పూజారి గారు ఆలా చేశారు! - తటవర్తి భద్రిరాజు

pujari garu ala chesaru

ఊరి చివర పూరాతన శివాలయం ఉంది. ఎప్పుడు ఎవరు కట్టించారో తెలియని ఈ ఆలయం ప్రస్తుతం శిదిలావస్థ లో ఉంది. ఆలయ గోపురం పై అక్కడక్కడ పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. ఆలయం లో నంది మొహం ఎవరో పగలగొట్టారు. తన బాధ ను చూడమన్నట్టు గా ఆ నంది గుడి లోపల ఉన్న లింగం వైపే చూస్తూ ఉంది. ఈ ఆలయాన్ని ఊళ్ళో వాళ్ళు మరమ్మత్తులు చేయిద్దాం అనుకున్నారు కానీ భారతీయ పూరావస్తు శాఖ అందుకు ఒప్పుకోలేదు. ప్రభుత్వం పాత కట్టడం రూపు రేఖలు కోల్పోకుండా పునర్ నిర్మిస్తుంది అని ఆ శాఖ చెప్పింది. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఈ ఆలయం ఎన్నాళ్ళు నుండో ఇలానే ఉండిపోయింది. పురాతన ఆలయం పక్కనున్న భూములు ఒకప్పుడు ఈ గ్రామాన్ని పాలించిన పెద్దాపురం రాజులవి. ఆ తర్వాత అవి శివాలయం పోషణ కోసం రాసి ఇచ్చేశారు ఎంతో భక్తి ఉన్న రాజులు. ఆ భూములలో చాలా వరకు ఇప్పుడు కబ్జా అయిపోయాయి. దేవుడు లేని ఊళ్ళో ఉండకూడదు అని ఊళ్ళో వాళ్ళు అంతా చందాలు వేసుకుని పాత శివాలయానికి దగ్గరలోకొంత భూమి కొని మరో శివాలయం కట్టారు. ఈ ఆలయం లో పూజారిగా కామేశ్వర శర్మ ని నియమించారు. ***** కామేశ్వర శర్మ తండ్రి వేంకటేశ శర్మ. వెంకటేశ శర్మ మేడపాడు లో శివాలయం పూజారి. వేద పండితుడు. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడే సిరపడ్డాడు. ఒక్క గాని ఒక్క కొడుకు చెడు స్నేహాలు చేసి పాడయిపోతుంటే, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆలయం లో లింగం ముందు మవునం గా చెప్పుకుంటూ ఉండేవాడు. అగ్రహారం లో కొంత మంది పెద్దలు పెళ్లి చేస్తే కుర్రాడు కుదరుకుంటాడు అని చెప్పారు. అమలాపురం భూపయ్య అగ్రహారం లో రామకృష్ణ అవధాని గారి అమ్మాయి ఉంది అని తెలిస్తే శాఖలు కలవకపోయినా, పెద్దలతో మాట్లాడించి ఏదోలా కొడుకు కామేశ్వర శర్మ కు పెళ్లి జరిపించాడు. అమ్మాయి సుందరి. చిన్నతనం నుండి ఆచార వ్యవహారాలు బాగా తెలిసిన అమ్మాయి. కోడలు ను చూస్తే వెంకటేశ్వర శర్మ కు ధైర్యం వచ్చింది తన కొడుకుని చక్క దిద్దుతుంది అని. చిన్నప్పటి నుండి పెంచిన తన మాట వినక పోయినా, కామేశ్వర శర్మ భార్య మాట వింటాడు అని ఆశ పడ్డాడు. కొడుకును కోడలు ను వేరే కాపురం పెడితే కొడుకు కు బాధ్యతలు తెలుస్తాయి అని వేరే కాపురం పెట్టాడు. కొడుకుకు నచ్చచెప్పి ఆలయం లో పూజ చేయడం నేర్పించ్చాడు. ఆలా పూజ చేయడం నేర్చుకున్న కామేశ్వర శర్మ ఇప్పుడు ఈ కొత్త ఆలయం లో పూజారిగా చేరాడు. కొత్త గుడికి దగ్గరలోనే కామేశ్వర శర్మ కుటుంబం ఉండడానికి ఏర్పాట్లు చేశారు గ్రామ పెద్దలు. కొంత కాలం బాగానే ఉన్న కామేశ్వర శర్మ, ఓ రోజు మధ్యాహ్నం గుళ్లో మహా నైవేద్యం పెట్టేశాక పాత స్నేహాతుడు ని కలుస్తాను అని భార్య కి చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఆలా వెళ్లిన కామేశ్వర శర్మ అర్ధరాత్రి దాటాక మత్తులో జోగుతూ, తూలుతూ ఇంటికి వచ్చాడు. ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే గుళ్లో నుండి ఊళ్ళో నుండి పొమ్మంటారు అని బయపడింది సుందరి. ఆ తర్వాత కామేశ్వర శర్మ అప్పుడప్పుడు పాత స్నేహుతులని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అర్ధరాత్రి తాగి వచ్చి మత్తుగా పడుకునే వాడు కామేశ్వర శర్మ. ఆ మత్తు తరువాత రోజు మధ్యాహ్నం కి ఎప్పుడో వదిలేది. ఉదయాన్నే ఆలయం తెరవక పోతే ఊళ్ళో వాళ్ళకి అనుమానం వస్తుంది అని శర్మ గారికి జ్వరం గా ఉంది అని తనే ఆలయం తెరిచి తనకు వచ్చిన పూజ చేసి భక్తులని పంపించేది. భర్త కు చాలా సార్లు నచ్చ చెప్పింది సుందరి. కామేశ్వర శర్మ సుందరి మాటలు విని కొంతకాలం బాగానే ఉన్నాడు. నెల తప్పిన సుందరి పుట్టింటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ గుళ్లో మహా దేవునికి నైవేద్యం పెట్టడానికి కామేశ్వర శర్మ కు వంట రాదు అని ఆ కొన్ని నెలలు కు ఒక వంట మనిషి ని పెట్టింది. ఆ వంట మనిషి ఉదయాన్నే వచ్చి వంట వండి వెళ్లిపోయేది. కామేశ్వర శర్మ ఎప్పటి లానే గుళ్లో పూజ చేసి నైవేద్యం పెట్టి తన కూడా తినే వాడు. కానీ తిన్నవి తోమడానికి ఓ మనిషి ఉంటే బావుంటుంది అనిపించింది కామేశ్వర శర్మ కు. ఎప్పుడూ బట్టలు తీసుకుని వెళ్లే గంగమ్మ ను ఇంటి పనులు చేయమని అడిగాడు. ఎప్పుడో భర్త పోయిన గంగమ్మ పూజారిగారి మాట కాదనలేక పనికి ఒప్పుకుంది. సుందరి లేక పోవడం తో గంగమ్మ తో కామేశ్వర శర్మ స్నేహం ముదిరింది. పాత స్నేహుతులు కూడా గుర్తుకు రావడం లేదు. మధ్యాన్నం మహా నైవేద్యం తర్వాత గంగమ్మ తోనే ముచ్చట్లు పెడుతూ రోజంతా గడిపే వాడు. గంగమ్మ కు కూడా పూజారి గారి సాన్నిహిత్యం కొత్తగా అనిపించింది. పూజారి గారి సన్నిధి లో ఉంటే దేవుడి సన్నిధి లో ఉన్నట్టే అనుకుంది. కొన్ని రోజులకు పూజారి గారు వంట మనిషిని రావద్దు అన్నారు. వంట మనిషి స్థానం కూడా గంగమ్మ కె ఇచ్చారు పూజారి గారు. "నేను వంట చేస్తే దేవుడి నైవేద్యం కి పనికి వస్తుందా" అని అడిగింది గంగమ్మ వయ్యారాలు పోతూ... శివుడే నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు. ఏం కాదు చెయ్యి అన్నాడు గంగమ్మ మత్తులో ఉన్న కామేశ్వర శర్మ. గంగమ్మ కొత్త కొత్త వంటలు చేసేది. గంగమ్మ మత్తు కామేశ్వర శర్మ కు తన పాత స్నేహుతులు ఇచ్చే మత్తు కన్నా బావుంది. సుందరికి ఆడపిల్ల పుట్టింది. విషయం కామేశ్వర శర్మ కు లేఖ ద్వారా తెలిపినా అతడు పట్టించుకోలేదు. పుట్టింటికి వెళ్లిన సుందరిని చూడడానికి కామేశ్వర శర్మ ఒక్కసారి వెళ్ళలేదు. ఓరోజు చెప్పాపెట్టకుండా కూతురు ని తీసుకుని తన ఇంటికి వచ్చింది సుందరి. వంట గదిలో ఉన్న గంగమ్మ ను చూసి ఉన్న విషయం మొత్తం ఎవరూ చెప్పకుండానే అర్ధం చేసుకున్న సుందరి మాట బయటకు రాకుండా బోరుమని ఏడ్చింది. సుందరి ని చూసిన గంగమ్మ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. సుందరి కామేశ్వర శర్మ తో ఏమీ మాట్లాడలేదు. ఎప్పటిలానే ఉంది. ఆరోజు రాత్రి కామేశ్వర శర్మ కు పాత స్నేహుతులు గుర్తుకు వచ్చారు. ఇంటికే మందు తెచ్చుకోమని చెప్పింది సుందరి. ఆ రాత్రి మత్తు గా తాగిన కామేశ్వర శర్మ.... తరువాత రోజు ఉదయం తన ఇంట్లో ఫ్యాన్ కు శవం అయ్యి కనిపించాడు. గుమ్మం పక్కన ఏడుస్తూ కూర్చున్న సుందరి వచ్చిన వాళ్లకు చెప్తూ ఉంది " ఆడపిల్ల పుట్టింది అనే బాధ లో పూజారి గారు ఇంత పని చేశారు " అని. నిజం ఆ శివుడికి మాత్రమే తెలుసు !

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ