అమ్మ - Madhunapantula chitti venkata subba Rao

Amma

ఉదయం 5 గంటలు అయింది. శీతాకాలం కావడంతో మంచు వానలా కురుస్తోంది. ప్రతిరోజు 5 గంటలకు లేచే సీతమ్మ గారు నిద్రలో నుంచి మెలకువ వచ్చినా శీతాకాలం కావడంతో బద్ధకంగా కళ్ళు మూసుకుని అలాగే మంచం మీద పడుకున్నారు. ఇంతలో అంబా అంటూ దొడ్డి వైపునున్న మట్టి వసారా లోంచి రాము గాడి అరుపు వినిపించింది. పాపం వీడికి ఆకలిఅనుకుంటూ సీతమ్మ గారు గబగబా మంచం మీద లేచి మొహం కడుక్కుని స్టవ్ వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టారు. పాలు కా గిన తర్వాత చల్లారి పెట్టేంతలో మరోసారి అంబా అంటూ అరుపు వినిపించింది. సీతమ్మ గారు గబగబా పాలు సీసాలో పోసి పాలతిత్తి పెట్టి మట్టివసారలోకి అడుగు పెట్టారు. సీతమ్మ గారిని చూడగానే రాము గాడు అటు ఇటు తిరుగుతూ తోక ఊపుకుంటూ హడావిడిగా ఉన్నాడు. ఏరా రాము ఆకలవుతుందా అoటూ సీతమ్మ గారు పాలసీసాని రాము గాడు నోట్లో పెట్టారు. రాము గాడు రెండు గుక్కలు తాగిన తర్వాత తలపైకెత్తి సీతమ్మ గారి తల మీద పెట్టి గారాలు పోతున్నాడు. ఇంకా కొద్దిగానే ఉన్నాయి రా ఇవి పూర్తిగా తాగెయ్యి. లేదంటే ఆకలి వేస్తుంది అంటూ రాము గాడి ఒళ్లంతా నిమురుతూ దగ్గరగా తీసుకుని మళ్లీ పాలసీసాలోని పాలని తాగించేశారు. రాము గాడు పాలు తాగేసిన తర్వాత అంబా అంటూ మళ్ళీ అరిచాడు. ఎనిమిది మంది పిల్లలు ఉన్న సీతమ్మ గారికి ఆ పిలుపు వింటుంటే గుండెల్లోంచి దుఃఖం పొంగుకు వచ్చింది. అమ్మ లేని లోటు మరిపించగలను. కానీ మీ అమ్మను తీసుకురాలేను. నువ్వు నాకు తొమ్మిదో సంతానం. నా ప్రాణంలో ప్రాణం. ఏం చేయను దేవుడు చేసిన దానికి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మీ అమ్మకి నేను అమ్మలాటి దానిని. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి దానిని కూతురు లాగా చూసుకున్నా. ఒక గర్భవతి అయిన ఆడపిల్లను తల్లి ఎలా చూసుకుంటుందో అలాగా. ప్రతి నెల పశువులడాక్టర్ గారు చెకప్ లు. ఆహారంలో మార్పులు. ఎన్ని చేసినా ఫలితం ఏముంది. జరగవలసింది జరిగిపోయింది.నేనుఊహించుకున్నది తారుమారైపోయింది. నా పిల్లలకి కడుపునిండా పాలిస్తుంది అనుకుంటే దాని బిడ్డ కి నేను పాలు పట్టే పరిస్థితికి నన్ను తీసుకొచ్చింది. కాలం చేసే మార్పుకి ఎవరు జవాబు దారి.ఆ దారిలో మనం వెళ్ళిపోవడమే అనుకుంటూ సీతమ్మ గారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఆ రాము గాడి దగ్గర ఉన్న మలమూత్రాలను శుభ్రం చేసి ఒళ్లంతా గుడ్డ పెట్టి తుడిచి ఆ పశువు కోరుకునే ఆహారం పెట్టి ఇంట్లోకి వెళ్లిపోయారు. మరి ఆ లంక అంత ఇంట్లో మరో పది ప్రాణాలనీ ఆవిడ పెంచి పోషించాలి. ఇంతకీ రాము గాడి కథ ఏమిటి? సీతమ్మ గారి భర్త చలపతిరావు గారు ఆ ఊర్లో అనువంశికoగా వచ్చే ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఆయనకి పశువులు అంటే ఇష్టం. పిల్లలకి ఏం పెట్టిన పెట్టకపోయినా పాలు పెరుగుతో పెంచితే ఆరోగ్యంగా పెరుగుతారని ఆయన నమ్మకం. అందుకే ఎప్పుడూ ఇంట్లో ఐదు ఆవులు ఉండేవి. పాలేరులు ఉన్నప్పటికీ సీతమ్మ గారు స్వయంగా పశువుల గురించి ఎప్పుడూ శ్రద్ధ తీసుకునేవారు. చలపతిరావు గారి దంపతులకి ఆవులు అంటే దైవంతో సమానం. సీతమ్మ గారు పండగలకి పబ్బాలకి గోపూజ చేసి ఇంట్లో పిల్లలతో సమానంగా ఆ పశువును పెంచుకుంటూ ఉండేవారు. ఇంట్లో కొంచెం అన్నం మిగిలితే బయట పారేయకుండా పశువులకు పెట్టేవారు. పండగలకి పబ్బాలకి చేసే తినుబండారాలు ఆ పశువులకు పెట్టకుండా తినేవారు కాదు ఆ దంపతులు. అప్పటికే వారి పశువుల కొట్టంలో ఐదు ఆవులు ఉన్నప్పటికీ ఒకరోజు చెప్పా పెట్టకుండా పిఠాపురం సంతకు వెళ్లి ఒక చూడు ఆవుని కొనుక్కొచ్చేసారు చలపతిరావు గారు. అవును చూడగానే సీతమ్మ గారి కళ్ళు ఆనందంతో మెరిసే యి. చూడగానే సీతమ్మ గారి మనసును దోచుకుంది. అచ్చు నందిలా ఉంది అనుకునీ దానికి శివ అని నామకరణం చేశారు. పైగా ఏడు నెలల గర్భిణీ. దాని నీ పశువులు పాకలో కట్టకుండా ఇంటికి దగ్గరలో ఉన్న నారింజ చెట్టు కింద ఉన్న రేకుల షెడ్ లో దానికి బస ఏర్పాటు చేశారు. దానికి ప్రతిరోజు ప్రత్యేకమైన ఆహారం ప్రత్యేకమైన పోషణ పశువుల డాక్టర్ గారు సలహాతో కొన్ని మందులు ఇలా ఒక రెండు నెలలు ప్రత్యేకంగా పోషించుకుంటూ వచ్చారు. ఒకరోజు సీతమ్మ గారు తెల్లవారుజామున లేచి చూసేటప్పటికి శివ కాళ్లు జాపుకుని తల దూరంగా పెట్టుకొని నేల మీద పడుకుని ముక్కుతూ కనిపించింది. ఇలా గంటసేపు బాధపడిన పాపం బిడ్డ బయటపడలేదు. పశువుల డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి తల్లి బ్రతకడం కష్టమని బిడ్డను బయటకు తీశారు. బిడ్డ బయటకు వచ్చిన కాసేపటికి కనీసం బిడ్డను కూడా నాకలేదు. అలాగే పడుకుని ఉండిపోయింది. కాసేపటికి పాపం ఏదో పుణ్యలోకం చేరుకుంది. పాపం రాము గాడు కన్నులు తెరవని పసిగుడ్డు. అమ్మ పొదుగులో పాలు తాగడం జాతి లక్షణం. పాలసీసాలో పాలు తాగమంటే అది ఎందుకు తాగుతుంది. సీతమ్మ గారికి రాము గాడికి పాలసీసా అలవాటు చేసేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది. ఇప్పుడు రాము గాడు సీతమ్మ గారి తొమ్మిదో సంతానం. తెల్లవారి లేచింది మొదలు రాము గాడు బాగోగులు కూడా సీతమ్మ గారు చూసుకుంటున్నారు. పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాము గాడితో ఆటలు ఆడుకుంటారు. రాము గాడు రోజురోజుకి ఎదుగుతూ పిల్లలతో ఆడుతూ ఉంటే సీతమ్మ గారికి ఆనందంగా ఉంది. క్రమేపి పశువుల ఆహారం తినే స్థాయికి రాము గాడు ఎదిగాడు కాబట్టి పాలు పట్టడం ఆపేశారు. అయిన వాడి బస మాత్రం నారింజ చెట్టు క్రింద ఉన్న రేకుల షెడ్ లోనే. ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రకృతి పరంగా వచ్చే మార్పు వల్ల రాము గాడు కూడా ఒక రోజు జత కోరుకున్నాడు. చలపతిరావు గారి దంపతులకు ఆనందానికి హద్దు లేదు. నెలలు గడిచేకొద్దీ రాము గాడిలో శారీరకంగా మార్పులు వచ్చాయి. ఎప్పటిలాగే ప్రత్యేక శ్రద్ధతో రాము గాడిని సీతమ్మ గారు చూసుకుంటూ పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పశువుల పాకలో ఇంకా ఆవులు ఉన్నప్పటికీ ఈ రాము గాడు అంటే ఆ దంపతులకు ప్రత్యేక అభిమానం. ఇలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు రాము గాడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చాడు. ఇలా ప్రతి ఏటా రాము గాడికి ఆడపిల్లలు పుడుతూనే ఉన్నారు. రాము గాడు ఇప్పుడు ఐదుగురు పిల్లల తల్లి అయ్యాడు. సీతమ్మ గారి పిల్లలందరూ పెళ్లిళ్లు అయిపోయి అత్తారింటికి వెళ్లిపోయారు. సీతమ్మ గారు తొమ్మిదో సంతానం మటుకు తన పిల్లలతో ఆ దంపతులతో కాలక్షేపం చేస్తోంది. వయసులో ఉన్నప్పుడే సీతమ్మ గారి పశువుల్ని ఎంతగానో ప్రేమించి పెంచి పోషించే వారు. ముసలి వయసొచ్చిన తర్వాత ఆ దంపతులకి రాము గాడు పిల్లల్ని పోషించడమే ఒక పెద్ద కాలక్షేపంగా మారింది. పొలంలోని పశువుకు ఆడబిడ్డ పుడితే రైతుకు ఎంతో ఆనందం. ఎందుకంటే అది పశుసంపదను వృద్ధిచేసి రైతుతో పాటే జీవితం కొనసాగిస్తుంది. కానీ మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ల వంశానికి ఆధారమవుతుంది. మన పిల్లల మనతో పాటు ఉండరు. మన పాకలో ఉన్న పశువు ప్రాణం ఉన్నంతవరకు మనతో పాటే ఉంటుంది. ఒకరోజు ఉన్నట్టుండి సీతమ్మ గారికి జ్వరం వచ్చి కన్నుమూశారు. ఆ చనిపోయిన రోజుల్లో సీతమ్మ గారు కనపడబోయే సరికి రాము గాడు మాటిమాటికి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపు రాము గాడి చిన్నతనంలో అంటే వాడి అమ్మని పోగొట్టుకున్న మొదటి రెండు నెలలలో అరిచిన అరుపులా అనిపించింది చలపతిరావు గారికి. పశువులకి మాటలు రావు గాని చాలా జ్ఞానంగా ఉంటాయి అంటారు. అదే నిజం అనిపించింది ఆ కుటుంబ సభ్యులకి. నిత్యం రాము గాడు తోటి కాలక్షేపం చేసే సీతమ్మ గారిని ఎలా మర్చిపోతాడు రాము గాడు. కడుపుని పుట్టకపోయినా పాపం కన్నతల్లి కాకపోయినా కన్నబిడ్డలా పెంచి పోషించింది సీతమ్మ గారు. అమ్మ అన్న ఆ ఒక్క పదం లోనే ఉంది మహత్యం. ఏ బిడ్డనైనా అది పశువైనా పక్షి అయినా నోరులేని ఏ జీవి నైనా ఆదరించేది అమ్మ. చలపతిరావు గారు భారీ ఎత్తున దశ దానాలు చేసి దొడ్లో ఉన్న పశువులన్నింటిని బ్రాహ్మణులందరికీ దానం చేసేసారు. భగవంతుడు ఒక స్త్రీకి మాత్రమే డొక్క తడిమి కడుపు నింపే అధికారం ప్రేమగా బిడ్డను సాకే అధికారం ఇచ్చాడు. ఇది స్త్రీకి వరం లాంటిది. దీనిని సద్వినియోగం చేసుకునే ఆదర్శ మూర్తులు సీతమ్మ గారి లాంటివారు ఎంతోమంది ఈ లోకంలో.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల