వసంతం - VEMPARALA DURGA PRASAD

Vasantam

వైజాగ్ రైల్వే స్టేషన్ కోలాహలంగా వుంది. హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ కదలడానికి సిద్ధంగా వుంది. పరుగు పరుగున వచ్చి రైలెక్కింది సుచిత్ర. ఎదురు బెర్త్ మీద ఒక 20 సంవత్సరాల కుర్రవాడు మొబైల్ చూసుకుంటున్నాడు.

బండి కదిలింది. స్టేషన్ దాటిపోతూంటే ఒక సారి స్టేషన్ ని, వెళ్లిపోతున్న platform ని చూస్తూ మళ్ళీ విశాఖపట్నం ఎప్పుడు చూస్తానో అనుకుంది. గతస్మృతులు ఆమెని వెంటాడుతున్నాయి. 15 సంవత్సరాల కి పూర్వం ఇదే స్టేషన్ లో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి, తాను, నితిన్ లు ముంబై వెళ్లి పోయారు. ఆనాటి విషయాలు గుర్తుకు వచ్చేయి.

సుచిత్ర బి.టెక్ చదువుతున్నప్పుడు కాలేజీ లో తన క్లాసుమేట్ నితిన్ ని ప్రేమించింది.వాళ్లిద్దరూ చదువులు పూర్తి అయ్యి, వాళ్ళిద్దరిలో ఎవరికి వుద్యోగం వచ్చినా వెంటనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.

నితిన్ ఒక అనాధ. అతను ఒక దాత సహాయంతో హాస్టల్ లో ఉండి చదువుకునే వాడు. అందువల్ల అతని నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ సుచిత్ర ఇంట్లో ఒప్పుకోలేదు. సుచిత్ర ఫామిలీ ని ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేడు నితిన్. అలాగే సుచిత్ర కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చెయ్యని ప్రయత్నం లేదు.

ఇంట్లో సుచిత్ర మీద అనేక ఆంక్షలు పెట్టేరు. చివరికి సెల్ ఫోన్ కూడా లాక్కున్నారు.

డిగ్రీ అవగానే, నితిన్ కి ముంబై లో వుద్యోగం వచ్చింది. సుచిత్ర కి హైదరాబాద్ లో వుద్యోగం వచ్చినా తండ్రి సుధాకర్ ఆమెని జాయిన్ అవ్వనివ్వలేదు. ఆమెని బాగా కట్టడి చేసేడు, ఆమెకి సంబంధాలు చూడడం మొదలు పెట్టేడు.

నితిన్ ముంబై లో వుద్యోగం లో చేరేక వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అంతా స్నేహితురాలు అలేఖ్య ద్వారానే. కొన్నాళ్ళు వ్యూహాత్మకంగా సైలెంట్ గా వున్నారు ఇద్దరూ. రాకపోకలు లేకపోవడం తో అంతా సుచిత్ర నితిన్ ని మర్చిపోయింది అనుకున్నారు. పైగా సెల్ ఫోన్ లేదు తన వద్ద.

అనుకోకుండా వచ్చింది అవకాశం. ఆ ఆదివారం ఇంట్లో వాళ్ళు అందరూ పెళ్లి కి వెళ్తున్నారని 2 రోజుల ముందు తెలిసింది. సుచిత్రని పెళ్ళికి కూడా తీసుకు వెళ్లడం ఇష్టం లేదు ఆమె తండ్రి కి. ఆమెకి కాపలాగా పనిమనిషి రంగిని, ఆమె భర్త ని ఉంచుతారని తెలిసింది.

ఆదివారం రాత్రి 9.30 కి నితిన్ సుచిత్ర వాళ్ళ ఇంటి వెనుకకు చేరుకోవడం జరిగింది. స్నేహితుడి మోటార్ సైకిల్ పట్టుకుని వచ్చేడు అతను.

రంగి, ఆమె భర్త ముందు హాలు లో వున్నారు. అదను చూసి, కట్టు బట్టలతో వెనుక తలుపు తీసుకుని బయటకి వచ్చింది సుచిత్ర. ఆమెని తీసుకుని స్టేషన్ కి వెళ్లి కోణార్క్ ఎక్ష్ప్రెస్స్ లో ముంబై వెళ్లి పోయారు. రంగి గమనించే లోపే వాళ్ళు వూరు దాటేసారు.

తర్వాత అలేఖ్య ద్వారా కొన్ని విషయాలు తెలిసేయి. తండ్రి సుధాకర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పాలీసులు పెద్దగా పట్టించుకోలేదు. MAJORS కదా, పెళ్లి చేసుకోవడానికి వెళ్లి పోయి వుంటారు , వెతుకుతాము లెండి అని లైట్ గా తీసుకున్నారట. తండ్రికి తమ ఆచూకీ తెలియకూడదని సుచిత్ర కూడా ఒక ఏడాది కామ్ గా వుంది. తర్వాత, కన్న వాళ్ళని కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కొంత కాలం గడిస్తే కోపాలు తగ్గుతాయి, ఈ లోపల సమస్యలు పెంచుకోవడం ఎందుకు అని, ఊరుకుంది. ఒక ఏడాది తర్వాత ఒక సారి విశాఖపట్నం వచ్చింది భర్త తో. ఇంటికి వెళ్లకుండా, అలేఖ్య ని కలుసుకుంది. అలేఖ్య ద్వారా విషయాలు తెలిసేయి.

సుచిత్ర తండ్రి కూతురు లేచి పోవడం అవమానంగా భావించి, TRANSFER చేయించుకుని హైదరాబాద్ వెళ్లి పోయాడుట. అతని అడ్రస్ ఎవరికీ తెలియదు.

సుచిత్రకి తండ్రి ఆచూకీ ఆనాటి నుండి తెలియకుండా పోయింది. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోంది, బహుశా నెంబర్ మార్చేసుకున్నాడేమో. తండ్రి పట్టుదల తెలిసిన సుచిత్ర ఇంకా ఏ ప్రయత్నాలు చేయలేదు. ఒక వేళ తండ్రి ఎదురయినా, తనని ఆదరించడని అర్ధం అయింది. తల్లి వరలక్ష్మి తండ్రి ని ఎదిరించలేదు. కూతురు కోసం ఆమె యెంత కుమిలిపోతుందో తెలుసు. ఆమె నిస్సహాయురాలు. అన్న పవన్ సంగతి తెలుసు సుచిత్ర కి . పవన్ తండ్రిని మరింత రెచ్చ గొట్టే రకం. వదిన రాధ అంతగా కల్పించుకోదు.

అలేఖ్య కి కూడా చెప్పి ఉంచింది, ఏదో విధంగా తన తండ్రి ఆచూకీ కనిపెట్టమని. కానీ అలేఖ్య చేసిన ప్రయత్నాలు కూడా వృధా అయ్యేయి... కారణం, హైదరాబాద్ ఆఫీస్ లో తెలిసిన విషయం ఏమిటంటే సుధాకర్ హైదరాబాద్ లో కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడట.

సుచిత్ర రెండు తెలుగు రాష్ట్రాల వైపు ఎప్పుడు వచ్చినా ఆమె కళ్ళు అయిన వారిని వెతకటం మానవు. తెలిసిన వారెవరయినా కనపడితే కనీసం తల్లి దండ్రుల బాగోగులు అయిన తెలుస్తాయని తహ తహ లాడుతుంది.

ఆలోచనలలో వున్న సుచిత్ర ఎవరో పిలుస్తుంటే ఉలిక్కి పడింది.

ఎదురు బెర్త్ మీద వున్న అబ్బాయి " MADAM డిన్నర్ చేస్తాను, మీ బాగ్ ఒక్క సారి కింద పెడతారా? అని అడుగుతున్నాడు.

సైడ్ టేబుల్ మీద వున్న తన బాగ్ తీసింది సుచిత్ర.

అప్పుడు ఆ అబ్బాయిని పరిశీలనగా చూసింది. ఆ అబ్బాయిని చూస్తే, తన అన్నయ్యని చూసినట్లే వుంది. అన్నయ్య చిన్నప్పుడు ఇలాగే వుండే వాడు. తాను ఇంట్లోంచి వెళ్లి పోయినప్పుడు అన్నయ్య కొడుకు భరత్ వయసు 5 సంవత్సరాలు. "కొంపతీసి ఈ అబ్బాయి అన్నయ్య కొడుకు కాదు కదా " అనుకుంది.

ఈ ఆలోచన రావడం తో ఆమె చాలా ఉద్విగ్నతకు లోనయ్యింది. ఇంక ఆ అబ్బాయి ప్రతి కదలిక కూడా పరిశీలించడం మొదలు పెట్టింది.

అతనికి ఇంతలో ఫోన్ వచ్చింది. మాట్లాడుతున్నాడు.

" చెప్పు తాతయ్యా! నేను సౌకర్యంగానే వున్నాను. భోజనం చేస్తున్నాను. మరో గంటలో పడుకుంటాను "

"మీకు భోజనం ఆర్డర్ పెట్టెను, వచ్చింది కదా"

అటునుండి వచ్చింది అన్నట్లున్నారు...

"సరే అయితే, మీరు కూడా తినేసి పడుకోండి. నేను సికింద్రాబాద్ స్టేషన్ రాగానే, మీ కోచ్ దగ్గరికి వస్తాను...“మీరు, నానమ్మ రైలు దిగి అక్కడే వుండండి " అన్నాడు.

ఇంక ఆపుకోలేక పోయింది సుచిత్ర. సంభాషణ మొదలు పెట్టింది ఆ అబ్బాయి తో.

నీ పేరేమిటి బాబు?

"భరత్ అండీ"

ఉలిక్కి పడింది సుచిత్ర.

ఉద్వేగంగా అడిగింది. నువ్వు ఒక్కడివే నా...ఈ రైల్లో ఇంకెవరయినా వున్నారా ?

మా నానమ్మ, తాతయ్య లకి S-9 లో వచ్చేయి బెర్త్ లు. నాకిక్కడ వచ్చింది. S-9 నుండి ఎవరూ ఇటు రావడానికి ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళక్కడ, నేనిక్కడ... వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ పెట్టేసేను. తిని పడుకుంటారు. నేను సికింద్రాబాద్ రాగానే వెళ్లి వాళ్ళని పిక్ అప్ చేసుకుని కలిసి ఇంటికి వెళ్తాము " అన్నాడు.

మీ తాతగారి పేరు?

"సుధాకర్", మా నానమ్మ పేరు "వరలక్ష్మి"... నానమ్మ పేరు అడగకుండానే చెప్పేసాడు భరత్.

సుచిత్ర మనసు ఉప్పొంగి పోయింది. సందేహం లేదు, ఈ అబ్బాయి తన మేనల్లుడే. S-9 లో వున్నది తన తల్లి, తండ్రి.

అతన్ని ఫాలో అయితే, సికింద్రాబాద్ స్టేషన్ లో తల్లి ని, తండ్రిని వెనుక నుండయినా దగ్గరగా చూడచ్చు అనుకుంది.

మీరు హైదరాబాద్ లో ఎక్కడ వుంటారు ?

" మౌలాలి అండీ " అన్నాడు. అవునా, మాది కమలాపూర్, మౌలాలి పక్కనే, 1 KM ఉంటుంది. మీ అడ్రస్ ఇవ్వు బాబు.. అని సుచిత్ర అబధం ఆడింది. నిజానికి ఆమె కమలాపూర్ లో రెలిటివ్స్ ఇంటికి ఫంక్షన్ కె వెళ్తోంది. వైజాగ్ లో స్నేహితురాలి ఇంట్లో ఫంక్షన్ చూసుకుని, అట్నుంచి హైదరాబాద్ లో ఫంక్షన్ అటెండ్ అయ్యి, తిరిగి ముంబై వెళ్ళిపోవాలి.. అదీ ఆమె షెడ్యూల్.

అడ్రస్ తన ఫోన్ నెంబర్ కి ఫార్వర్డ్ చేయించుకుంది. ఇప్పుడు ఆమె వద్ద మేనల్లుడి ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా వున్నాయి.

సుచిత్ర మనసు గాల్లో తేలిపోతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన తల్లిని తండ్రిని చూస్తుందన్న మాట.

ఎప్పుడెప్పుడు రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుతుందా అని EXCITING గా వుంది ఆమెకి. తెల్లవారక ముందే లేచి కూర్చుని బ్రష్ చేసేసుకుని, బాగ్ సర్దుకుని, రెడీ గా కూర్చుంది. స్టేషన్ రావడానికి 15 నిముషాల ముందే భరత్ కూడా లేచి బ్రష్ చేసుకుని రెడీ అయిపోయాడు.

" గుడ్ మార్నింగ్ మేడం " పలకరింపుగా అన్నాడు.

"గుడ్ మార్నింగ్" అని నవ్వింది.

స్టేషన్ వచ్చింది ఇంతలో. దిగి వెళ్తూ, వస్తానండి అని వీడ్కోలు చెప్పేడు.

ఓకే .. అంది.

గబా గబా అతని వెనుకే వెళ్ళింది సుచిత్ర.

S-9 సమీపిస్తూంటే తీవ్రమయిన ఎమోషన్స్ కి లోనవు తోంది సుచిత్ర.

దూరంగా తండ్రి సుధాకర్ , తల్లి వరలక్ష్మి బెంచ్ మీద కూర్చుని వున్నారు.

భరత్ వాళ్ళని చేరుతూ " మీ 2 బ్యాగు లు దింపేసుకున్నారా." అన్నాడు.

" మేము దింపేసుకున్నాం గానీ, ఎందుకో మీ తాతయ్య లేచిన దగ్గర్నుంచీ నీరసంగా వున్నారు రా" అంటోంది వరలక్ష్మి.

స్తంభం చాటు నుండి గమనిస్తోన్న సుచిత్ర కి తల్లికి ఎదురుగా వెళ్లాలని అనిపిస్తోంది.

ఇంతలో సడన్ గా బెంచి మీద నుండి కిందకి పడిపోయాడు సుధాకర్

గుండె మీద చెయ్యి పెట్టుకుని పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు.

ఈ ఈ సంఘటనకి వరలక్ష్మి, భరత్... షాక్ అయ్యేరు.

స్థంభం చాటు నుండి చూస్తున్న సుచిత్ర ఇంక ఆపుకోలేక పోయింది. తల్లి ముందుకు వచ్చేసింది.

వరలక్ష్మి నిర్ఘాంత పోయింది. ఒక పక్క భర్త కూలిపోయాడు, స్పృహ లేదు. ఈ సమయంలో కూతురు హఠాత్తుగా కనపడింది. ఆమె కి మాట పెగల లేదు. దీనంగా వుంది ఆమె పరిస్థితి. నెమ్మదిగా ఆమె కూడా స్పృహ కోల్పోతోంది.

భరత్ కాల్ చేయడం తో అంబులెన్సు వచ్చింది.

బాబూ! కేర్ హాస్పిటల్ కి తీసుకుని పద, నేను మీతో వస్తాను అని, తల్లిని పొదివి పట్టుకుంది సుచిత్ర. అతనికి ఏమీ అర్ధం కావట్లేదు. కానీ, ఆమె తనకి సాయంగా వస్తున్నట్లు అర్ధం అయ్యింది. సరే మీరు నానమ్మని పట్టుకోండి అన్నాడు, తాను తాతయ్యని పట్టుకుని. అంబులెన్సు లోకి చేర్చేరు ఇద్దర్నీ. సుధాకర్ కి ఆక్సిజెన్ పెట్టేరు. వరలక్ష్మి కి నెమ్మదిగా ఉపచర్యలు చేసేసరికి, స్పృహ వచ్చింది.

కళ్ళ తోనే పలకరించుకున్నారు తల్లీ కూతుళ్లు. ముందు తండ్రి ఆరోగ్యం పై తల్లడిల్లి పోతున్నారు. కేర్ హాస్పిటల్ కి చేరేక, సుధాకర్ ని క్యాజువాల్టీ లో చేర్చి అన్ని పరీక్షలు చేసేరు. ఒక ఇంజక్షన్ ఇచ్చేరు. హార్ట్ ఎటాక్ అని చెప్పేరు. ట్రీట్మెంట్ మొదలు పెట్టేరు.

కొడుకు ఫోన్ చేయడం తో, పవన్, రాధ లు హాస్పిటల్ కి చేరుకున్నారు.

పవన్ చెల్లిని అక్కడ చూసి ఆశ్చర్య పోయేడు. విషయం అడిగి తెలుసుకున్నాడు.

సుచిత్ర ముందే చెప్పింది. “తండ్రికి తన రాక చెప్పవద్దు” అంది. ఈ పరిస్థితి లో ఆయన ఆవేశానికి లోనవ్వకూడదు అనుకుంది.

ఓ గంటకి సుధాకర్ కి తెలివొచ్చింది. భార్య, మనవడు, కొడుకు కోడల్ని చూసి కళ్ళ తోనే పలకరించేడు. ఆయన మాట్లాడే స్థితి లో లేడు.

“నాన్నా, నీకు స్ట్రోక్ లాగ వచ్చింది. హాస్పిటల్ కి వెంటనే తీసుకుని రావడం తో ప్రమాదం తప్పింది. ఓ 4 రోజులు ఉంటే, పూర్తిగా తగ్గిపోతుంది, ఇంటికి వెళ్లి పోతాము " అనునయంగా చెప్పేడు పవన్.

ఆయన తలాడించి కళ్ళు మూసుకుని పడుకున్నారు.

డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఆయనకి వెంటనే బై పాస్ ఆపరేషన్ చెయ్యాలిట. మరునాడు పొద్దున్నే 4 పాకెట్స్ FRESH బ్లడ్ అవసరం అన్నారు డాక్టర్లు. డోనార్స్ ని ARRANGE చేసుకోమన్నారు.

పవన్, భరత్ లు బ్లడ్ ఇవ్వడానికి రెడీ అయ్యేరు. రాత్రి కి భర్తని ముంబై నుండి రప్పించింది. అతనిది, సుచిత్ర దీ కూడా బి పాజిటివ్ బ్లడ్ GROUP అవడం తో, వాళ్ళు కూడా బ్లడ్ ఇచ్చేరు. కానీ తండ్రి కి తమ రాక తెలియకుండా జాగ్రత్త పడ్డారు. హోటల్ లో రూమ్ తీసుకుని వున్నారు.

సుచిత్ర కి ఇన్నాళ్ళకి తండ్రి, తల్లి ని చూసిన ఆనందం ముందు ఇంకేమీ కనపడ్డం లెదు. నితిన్ కి సుచిత్ర కళ్ళల్లో పూర్తి సంతోషం, సంతృప్తి కనిపిస్తున్నాయి.

వరలక్ష్మి కి భర్త అనారోగ్యం గురించి బెంగగా వున్నా, సమయానికి కూతురు, అల్లుడు కూడా దగ్గర చేరడం ధైర్యం గా వుంది.

ఆపరేషన్ SUCCESSFUL గా జరిగింది. తండ్రి కోలుకుంటున్నాడని తెలుసుకుని, తృప్తిగా ముంబై, వెళ్లి పోయారు సుచిత్ర, నితిన్ లు.

నెల గడిచింది. అన్ని విషయాలు ఫోన్ లో తెలుస్తున్నాయి సుచిత్ర కి.

ఆ రోజు ఉదయాన్నే భరత్ నుండి ఫోన్ కాల్ వచ్చింది.

"భరత్! " తాతయ్యకి ఎలా ఉందిరా " అంది.

"భరత్ కాదమ్మా, నేను సుధాకర్ ని, నీ తండ్రిని తల్లీ... అన్ని విషయాలు తెలిశాయమ్మా, నీ రాక తో నా ప్రాణాలు నిలబడ్డాయని భరత్, మీ అమ్మ చెప్పేరు".. అటువైపు తండ్రి గొంతు.

సుచిత్ర కి నోట మాట రావట్లేదు. కళ్ళు వర్షిస్తున్నాయి.

"నాన్న" నిన్ను బాధ పెట్టెను .. క్షమించు అంది.

" జరిగినవి అన్నీ మర్చి పోయి, నీ తండ్రిని క్షమించు బంగారూ"...

"నువ్వు అల్లుడు గారు ఒక సారి ఇక్కడికి రండమ్మా, మిమ్మల్ని చూడాలని వుంది" అన్నాడు సుధాకర్.

"ఈ రోజే మీ అల్లుడుగారు, నేను బయలు దేరి ఫ్లైట్ లో వస్తాం నాన్నా అంది".

ఆమె మనసు ఆనందం తో తేలిపోతోంది.

మీరు వస్తే మన కుటుంబానికి "వసంతం " తిరిగి వచినట్లేనమ్మా!

ఎదురు చూస్తూ వుంటాను.. అని తృప్తిగా నిట్టూర్చేడు సుధాకర్.

***END***

మరిన్ని కథలు

Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ
Kathalo daagina katha
కథలో దాగిన కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neeve naa mantri
నీవే నామంత్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poola danda
పూలదండ
- ప్రమీల రవి
STREE
స్త్రీ
- chitti venkata subba Rao
Goddalupettu
గొడ్డలిపెట్టు (జాతీయం కథ)
- కాశీవిశ్వనాధం పట్రాయుడు