చేరి జీవనం పొందాడు.
అనతి కాలంలోనే అది ప్రభుత్వ ఆస్పత్రిగా మారింది. అందులోని డాక్టర్లు అందరూ ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. రమణయ్య సూపరింటెండెంటు హోదా పొందాడు. రెండేళ్లు గడిచాయి.
ఓ సారి రిపబ్లిక్‌ డే రోజు రమణయ్య వైద్యబ్రహ్మ అవార్డును మంత్రి చేతులు మీదుగా అందుకున్నాడు. ఇన్నాళ్లు రమణయ్య చేసిన నిస్వార్థ వైద్య సేవలకు ప్రభుత్వ గుర్తింపు పొంది అవార్డు లభించినందుకు ఒకప్పుడు అతడిని విమర్శించిన తల్లిదండ్రులతో పాటు ఆ ఊరి ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు.
ఎంతో మంది వైద్యులు తమ వృత్తిలో రమణయ్య అనుసరించిన ధర్మమార్గంను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి పథంలో ముందకు సాగారు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి