నాగ తీర్థం. (పురాణ గాథలు) - కందుల నాగేశ్వరరావు

Naagateerdham

నాగ తీర్థం

(పురాణ గాథలు)

పూర్వం శూరసేనుడు అనే చంద్రవంశపురాజు ప్రతిష్ఠానపురం రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. బుద్ధిమంతుడైన ఆ రాజు ప్రజలను తన కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ చంద్రవంశానికి కీర్తి తీసుకు వచ్చాడు. ఎన్నో ఏళ్ళు గడిచినా రాజదంపతులకు సంతానం కలుగ లేదు. తన తరువాత రాజ్యపాలన చేయడానికి వంశాంకురం లేకపోవడం మహారాజుకి తీరని బాధగా ఉండేది. పురోహితుల సలహాపై ధర్మపత్నితో కలిసి ఎన్నో పూజలు, వ్రతాలు ఆచరించాడు. వాటి ఫలితంగా కొంతకాలానికి రాణి గర్భం ధరించింది. కాని కర్మవశాత్తు ఆమె ఒక సర్పకుమారునికి జన్మ నిచ్చింది.

కుమారుని సంగతి కొద్దిమంది విశ్వాసపాత్రులైన సేవకులకు తప్ప మరెవ్వరికీ తెలియనీయకుండా ఆ రాజదంపతులు అతి రహస్యంగా పెంచసాగారు. ఇటువంటి పుత్రుడికి జన్మ ఇచ్చేకంటే సంతానం లేకుండా ఉంటేనే బాగుండేది అని ఆ దంపతులు తమలో తాము బాధపడుతూ ఉండేవారు.

అలా కొంత కాలం గడిచింది. ఆ సర్పకుమారుడు పెరిగి భయంకరమైన విషసర్పంగా తయారయ్యి మనుష్యుల వలె మాట్లాడడం మొదలెట్టాడు. తమ కుమారుడి ఈ చిత్రమైన జన్మకు కారణమేమిటా అని రాజు విచారించ సాగారు.

ఇలా ఉండగా ఒకనాడు ఆ సర్పకుమారుడు తండ్రితో “జనకా! రాజకుమారుడైన నాకు శాస్త్రోక్తంగా ఉపనయనం గావించి వేదాధ్యయనం చేయించండి. శాస్త్రధర్మాలు పాటించని వారు శూద్ర సమాను లవుతారు” అని ధర్మసూత్రాలు చెప్పాడు. శూరసేనుడు కుమారుని కోరిక ప్రకారం పురోహితులను రప్పించి ఉపనయనం గావించాడు. ఒక గొప్ప పండితునితో వేదాధ్యయనం చేయించాడు. రాకుమారుడు యుక్తవయస్సు వచ్చేసరికి అమితమైన దీక్షతో విద్యాభ్యాసం పూర్తి చేసాడు.

ఒకనాడు ఆ సర్పము “తండ్రీ! నేను పెద్దవాడి నయ్యాను. నా విద్యాభ్యాసం పూర్తయింది. తన కుమారుడికి వేదాలలో చెప్పిన సంస్కారాలన్నీ చెయ్యని తండ్రికి నరకం ప్రాప్తిస్తుంది. అందుకని నాకు వివాహం చెయ్యండి” అని చెప్పాడు.

మహారాజు రాకుమారుని మాటలకు ఆశ్చర్యపోయాడు. అప్పటికి తప్పించుకోవాలనే ఉద్దేశంతో “నా పేరు విన్నంత మాత్రాన మహావీరులు కూడా భయపడతారు. అటువంటప్పుడు నీ కుమారునికి మా కన్యను దానం చేస్తామని ధైర్యంగా ఎవరు నా ముందుకు వస్తారు?” అన్నాడు.

సర్పకుమారుడు ఆ మాటలు ఆలకించి “తండ్రీ! వివాహాలు పలురకాలు ఉంటాయి. అందులో రాజులకు తమ శస్త్రభుజ బలాలను ప్రకటించి కన్యను అపహరించి పరిణయమాడడం అన్నిటి కంటే ఉత్తమమైన మార్గం. పుత్రునకు వివాహం చేసేవరకు తండ్రి జీవితం సఫలమైనట్లుకాదు. అందు వలన మీరు ఏ ఉపాయం చేసైనా నాకు వివాహం చేయండి. లేనిచో నేను గోదావరిలో మునిగి నా జీవితాన్ని ముగిస్తాను” అని చెప్పాడు.

మహారాజు కుమారుని దృఢసంకల్పం గ్రహించి తన మంత్రులను పిలిచి ఇలా చెప్పాడు. “యువరాజు నాగేశ్వరుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. అస్త్రశస్త్రవిద్యలలోను భుజబలంలోను నేర్పరి. నేను పెద్దవాడినయ్యాను. వానికి వివాహం జరిపించి పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించాను. మీరు యువరాజుకు తగిన సద్గుణవతి సౌందర్యవతియైన కన్య గురించి సమాచారం సేకరించి నాకు తెలపండి”. రాజు వారికి తన కుమారుడు సర్పమూర్తి అనే విషయం తెలియపర్చలేదు..

అప్పుడు మంత్రులు “మహారాజా! మీరు అసమాన పరాక్రమవంతులు. మీ కీర్తి ప్రతిష్ఠలు తెలియని రాజులు ఈ భూమండలంలోనే లేరు. మీ కుమారుని వివాహము గురించి ఇంత ఆలోచన దేనికి?” అన్నారు. ఇంతలో రాజకుటుంబం అంటే ఎంతో అభిమానం ఉన్న ఒక వృద్ధమంత్రి “మహాప్రభూ! తూర్పుదేశంలో విజయభూపాలుడు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతనికి లెక్కలేనంత ధనసంపద, చతురంగబలాలతో కూడిన సైన్యం ఉన్నాయి. ఆ రాజుగారికి వీరులైన ఎనమండుగురు కుమారులు, భోగవతి అనే కుమార్తె ఉన్నారు. ఆ రాకుమారి గుణవంతురాలు, సౌందర్యరాశి మరియు లక్ష్మీస్వరూపిణి” అని తనకు తెలిసిన సమాచారాన్ని విన్నవించాడు.

ఆ మాటలకు ఎంతో సంతోషించిన శూరసేనమహారాజు ఆ వృద్ధమంత్రికి వస్త్రభూషణములు బహూకరించి విజయభూపాలునితో సంబంధం కలిసే ఉపాయం ఆలోచించమని ఆదేశించాడు. ఆ మంత్రిని దూతగా విజయభూపాలుని వద్దకు పంపాడు. ఆ మంత్రివర్యుడు తూర్పుదేశానికి వెళ్ళి తన తెలివితేటలు ఉపయోగించి ఆ రాజును శూరసేనమహారాజుతో వియ్యమందడానికి ఒప్పించాడు. తూర్పుదేశ భూపాలుని వద్ద శలవు తీసుకొని మరల ప్రతిష్ఠానపురానికి వచ్చి ఆ శుభవార్త మహారాజుకు తెలియజేసాడు. కుమారుని వివాహ ప్రయత్నం నెరవేరినందుకు శూరసేనమహరాజు ఎంతో సంతోషించాడు. మంత్రి సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు.

కొంతకాలం తరువాత ఆ వృద్ధమంత్రి ఇతర బంధు జనంతో, సేనాబలగంతో విశేష బహుమతులతో మహారాజు విజయుని చెంతకు వెళ్లాడు. నిండు సభలో “మహారాజా! మా శూరసేనభూపాలుని కుమారుడు యువరాజు నాగేశ్వరుడు మిగుల సుగుణవంతుడు మరియు బుద్ధిమంతుడు. ఒక అనివార్య కారణము వలన ఇచ్చటకి వచ్చుట లేదు. క్షత్రియ ధర్మం ప్రకారం మా యువరాజావారి చిహ్నాలపైన ఖడ్గకిరీటములతో మీ రాకుమార్తె వివాహం జరిపించుటకు అంగీకరింపమని మా మహారాజు గారి విన్నపం” అని చెప్పాడు.

విజయభూపాలుడు మంత్రి మాటలు నమ్మి వరస్థానంలో ఆ ఖడ్గము నుంచి నాగేశ్వరునితో రాకుమారి భోగవతి వివాహం గావించాడు. వివాహం తరువాత వదూవరులకు పట్టు వస్త్రాలను, పెక్కు రత్నాభరణములను బహూకరించాడు. దాసదాసీజనాన్ని, రథగజతురాదులను తన కుమార్తె వెంట మంత్రితో బరణంగా పంపించాడు. వృద్ధమంత్రి నవ వధువుతో సహా బహుమతులన్నీ తీసుకొని తన రాజ్యానికి వచ్చి శూరసేనమహారాజుకి నివేదించి, ఆ రాజ్యంలో జరిగిన విశేషాలను వివరించాడు. రాకుమారి భోగవతితో వచ్చిన మంత్ర్రులకు, పెద్దలకు శూరసేన మహారాజు తగిన బహుమతులు ఇచ్చి సత్కరించి సాగనంపాడు.

సర్పకుమారుడు రాజభవనంలో ఒక సువర్ణమణిమయ గృహములో నివసించి యుండెను. భోగవతి అత్తవారి ఇంటికి వచ్చినా ఇంకా తన భర్తను చూడలేదు. సర్పకుమారుడు ప్రతిరోజు తన తల్లితో ‘రాకుమారి తన వద్దకు ఇంకా ఎందుకు రాలేదు’ అని అడుగుతూ ఉండేవాడు. కుమారుని ఆత్రుత గ్రహించిన మహారాణి ఒక దాసిని పిలిచి “నీవు రాకుమారి వద్దకు వెళ్ళి ఆమెభర్త ఒక సర్పకుమారుడు అని చెప్పి, ఆమె ఏమన్నదో నాకు తెలుపు ” అని ఆజ్ఞాపించింది.

రాణిగారి ఆజ్ఞ ప్రకారం దాసి వెళ్ళి రాకుమారి భోగవతిని కలిసి “అమ్మా, నీభర్త మానవుడు కాదు, సర్పాకారంలో ఉన్న దేవతామూర్తి. ఈ విషయం నీ వెవ్వరికీ తెలియనీయ రాదు” అని చెప్పింది. భోగవతి ఆ మాటలు విని “సాధారణంగా మానవ స్త్రీలకు మానవులు భర్తలవుతారు. నా పూర్వజన్మ పుణ్యం వలన నాకు సర్పరూపంలో ఉన్న దేవతామూర్తి నాకు భర్త అయ్యాడు” అని ఆనందం వెళ్ళబుచ్చింది. దాసి వచ్చి రాణిగారికి ఈ విషయం చెప్పింది.

భోగవతి ఒకనాడు దాసితో తనను రాకుమారిని వద్దకు తీసుకు వెళ్ళమని చెప్పింది. దాసి భోగవతిని వెంటబెట్టుకొని సర్పగృహము ప్రవేశించి అందులో ఉన్న నాగేశ్వరుని చూపించింది. మెత్తని శయ్యపై శయనించియున్న సర్పాకారుడైన యువరాజును చూసి భోగవతి “నాథా! మీతో వివాహం వల్ల నేను దేవపత్ని నయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నది. భోగవతి తన పతికి సేవలు చేస్తూ సరస సల్లాపాలు సాగిస్తూ విహరింప సాగింది. సుగంధ పుష్పాలు, అమృతపానీయాలు ఇచ్చి అతనిని సంతృప్తిపరుస్తూ ఉంది. భోగవతి చర్యలవల్ల నాగకుమారునికి పూర్వజన్మ జ్ఞానం ఉదయించింది.

ఆ రాత్రి నాగేశ్వరుడు ఏకాంతంగా ఉన్నప్పుడు భోగవతితో “ ప్రియా! నీవు రాకుమారివి అయినా సర్పరూపంలో ఉన్న నన్ను చూసి ఎందుకు బయపడుట లేదు?” అని ప్రశ్నించాడు. దానికి బోగవతి “స్వామీ! దైవనిర్ణయాన్ని తప్పించడం ఎవరి తరమూ కాదు. అదీకాక సతులకు పతులే దైవము కదా!” అని సమాధానం చెప్పింది.

ఆ మాటలు విన్న నాగేశ్వరుడు చిరునవ్వు నవ్వి “దేవీ! నీ మాటలతో నేను చాలా సంతోషం పొందాను. నీ సామీప్యం వల్ల నాకు పూర్వ స్మృతి కలిగింది. పూర్వజన్మలో నేను శేషువుకు పుత్రుడను. మహాదేవుని కంఠంలో అలంకారంగా ఉండేవాడిని. ఆ జన్మలో కూడా నీవే నా భార్యవు. ఒకనాడు పరమేశ్వరుడు ఉమాదేవితో సరససల్లాపాలాడుతూ బిగ్గరగా నవ్వాడు. వారి సన్నిధిలో ఉన్న నేను కూడా నవ్వటం మొదలెట్టాను. అది చూసిన శంకరుడు కోపంతో నన్ను ‘మానవగర్భంలో సర్పంగా జన్మించమని’ శపించాడు. అందువలన నేను సర్పరూపంలో మహారాజుకు జన్మించాను. నీవు నా కోసం మానవ రూపంలో జన్మించావు. నీకు పూర్వ స్మృతి ఉంది కాబట్టే నన్ను ప్రేమతో భర్తగా అంగీకరించావు.”

“మహేశ్వరుడు నన్ను శపించినప్పుడు మన మిద్దరమూ శాప విమోచన మార్గం చెప్పమని వారిని ప్రార్థించాము. వారు అనుగ్రహించి గౌతమి నదీతీరంలో మీ ఇద్దరూ కలిసి నన్ను ఆరాధించినప్పుడు నీ భార్య సహాయంతో నీకు శాపవిమోచనం కలుగుతుందని పలికారు. అందువలన నీవు నన్ను గౌతమి తీరానికి తీసుకొని వెళ్ళు. అక్కడ మనం శివపూజ చేద్దాము” అని చెప్పాడు.

భర్త మాటలు విన్న భోగవతి ఈ విషయమంతా అత్తమామలకు చెప్పింది. వారి అనుమతితో తన పతిని గౌతమీ నది ఒడ్డుకు తీసుకొని వెళ్లింది. ఆ పవిత్రజలాలలో స్నానం చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్టించింది. నాగేశ్వరుడూ భోగవతి భక్తిశ్రద్ధలతో వైభవంగా శివపూజలు జరిపారు. అప్పుడు భగవానుడైన శివుడు ప్రసన్నుడై నాగేశ్వరునకు దివ్యరూపం ప్రసాదించాడు. నాగేశ్వరుడు మనోహరమైన మానవరూపంతో తన తల్లితండ్రుల వద్దకు వెళ్ళి వారికి నమస్కరించాడు. తన భార్యతో సహా శివలోకానికి వెళ్లడానికి అనుజ్ఞ ఇమ్మని కోరాడు.

శూరసేన మహారాజు కుమారుని సుందర మానవరూపం చూసి ఎంతో సంతోషించాడు. “కుమారా! నీవు మాకు ఏకైక పుత్రుడవు. ఈ రాజ్యానికి వారసుడవు నీవే. కాబట్టి నీవు ఈ రాజ్యపాలన గావిస్తూ బహుపుత్రవంతుడవై వంశాన్ని అభివృద్ధి చేయాలి. నీ తల్లిదండ్రులమైన మేము పరలోకానికి వెళ్ళిన తరువాత మీరు శివపురమైన కైలాసానికి వెళ్లండి” అని ప్రేమపూర్వకంగా కుమారుని అభ్యర్థించాడు.

నాగేశ్వరుడు తండ్రి మాటలు అంగీకరించి రాజ్యపాలన భారాన్ని స్వీకరించాడు. తల్లితండ్రులకు సంతోషాన్ని కలుగజేస్తూ, పుత్రవంతుడై వంశాన్ని అభివృద్ధి చేసాడు. తల్లిదండ్రుల మరణా మంత్రం కొన్నాళ్ళు వానప్రస్థ జీవనం గడిపి తరువాత భార్యాసమేతంగా శివపురానికి వెళ్లాడు. నాగేశ్వరుడు కైలాసంలో మరల గరళకంఠుని కంఠాన్ని అలంకరించాడు.

గౌతమీ తీరంలో భోగవతీదేవి నాగేశ్వరునికై ప్రతిష్టించిన శివతీర్థము, అప్పటి నుండి నాగతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ తీర్థంలో స్నానదానాలు చేసినవారికి, అన్ని రకాల యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది.

శుభం

మరిన్ని కథలు

Nishani
నిశాని
- DR Bokka Srinivasa Rao
Vachhindi ashadha masam
వచ్చింది ఆషాఢమాసం
- తాత మోహనకృష్ణ
Kathalo daagina katha
కథలో దాగిన కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neeve naa mantri
నీవే నామంత్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poola danda
పూలదండ
- ప్రమీల రవి
STREE
స్త్రీ
- chitti venkata subba Rao
Goddalupettu
గొడ్డలిపెట్టు (జాతీయం కథ)
- కాశీవిశ్వనాధం పట్రాయుడు