లౌక్యం - డా. లక్ష్మీ రాఘవ

Lowkyam

కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన శేఖరానికి హైదరాబాదు ఆఫీసులోఅందరికంటే విశ్వం చాలా ప్రత్యేకంగా కనిపించారు. అందరితో గల,గలా మాట్లాడేస్తూ, చక, చకా పనులు చేసుకుపోతూ వుంటే చూసి తను కూడా అలాగే వుండాలన్న భావన కలిగింది. అతనితో స్నేహం చేయాలన్న కోరికా ఎక్కువైంది. విశ్వం గారికి నలబై ఏళ్ళు వయసు ఉండొచ్చేమో కానీ ఇంకొంచెo ఎక్కువగా అనిపిస్తుంది అతనికి వున్నబొజ్జ చూస్తే. ‘భోజనప్రియుడేమో’ అని కూడా అనిపించక మానదు.

శేఖరం ఆఫీసు చేరిన నెలలోనే ప్రతి సంవత్సరం ఆఫీసు వాళ్ళ ద్వారా జరిగే ఫామిలి గెట్ టుగెదర్ అని డిన్నర్ ఒక హోటల్ లో ఏర్పాటు చేశారు. శేఖరoకు ఇంకా పెళ్ళికాలేదు కనుక ఒంటరిగా వెళ్ళాడు. అందరూ ఫామిలీలతో వచ్చారు. మేనేజర్ అందరినీ పలకరించాక అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కూర్చుని వారికి కావాలసినవి ఆర్డర్ ఇస్తూ వున్నారు. శేఖరం ఒక్కడే కూర్చున్నా అందరినీ గమనిస్తున్నాడు. విశ్వం మాత్రం ఒక టేబల్ దగ్గర ఫామిలీతో కూర్చుని చాలా శ్రద్దగా మెనూ చూస్తూ తమకు కావాల్సినవి తెప్పించుకుంటున్నారు. అతని టేబల్ మీద అయిటమ్స్ కాస్త ఎక్కువే వున్నట్టు అనిపించింది. వారు తింటున్న తీరు చూసి ఆయన ఫామిలిని శ్రద్దగా చూసుకుంటారనిపించింది.

మరుసటి నెలలో విశ్వం తో బాటు శేఖరం కూడా ఆఫీసు వర్క్ మీద ముంబాయి వెళ్ళవలసి వచ్చింది.

ప్రయాణంలో మాటలు కలిపిన విశ్వం శేఖరం గురించి తెలుసుకున్నాక, ఉద్యోగంలో సెటిల్ అయినట్టే కనుక పెళ్లి చేసుకోమనీ, ఉద్యోగం చేసే పిల్ల అయితే మరీ మంచిదనీ, ఒకరో ఇద్దరో పిల్లలతో సరిపెట్టుకోవాలని సలహా ఇస్తూవుంటే ఆయన తన జీవితాన్ని ఎంత పద్దతిగా జరుపుకుంటున్నాడో అనిపించింది శేఖరానికి.

హోటల్ చేరగానే తను తెచ్చుకున్న బ్యాగ్ లో నుండీ కొన్ని బట్టలు తీసి వాష్ కు వేశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న శేఖరం తో ‘నీ బట్టలూ ఏదైనా ఉంటే వాష్ కు వెయ్యి’ అంటే

‘లేదండీ. ఇప్పడే కదా వచ్చింది..” అన్నాడు ఇబ్బందిగా

“నేను మాత్రం ఇలా వచ్చినప్పుడు బట్టలు డ్రైక్లీన్ చేయించుకు వెడతాను. ఎలాగూ హోటల్ బిల్లు ఆఫీసు కడుతుంది కదా మనకు ఖర్చూ తగ్గుతుంది” విశ్వం మాటల్లో ఏమాత్రం మొహమాటం లేదు...

మూడు రోజుల్లో ముంబాయి ఆఫీసు వర్క్ అయిపోయింది. వెనక్కి వచ్చే ముందురోజు సాయoత్రం ఒకసారి ఆఫీసర్ గారి ఇంటికి వెళ్ళి వద్దాం అంటే ఆశ్చర్యపోయాడు శేఖరం. పని అయ్యింది కదా ఇప్పుడు ఎందుకూ.. పైగా ఈ నగర ట్రాఫిక్ లో...అని అంటే

‘పర్లేదు వెళ్ళటం ముఖ్యం రా’ అని తన సూట్కేసులో ఒక పాకెట్ తీసుకుని ‘పద ‘ అంటూ బయలుదేరదీసి ఆఫీసరు గారింటికి వెళ్ళాక కాసేపు మాట్లాడి ఆయనకు ఆ పాకెట్ అంది౦చాడు. ఆయన ముఖoలో చిరునవ్వు శేఖరం దృష్టిని దాటిపోలేదు.

వెనక్కి బయలుదేరాక చెప్పాడు ఇలా పనులమీద వేరే వూరిలో కలిసిన ఆఫీసర్లకు చిన్న గిఫ్ట్ ఇవ్వటం వలన వాళ్ళ దృష్టిలో మనం ఎంతగానో ఎదిగిపోతామనీ...మరోసారి వచ్చినప్పుడు మన పనులూ సులభంగా అయిపోతాయి అని. ఇలా ఇవ్వడం కోసం కాస్త చవగ్గా వచ్చే కొన్ని గిఫ్ట్స్ కొని పెట్టుకుంటానని చెబుతూంటే అతని ముందు చూపుకు శేఖరం చాలా ఆశ్చర్య పోయాడు.

*****.

కొద్ది రోజుల్లోనే శేఖరం ఆఫీసులో వర్క్ బాగా చేస్తాడని పేరొచ్చింది. ముఖ్యంగా అందరితో సఖ్యంగా ఉండటం, సీనియర్స్ ని గౌరవంగా చూడ్డం అందరికీ నచ్చింది.

తనకు ఉద్యోగం బాగుందని అమ్మా నాన్నలకు చెప్పాడు. పెళ్లి సంబంధాలు చూస్తామని వారంటే అభ్యంతరం చెప్పలేదు శేఖరం.

ఆఫీసులో మాత్రం అందరితో కలివిడిగా ఉంటూ తిరగే విశ్వం ఎప్పుడూ ప్రత్యేకమే శేఖరానికి.

ఒక రోజు విశ్వం చేసిన ప్రపోజల్ అందరికీ నచ్చింది ఆఫీసులో.

ఆఫీసులో కొంత మంది కలిసి ఒక స్థలం కొనుక్కుని ఫ్లాట్స్ కట్టుకుంటే అందరికీ ఇల్లు రావటమే కాకుండా చవక పడుతుంది. స్థలం కొనుక్కోవడానికి ఆఫీసు నుండీ గిఫ్ట్ లోను ఇవ్వమని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే.. లోనూ దొరకవచ్చు. ఆపైన ఇంటి కోసం స్వంతంగా తీసుకునే బాంక్ లోనులు వుండనే వుంటాయి. ఈ అయిడియా అందరికీ నచ్చింది.

శేఖరం తో ప్రత్యేకం గా చెప్పాడు పెళ్ళికి ముందే ఇలా ఇల్లు కూడా స్వంతం చేసుకుంటే ఎంత మంచిదో...అని. ఇది నిజంగా మంచి ఆలోచన అనిపించింది శేఖరానికి కూడా.

ఇప్పటికే స్వంత ఇల్లు ఉన్నవాళ్ళు కూడా ఇలా తీసుకుంటే అద్దెకు ఇచ్చుకోవచ్చని, అదనపు ఆదాయం అంటూ చెప్పడం వల్ల ఆసక్తి పెరిగింది కొoదరికి.

అందరూ కూడబాలుక్కుని స్థలం ఎక్కడ చీప్ పడుతుందో తెలుసుకోవడం లాటి బాధ్యతలు విశ్వం మీదే పెట్టారు. కార్యాచరణ మొదలైంది. స్థలం చూడటం మొదలుకొని హెడ్ ఆఫీసు నుండీ కొంత లోనూ రాబట్టడం వంటివి అన్నీ విశ్వం చాలా పద్దతిగా చేశారు.

తనకు తెలిసిన ఆర్చిటెక్ట్ ఉన్నాడని చెప్పి అతనితో ప్లాన్ వేయించాడు.

గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పక్కన పార్కింగ్, మరోవైపు ఒక ఫ్లాట్, పైన నాలుగు అంతస్తులు ఒక్కో అంతస్తులో రెండు ఫ్లాట్స్ వచ్చేలా వున్న ప్లానుకు అందరూ ఒకే చేశారు. మునిసిపాలిటీ పర్మిషన్ కోసం విశ్వం తిరుగుతూంటే ఆయన ఆఫీసు పనులు అందరూ పంచుకున్నారు.

అంతా నిర్ణయం జరిగాక విశ్వం ఒక కండీషన్ పెట్టాడు. ఫ్లాట్స్ విషయంలో అన్నీ పనులూ తానే చూసుకుంటునాడు కనుక గ్రౌండ్ ఫ్లోర్ లో వున్న ఫ్లాట్ తనకు అలాట్ చేయాలని, మిగిలిన ఫ్లాట్స్ అన్నీ పూర్తి అయ్యాక లాటరీ పద్దతిలో ఇవ్వాలనీ, ఇలా ఎందుకూ అంటే ఫ్లాట్స్ ఫలానా అని ఇప్పుడే తెలిస్తే లోపల అలా వుండాలని, ఇలా మార్చాలనీ చెప్పారంటే కట్టడం ఆలస్యం అవుతుంది కాబట్టి లోపల వున్న ప్లాను అందరూ చూసి సమ్మతించాలనీ, విశ్వం అనటం తో ఎవరూ అడ్డు చెప్పలేదు.

ఇంటి విషయమై ఎక్కువగా పని వున్నరోజున ఆయన పనిని పంచుకోవడం తప్పని సరి అయ్యింది. అందరమూ బ్యాంకు లోనూ, ఎల్ఐసి లోనూ అప్లై చేసుకుని కంతులవారిగా విశ్వానికి ఇస్తూ అప్పుడప్పుడూ పని ఎలా జరుగుతూందో వీలును బట్టి పర్యవేక్షణ కూడా చేశారు. పనులు జరుగుతున్న విధానం అందరికీ సంతృప్తినిచ్చింది. విశ్వం బావమరిదే కాంట్రాక్టర్ గా వుండటంతో ఇంకా ఎంతో సులువైనది.

ఫ్లాట్స్ అనుకున్న సమయానికే నిర్మాణం పూర్తి అవటం అందరికీ నచ్చింది.

విశ్వం అందరినీ సమావేశ పరిచి ఆషాడమాసం వస్తోందని అంతలోపే దగ్గరి బంధువులతో పాలు పొంగిస్తే, ఆషాడమాసంలో ఇంటీరియర్ వుడ్ వర్క్ అనీ పూర్తి చేసుకుని శ్రావణంలో ఎవరికి కావాల్సిన రోజు వారు ప్రత్యేకంగా గృహాప్రవేశాలు చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించమని చెబితే అందరికీ అదే బాగుంటుందనిపించింది. వారి సమ్మతి గమనించిన విశ్వం మరో మాట అన్నాడు.

‘ఫ్లాట్ ఓనర్స్ గా అందరం ఆఫీసువాళ్ళకీ, దగ్గరి బంధుజనానికీ ఒకేసారి లంచ్ ఇస్తే ఖర్చు కలసివస్తుంది” ఇది ఎంతో బాగుంటుంది అనకోక తప్పలేదు.

అన్నీఅనుకున్న ప్రకారం జరగాయి. అందరూ ఇచ్చే లంచ్ గురించిన ప్రస్తావన వస్తే విశ్వం తనకు తెలిసిన కాటేరింగ్ వాళ్ళు కాస్త చీప్ కాబట్టి ఎవరికీ అభ్యంతరాలు లేకపోతే ఆ ఏర్పాట్లు తానే చేస్తానని అన్నాడు.

లంచ్ రోజు ఆఫీసు వాళ్ళను కూడా పిలవాలి కాబట్టి ముందురోజు విశ్వం ఆఫీసు కారునే వూపయోగించుకున్నాడు. విశ్వం మాత్రం తన గృహప్రవేశం కూడా అదే రోజు పెట్టుకుంటానని అన్నా మిగిలిన వారు అన్నీ పూర్తి అయ్యాకే గృహాప్రవేశాలు అనుకున్నారు..

పార్కింగ్ ప్లేస్ లో పక వైపు నీట్ గా బఫె ఏర్పాటు బాగా అనిపించింది. పార్కింగ్ పక్కనే విశ్వం ఫ్లాట్ కాబట్టి బాగా ఉపయోగ పడింది. లంచ్ కి అందరూ కొంతమందిని మాత్రమే భోజనానికి పిలిచారు, ఎందుకంటే ఇంట్లో అన్నీ పనులూ పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలనుకున్న వాళ్ళు కదా.

విశ్వం తరఫున వచ్చిన బంధువులు ఎక్కువ!! ఇక ఆఫీసు వాళ్ళూ అందరూ.. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ తిరుగుతూ వున్న విశ్వం ను చూస్తూంటే శేఖరానికి ఆయన విశ్వరూపం కనిపించినట్టయింది.

ఆలోచిస్తూంటే కింది ఫ్లాట్ కోరుకున్న అతని ఇంటికి కాస్త పెరడు, కాస్త తోటా వుంటుంది ఇది ఇంకెవ్వరికీ కెవ్వరికీ లేనిది. ఇంటి లోపల తనకు కావాల్సిన విధంగా చేసుకుని వుడ్ వర్క్ కూడా పూర్తి చేసుకుని ఉన్నాడు. గృహాప్రవేశం కూడా ఆ రోజునే పూర్తి చేశాడు కనుక అందరి షేర్ తో ఏర్పాటు అయిన లంచ్ లో తనవాళ్ళందరినీ పిలుచుకుని.. వెంటనే ఇల్లు చేరిపోయి అద్దె ఇల్లు వదిలేసి డబ్బు మిగిల్చుకుంటాడు!!!!!.

ఏమయితేనేమి విశ్వం చెడ్డవాడు కాదు అందరికీ సాయం చేస్తూ తన పని కూడా చేసుకోగల తెలివి ఉన్నవాడు. ఆయనకు ప్రతి పనికీ ఒక ప్రణాళిక ఉంటుంది. ఒకరినీ నొప్పించకుండా, అందరి సమ్మతి తోనూ తన పనులు చక్కబెట్టుకునే విశ్వం లౌక్యం ఎవరికీ అర్థం అయినట్టే లేదు అనుకున్నాడు శేఖరం స్వగతంగా....

****సమాప్తం ****

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ