ప్రత్యేకులు - తటవర్తి రాజేష్

Pratyekulu

"ఏంట్రా అలా మూల కూర్చున్నావ్!" గద్దించినట్టే అడిగాడు నాన్న. అలా అడిగేవరకూ నేనున్న స్థానాన్ని గమనించనే లేదు. 'అసలు నా ఉనికినే మర్చిపోయేలా ఎన్నో ఆలోచనలు, సమాధానం దొరకని ప్రశ్నలు. ఇవన్నీ ఆలోచిస్తూ అ గదిలో ఎక్కడ తిరిగానో, ఏమూల కూర్చున్నానో' అనుకుంటూ అక్కడ నుంచీ లేచి, రాకింగ్ చైర్ లో కూర్చున్నాను. కుర్చీతో పాటే నా భావాలూ ఊగిసలాడుతున్నాయ్.. 'ఒక ఉద్యోగానికి వందమంది పోటీ' అని తెలిస్తేనే, పోటీదారుల్లో నిరుత్సాహం పురుడుపోసుకుంటుంది. అలాంటిది 'జీవితానికి ఒకే ఒక అవకాశం. కోటిమంది పోటీ అంటే..' ఎన్ని ఒత్తిళ్లు, ఎన్నివేల అవరోధాలు! వీటన్నిటినీ తట్టుకుని నిలబడటమే ఒక సాహసం అంటే, గెలవటాన్ని ఏమనాలి?, గెలిచినవారిని ఏమనాలి?. మనుగడ కోసం చేసిన పోరాటంలో కుల, మత, లింగ భేదం లేకుండా తల్లి గర్భంలో గెలిచి, నిలిచి, వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆ ఖ్యాతి చెందుతుంది. అయితే ఇప్పుడు నా ఆలోచనలన్నీ వివక్షతకు గురవుతున్న ఆ విజేతల వైపే.. సమస్యల్లో చిక్కుకున్న నపుంసకత్వం చుట్టే.. "ఏ! కాలేజీ లేదా ఇవాళ?" కఠినంగానే అడిగాడు నాన్న . నా ప్రవర్తనో, నాపై స్నేహితులు చెప్పే చాడీలో, నాకొచ్చే మార్కులో కారణం ఏంటో తెలియదు. గత కొద్ది రోజులుగా నా పట్ల నిరాసక్తతే కనిపిస్తోంది ఆయనలో. "వెళ్తున్నా నాన్నా" అంటూ ఆలోచనలు బ్యాగ్ లో పెట్టి సైకిల్ తీశాను. దారంతా నాతో నేను మాట్లాడుకుంటునే ఉన్నాను. నాలో నేను మదనపడుతూనే ఉన్నాను. దగ్గర ఉన్నంతవరకు నవ్వుతూ మాట్లాడి, పక్కకు వెళ్లి "వాడూ, వాడి తేడా మాటలు." అని నవ్వుకునే స్నేహితులు, "ఇంట్లోనే ఉండు బయటకు వచ్చి మా పరువు తీయకు." అని మందలించే తల్లిదండ్రులు. "వాడు ఇల్లు చూసుకుంటాడులే మీరు ఫంక్షన్ కి రండి." అని సున్నితంగా తిరస్కరించే చుట్టాలు. ఇవి కాక "వస్తావా" అంటూ పోకిరీ వెధవల పిచ్చికూతలు, అత్యాచారాలు. ఇలా ఒకటా, రెండా ఎన్నో శారీరక, మానసిక సమస్యలతో ఎంతమంది ఓదార్పు దొరకక ఒంటరి పోరాటం చేస్తున్నారో.. సాయం చేయకపోగా సాటి మనిషిని చులకనగా చూసే చూపులు ఇంకెంత కాలమో! ఎంత అభివృద్ధి చెందుతున్నా ఆలోచనా విధానంలో మార్పు రాదెందుకో.. ఇలాంటి ప్రశ్నలెన్నో నా సైకిల్ చక్రంలా తిరుగుతున్నాయి. ఒక ముళ్ల చక్రం అదే చైన్ ను పదే పదే తిప్పుతుంటే, గోతులలో పడుతూ, లేస్తూ సైకిల్ కాలేజ్ చేరుకుంది. "పాయింట్ ఫోర్ తర్వాత ఏమొస్తుందిరా!" నా స్నేహితులు చేస్తున్న అల్లరిలో నా నవ్వులు కలపలేకపోయాను. గుండె ఒక అగ్నిగుండంలా రగులుతోంది. మాటలు మనసును చంపే మారణాయుధాలుగా తోస్తున్నాయి. ఎన్నడూ లేనిది ఈ రోజు నాలో ఎందుకింత ఆవేశం. నాలుగు రోజుల క్రితం ఇంటి ముందు జరిగిన సంఘటన ఒక్కసారిగా కళ్లముందు మెదిలింది. ఆ రోజు ఏవో అరుపులు వినిపిస్తుంటే బయటకు వెళ్ళి చూశాను. ఎదురుగా శంకరం మాష్టారు వాళ్లబ్బాయి పై కోప్పడుతున్నారు. "ఎంత చెప్పినా మారవా.. నా కడుపున చెడ పుట్టావు కదరా.. పో బయటకు పో.." "ఇంకెప్పుడూ ఇలా చేయను నాన్న నన్ను క్షమించు" "ఇలా ఎన్నిసార్లు చెప్పి ఉంటావ్.! మళ్లీ మళ్లీ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు. నీ వల్ల రోజుకో సమస్య. నలుగురిలో పరువు పోతోంది. ఇంక నిన్ను భరించడం నా వల్ల కాదు" "నేను కావాలని చేయలేదు నాన్న. నాలో ఏదో లోపం ఉంది. నేనెందుకో ప్రత్యేకంగా అయిపోతున్నాను." "నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మారుమాట మాట్లాడకుండా తక్షణమే ఇంటి నుంచి వెళ్లిపో. నువ్వు చనిపోయావ్ అనుకుని నీళ్లు వదిలేసుకుంటాం." చుట్టుపక్కల ఎవరూ ఆ గొడవ ఆపడం లేదు. "వీడిలా ఉంటే ఏ తల్లిదండ్రులు మాత్రం భరిస్తారు" అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఖరికి కన్నతల్లి కూడా మౌనంగా ఉండిపోయింది. చేసేదేమీ లేక వాళ్ల బ్బాయ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. రెండు రోజులు గడిచాయి. శంకరం మాష్టారు మునుపటిలా ఉండట్లేదు. చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. దిగమింగలేని బాధ వలన ఆయన గొంతు కూడా సరిగా వినిపించడం లేదు. మాస్టార్ని మళ్లీ మామూలు మనిషిని చేయాలి. కానీ, ఎలా? నాకు ఎవరు సహకరిస్తారు.! ఈ నా అన్వేషణ సాగిస్తూ ఉండగానే కాలేజీలో 'లింగ వివక్షత' అనే అంశంపై వ్యక్తృత్వ పోటీ అని నోటీసు వచ్చింది. ఈరోజే పోటీ. ఇదే సరైన అవకాశం. పోటీ ప్రారంభం అయ్యింది. నా ప్రత్యర్థుల మాటలు లీలగా వినిపిస్తున్నాయ్. "అవనిలో సగం, ఆకాశంలో సగం. ఆ సగాన్ని హక్కుగా గుర్తించని ఈ పురుషాధిక్య సమాజం నానాటికి స్త్రీని బానిసగా చేసుకొని..." ఆవేశాన్ని అక్షరాలుగా మార్చాను. నా ఆలోచనలన్నీ ఒక వరుసలో కూర్చాను. నా వంతు రానే వచ్చింది. "సభాయ నమః, ఓం శ్రీ గురుభ్యోనమః. అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ మహిళా వివక్ష గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ, ఇలాంటి నినాదాలలో సైతం తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోలేక పోయిన వర్గం ఒకటి ఉంది. తమను ఈ సమాజం అంగీకరించదు అనే బలమైన ముద్రతో, తమ గుర్తింపునే దాచుకుంటున్న వర్గం. తమని తామే వెలివేసుకుంటున్న వర్గం. అత్యంత వివక్షకు గురవుతున్న వర్గం. అవనిలో భాగం ఆకాశంలో భాగం ఆ భాగాన్ని మనుషులుగానే గుర్తించని మానవ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనది మానవత్వం అని చెప్పుకుంటున్నాం. ఈ రోజు నా గొంతు గుర్తింపులేని, కనీసం గుర్తుకు కూడా రాని ఆ వర్గం తరపున వకాల్తా పుచ్చుకుంది. ఆ వర్గం పేరు LGBTTQQIAAP. షార్ట్ ఫార్మ్ లో ఎల్జిబిటి. మన భారతదేశంలోనే దాదాపు మూడు లక్షల మంది గే లు, అయిదు లక్షల మంది ట్రాన్స్ జెండర్లున్నారు. వారు డిజేబుల్డ్ కాదు. డిఫరెంట్లీ ఏబుల్డ్. ప్రతి దేశంలోనూ, ఆ దేశానికి పేరు తెచ్చిన హిజ్రాలున్నారు. మన దేశంలోని హిజ్రాలలో కూడా నటకిరీటిలున్నారు, నాట్యకారులున్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ఆఖరికి చట్టసభల్లో కూడా చర్చలు జరుపుతున్నారు. డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం గురించి, డీవ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతం గురించి నేర్చుకున్న విద్యార్థులు హార్మోన్ అసమతుల్యతని, పాయింట్ ఫైవ్ అని పిలుస్తున్నారు. మన విద్యకి అర్ధమేది! అర్ధనారీశ్వరున్ని పూజించే పెద్దలు కూడా హిజ్రాల శరీర తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నవారికి ఈ సంఘం తోడుగా ఉండలేకపోతోంది. కనిపించని నలుగురు ఏమనుకుంటారో అని, కని పెంచాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లల్ని వెలివేస్తున్న ఉదంతాలు వివక్షత ఏస్థాయిలో ఉందో చెప్పే ఉదాహరణలు. చివరిగా ఒక్కమాట. వారు ప్రత్యేకమైన వారు మాత్రమే.. పరాయివారు కాదు. మన తోటివారు, తోడబుట్టిన వారు. వారిని ఆహ్వానిద్దాం. అండగా నిలుద్దాం. గెలిపిద్దాం, కలిసి గెలుద్దాం." అని ముగించిన వెంటనే ఆ సెమినార్ హాల్ లో హర్షధ్వానాలు మారు మ్రోగాయి. మరో విద్యార్థిని పిలవబోతుంటే, శంకరం మాస్టారు మైక్ అడిగి తీసుకున్నారు. ఆయన కళ్లలో నీరు అక్కడున్న ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపిస్తోంది. "నా బిడ్డ ఒక హిజ్రా. ఏ మొహమాటం లేకుండా ఇలా ప్రకటిస్తున్నందుకు నన్ను చూసి నేను గర్వపడుతున్నాను. పరువు అనే భ్రమలో పడి, పేగుబంధాన్ని, ఆత్మ సాక్షిని చంపుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజే నా బిడ్డను కలుస్తాను. ఎవ్వరు ఏమనుకున్నా, న్యూరో సర్జన్ కావాలనుకునే తన కలని నేను నెరవేరుస్తాను." అంటూ నా వైపు తిరిగి "నా కళ్ళు తెరిపించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను" అంటూ నన్ను గుండెలకు హత్తుకున్నారు. రెట్టింపు అయిన కరతాళ ధ్వనుల మధ్య కూడా, ఆయన ఎద సవ్వడి నాకు స్పష్టంగా వినిపిస్తోంది.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ