కోనసీమ కుర్రాడు - సిహెచ్. వి. యస్. యస్. పుల్లంరాజు

Konaseema kurradu

శ్రీ కోనసీమ భానోజి రామర్స్ కళాశాల, అమలాపురం అంటే ఆ రోజుల్లో అందరికీ గౌరవ మర్యాదలు మెండుగా వుండేవి. చుట్టుప్రక్కల గ్రామాలనుండి, ఆడ పిల్లలు బస్సుల మీద, మగ పిల్లలు సైకిళ్ల మీద కాలేజీకి వస్తూ పోతూ వుండేవారు. కాలేజీలో పనిచేసే అధ్యాపకుల నిబద్దత, వారి భాషా నైపుణ్యాలు,అసామాన్య ప్రతిభ, ఈనాటికి ఆ విద్యార్థులు మర్చిపోలేరు. వేసవిలో ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు, పెళ్ళి సందడులతో బాటు, కొత్త ఆవకాయ ఘుమ ఘుమలు, మామిడి పళ్ళు, లేత తాటి ముంజులు, కొబ్బరి బొండాలు, సంపెంగ, మల్లె పూలపరిమళాలు, పూత రేకులు, ఇలా ఎన్నో… మరో వైపు మేము, కొబ్బరి తోటలలో తడికల మీద కూర్చుని, స్నేహితులతో వార్షిక పరీక్షల తయారీ, ఆడ పిల్లల ఆధునిక పోకడలు, సినిమాలు, సమ కాలీన రాజకీయాలు, స్వాతి వార పత్రిక, డా. సమరం శీర్షిక మీద చర్చలు, భవిష్యత్ ప్రణాళికలు, చివరగా విద్యుత్ కోతల మధ్య చెమటలు కక్కుతూ పరీక్షలు వ్రాయడం… ఐతే మా రాంబాబు … కోనసీమ కొబ్బరి నీళ్లు బాగా తాగిన వాడు. విషయం ఏదైనా అనర్గళంగా, కాస్తంత చమత్కారంగా మాట్లాడగలగడం వాడి ప్రత్యేకత. విశాఖపట్నం వెళ్ళి వారం రోజులు తరువాత వచ్చాడు. అక్కడ వింతలు విశేషాలతో పాటు, అక్కడ, వాడు చేసిన ఘన కార్యాలను రెచ్చిపోయి మరీ వక్కాణిస్తున్నాడు. వెర్రి మొహాలేసుకొని, వాడి కేసి చూస్తూ నిలబడ్డాం. ఇంతలో సైకిల్ మీద అటుగా వెళుతున్న రామం గాడు మా అవస్థని చూసి ఆగాడు. “ఒరేయ్ రామం! రాంబాబు గాడు విశాఖపట్నం నుంచి ఈ రోజే వచ్చాడు, నీకు తెలుసా?” అన్నాడు రాజుగాడు కన్ను గీటుతూ. “ఏరా రామం! ఏంటి సంగతి?” అన్నాడు రాంబాబు కళ్ళు చిత్రంగా ఎగరేస్తూ. “నా సంగతి సరే కానీ, ముందు ఈ ప్రశ్న కి సమాధానం చెప్పు“ అన్నాడు రామం . “ఆలస్యం దేనికి, అడుక్కో” అన్నాడు రాంబాబు. “ఏమీ లేదు. ఈ రోజే ఎవడో విశాఖపట్నం ఆసుపత్రి లోంచి తప్పించుకొని వచ్చాడని, ప్రక్క వీధిలో చెప్పుకుంటున్నారు…” అంటూ క్షణం ఆగి, రాంబాబు కేసి చూసాడు రామం. అందరూ పగలబడి నవ్వాం ఆ జోక్ కి. విశాఖపట్నం, పిచ్చి ఆసుపత్రికి ప్రసిద్ది ఆ రోజుల్లో. “ఎందుకైనా మంచిది, కొంచెం దూరంగా వుండండి. వాడు కరిచాడా…. ఇక అంతే, దేవుడు కూడా మిమ్మల్ని కాపాడ లేడు.” అంటూ రివ్వున సైకిల్ మీద సాగిపోయాడు రామం. అందరం మరో మారు ఘోల్లుమని నవ్వేము రాంబాబు వాలకం చూస్తూ. ఐతే, రాంబాబు గొప్పదనం అక్కడే వుంది. ఆ జోక్ అర్ధమయినా, పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ,” సరే పదండిరా గణేష్ టీ స్టాల్ కి వెళదాం” అన్నాడు మాట మారుస్తూ. హోటల్లో కుర్చీలో కూర్చుంటూ, రాంబాబు గొంతు సర్దుకున్నాడు. స్క్రీన్ ప్లే, సంభాషణలతో బాటు, దర్శకుడి ప్రతిభని కూడా వర్ణిస్తూ, శంకరాభరణం సినిమాని చెప్పుతుంటే, మిర్చి బజ్జీలు కొరుకుతూ, తేనీరు సేవించాం. ఇక బిల్లు ఎవరు కట్టాలన్నది సమస్య. ఈ సారైనా రాంబాబు చేత కట్టించాలని సత్యం గాడి ప్రతిజ్ఞ. అందుకే, “ఒరేయ్ రాంబాబు! విశాఖపట్నం వెళ్ళి వచ్చిన సందర్భంగా, ఈ సారి బిల్లు నువ్వు కట్టాలిరా” అన్నాడు సౌమ్యంగా. వెంటనే తల ఇటు అటు ఊపుతూ, జేబులు తడుము కొంటూ,“అరే ప్యాంట్ మారిపోయింది. జేబులో పది పైసలు కూడా లేవురా!” అన్నాడు రాంబాబు బాధగా. “బిల్లు కట్టక పోతే, ప్యాంట్ విప్పించి, లాక్కొంటాడు హోటల్ వాడు” అన్నాడు సత్యం దురుసుగా. “తీసుకొంటే తీసుకోమను… ప్యాంట్ నాది కాదు, మా అన్నయ్య, శ్రీను గాడిది.”అన్నాడు ధీమాగా. “ఓహో ! అలాగా బాబూ! అయితే చొక్కా విప్పి….” ప్రసాద్ మాట పూర్తి కాకుండానే, “చొక్కా…? మా తమ్ముడు శివరాం గాడిది” అన్నాడు రాంబాబు, ప్రసాద్ కేసి చూస్తూ. “ఐనా ఫరవాలేదు, ప్యాంట్ లోపల డ్రాయర్ వుందిగా. దాన్ని తీసుకోమని చెబుతాలే. ఈసారి నువ్వు తప్పించుకోలేవు.” అన్నాడు శాస్త్రి, ముసి ముసి నవ్వులు నవ్వుతూ. రాంబాబుని ఉచ్చులో గట్టిగానే బిగించామని ఆనందిస్తూ, వాడి జవాబు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాము. క్షణంలో తేరుకొని, తల ఎత్తి, గొంతు సవరించుకుని, “ఒరేయ్ మీకు తెలియంది కాదు కదరా ! నాకు డ్రాయర్ వేసుకొనే అలవాటు లేదని. ఇక ఎటకారాలు ఆపి, బిల్లు కట్టండిరా, భోజనానికి ఆలస్యమయితే అమ్మ తిడుతుంది.” అన్నాడు గబ గబా బయటకు నడుస్తూ. రాంబాబు హాస్య చతురతని, మరోమారు ప్రశంసిస్తూ బిల్లు కట్టాడు ప్రసాద్. 💐💐💐

మరిన్ని కథలు

Saaraayi veerraju veerangam
సారాయి వీర్రాజు వీరంగం
- కందర్ప మూర్తి
Isu
ఐసు
- డా. కె. తేజస్వని
Jathakamaa kaakataaleeyamaa
‘జాతకమా – కాకతాళీయమా’
- మద్దూరి నరసింహమూర్తి
Chidramaina jeevitham
ఛిద్రమైన జీవితం (చిన్న కథ )
- టి. వి. యెల్. గాయత్రి.
Repu
రేపు
- బొబ్బు హేమావతి
Madhya taragathi manogatam
మధ్య తరగతి మనోగతం
- షామీరు జానకీ దేవి
Marriages are made in heaven
మేరెజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్
- బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి
Adde talli
అద్దె తల్లి
- chitti venkata subba Rao