ధరణీ కళ్యాణం - భాను శ్రీ తిరుమల

Dharanee kalyanam

"ఏవండీ! మీకే ఫోను" అంటూ సంధ్య పిలిచిన పిలుపుకు మెలుకువ వచ్చిన మనోహర్, "ఎవరో! ఇంత పొద్దున కాల్ చేసారు".. అంటుండగానే ఫోన్ అతని చేతికిచ్చి వంటిట్లోకి పారి పోయింది సంధ్య. అటునుంచి మధుసూధనరావు, ఆయన మనోహర్ వాళ్లకి దగ్గర బంధువు . "చెప్పండి బాబాయి ఏంటీ ఇంత పొద్దునే, ఏమైంది బాబాయి".. అంటూ కంగారుగా ఆడిగాడు మనోహర్. "ఏమీ లేదు మనోహర్ ,అంత గాబరా పడాల్సిన విషయమేమీ కాదు, పైగా ఆనందించ తగ్గ విషయమే.. మన ధరణి పెళ్లి గురించి మాట్లాడదామని..." "అదే ఆ గుంటూరు సంబంధం గురించి; నీకు ఇంతకు ముందు చెప్పాను కదా! అదే ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడని.. "మన అమ్మాయి వాళ్లకి చాలా బాగా నచ్చిందట, అబ్బాయి కూడా చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టు పట్టుకు కూచున్నాడట".. "అది సంగతి, నీ వెప్పుడు చెబితే అప్పుడు వాళ్లు మన ఇంటికి వస్తారట, ఒక రోజనుకుని నాకు కాల్ చేయ్ ,నేను వాళ్లకి చెబుతాను".. "సరే బాబాయ్ నేను త్వరలో మీకు కాల్ చేస్తానని చెప్పి మంచం దిగాడు మనోహర్. మనోహర్ విజయవాడలో ఓ ప్రముఖ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పని చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ఇప్పుడైతే విశాఖపట్నం లో సెటిల్ అయ్యాడు. మనోహర్ కి ఒక అబ్బాయి,ఒక అమ్మాయి. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి ధరణి వైజాగ్ లోనే ఉద్యోగం చేస్తుంది. ధరణికి చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయి, కానీ ఏదీ ఇంతవరకు ఫలవంతం కాలేదు. దానికి ఏవేవో కారణాలు. ఈ మధ్యనే మధుసూదన రావు కాల్ చేసి ఈ గుంటూరు సంబంధం గురించి చెప్పాడు. ఇరువైపులా పెద్దలు ప్రాధమికంగా మాట్లాడుకున్నారు, తరువాత కొంత కాలం, మంచి రోజులు లేవని తదుపరి కార్యక్రమాలు ఏమీ అనుకోలేదు. బహుశా! పెళ్లి కొడుకు వైపునుండి ఈ సంబంధం పట్ల మక్కువ ఉన్నట్టుంది. అందుకే మళ్లీ వాళ్లు కాల్ చేసారు మొత్తం మీద మధుసూధనరావు చొరవతో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని,విజయవాడలో ని ఓ పెద్ద స్టార్ హొటల్ లో నిశ్చితార్థం ఘనంగా జరిపారు. అదే రోజు పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టుకున్నారు. అన్నీ బాగున్నాయి అనుకుంటూ ఉంటే వియ్యంకుల వారి వైపు నుండి ఓ డిమాండ్. అది ఏంటంటే పెళ్లి మాత్రం విజయవాడ లోని తామనుకున్న ఓ ప్రముఖ స్టార్ హొటల్ లోనే తామే జరిపిస్తామని. ఆ హొటల్ పేరు వినగానే మనోహర్ గుండెల్లో రాయి పడింది. ఓ చేదు జ్ఞాపకం మళ్లీ పలకరించనట్టనిపించింది. అది చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, వారితో ఓ అపరాద భావనని వదిలి వెళ్లిన సంఘటన. బహుషా ఓ తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ చేదు అనుభవం. మనోహర్ విజయవాడలో పని చేస్తున్నప్పుడు ప్రతిరోజు కాకపోయినా వారాంతాలలో క్రమం తప్పకుండా ఓ ప్రముఖ స్టార్ హొటల్ కి కుటుంబంతో సహా లంచ్ కో డిన్నర్ కో వెల్తూ ఉండే వాడు. అక్కడి సిబ్బంది అతనిని గానీ, కుటుంబ సభ్యులనిగానీ ఎప్పుడూ సాదరంగా రిసీవ్ చేసుకునేవారు. రెస్టారెంట్ ఎంత బిజీగా ఉన్నప్పటికి ఆయనకి తప్పక టేబుల్ ఏర్పాటు చేసేవారు. అందుకే మనోహర్ కుటుంబానికి ఆ హొటలన్నా, రెస్టారెంట్ అన్నా అక్కడి సిబ్బంది అన్నా చాలా ఇష్టం. ఒక సారి మనోహర్ ఎవరో పారేసుకున్న మనీ పర్సు వాష్ రూమ్ లో దొరికితే మేనేజ్మెంట్ కి అందజేసాడు. ఇలా చాలా సంఘటనలే ఉన్నాయి అతని ఇమేజ్ పెరగటానికి. ఆ హొటల్లో అతనిని చాలా ఆదరించే వారు, వెరీ రెగ్యులర్ & వి ఐ పి గా ట్రీట్ చేసేవారు. అటుపైన చాలా సార్లు ఆ హొటల్ కి కుటంబంతో వెళ్లి వచ్చేవాడు. అలాగే ఓ రోజు వాళ్ల పాప ధరణి పదిహేనవ పుట్టిన రోజు సందర్భంగా ఆ హొటల్ రెస్టారెంట్ లో లంచ్ ముగించుకుని భార్య సంధ్య, పాప ధరణిలతో లిఫ్టు కోసం వెయిట్ చేస్తుండగా,ఇంకో జంట వారి పక్కన నిలుచున్నారు. అందరూ కలిసి క్రిందికి వచ్చిన తరువాత ఆ జంటలోని పురుషుడు దేని గురించో నేల పైనా చుట్టూ వెదకుతున్నాడు. హొటల్ సిబ్బంది వచ్చి ఏమైందని అడిగుతున్నారు. అతను ఏదో వస్తువు పడిపోయిందని చెబుతున్నాడు. సిబ్బంది కూడా వెదకటం ప్రారంభించారు. వాళ్లని గమనిస్తూ మనోహార్ వాళ్లు తమ కారువైపు నడిచారు. కారులో ధరణి,సంధ్య ముభావంగా ఉండటం గమనించాడుమనోహర్, ఏం డల్ గా ఉన్నారు అని అడిగితే ఏం లేదన్నారు వారు. ఇంటికి చేరిన ఓ గంట తరువాత మనోహర్ కి ఆ హోటల్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మనోహర్ కి చాలా కాలంగా తెలిసిన వ్యక్తే. "సార్ నమస్తే , మీకిది ఎలా చెప్పాలో తెలియటం లేదు, వేరే గెస్ట్ ది ఓ ఉంగరం మిస్సయింది, మేము అన్నిచోట్ల వెదికాం సార్,కానీ ఎక్కడా దొరకలేదు" చెప్పాడు హొటల్ ప్రతినిధి. "ఔనా! ఇంతకీ నా కెందుకు కాల్ చేసినట్టు"? "అదే సార్ మేము అంతటా వెదికాము, చివరికి సి.సి ఫూటేజ్ చెక్ చేస్తే ఆ రింగు మీ అమ్మాయి నేలమీది నుంచి తీసినట్టుంది, అందుకని".. అంటూ నసిగాడు. "అవునా "! మనోహర్ గొంతులోంచి మాట సరిగా రావటంలేదు. "సారీ, ఇప్పుడే మీకు కాల్ చేస్తాను" అని ఫోన్ కట్ చేసాడు. కోపాన్ని దిగమింగు కొని కూతురుని పిలిచి అడిగితే అవును డాడీ దొరికింది, కానీ క్రింద పడి ఉంది కదా అని తీసుకొచ్చేసాను అని నీళ్లు నమిలింది. తమాయించుకుని "మరి వాళ్లు వెదుకుతున్నప్పుడైనా ఇచ్చేయాల్సింది కదే"... "అంటే అప్పుడు ఇస్తే మన గురించి తప్పుగా అనుకుంటారేమోనని ఇవ్వలేదు డాడీ, సారీ డాడీ "అంటూ బోరున ఏడ్చేసింది. ధరణి ఎడవగానే మనహర్ సానుభూతితో తనని దగ్గరకు తీసుకోని ఓదారుస్తూ.. "సరే నేను వాళ్లతో మాట్లాడి మన డ్రైవర్ తో ఉంగరం పంపించేస్తాను, ఇటువంటి తప్పులు ఇంకెప్పుడూ చేయకు, ఇది వాళ్లకు తెలిసింది కాబట్టి ఉంగరం వెనక్కి ఇచ్చేస్తున్నాం , లేక పోతే నీవు ఎదుగుతున్న కొద్ది ఆ అపరాధ భావన నీతోనే పెరుగుతూ ఉండేది". మనోహర్ ఆ ఉంగరాన్ని డ్రైవర్ తో పంపించి, హొటల్ ప్రతినిధి కి సారి చెప్పాడు. "ఫరవాలేదు సార్, ఇది మన ఇద్దరి మధ్యే ఉంటుంది, ఈ విషయం మా సిబ్బందికి కూడా ఎవరికీ తెలియదు, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి నేను డీల్ చేసాను. మీరు మునుపటిలానే మన హొటల్ కి రావచ్చు,దయచేసి అసౌకర్యం ఫీలవ్వద్దు".. అని ఆయనేదో చెబుతూనే ఉన్నాడు. మనోహర్ అన్యమనస్కంగానే హొటల్ ప్రతినిధి కి మరొక్కసారి క్షమాపణలు అడిగి ఉంటాను సార్ అని ఫోన్ కట్ చేసేసాడు. ఆ తరువాత మనోహర్ మనసులో అపరాధ భావన వలన ఆ హోటల్ కి వెళ్లడం మనేసాడు. వియ్యాల వారేమో పెళ్లి ఇప్పుడు అదే హొటల్లో అంటున్నారు. అయినా తప్పేదేముంది అనుకున్నా, చివరి ప్రయత్నంగా మధుసూధనరావు కి కాల్ చేసి "బాబాయ్ ధరణి పెళ్లి ఇంకో పెద్ద హొటల్లో అయితే బాగుంటుందని నా ఉద్దేశ్యం, ఆ విషయం మీరు వియ్యంకుల వారికి చెప్పి చూడండి ఒప్పించడానికి ప్రయత్నించండి . పైగా నేనంటున్న ఆ హొటల్లో నాకు బాగా తెలిసిన వారు కూడా ఉన్నారు, కావలంటే నేను మాట్లాడి అన్నీ ఏర్పాటుచేస్తాను"అన్నాడు. దానికి మధుసూధన రావు మధ్యలోనే కల్పించుకుంటూ "లేదు మనోహర్, వాళ్లకి ఆ హొటలంటే ఓ సెంటిమెంట్ ఉందిట. మీ అల్లుడి ముగ్గురు అన్నదమ్ముల్ల,అక్కచెల్లెల్ల కి సంబంధించి అన్ని శుభకార్యాలు అక్కడే జరిపారట, నిశ్చితార్థం అంటే నీవు జరిపించావు కాబట్టి అది నీ ఇష్టానికి వదిలేసారు, పెళ్లి మాత్రం అక్కడే జరుగుతుంది... అయినా నీకున్న ఇబ్బంది ఏమిటో నాకర్థం కావట్లేదు".. అన్నాడు మధుసూధనరావు. "సరే బాబాయి,నాకేమీ ఇబ్బంది లేదు అలాగే కానిద్దాం".. దారాన్ని తెగే దాక లాగడం ఎందుకని మనోహార్ ఆ విషయం అక్కడితో వదిలేసాడు. అన్ని ఏర్పాట్లు వియ్యాలవారే చూసుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అదే హొటల్లో కొన్ని గదులు కూడా బుక్ చేసుకున్నారు. మనోహర్ వాళ్లు చాలా రోజుల తరువాత ఆ హొటలికి వచ్చారు. చాలా మారిపోయింది, ఆధునికత ఉట్టిపడుతోంది. సిబ్బంది లో తెలిసిన మొహం ఒక్కటి కనిపించలేదు. తాను భయపడ్తున్నట్టు తమని ఎవరూ గుర్తు పట్టే అవకాశమే లేదు. అందరూ ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్నారు. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ,హడావిడిగా జరుగుతున్నాయి. ఇన్నేల్లుగా తమను వెంటాడిన ఓ అపరాధ భావపు మూలాలను తరచి చూసి, అక్కడ,తాము భయపడినంత ఏమీ జరగనందుకు, మనోహర్,ధరణి,సంధ్యల మొహాలపైన ఓ మందహాసం మెరిసింది. పెళ్లి ఘనంగా జరిగింది. బహుశా ఆ జంటకి పాపో,బాబో పుడితే బారసాల చేయడానికి మళ్లీ ఆ హోటల్ కే రావచ్చు. ఎందుకంటే ఆ ఇరు కుటుంబాలకి ఆ హోటల్ అంటే అంత ఇష్టం మరి !

మరిన్ని కథలు

podupu mantram
పొదుపు మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Jnapakala dontara
‘జ్ఞాపకాల దొంతర’
- మద్దూరి నరసింహమూర్తి
O satya katha
ఓ సత్య కథ
- తటవర్తి భద్రిరాజు
Safari kooli
సఫారీ కూలీ
- మద్దూరి నరసింహమూర్తి
Anoohyam
అనూహ్యం
- మూల వీరేశ్వర రావు
Food delivery
ఫుడ్ డెలివరీ
- మద్దూరి నరసింహమూర్తి
Naagateerdham
నాగ తీర్థం. (పురాణ గాథలు)
- కందుల నాగేశ్వరరావు
Kallu
కళ్ళు
- Moola Veereswara Rao