భాధ్యత - M chitti venkata subba Rao

Badhyata

అర్ధరాత్రి 12 గంటలు అయింది. అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ అమ్మా రమ్య బాత్రూం కి వెళ్ళాలి అంటూ పక్క గదిలోంచి తల్లి పిలుపు వినబడింది. అప్పుడే కునుకు పట్టిన రమ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ లేచి గబగబా పక్క రూములోకి పరిగెత్తింది. చేయవలసిన సహాయం సక్రమంగా చేసి మళ్లీ తన పడక గదిలోకి తిరిగి వస్తుంటే మూడేళ్ల చంటిది ఏడుస్తూ వచ్చింది. దాన్ని ఎత్తుకుని సముదాయించి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రమ్య. ఇవేమీ పట్టనట్లు భర్త సురేష్ గురక పెట్టినట్టు నిద్ర పోతున్నాడు. ఈ లోకంలో తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేది అలారం గడియారం ఒకటే. మనం అనుకున్న సమయానికి మనల్ని నిద్ర లేపడం దాని భాధ్యత .మనం లేచే వరకు అది అలా హోరు పెడుతూనే ఉంటుంది. రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మంటలు పెడుతున్న తన భుజస్కందాలపై ఉన్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలంటే ప్రతి గృహిణి కాలాన్ని చూసుకుని పరిగెట్టాలి. మూడేళ్ల చంటిపిల్ల , ఉదయం టిఫిన్ చేసి క్యారేజీ పట్టుకుని రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే భర్త బాగోగులు, లేవలేని స్థితిలో మంచం మీద ఉన్న కన్నతల్లి. ఏ బాధ్యత అలక్ష్యం చేసేది కాదు. అన్ని బాధ్యతలు రమ్య వైపు చూపులు చూసేవే. కన్న కూతురు కన్నతల్లి ఇద్దరు నిస్సహాయులు. కట్టుకున్న భర్త రమ్య మెడలో తాళి అయితే కట్టాడు కానీ ఆఫీసులో కుర్చీకి అతుక్కుపోయే కర్మజీవి. ఏమైనా అంటే ఆ వృత్తే కదా మనకు తిండి పెట్టేది అంటాడు. మళ్లీ మనం ప్రశ్నించడానికి ఆస్కారం దొరకదు. ఇది ఆ ఇంటి ఇల్లాలిపరిస్థితి. అలారం కూడా ఆమెను ఊపిరి తీసుకుని ఇవ్వకుండా మంచం నుంచి లేచే వరకు అలా హోరు పెడుతూనే ఉంది. మంచం మీద లేచి రమ్య బాత్రూంలోకి. పరిగెట్టింది. మొహం కడుక్కుని అమ్మ గదిలోకి తొంగి చూసింది. మొహం కనబడకుండా దుప్పటి ముసుగేసుకుని తలకింద చెయ్యి పెట్టుకుని పక్కకు తిరిగి పడుకుంది. రమ్య కూడా ఇప్పటికే అలాగే పడుకుంటుంది. అంటే తల్లి పోలిక అన్నమాట. రమ్య తల్లి పార్వతమ్మ గారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక చిరుద్యోగం చేసి పదవీ విరమణ చేసింది.తండ్రి రాజారావు చనిపోతే ఆ ఉద్యోగం పార్వతమ్మ గారికి ఇచ్చారు. రమ్య కడుపులో ఉండగానే రాజారావు గారు కాలం చేశారు. అప్పటికే పార్వతమ్మ గారి వయసు 32 సంవత్సరాలు. తెల్లగా బొద్దుగా గిరజాలు జుట్టుతో చాలా అందంగా ఉండేది పార్వతమ్మ. చాలామంది పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చారు. వచ్చినవాడు తనమీద మోజుతో పెళ్లి చేసుకుంటాడు కానీ బిడ్డను ఏ విధంగా చూస్తాడని బెంగతో ఆమె వచ్చిన వాళ్ళందరిని తిరస్కరించింది. ప్రతి తల్లి తన పిల్లల్ని కళ్ళల్లో వత్తులు వేసుకుని కాపాడుకుంటుంది. తల్లి తండ్రి తానై రమ్య నీ కంటికి రెప్పలా చూసుకుని పెంచి పెద్ద చేసి ఒక ఇంటిదాన్ని చేసింది.అల్లుడు సురేష్ బ్యాంక్ మేనేజర్. ఆ హోదా ఇంటిలో కూడా చూపిస్తుంటాడు. మంచివాడు అని చెప్పలేం చెడ్డవాడని చెప్పలేం. అదోరకం మనస్తత్వం. పార్వతమ్మ గారికి పాపం పక్షవాతం వచ్చి రిటైర్మెంట్ అయిన వెంటనే మంచం మీద పడ్డారు. పార్వతమ్మ గారు జబ్బు పడిన తర్వాత కూతురింటికి వచ్చేసారు. అంతవరకు ఒంటరిగానే కాలుక్షే పం చేసేవారు ఆ ఊళ్ళో.సురేష్ రోజు బ్యాంకుకు పెడుతూ అత్తగారి గదిలోకి తొంగి చూసి ఒక చిరునవ్వు నవ్వి మందులు వేసుకున్నారా అని పలకరించి నేను బ్యాంకుకు వెళ్లి వస్తానని చెప్పి మళ్లీ మరునాటి వరకు ఆమె ఊసే ఉండదు. మధ్యలో భార్యకి ఫోన్ చేసి చంటి పిల్ల గురించి వాకబు చేస్తాడు కానీ అత్తగారి మాటే ఉండదు. ఇది ఆ ఇంటి పరిస్థితి. ఒకప్పుడు అమ్మ ఎలా ఉండేది. చక చకమంటూ పనులు చేసేసేది. కాలం ఎలా మార్చేసింది అమ్మని అనుకుంటూ రమ్య ఆలోచనలో పడింది రమ్య పార్వతమ్మ గారు నవ మాసాలు మోసి కనిపెంచిన బిడ్డ. ఇప్పుడు పార్వతమ్మ గారికి నవనాడులు కృంగిపోయి రమ్యకి దేవుడు ఇచ్చిన బిడ్డగా మారిపోయారు. పురిటి నొప్పులు పడకుండా రమ్యకి దేవుడిచ్చిన పసిబిడ్డ పార్వతమ్మగారు. అందరూ దేవుడు చేసిన మనుషులే. ఇద్దరు మనుషుల మధ్య బంధం రకరకాలుగా ఉంటుంది. రమ్యది పార్వతమ్మ గారిది పేగు బంధం. రమ్యది మాతృరుణం. కాలం చిత్రమైన మార్పులు చేస్తుంది.రమ్య పార్వతమ్మ గార్ల ఇంటి పేర్లు వేరు చేసింది. పేరుకి అది పార్వతమ్మ గారి శరీరమే కానీ దానిని పెంచి పోషించేది సపర్యలు చేసేది కూతురు రమ్య మాత్రమే. చిన్నతనంలో రమ్య అమ్మ చంక లోనే ఉండేది .ఒకప్పుడు రమ్యని ఎత్తుకు తిరిగిన పార్వతమ్మ గారు అప్పుడే పుట్టిన చంటి పిల్లల మారి మంచం దిగకపోతే నేను అమ్మ పాత్రలోకి మారి అమ్మ మంచం పక్కనే నా డ్యూటీ ఆ మూడు గదుల అద్దె కొంపలో నా చిన్నతనంలో ఆ చిన్ని బాత్రూంలో అమ్మ ఆనందంగా చేయించిన స్నానం నేను రోజు అమ్మకు స్నానం చేయిస్తూ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నా ను అమ్మ ఎందుకు ఇలా మారిపోయింది అని. అమ్మ ఆనందంగా నాకు స్నానం చేయించి తెల్లటి నుదురు మీద నల్లటి అగర బొట్టు పెట్టి సంతోషపడుతు ఉండేది. ఇప్పుడు నేను అమ్మ నుదుటిన రవంత విభూది బొట్టు పెట్టి కన్నీళ్లు కారుస్తున్నాను. అమ్మ కళ్ళ నుండి కారేవి ఆనంద భాష్పాలు. నా కన్నీళ్లు గుండెలో దిగులుతో వచ్చేవి. తలుపు చాటుకు వెళ్లి నేను అమ్మ పరిస్థితి చూసి వెక్కి వెక్కి ఏడ్చిన క్షణాలు నన్ను ఓదార్చ డానికి అమ్మకు సహకరించని శరీరం. అమ్మకు నేనంటే ప్రాణం. చాలాసార్లు తను నా చిట్టి చేతుల్ని తన బుగ్గలకు ఆనించుకుని నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ ఉండిపోయేది. ఆ ప్రేమ ఇప్పుడు నన్ను కట్టిపడేసి ఆ చేతులతో అమ్మ మలమూత్రాలు అన్నింటికీ నేనే ఆధారం. ఇప్పుడు అమ్మ కి నా చంటి పిల్లకి తేడా లేదు. చిన్నప్పుడు నాకు బజార్లో దొరికే రకరకాల డ్రస్సులు కొని తొడిగి మురిసిపోయేది. ప్రస్తుతం రాత్రి పగలు కూడా ఆ నైటీ తోటే కాలక్షేపం చేస్తోంది అమ్మ. అది కూడా మోయలేకపోతున్నానని ఒకటే గొడవ. ట్రంకు పెట్లో పాత చీరలు ఉన్నాయని రోజు గుర్తు చేస్తోంది. కట్టుకుంటావా అని అడిగాను కాదు కప్పుకుంటానంది. నాన్న ఉన్నన్నాళ్ళు గుమ్మం దాటి బయటకు వచ్చేది కాదు. నాన్న మరణo అమ్మని బలవంతంగా బయటకు నెట్టింది. అలాంటి అమ్మ నాకు ఇప్పుడు మంచం దిగడమే అంబరం. నేను కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత నాకు అన్ని రుచులతో ప్రతిరోజు కడుపు నింపేది. నా కోరికలన్నీ శ్రమనుకోకుండా తీర్చేది. ఇప్పుడు నా చేత్తో కలిపి పెట్టిన రెండో ముద్దకే నోరు తెరవడం లేదు. అమ్మ నాకు ఇప్పుడు లక్కపిడతల బొమ్మ. రోజుఆడుకుంటాను అమ్మతో ఆనందంగా అనుకుంటూ రోజూ అమ్మ ఈపాటికి నిద్ర లేచి పోయేది ఇంకా లేవలేదు ఏమిటి అనుకుంటూ పార్వతమ్మ గారిని తట్టి లేపింది. సమాధానం లేదు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసేసరికి గుండె జల్లుమంది.గుండె లోంచి దుఃఖం పొంగుకు వచ్చింది. ఏవండి అని గట్టిగా ఏడుస్తూఅరిచింది. పక్క గదిలో నుంచి భర్త పరుగు పరుగున వచ్చి పరిస్థితి అర్థం చేసుకుని ఇరుగుపొరుగు సహాయంతో పార్వతమ్మ గారిని వీధిలోకి చేర్చాడు. తల్లి శవం మీద పడి రమ్య అలా ఏడుస్తూనే ఉంది. ఎంతసేపు అలా గడిచిందో తెలియదు.పార్వతమ్మ గారికి బంధువులు ఎవరు లేరు. ఇంక ఎవరి గురించి చూడాలి. ఇది ఇరుగుపొరుగు మాట్లాడుకునే మాటలు. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది రమ్యకి. భర్త దగ్గర నుంచి ఏమి ప్రతిస్పందన లేదు. పైగా తల్లిదండ్రు ఉన్న వాళ్ళు ఈ పని చేయకూడదు ట అంటూ భర్త సురేష్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఎవరికి బాధ్యత గుర్తు చేయకూడదు. శాస్త్రం ఆడదానికి అధికారం ఇవ్వలేదు. అయినా కన్నతల్లి శవo అనాథలా ఎలా వదిలేస్తాం అంటూ పంతులు గారికి తన మనసులో మాట చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. లోక విరుద్ధంగా చేసే పనులు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. వింతగా చూస్తా రు. చెవులు కొరుక్కుంటారు. అయినా ఎవరికి భయపడకుండా సమయానుకూలంగా బాధ్యతను నిర్వర్తించినప్పుడే మనల్ని మనుషులు అంటారు. ఏది మంచి ఏది చెడు ఆలోచించుకునే అవకాశం ఒక్క మనిషికే ఉంది.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల