గుడిసె ముంగల గద్దె మీద నొసలు పట్టుకొని కూకున్నాడు రాజయ్య. పానమంత అగులు, బుగులు అయితానట్టున్నది.. కాళ్ళు వన్కబట్టినై. గుడిసెకానుకొనే పసువుల కొట్టమున్నది..
కొట్టంల ఉన్నది ఒక్క ఆవే.. అది ఇప్పుడా! అప్పుడా! అన్నటు ఈనెడానికి తండ్లాడుతాంది. ఒక చెవ్వు కొట్టం దిక్కు పెట్టిండు.
గుడిసెల రాజయ్య పెండ్లాం కన్కమ్మ పురిటి నొప్పులు పడ్తాంది. మంత్రసాని మంగలి మల్లమ్మ దాపుల్నే ఉన్నది. ఎప్పుడచ్చి ఏం సెప్తదా! అని ఇంకో చెవ్వు గుడిసె గల్మ దిక్కు పెట్టిండు.
కమస్కం గంట దాటింది.. కాని ఏ నతీజా తెల్వక పాయేనని రాజయ్య తకమికైతాండు. ఇంతల మల్లమ్మ గుడిసె తలుపు తెర్సుకొని ఉర్కుంటచ్చి..
“రాజన్నా.. కాన్పు కట్టమైతాంది” అన్కుంట.. ఇక తనవల్ల కాదన్నట్టు మొసపోసుకుంట న్యాల సూపులు సూడబట్టింది.
గజ, గజ వనుక్కుంట నిలబడి రెండు సేతులా పబ్బతి పట్టిండు రాజయ్య. మల్లమ్మ పానం కలికలయ్యింది.
“రాజన్నా.. ధైర్నం సెడకు.. ఒక పని సెయ్యి” అని ఒకపాలి తను సేసిన ఇక్మత్ యాదికచ్చి సెప్పింది.
రాజయ్యకు పానం లేచచ్చింది. ఎన్కకు మర్లి సూడకుంట ఊల్లెకుర్కిండు.
***
రాజయ్య గుడిసె ఎన్కాల దిడ్డి దగ్గర పిట్టల్ని కొట్టే గాలితుపాకి ‘ఢాం’మ్మని పేలింది. ఆ దెబ్బకు కన్కమ్మ పెయ్యి జలదరిచ్చింది. పిండం బైట పడ్డది. ‘కెవ్వు’ మన్న కీక ఇనచ్చేటాల్లకు రాజయ్య సంగ, సంగ ఎగురుకుంట తుపాకి పేల్సినోనికి రెండు చేతులా దండం పెట్టిండు. మల్లమ్మ ఇక్మత్ కాన్యాబయ్యేటాల్లకు సంబుర పడుకుంట.. కమీజు జేబులకెల్లి సౌ నోటు తీసిచ్చి, గుడిసె ముందలకు ఉర్కచ్చిండు. మల్లమ్మ గల్మల్ల నిలబడి కొడుకు పుట్టిండని సెప్పి.. తోడెం సేపు ఆగమన్నట్టు ఇషారా సేసుకుంట.. మిగిలిన పనులు సెయ్యాలన్నట్టు మల్ల కన్కమ్మ దగ్గరికి పోయింది.
‘అంబా’ అని ఇనరాంగనే కొట్టంలకుర్కిండు రాజయ్య. ఆవు ఈనిన రెండు మగ దుడ్డెలను ముద్దుగ నాల్కె తోని నాకుతాంది. రాజయ్య నోరు, కండ్లు బండి గీరెలంత తెర్సుకున్నై.
అయ్యాల్ల పున్నం. కొడుకు పుట్టుడు.. ఆవుకు రెండు మగ దుడ్డెలు పుట్టుడు.. తన తక్దీర్ శాన బాగున్నదని మీదికి సూసుకుంట దేవునికి పబ్బతి పట్టిండు రాజయ్య.
***
తొల్సూరు కొడుకు పుట్టేటాల్లకు కన్కమ్మ, రాజయ్యలకు భూమ్మీద కాలు నిల్తలేదు. మీదికెల్లి ఆవు పాలు అమ్ముకొని బతికేటోల్లకు రెండు ఎద్దులు సుత అచ్చుడు తబ్బిబ్బైతాండ్లు. మనకు ‘ముగ్గురు కొడుకులని’ రాజయ్య అంటాంటే కన్కమ్మ గుడిసె వాసాల దిక్కు సూసుకుంట మొక్కబట్టింది.
రెండు యాటలు కోసి ఇరువై ఒక్క దినం సేసుడు ఊల్లె ఆడోల్లంత ముక్కుమీద ఏలేసుకున్నరు. రాజయ్య తన అశ్వత్ మించి సేత్తాండని ఊరి పెద్దలు లోపల్లోపల నసుగుడు రాజయ్య కూనంబట్టినా.. ఖాతర్ సెయ్యలే.
ముద్దుగా ఎడ్లకు రాముడు, భీముడు అని.. కొడుక్కు మురారి అని పేర్లు కరారు సేసిండు.
ఊరోల్లంత దీవెన్లిచ్చి.. కడుపు నిండ తుర్తిగ తినిపోయిండ్లు.
***
సూత్తాంటే, సూత్తాంటెనే ఐదేండ్లు గడ్సినై. ఎడ్లు సేతికందచ్చినై. కొడుకు బడికి పోబట్టిండు. లోగడ ఉన్న ఎకురం కౌలుకిచ్చే రాజయ్య సొంతంగ వ్యవుసం మొదలు పెట్టిండు. దాపుల్నే ఉన్న తన బీడుబడ్డ ఎకురం సుత సాగుబాట్లకు తెచ్చిండు. ‘అంగట్ల అన్ని ఉన్నై.. కాని అల్లుని నోట్లె శని’ అన్నట్టు ఒక పక్క కాలం ఎటమటమవుడు.. తోడెం సెయ్యి తిప్పుకునుడు కట్టంగానే ఉన్నది. ఇంకో పక్క కన్కమ్మ మల్ల నీళ్ళు పోసుకోక ‘ఒక్క రూపాయి ముల్లె కాదు.. ఒక్క కొడుకు కొడుకూ కాదు..!’ అని మిడ్కుడు రాజయ్య పానం అవిసి పోతాంది. అయినా దైర్నం సెడలేదు.
“మనకు ముగ్గురు కొడుకులని నేను ఆనాడే సెప్పిన.. దేనికైనా దేవుడిచ్చిన దానికి తుర్తి పడాల్నే..!” అని సముదాయించేటోడు రాజయ్య. సేసేదేమి లేక ఒక్క చిత్తం సేసుకున్నది కన్కమ్మ.
కొడుకు సుకం కోసం గుడిసె పీకేసి గూనపెంకుటిల్లు కట్టిచ్చిండు రాజయ్య. కొడుకు సదువుకు తక్లీబు కావద్దని ఇంట్ల కరంటు పెట్టిచ్చిండు. దానికి తోడు లాడు సుత ఎక్కువనే అయ్యింది.
మురారి ఊల్లె బడి పదోటి దాకానే ఉన్నది. పదిల పాసైండు మురారి. కొడుకు పెద్ద సదువులు సదివి పెద్ద నౌకరు సెయ్యాలని పట్నం బాట పట్టిచ్చిండు రాజయ్య. ఊరికి వచ్చుడు పోవుడు కొడుక్కు కట్టమైతదని ఆడనే హాట్టల్ల శరీకు సేసిండు. కర్సులు తడ్సి మోపడైంది. అయినా రాజయ్య నారాజ్ కాలే.. ఐతారం, ఐతారం కన్కమ్మను తోల్కోని పోయి మురారిని సూసి వచ్చేటోడు.
అట్లిట్ల మల్లో యాడాది గడ్సింది. ఇక రాజయ్య కట్టాలు మొదలైనై.. నెలకు రెండు, మూడు కారట్లు రాసేటోడు మురారి. ఏమైనా.. పైసలు, పైసలు, పైసలు పంపు. మరో ముచ్చట లేదు. కాలేజీల సక్తు సేత్తాండ్లు.. పరీక్షలు రాయనియ్యరని బెదిరిచ్చుడు. రాజయ్యకు వశపడకచ్చింది.
“కాలేజి సదువంటే ఏమనుకున్నావ్? కొడుక్కు ఊకనే పెద్ద నౌకరి వత్తదా?” అని కన్కమ్మ సుత కొడుకునే సపోటు సేసేది.
పైసలకు తక్లీబై ఒక ఎకురం అమ్మక తప్పలేదు. పొతే పోయింది.. నా సేతి మైల. కొడుకు పెద్ద నౌకరి సేత్తే సాలని గుడికి పోయి పొర్లి దండాలు పెట్టిండు.
మురారి కాలేజీ సదువులైనంక నౌకరి కావాలంటే మందికి సేతులు తడ్పక తప్పదని ఉన్న ఒక్క ఎకురానికి సూటి పెట్టిండు మురారి. ‘చెట్టెక్కిచ్చినంక చేతులు ఇడ్పిచ్చుడెందుకు?’ అన్నట్టు అది సుత అమ్మి సేతులు దులుపుకున్నడు రాజయ్య.
“నువ్వేం పికరు సెయ్యకయ్యా. నౌకరైనంక వాడే సంపాయించుకుంటడు” అని కన్కమ్మ సదిరి సెప్తాంటే.. “పురంగ సేతుల దమ్మిడి లేకుంటే ఎట్లనే..!” అని మన్సుల మిడ్కబట్టిండు రాజయ్య.
***
నడినాత్రి అయ్యింది..
అయినా రాజయ్యకు కంటి నిండా నిద్రత్తలేదు. కన్కమ్మ మంచం పక్కపొంటే తన గడెంచెల నడుం వాల్సిండు. తాప, తాపకు కన్కమ్మ నొసటి మీద సెయ్యేసి సూత్తాండు. జరంత జరం జారిందన్నట్టు కూనంబట్టి.. తుర్తిగా ఊపిరి పీల్సుకున్నడు. కాని కారటేసినా కొడుకు తనను సూసెదానికి రాలేదని మానాది పెట్టుకున్నదేమో! అన్న అనుమానం ఇంకో పక్క పీకుతాంది.
ఇంతల ఎడ్ల కొట్టంలకెల్లి భీముని ఏడ్పు లాసిగ ఇనచ్చేటాల్లకు దిగ్గున లేసి కూకున్నడు రాజయ్య. భీముని
తల్లి ఆవు పిడాత సచ్చినప్పుడు సుత భీముడు ఇంతగనం ఏడ్వలే.. ఇప్పుడు రాముడు కనబడ్తలేడని ఇరాం లేకుంట
ఏడ్సుడు.. రాజయ్య నెత్తి కొట్టుకుంట కొట్టంలకుర్కి లైటేసి సూసిండు.
భీమునికి ఇట్టమని ముందల పచ్చ గడ్డి ఏత్తే.. ఏసిన గడ్డి ఏసినట్టే ఉన్నది. సొప్ప సుత ముట్ట లేదు. గోలెంల మూతి పెట్ట లేదు. రాజయ్య గుండె తరుక్క పోయింది. మోకాల్ల మీద కూకోని అమాంతం భీముని ముందర కాల్లు పట్టుకున్నడు. ఎదలకెల్లి యాతన తన్నుకత్తాంటే.. భీముని ముందల ఎల్లబోసుకోబట్టిండు.
“భీముడా.. గోలెంల కుడితి కలిపింది కలిపినట్టే ఉండే.. గడ్డి పోస వాసన సుత సూడక పోతివి. గిట్లైతే ఎట్లరా? నేనేం సేసేది?.. రాముడు కనబడ్తలేడని రంది పెట్టుకుంటే నా బతుకేం కావాలె!.. నేను కావాల్నని రామున్ని అమ్మితినా.. నా సేతులు పడిపోను” అన్కుంట తనను తానే తిట్టుకోబట్టిండు. కండ్లు నీల్లపటువలైనై. కండువ తోని కండ్లకు తుడ్సుకుంట..
“నీకు తెల్వందేమున్నది భీముడా.. మీ కన్కమ్మ ఉన్నట్టుండి కట్టెసర్సుక పడిపోతే.. మీరే కదా! మన బండి మీద పట్నం దవకానకు తీస్క పోయింది.. డాక్సర్లు పరీచ్చలు సెయ్యాలని.. మాలాసిగ పైసలు కర్సైతయన్నరు. అప్పటికే సేతిల దమ్మిడి లేకపాయే.. ఏం సెయ్యాలే.! కన్కమ్మను ఎట్లైనా బతికించుకోవాలని.. పైసలు తెత్త గానీ.. మీరు పరీచ్చలు కానియ్యుండ్లని ఇంటికచ్చినం కదా! యాడ అప్పు పుట్టకపాయే.. ఇంక రామున్ని అమ్మక తప్పక పాయె.. ఎకాఎకిన అమ్మబోతే ఎవరు కొంటరు? అడ్డికి పావుసేరు సొప్పున మనం సౌదలు తెచ్చుకునే దుకానం సావుకారు కొన్నడు. మన ఖాతా పైసలు జమ కట్టుకొని మిగిన పైసలు నా సేతిల పెట్టిండు. అవి పట్టుక పోతెనే.. కన్కమ్మ మల్ల మన ఇంటికి వచ్చింది.
నీ బాంచెను.. తోడెం ఎంగిలి పడు. నీకు దండం పెడ్తా.. బుక్కెడు కుడితి తాగు.. రెండు గడ్డి పోసలు తిను.. సచ్చి నీ కడుపున పుడ్తా..” అని భీమున్ని బతిమాలుకుంట మూతి కందిచ్చిండు.
భీముడు తిననన్నట్టు తల్కాయె అడ్డంగ ఇసిరింది.
నొసలు కొట్టుకుంట భీముని రెండు కాల్లు మొక్కబట్టిండు రాజయ్య.
భీముని కండ్లల్లకెళ్ళి కారిన నీటి సుక్కలు రాజయ్య ఈపు మీద పడి పొగలెల్లబట్టినై..
ఇదంతా కన్కమ్మ దూరంగా నిల్సోని సూసుకుంట కొస కొంగుతోని కండ్లల్ల నీళ్ళు తుడ్సుకోసాగింది. రాజయ్య ఇంట్లకచ్చేది సూసి మెల్లంగ, మెల్లంగ పోయి మంచంల ఒరిగింది.
రాజయ్యకు ఆ నాత్రంతా కన్ను మీద కునుకు పడ్తే ఒట్టు. పొద్దుగాల్నే లేసి పోయి భీముడు పడ్తాన యాతనంతా సేటుకు సెప్పి రెండు దినాలు రామున్ని పంపుమని బతిమాలుత.. అని కలువరిచ్చుకుంట.. కలువరిచ్చుకుంట.. బల్మీటికి కండ్లు మూసుకున్నడు. భీముడు యాడనో మైలు దూరంల ఏడ్తానట్టు ఇనచ్చుకుంట, ఇనచ్చుకుంట.. తెల్లారగట్ల ఎప్పుడో కన్నంటుకున్నది.
***
ఇంటెన్క జల్ల కింద పన్న కోడిపుంజు ఎగిలిబారంగనే లేసి ‘కొక్కొరోకో..!’ అని కూసిన ఒక్క కూతకే లేసి కూకున్నడు రాజయ్య. లోట తీస్కోని దబ్బ, దబ్బ ఆవలికి పొయ్యచ్చిండు. మొకం, కాల్జేతులు కడుక్కొని సావుకారింటికి పోతనని తయారయ్యిండు. కండువ భుజానేసుకొని.. కన్కమ్మ మంచం దిక్కు సూసిండు. కొడుకు మీద రంది పెట్టుకొని ఇంకా పండుకునే ఉన్నదని.. లేపద్దనుకున్నడు. పెద్ద దర్వాజ దాటి తంతెలు దిగేటాలలకు ఎవలో తుమ్మినట్టు ఇనబడ్డది. ఎన్క తుమ్ము మంచిదే అని సిన్నంగ నవ్వుకున్నడు. జరంత సేపు కూకోని పోదామని మన్సులనుకుంట.. అరుగు మీద కూకున్నడు.
కన్కమ్మ తలుపు ఓరగ తీసి తొంగి సూసింది. “ ఏమయ్యా.. నిన్నే.. యాడికో బైలెల్లి మల్ల కూకున్నావ్?”
అని దీర్ఘం తీసుకుంట అడిగింది.
“నువ్వు దవాఖాన్ల శరీకైనప్పుడు సెప్పటానికి మురారి దఫ్తర్ పోయిన. కొడుకు దౌర పోయిండట.. వచ్చినంక సెప్తమన్నరు. ఎందుకైనా మంచిదని కారటేత్తిని.. ఇంకా రాక పాయేనని సూత్తాన..
అట్లనే మన సావుకారింటికి పోయి రాముని కోసం భీముడు బెంగటిల్లి గడ్డి పోస ముడ్తలేదని సెప్పి నాల్గొద్దులు రామున్ని పంపుమని అడుగుదామని బైలెల్లిన” నువ్వేంది పండుకోక అప్పుడే లేసినౌ అన్నట్టు నొసలు ఎగరేసిండు.
“వాడు వత్తడో! రాడో!.. ఎదురి సూసుడెందుకు? భీముని ఏడ్పు ఇనత్తాందా!” పురంగ తెల్సుకోకుంటనే ఉర్కులాడుతాండు అన్నట్టు అడిగింది కన్కమ్మ.
“నిజమేనే..! నేను క్యాల్ సెయ్యలే.. ఏంమ్మాయ సేసినౌ” అన్కుంట గోసి సదురుకుంట లేసి నిలబడ్డడు.
“నువ్వు నాత్రి పడ్డ యాతనంత సూసిన. సుక్కపొద్దుకే లేసి భీమున్ని తీస్కోని సేటింటికి పోయిన. నా గంటెపుత్తెలుంచుకొని రామున్ని ఇడ్సిపెట్టమని కాల్మొక్కిన. భీముడు మేత్త లేదు.. కుడ్తి ముడ్త లేదని సెప్పిన. ఆడ సుత రాముడు గట్లనే సేత్తాందని సేటు సెప్పిండు.
సేటు కొట్టంల రామున్ని సూడంగానే భీముడు ఉర్కిండు. రెండు కలిసి సంబురంగ ఒకదాని పెయ్యి.. ఇంకోటి నాక్కుంటాంటే.. ఇద్దరం ఇచ్చంత్ర పోయినం. సేటు ఒక శర్తు పెట్టిండు” అనంగానే రాజయ్య బీర్పోయిండు. ఏంటో ఆ శర్తు అన్నట్టు గుడ్లప్పగిచ్చిండు.
కన్కమ్మ రాజయ్య సూపులు సమఝ్ సేసుకొని.. తిరిగి సెప్పసాగింది.
“మా పసువులు కాసేటోడు ఎప్పటిలెక్కనే.. మా వాటితో పాటు రామున్ని, భీమున్ని సుత మేపడానికి తీస్కపోతడు. మాపటాల్లకు అవి మీ ఇంటికి వత్తే.. మీయి. మా ఇంటికి వత్తే మాయి. మా ఇంటికి వచ్చినై అనుకో.. అప్పుడు గంటెపుత్తెలకు కరీదు కట్టి మిగిలిన పైసలిత్త” అన్నడు.
“రాముడు, భీముడు కల్సి పచ్చ గడ్డి మేత్తాంటే.. సూసి సంబర పడ్డ. అవి యాడున్నా కల్సి ఉండాలని దేవునికి మొక్కుకుంట సరేనని వచ్చిన. సీకటాల్లకు సూద్దాం గాని నువ్వు ఇంట్లకైతే రా..” అన్కుంట ఇంట్లకు పోయింది కన్కమ్మ.
కన్కమ్మ మెడల పసుపుతాడు సూసి.. గులేరుదెబ్బ తిన్న పిట్టలెక్క రాజయ్య మన్సు గిల, గిల కొట్టుకున్నది. సైకిలు టైరు పంపుచారైనట్టు పానం సత్కిల పడ్డది.
రాముడు, భీముడు ఇంటికి వత్తయో! రావో! అని ‘కుడ్తిల పడ్డ ఎలుక లెక్క’ ఎటూ సుదురాయించక మల్ల అరుగు మీదనే కూలబడ్డడు.
కనుమస్కయితాంది. పచ్చులు వాటి, వాటి గూట్లెకు ఉర్కుతానై..
దూరం నుంచి రాముడు, భీముడు వచ్చుడు సూసి రాజయ్య కండ్లల్ల సంభ్రంగ నీల్లు తిరిగినై. నమ్మిక రాక.. కండువ తోని కండ్లు తుడ్సుకొని మల్ల మల్ల సూసిండు.. కన్కమ్మను పిల్సి అడిగిండు.
“నిజమే.. ఇద్దరు కొడుకులు మనింటికే వత్తాండ్లు” అని వాటికి ఎదురుంగ పోయింది కన్కమ్మ.
“నీ పానం బాగలేదని నిన్ను సూడకుండ ఆగుతాయా!” అన్కుంట రాజయ్య సుత కన్కమ్మ ఎన్కాల్నే సిన్న పోరని లెక్క గున్న గున్న పోయి రామున్ని, భీమ్ముని కావలిచ్చుకున్నడు. వాటిని ముద్దాడుకుంట.. “కన్కమ్మా.. మనం సూసేది నిజమేనా..!” అని అడిగిండు. ఇంకా రాజయ్యకు నమ్మబుద్ధైతలేదు. ‘నిజమే!’ అన్నట్టు కన్కమ్మ కండ్లు మిట్కరిచ్చింది.
రాముడు, భీముడు కన్కమ్మ రెండు సేతులను మూతుల తోటి తడుమబట్టినై.. ‘బాగున్నావా!’ అన్నట్టు. అది సూసి రాజయ్య కండ్లు సెమ్మగిల్లినై.
ఇద్దరు కల్సి ఎడ్లను కొట్టంలకు తోలుక పోయిండ్లు. రాముడు, భీముడు కుడితి తాగుతాంటే.. కన్కమ్మ, రాజయ్య ముసి, ముసి నవ్వులు నవ్వుకుంట ఇంట్లకు పోయిండ్లు.
రాజయ్య మల్ల సర్రాసుగ పోయి ఇంటి ముందల అరుగు మీదనే కూకోని సుట్ట ఎలిగిచ్చిండు. మురారి కోసరం పానమంత కలి, కలి కాబట్టింది.
“ఏంది ? మల్ల ఈడనే కూకుంటివీ.. ఇద్దరు కొడుకులచ్చిండ్లు కదా!.. ఇంక ఎంగిలి పడవా..!” అని కనకమ్మ ముక్కిర్సుకుంట అడిగింది. సుట్ట తాగుడంటే కన్కమ్మ సైసది.
“పెద్ద కొడుకు అచ్చినంక ఇద్దరం కల్సి తింటమే.. నువ్వు తిను” తాత్పరంగ అన్నడు రాజయ్య.
“ఇయ్యాల రేపు పసువులకున్న నీయతి మన్సులకుంటాందా!.. నా మీద పాయిరముంటే రాక పోయేటోడా..! రెక్కలు కట్టుకొని అచ్చేటోడు. వాడు వచ్చినప్పుడాయే! నువ్వైతే ఇంట్లకురా.. పురంగ సీకటయ్యింది” అన్కుంట ఇంట్లకు పోయింది కన్కమ్మ.
కొడుకు వత్తడని నమ్ముతలేదు. మన్సు దిటవు సేసుకున్నది. ఈ రోజుల్ల పొలగాండ్లకు కావాల్సింది అయ్యా, అవ్వ పైసలే కాని వాల్లను అర్సుకోవాలన్న గ్యానముంటాందా!. పానం బాగ లేదని కారటు రాసినా రాకపాయే.. రేపు సత్తె సుత వచ్చి తలకొర్వి పెడ్తడని నమ్మిక లేదని మనసుల అనుకుంట.. రాజయ్య వత్తాండా! అని కిటికిలకెల్లి తొంగి సూసింది.
రాజయ్య కొడుకు కోసం ఎంగిలి పడకుంట.. ఎదురి సూత్తనే ఉన్నడు..! *

